Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 3


    సర్దార్జీ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అతని చొక్కా పట్టుకున్నాడు. పట్టుకుని ఆ శాల్తీని గాలిగోలకి లేపాడోసారి. అప్పుడు చూశాడు సింహాద్రి.
    చూస్తూనే ఆనందంతో గావుకేక పెట్టాడు.
    "ఒరే చిరంజీవి!"
    "గాలిలోకి తేలిన చిరంజీవి ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. అతని కళ్ళకు సింహాద్రి కనిపించేలోగానే సర్దార్జీ అతనిని కిందకు దింపేశాడు.
    "ఆంఖ్ బంద్ కరకే చలారియా సైకిల్?" కోపంగా చిరంజీవి చొక్కా కాలర్ పట్టుకుని కిందకు దింపి ఊపుతూ అడిగాడు సర్దార్జీ.
    "ప్లీజ్ లిఫ్ట్ మీ అప్ ఎగైన్" సర్దార్జీ నడిగాడు చిరంజీవి. మరోసారి గాలిలోకి లేస్తే తనను పిలిచినవారెవరో చూద్దామని అతని కోరిక! కానీ సర్దార్జీ అతని కోరిక తీర్చలేదు.
    "పాగల్ హోగయోహో తుమ్ ణే?"
    "అయ్ డోంట్ నో హిందీ" అన్నాడు చిరంజీవి- సర్దార్జీ చేతిలోంచి తన చొక్కా కాలరు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ.
    "దెన్ అయ్ విల్ డీల్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ-" అంటూ భుజాలు కొట్టుకుపోయిన నలుగురు బాధితుల్లో ఒకడు ముందు కొచ్చి చిరంజీవి షర్టులో మరికొంత భాగం పట్టుకున్నాడు.
    "బాగా ఉతకండి! అప్పుడుగాని కళ్ళు తెరచి సైకిల్ తొక్కడు నేర్చుకోడు" అన్నాడు మరొకరు.
    "అవును ఉతకాల్సిందే" అన్నాడు ఇంకోడు.
    సరిగ్గా ఆ సమయంలో సింహాద్రి ఆ గుంపుని తోసుకుంటూ ముందుకెళ్ళాడు ఉత్సాహంగా.
    మరోసారి ఇద్దరి గుప్పెళ్ళల్లో నలిగిపోతున్న చొక్కా ఓనర్ ని పరీక్షగా చూశాడు. సందేహం లేదు. వాడు చిరంజీవే!
    "ఒరే చిరంజీవీ" మరోసారి అప్యాయంగా పిలిచాడు మరో రెండడుగులు ముందుకేస్తూ.
    చిరంజీవి సింహాద్రిని చూసి ఆశ్చర్యపోయాడు.
    "నువ్వా?" అన్నాడు ఆనందంగా.
    "అవును నేనే" అన్నాడు సింహాద్రి చిరునవ్వుతో.
    "ఇందాక నేను గాలిలోకి లేచినపుడూ పిలిచింది నువ్వేనా?"
    "అవును అప్పుడే గదా నీ వ్యూ బాగా కనిపించింది?"
    "నాకా పిలుపు వినిపించిందిగానీ నువ్వనుకోలేదు."
    "అబ్బే- నేనే!"
    "భలే  తమాషాగా కలుసుకున్నాం కదూ?"
    "అవును!"
    "నిన్నిక్కడ కలుసుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు."
    "నేనూ అంతే!"
    "చాలా కాలమయిపోయింది మనం కలుసుకుని."
    "అవును! నైన్ టీన్ సెవెంటీ ఎయిట్ మే లో ఆఖరి సారి కలుసుకున్నాం"
    "ఎగ్జాట్లీ"
    ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.
    "పద ఆ హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాడు సింహాద్రి.
    "అవును చాలా విషయాలు మాట్లాడాలి. పద" అన్నాడు చిరంజీవి.
    ఇద్దరూ అడుగులు వేయబోయారుగాని చిరంజీవి చొక్కా అప్పటికే ఇద్దరి చేతిలో వుండటం వల్ల అతనికి నడవడం సాధ్యం కాలేదు.
    "నా చొక్కా మీ చేతిలో వుంది వదలండి" అన్నాడు చిరంజీవి సర్దార్జీతో వినయంగా.
    "ఇదిగో ఆయన చేతిలో కూడా కొంచెం వుంది" అన్నాడు సింహాద్రి ఇంకో వ్యక్తిని చూసి.
    "మీరు వదిలేయండి. ఫరవాలేదు. నేనింక మామూలుగా నిలబడగలను" అన్నాడు చిరంజీవి ఆ రెండో వ్యక్తితో.
    "మొహం పగలగొడతాను రాస్కెల్! మమ్మల్నందర్నీ కిందపడేసి తప్పించుకుని పోదామనా?" అన్నాడు రెండో వ్యక్తి కోపంగా.
    చిరంజీవి ఆశ్చర్యంగా సింహాద్రివేపు చూశాడు.
    "ఎవరి గురించి అతను మాట్లాడుతోంది?"
    సింహాద్రి పెదవి విరిచాడు. "నాకూ అదే అర్ధం కావటం లేదు. బహుశా సర్దార్జీ గురించేమో"
    "సర్దార్జీ గురించి కాదురా ఇడియట్! నీ గురించే నిన్నే అనేది" ఇంకా కోపంగా అన్నాడా వ్యక్తి.
    "సినిమాకి టైమయిపోతోంది" అంది అతని భార్య హిందీలో.
    ఇలా కాలనిర్ణయం లేకుండా గంటలకొద్ది చిరంజీవి చొక్కా పట్టుకుని నిలబడటం సర్దార్జీ కి నచ్చలేదు. చేయదల్చుకుందేదో ఠకీమని చేసేసి తన దారిన తాను  వెళ్ళడం ఉత్తమంగా కనిపించిందతనికి.
    వెంటనే పళ్ళు బిగించి, తన బలమంతా ఉపయోగించి రెండో చేత్తో చిరంజీవి నెత్తిమీద గట్టిగా కొట్టాడు.
    కానీ చిరంజీవి ఆ పరిస్థితిని ముందే గ్రహించడంచేత ఠక్కున తల కిందకు వంచేశాడు. దాంతో ఆ బలమయిన సర్దార్జీ చేయి అదే స్పీడ్ లో వెళ్ళి చిరంజీవి చొక్కా రెండో భాగాన్ని పట్టుకొన్న మరో పెద్దమనిషికి తగిలింది. ఆ పెద్ద మనిషికి గూబ అదిరిపోయింది.
    "అబ్బా" అంటూ చిరంజీవిని వదిలేసి రెండు చేతుల్లో తన తల పట్టుకున్నాడు. అదిచూసి సర్దార్జీ కంగారుపడ్డాడు.
    కానీ అప్పటికే దెబ్బతిన్న వ్యక్తి తాలూకు మరో వ్యక్తి భీకరంగా ఘర్జిస్తూ సర్దార్జీ మీదకొచ్చాడు.
    సర్దార్ జీ భయం భయంగానే వెనక్కు తగ్గుతూ పొరబాటెలా జరిగిందో వివరించడానికి ప్రయత్నించసాగాడు.
    అదే సమయమనుకుని చిరంజీవి, సింహాద్రి సైకిల్ తో సహా గుంపు బయటకు జారుకున్నారు.
    ఆ తరువాత చాలా సేపటివరకూ ఆ గుంపు అలానే ఉండడం, సర్దార్జీ తరపు కొంతమందీ, దెబ్బతిన్న వ్యక్తి తరపు కొంతమందిగా విడిపోయి చొక్కాలు పట్టుకుని తోసుకోవడం అంతా ఎదురుగ్గానే హోటల్లో కూర్చున్న సింహాద్రికీ, చిరంజీవికీ కనబడుతూనే వుంది.
    "నువ్విక్కడెలా ఉన్నావ్ రా?" అడిగాడు సింహాద్రి 'టీ' తాగుతూ.
    "ఉద్యోగం ఇక్కడే కదా మరి! ఇంకెక్కడుంటాను?"
    "ఉద్యోగమా?" మరీ ఆశ్చర్యపోయాడు సింహాద్రి"
    "అవును!"
    "నీకు ఉద్యోగం ఎలా దొరికింది?"
    "యాక్సిడెంటల్ గా అయిపోయిందిలే!" చాలా తాపీగా చెప్పాడతను.
    "అంటే?"
    "అంటే ఏముందీ? ఇంటర్ వ్యూలో నా సర్టిఫికెట్ లన్నీ వివరంగా చూళ్ళేదు వాళ్ళు"
    "అసలు పరీక్ష ఎలా పాసయ్యావ్?"
    "రైల్వే సర్వీస్ కమిషన్ కదా! పెద్ద కష్టమేముంటుంది? పరీక్ష పేపర్ ఎలాగూ రెండు రోజుల ముందు మార్కెట్లో దొరుకుతుందిగా!"
    "ఏడ్చావ్ లే మిగతా పేపర్లు మాత్రం దొరకవేంటి? అంతెందుకూ? టెన్త్ క్లాస్ వీ, ఇంటర్ వీ మాత్రం మార్కెట్లో దొరకలేదూ? నాలుగు రోజులముందే దొరికాయ్! అయినా నువ్వు ఫెయిలవ్వలేదూ?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS