Previous Page Next Page 
మధుకీల పేజి 2

    "అమ్మాయి పెళ్ళివిషయం"
    "పెళ్ళంటే మాటలా? బోలెడు డబ్బు కావాలి, కట్నాలకి ఖర్చులకి పైగా తగినసంబందం దొరకాలి."
    "సంబంధం దొరికిందనే చెపుతున్నాను."
    "ఎవరినయినా చూశావా?"
    "ఆఁ మీరు వెళ్లివస్తే సరిపోతుంది"
    "ఎవరు?"
    "భోజనంవేళ మాటలలోపడితే భోజనం సాగదంటారు కానీ చూడండీ, మాటల సందడిలో మీరు బాగా భోంచేశారు" అని మజ్జిగ వడ్డిస్తూ "ఈ రోజు పెరుగు మనిషి రాలేదు" అని "మీ బాబాయిగారి కూతురు విశాలక్షి గుర్తుందా?" అని అడిగింది.
    "నేను మనుషుల్ని మరిచిపోయే స్థాయికి యింకా ఎదగలేదు. విశాలాక్షి గుర్తుంది. ఆ మధ్య ఆమె మరిదికి పెరాలసిస్ వచ్చిందట కదా! కొడుకు స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడని విన్నాను. వాడికిద్దామంటావా?"
    జయప్రద లేచి వెళ్ళింది.
    "నీ కూతురు ఆమాటవిని లేచి వెళుతోంది. వెళ్ళి ఆమె అభిప్రాయం కనుక్కో."
    "మీరు వెళ్లి మాట్లాడి రండి నాన్నా!" మధు భోజనంముందు నుంచి లేస్తూ అన్నాడు.
    "సరే! సరే! మీ రిద్దరూ చెప్పాక తప్పుతుందా! ఈ రోజు నేను వ్రాసినట్టుగా కార్డుముక్క రాసెయ్. జవాబు వచ్చాక వెళ్ళొస్తాను" అన్నాడు సుందర్రావు.
    'అలాగే' తలూపాడు మధు.
    భర్తకి తాంబూలం అందించింది అన్నపూర్ణ.
    "మంత్రినీ నీ సలహా ఆచరణలో పెడుతున్నాను" అన్నాడు నవ్వుతూ సుందర్రావు.
    "అల్లుడొచ్చే వయసొచ్చినా మీ అల్లరి తగ్గేటులేదు" అంది అన్నపూర్ణ.
    "ఒరె ఒకె అల్లుడొస్తే- కోడలులొస్తే అన్నం కూడా తిన నివ్వరేమో మనల్ని"
    "అన్నీ నేర్చిపోయారు. మీతో ఏమన్నా చిక్కే"
    "అందుకే ఏమీ అనకు నేనేం చేస్తే అది ఆచరించు. ఆరోగ్యకరం"
    "అమ్మా నేను ఫాక్టరీకి వెళుతున్నాను" అని కేకేసి వెళ్లిపోయాడు మధు.
    "అమ్మాయి పెళ్ళితో పాటు అబ్బాయికి కూడా ముడి పెట్టిస్తే సరి"
    "ఇదిగో పూర్ణ కోడలు రావాలని కోరుకోవటం అంటే ఏమిటో తెలుసా? ఇంటి బాధ్యత తగ్గించుకోవాలను కోవటం. అల్లుడు రావాలనుకోవటం మనం పెద్దవాళ్ళమయ్యా మనుకోవటం"
    "సగం తల నెరిసిపోయినా మీకింకా చెతుర్లు తగ్గలేదు"
    "ఇదిగో రంభా వయసు శరీరానికే కానీ మనస్సుకి కాదు" అని బుగ్గ మీద చిటికవేసి వెళ్లిపోయాడు సుందర్రావు.
    ఇంట్లోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ.
                            *        *        *
    "ఇదిగో మధూ చెరుకు తోలిన రైతులు వచ్చారు. ఎవరెవరి కెంతెంత యివ్వాలో లెక్క తేల్చు. పాపం ఉదయం నించీ కాచుకుని కూర్చున్నారు వెళ్లు. అయినా గవర్నమెంటు  ఆఫీసులకి లాగా టంచన్ గా పదికొచ్చి అయిదింటికి వెళ్లాలంటే ఎలాగయ్యా బాబూ కాస్త ముందుగా వచ్చి బాగా ఆలస్యంగా వెళుతూ యిది మీ స్వంతపనిలాగా చూసుకుంటూ వుంటే కానీ యాజమాన్యానికి మన మీద వుంచి గురివుండరు. ఊఁ ఊఁ త్వరత్వరగా వీళ్లలెక్కచూడు"
    హెడ్ క్లర్క్ గారి మాటలువిని ఆశ్చర్యపోయాడు మధు. ఆయన దగ్గరిగా వెళ్ళి మెల్లిగా అన్నాడు. "ఎవరెవరికి ఎంతెంత యివ్వాల్సిందీ లెక్కలన్నీ తయారుగా వున్నాయండి మొన్నటికే తయారుచేశాను. ఇపుడు మళ్ళీ మీరు..."
    చికాకుగా అన్నాడు హెచ్.సి. పాపయ్య "మీ కుర్ర కారుతో వచ్చిన చిక్కేయిది. ఆ విషయం నాకు తెలియకనా? కానీ అలా అనేసి వీళ్ళకిప్పుడు డబ్బివ్వాలంటే బోలెడు కావాలి. నావద్ద పదివేలకి మించి లేదు. అందుకని లెక్కలు తయారుచేయటానికి టైం పడుతుందని చెప్పు, ఏదోయిచ్చి సర్ది పంపేద్దాం అని మెల్లగా అని "ఊహూఁ ఇప్పుడు లెక్కలన్ని పూర్తికావా? అలా వీల్లేదు, మీరు ఎంత రాత్రయినా కూర్చుని ఎవరెవరి కెంతెంత యివ్వాలో పైసలతో సహా తేల్చి చెప్పాలి వెళ్లండి" అన్నాడు తీవ్రంగా.
    మధు మౌనంగా వెళ్ళి సీట్లో కూర్చున్నాడు.
    "గుడ్ మార్నింగ్" అంది మణి.
    ఆమె పాపయ్య ఏకైక పుత్రిక. బి.ఏ. చదివి టైప్ పూర్తిచేసి ఆ ఫాక్టరీలో పనిచేస్తుంది. కూతురిపేరిట నెల నెలా మూడొందలు జమ అవుతోంటే చూస్తూ చూస్తూ దాన్ని జారవిడుచుకోలేకా - కట్నంయిచ్చి డబ్బు పోగొట్టుకోలేకా ఎవరైన తన కూతుర్ని ప్రేమిస్తే అదిరించో బెదిరించో కానీ ఖర్చులేకుండా పెళ్లి చేసెయ్యాలని చూస్తున్నాడు పాపయ్య.
    "వెరీ గుడ్ మార్నింగ్" అన్నాడు జవాబుగా మధు.
    "అక్షింతలు అందుకున్నారా?" అంది నవ్వుతూ.
    "ఆ!ఆ! అల్లుడి నెత్తిన వెయ్యాల్సిన అక్షతలన్నీ నా తలపై వేశారు" అన్నాడు నవ్వుతూ.
    సిగ్గుపడింది మణి.
    అంతలో ఓ రైతు వచ్చి "బాబూ. మీరు అవన్నీ లెక్క చూసి మాకు ఇచ్చేసరికి ఎంత పొద్దవుతుందో ఏమో! మేం పదిహేనుమందిమి వచ్చాము. తలా కాస్త అడ్వాన్సుగా ఇప్పిస్తే వెళ్ళిపోతాం. మళ్ళీ ఓ వారం తర్వాత వస్తాం. అప్పటికి లెక్కలు తేల్చివుంచండి" అని అడిగాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS