Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 2


    తండ్రి కళ్ళల్లో కనిపిస్తున్న బెరుకుతనం, అరచిన అరుపుకు ప్రియాంక ఓ క్షణం అనుమానించింది.

    డాడీకి మేడమ్ అంతకుముందే తెలుసా?

    "నిజమేనా?" సుదర్శన్ రావు తరచి అడిగాడు.

    తండ్రి మొహంలోకే సాలోచనగా చూస్తూ "నిజమే" అంది.

    అంటే... ఆమె గతాన్ని మర్చిపోలేదన్న మాట.

    ఆ రోజు ఆమె ఫోన్ లో అన్న మాటలు ఇప్పుడు వినిపిస్తున్నట్టుగా అనిపించి ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు.

    ఆ వెంటనే హడావుడిగా తన గదిలోకి వెళ్ళిపోయాడు సుదర్శన్ రావు. ప్రియాంక పూర్తిగా అనుమానించింది. తన తండ్రికి ఏదో ఫ్లాష్ బ్యాక్ వుంది. అందులో తన తండ్రి, మేడమ్ ప్రధాన పాత్రధారులై వుంటారు. అనుకోకుండా కథేమిటి ఇలా మలుపు తిరిగింది?

    అంటే... మేడమ్ ఒక పథకం ప్రకారమే ఆనాడు తనను రెచ్చగొట్టి, ఆ తరువాత త్రినాధ్ వెనుక నిలిచిందా? అంటే అప్పటికే తనెవరయిందీ ఆమెకు తెలిసివుండాలి.

    ముందు ఈ వ్యవహారమేమిటో తెలుసుకోవాలి అనుకుంది బయటకు వెళుతూ.

    సుదర్శన్ రావు యోగేష్ కి ఫోన్ చేశాడు.

    కొడుకు ఫోన్ లోకి వచ్చాక సుదర్శన్ రావు చెప్పడం ప్రారంభించాడు.

    "వాణ్ణి అంతవాణ్ణి చేసింది. అక్కడతో ఆగకుండా మనల్ని అవమానించేందుకు వాడి ద్వారా ప్రయత్నిస్తోంది" సుదర్శన్ రావు చెప్పటం పూర్తి కాకుండానే ఆ వైపు యోగేష్ ఫోన్ పెట్టేసి ఆవేశంగా లేచాడు.

    ఆ మరుక్షణం అతని కారు బుల్లెట్ లా కాలేజీ వైపు దూసుకుపోయింది.   


                                         *    *    *    *


    త్రినాధ్ ఎక్కినా జీప్ మామిడితోపు రోడ్ వైపు సాగిపోతోంది. జీప్ లో కూర్చున్న గుప్తా, హిందూలకు తమని త్రినాధ్ ఎక్కడికి తీసుకెళుతున్నాడో తెలియదు.

    ఈ మధ్య వారికో నమ్మకం ఏర్పడింది. త్రినాధ్ ఏం చేసినా అది సమయస్పూర్తితోనే, సమర్దవంతంగానే చేస్తాడని.

    జీప్ కొంత దూరం ప్రయాణించాక ఎదురుగా రోడ్ ప్రక్కగా కనిపిస్తున్న బంకుని హిందూ గుర్తించింది.

    అప్పుడు గుర్తొచ్చిందామెకు- కొన్ని ఒర్జుల క్రితం త్రినాధ్ తిమ్మడిలా నటిస్తూ అన్న మాటలు. 'వన్ లేక్ టీ బంక్- వన్ లేక్ ఆఫీస్ బిల్డింగ్- టూ లేక్స్ న్యూ బిజినెస్.'

    ఏమిటీతనికి ఈ విచిత్రమైన కోరిక- ఆ టీ బంక్ ని కొనాలని. దాన్ని కొనటంలో తను చేయాలనుకొనే వ్యాపారం ఏదైనా దాగుందా? ఊహూ... అలా అనిపించటం లేదు. మరి... అవమానమా? అంతే అయుంటుంది. ఎంత ఆత్మాభిమానం?!

    జీప్ టీ బంక్ కి ఒకింత దూరంలోనే ఆగింది. త్రినాధ్ దిగి హిందూ, గుప్తాల్ని తనను అనుసరించమని కళ్ళతోనే సైగచేసి కొట్లోకి వెళ్ళిపోయాడు. టీ కొట్టు యజమాని త్రినాధ్ ని గుర్తించినట్లు లేదు.

    త్రినాధ్ మూడు టీలకు ఆర్డరిచ్చాడు.

    టీ రాగానే త్రినాధ్ ఒక్క గుక్క త్రాగి 'ఛీ... ఛీ..." అన్నాడు యజమానివేపు చూసి.

    అతనికి కోపం వచ్చింది.

    "టీ కూడా తయారుచేయటం చేతకాకపోతే ఈ వ్యాపారం మానుకొని వేరే వ్యాపారం చేసుకోవచ్చు గదా?" త్రినాధ్ కంఠంలో హేళన తొంగిచూసింది.

    టీకొట్టు యజమాని తోకత్రొక్కిన త్రాచులా లేచాడు.

    "నేను వేరే వ్యాపారం చూసుకుంటాను. నువ్వీ వ్యాపారం కొంటావా? కసిగా అన్నాడతను.

    "నీకంత దమ్ము కూడా వుందా?" త్రినాధ్ మొండిగా అన్నాడు.

    త్రినాధ్ హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడో హిందూ, గుప్తాలకు అర్ధంకావటంలేదు.

    "అమ్మే దమ్ము నాకుంది. కొనే దమ్ము నీకుందా?" టీకొట్టు యజమాని రెచ్చిపోయాడు.

    అతనలా రెచ్చిపోవటాన్నే కోరుకున్నాడు త్రినాధ్.

    "కొనే దమ్ముంది- కాని ఛాన్స్ వచ్చింది గదాని నువ్వు లక్షో, రెండు లక్షలో అంటే?" త్రినాధ్ చూపులు యజమాని రియాక్షన్ ని మెరుపు వేగంతో పసిగడుతున్నాయి.

    హోటల్లో కూర్చున్న కస్టమర్స్ ఆ ఇద్దరిమధ్య జరిగే వివాదాన్ని విస్తుపోయి చూస్తున్నారు.

    యజమానికి అరికాలిమంట నెత్తికెక్కింది.

    "నీ మొఖానికి లక్షో, రెండు లక్షలో పెట్టి కూడా కొనగలవా? "సర్ క్కాస్టిగ్గా నవ్వి మరలా అన్నాడు. "యాభైవేలకు కొను- నీకు దమ్ముంటే" మాట జారాడు యజమాని.

    సన్నని చిరునవ్వు కనురెప్పపాటు కాలం మెరిసి అదృశ్యమైంది త్రినాధ్ పెదవులపై.

    "యాభై వేలకు కూడా దమ్ము లేదు. నా టీని తిడతావా?" పై పంచను గాల్లో దులుపుతూ నిర్లక్ష్యంగా అన్నాడు యజమాని మరలా.

    త్రినాధ్ ఓ క్షణం మౌనంగా వున్నాడు.

    "టీ కప్పు క్కూడా ఠికానాలేని పరమ బేవార్స్ నా కొడుకులంతా నా టీని తిట్టేవాళ్ళే..." యజమాని మాటలు పూర్తవుతుండగానే త్రినాధ్ శివంగిలా ఎగిరిదూకాడు అతని మీదకు.

    ఊహించని త్రినాధ్ ఎటాక్ కి రెండడుగులు వెనక్కి తూలి క్రిందపడ్డాడు యజమాని.

    ఆ సంఘటనతో కోపోద్రిక్తులైన యజమాని మిత్రులు- "మాటంటే పౌరుషం వున్నవాడివాయితే ఇచ్చిన టీ త్రాగి గమ్మున వెళ్ళిపోవాలి. దమ్మున్నవాడివైతే సగానికి సగం రేటు చెప్పినప్పుడు కొనాలి. అదీ, ఇదీ కాక ఇలా రౌడీయిజానికి దిగుతావా?" అన్నారు ముందుకొస్తూ.

    "సరే... యాభైవేలకు కొంటున్నాను" అన్నాడు త్రినాధ్ చేతులు దులుపుకుంటూ.

    "యాభై రూపాయిలు చూపించు చూద్దాం" బల్లల మధ్య నుంచి లేస్తూ అన్నాడు ఉక్రోషంగా యజమాని.

    "హిందూ! డబ్బిలాతే" అన్నాడు త్రినాధ్ చొక్కా చేతులు మడుచుకుంటూ.

    అప్పటికిగాని అర్ధంకాలేదు గుప్తాకి- తనతో త్రినాధ్ సేల్ డీడ్ ఎందుకు ప్రిపేర్ చేయించింది?

    అందరూ చూస్తుండగానే త్రినాధ్ వంద నోట్ల కట్టలు ఐదు బ్రీఫ్ లోంచి తీసి బల్లమీద పెట్టి- గుప్తావేపు చూడగానే ఆయన సేల్ డీడ్ అందించారు.

    "లెక్కపెట్టుకో- ఇవి యాభైవేలు- ఇది పవరాఫ్ అటార్నీ. సంతకం పెట్టు" అన్నాడు త్రినాధ్ నిర్లక్ష్యంగా.

    ఒక్కసారే యాభైవేలు చూడగానే అక్కడున్న జనాలకి కళ్ళు తిరిగిపోయాయ్.

    వివాదం కాస్తా చూస్తుండగానే అమ్మకంవేపు మరలటం- స్పాట్ లోనే డబ్బు బయటకు తీయటం- అంతా మాయలా వుంది వాళ్ళకు.

    యజమాని మరో మాట లేకుండా వడివడిగా డబ్బు లెక్కపెట్టుకుని వెంటనే పవరాఫ్ అటార్నీ మీద సంతకం చేసి ఆ కాగితాన్ని త్రినాధ్ వేపు విసిరాడు పౌరుషంగా.

    అప్పుడు వెలిసింది పరిపూర్ణమైన నవ్వు త్రినాధ్ ముఖంపై.


                   *    *    *    *


    "నీకా స్థలంలో అవమానం జరిగిందొకప్పుడు- దాన్ని తీర్చుకోటానికి ఆ స్థలాన్ని కొనేసావ్. కాని... ఆ... కొనటంలో కూడా ఇంత తెలివిగా సగానికి సగం రేటుకి కొనటమే నాకాశ్చర్యంగా వుంది. కానది మోసం కాదా?" ఇంజనీర్ జరిగిన సంఘటనపట్ల ఆశ్చర్యపోతూ అడిగాడు.

    "అది మోసం కాదు. వ్యాపారస్తుడికి అంచనాలుండాలే కాని అహం కూడదు. ఆ అహం మీదే నేను వ్యాపారం చేశాను. వ్యాపారమన్నాక కొన్ని గిమ్మిక్కులు తప్పవు" ముక్తసరిగా అని బెల్ నొక్కి గుప్తాని రమ్మని చెప్పాడు.

    ఇదివరకటిలా ఫ్రీగా, కావల్సినంతసేపు త్రినాధ్ తమతో మాట్లాడటం లేదని ఆరోజే గ్రహించాడు ఇంజనీర్.

    గుప్తా లోపలకు వచ్చాడు.

    ఒక వ్యక్తి ఏదైనా సాధించగలడు- ఎలాంటి సమస్యనైనా అధిగమించ గలడని రుజువైతే, ఆ వ్యక్తిపట్ల భయభక్తులే కాదు- ఆరాధనా భావం కూడా పెరుగుతుంది. అలాంటి అనితరసాధ్యుడి దగ్గర పనిచేయటాన్ని గర్వంగా కూడా భావిస్తారు అతని క్రింద పనిచేసేవారు.

    ఇప్పుడు గుప్తా, ఇంజనీర్ ల విషయంలో అదే జరిగింది.

    సైనికాధికారి ఆజ్ఞ కోసం ఎదురుచూసే సిపాయిలా వున్నాడు ఇప్పుడు గుప్తా. అతని కళ్ళలో ఓ బిజినెస్ జమ్ ని చూస్తున్న ఆశ్చర్యం, ఒక డైనమిక్ ఇండస్ట్రియల్ సెలబ్రిటీని చూస్తున్న ఉద్విగ్నత- అభిజాత్యానికి, ఆత్మాభిమానానికి ప్రతిరూపాన్ని చూస్తున్న థ్రిల్.

    అంతలో సూచనలు రావటం ప్రారంభించాయి త్రినాధ్ నోటినుంచి.

    "మనం కొన్న 'టీ' బంక్ ప్లేస్ లో ఒక అల్ట్రా మోడరన్ షోరూమ్ ముందు ప్లాన్ చేయండి. వెనుకవేపు గోడౌన్స్ కట్టించండి. అందుకు లోన్ కోసం బ్యాంక్స్ ని అప్రోచ్ అవ్వండి. సరిగ్గా సంవత్సరంలో ఈ సిటీ మొత్తం మీద 'టీ' సప్లై చేసే డీలర్స్ లో మనం ప్రధమ స్థానంలో వుండాలి. ఈ రోజు నుంచి మీరు వసుంధరా ఇండస్ట్రీస్ కి జనరల్ మేనేజర్. మీ జీతాన్ని మీరే నిర్ణయించుకునే అధికారం మీకిస్తున్నాను.

    ఇకపోతే వసుంధర ఇండస్ట్రీస్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ- బోర్డ్ డైరెక్టర్స్ గా ఇంజనీర్, హిందూ, బోస, వసుంధరాదేవి, విజయరామారావు, రామచంద్ర, మిసెస్ ఛటర్జీ, మాలిని, నేను నామినేట్ కావాలి. అతి త్వరలోనే బోర్డాఫ్ డైరెక్టర్స్ అందర్నీ సమావేశపరచి ఫస్ట్ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయండి.

    వివిధ రకాల వ్యాపారాల్ని మనం అతి త్వరలోనే చేపట్టాలి. వాటికి అవసరమైన మూలధనాన్ని షేర్స్ అమ్మకాల ద్వారా డిబెంచర్స్ విడుదల ద్వారా రాబట్టాలి.

    షేర్స్ డిబెంచర్స్ విడుదలకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అంగీకరించాలి. ఆ తరువాత పబ్లిక్ మన కంపెనీలో వాటాలు కొనేందుకు ముందుకు రావాలంటే మనకు హెచ్.బి. ల్యూబ్ బిజినెస్ లో బాగా లాభాలు వస్తున్న సంగతి మనం ప్రకటనల ద్వారా బయట ప్రపంచానికి తెలియపర్చాలి.

    ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి క్రమపద్ధతిలో జరిగిపోవాలి." చెప్పుకుపోతున్నాడు త్రినాధ్ - వ్యాపారంలో ఎంతో అనుభవం వున్నవాడిలా, లావాదేవీల్లో రాటుదేలిన వాడిలా.

    "తక్కువ రేటుకి డిటర్జెంట్ సోప్ అందిస్తే పెద్ద కంపెనీల పోటీని తట్టుకోలేమా? చాలా ఆశ్చర్యంగా వుంది గుప్తాజీ. మీకు కార్ సన్ భాయ్ పటేల్ గురించి తెలుసా? 'నిర్మా' డిటర్జెంట్ సోప్ ఓనర్. డిటర్జెంట్ సోప్ తయారీ వెరీ సింపుల్- డౌన్ మార్కెట్ ప్రోడక్ట్. మార్కెటింగ్ ఎపర్ట్ మినిమల్. హిందూస్థాన్ లివర్, టాటాలాంటి పెద్ద కంపెనీలు రిన్, డెట్, సర్ఫ్, డబుల్ లాంటి ఉత్పత్తుల్ని డంప్ చేసి మార్కెట్ ని చాలావరకు తమ హస్తగతం చేసుకున్నాయి. అయినా 'నిర్మా' డిటర్జెంట్ సబ్బుల ప్రపంచంలో సంచలనం సృష్టించింది" త్రినాధ్ ఓ క్షణం మౌనంగా వున్నాడు.

    "అతి సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పటేల్ బ్రతుకు తెరువు కోసం అహ్మదాబాద్ లో ప్రభుత్వ కెమికల్ సంస్థలో ఒకప్పుడు నాలుగు వందల యాభై రూపాయిల ఉద్యోగం చేసేవాడు. ఆ జీతంతో బ్రతకలేక సైడ్ వ్యాపారంగా మార్కెట్ లో కొన్ని కెమికల్స్ ని కొద్దికొద్దిగా కొని దానితో పసుపు పచ్చ పౌడర్ ని తయారుచేసి, తెలిసిన ఫ్రెండ్స్ కుటుంబాలకు చీప డిటర్జెంట్ పౌడర్ గా అమ్మేవాడు. ఆ పౌడర్ బాగా పనిచేయటం- తక్కువ ధరకి రావటంతో పటేల్ పౌడర్ ని కొనేవారి సంఖ్య క్రమంగా పెరగసాగిందట.

    దాంతో పటేల్ ఉద్యోగం మానేసి తన కూతురు పేరుమీద 'నిర్మా; డిటర్జెంట్ పౌడర్ ని ఒకింత భారీ ఎత్తున ఉత్పత్తి చేయటం ఆరంభించాడు.

    అప్పుడు ఆయన పెట్టుబడి కేవలం కొన్ని వేలు, కొన్ని బకెట్స్, కొన్ని ప్లాస్టిక్ షీట్స్- కొంతమంది కూలీలు- అంటే ఆశ్చర్యంగా లేదూ?!

    గత 14 సంవత్సరాలలో సంవత్సరానికి 50 శాతం చొప్పున ఆయన వ్యాపారం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ మధ్యనే సోప్ తయారుచేయటం ప్రారంభించాడు. వచ్చే సంవత్సరం నిర్మా బాతింగ్ సోప్, టూత్ పేస్ట్ తయారు చేయబోతున్నాడు. ప్రపంచంలో మరేదేశంలోను ఒక కంపెనీ, ఒక బ్రాండ్ నేమ్ మీద రోజుకి 500 టన్స్ డిటర్జెంట్ పౌడర్ అమ్మటం అనేది జరగలేదు. ఇప్పుడు కోట్లలో వ్యాపారం చేస్తున్నా అతని పెట్టుబడి మాత్రం కేవలం లక్షల్లోనే వుంది. ఇప్పటికీ ఆయన ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద యంత్రాలు లేవు. అతని సేల్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసేది కేవలం ఆరుగురు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS