Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 5

 

    ఉత్తరం చదివి , "రండి" అన్నాడతను కిళ్ళీ వేసుకుంటూ.
    సురేష్ లోపలకు నడిచాడు. గోడల నిండా మరకలు నిండిపోయినాయ్. పెళ్లలు చాలా చోట్ల ఊడినాయ్. చీమలు, చెదపురుగులు యిల్లంతా కనబడుతున్నాయ్.
    "వరండా , ఈ గదీ , వంటిల్లూ......." అన్నాడతను కారా కిళ్ళీ నములుతూ.
    "మరి సమాధులేవీ?"
    "సమాధులేమిటి?"
    "ఈ ఇంట్లో ఇంతకుముందున్న వాళ్ళవి......"
    అతని కర్ధం కాలేదు. "మీరేమంటున్నారో తెలీటం లేదు."
    "బహుశా వాళ్ళను చేద తినేసి వుంటుంది. అందుకని సమాధులు కట్టి వుండరు."
    "ఏ విషయం మీరు మాట్లాడుతోంది?"
    "శవాల గురించి........"
    "శవాలేమిటి?"
    "ఏమీ లేదు"
    అతను అనుమానంగా చూశాడు గాని ఆ విషయం మళ్ళీ ప్రశ్నించదల్చుకోలేదు.
    "కరెంట్ కి పదిహేను, నీళ్ళకు పాతిక మీరే కట్టాలి."
    "దహన సంస్కారాలకి కేవరిస్టారు?" అడిగాడు సురేష్.
    "అంటే?" అయోమయంతో అడిగాడు యజమాని.
    "స్మశానం దగ్గర్లో వుందా?"
    "ఎందుకు?"
    "దూరమయితే కష్టమని."
    "అంటే - ఎవరయినా జబ్బు మనిషి వున్నారా మీతో?"
    "ఇంట్లో దిగాక ఎవరయినా అవక తప్పదుకదా."
    "అవునవును. ఈ రోజుల్లో ఎప్పుడేమవుతుందో ఎవరు చెప్పగలరు?"
    "ఈ ఇంట్లో దిగేవాళ్ళ గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు."
    సురేష్ బయటకు నడుస్తుంటే అతను వెనుకే వచ్చాడు.
    "ఇల్లు నచ్చిందా?"
    "సూయిసైడ్ స్క్వాడ్స్ అని కొన్ని ఉంటాయ్. వాటి మెంబర్లకు నచ్చకేమవుతుంది?"
    "మరి ఎప్పుడు దిగుతున్నారు?"
    "త్వరలోనే........కోరికలన్నీ చచ్చిపోయాక"
    "మీరు తమాషాగా మాట్లాడుతున్నారు."
    "ఇలాంటి యిళ్ళల్లో దిగబోయే వాళ్ళంతే" నవ్వుతూ అన్నాడు సురేష్.
    "అడ్వాన్స్ యిస్తారా?"
    "ఇంకా అడ్వాన్సెందుకు? మాకున్నదంతా ఎలాగూ మీదేగా ఇక. అవునూ- ఈ ఇల్లోకటేనా- ఇంకేమయినా పద్దతులున్నాయా - ఇంట్లో దిగే వాళ్ళను అంతం చేయడానికి?"
    'అంటే?" మళ్ళీ అనుమానంగా అడిగాడు.
    "అంటే ఇతర గేమ్స్, స్పోర్ట్స్ వేటలాడటం లాంటివి! కొత్తవి ఏమయినా కనిపెట్టినప్పుడు చెప్పండి! బలికి వస్తాం.
    అనేసి నిరాశగా బయటికొచ్చేడతను. ఇలాంటి ఇళ్ళు ఈ వారంలో చాలా చూశాడతను. తులసి లాంటి అందమయిన దేవతను అలాంటి అనార్కలీ మోడల్ హౌస్ లో వుంచడం తనకు ససేమిరా యిష్టం లేదు.
    చౌరస్తా కొచ్చి నిలబడ్డాడతను.
    తులసి ఆఫీస్ నుంచి బయట పడడానికి ఇంకో అరగంట టైముంది. ఆమె దీప యింటినుంచి బయటపడడానికి ఇంక రెండే రెండు రోజుల టైం......
    ఇప్పుడు తులసికి ఏమని చెప్పాలి! ఆ యిల్లు కూడా చేయి జారిపోయిందనా? తను ఉద్యోగాలకే కాదు- ఇళ్ళు వెతికేందుకు కూడా అనర్హుడనుకుంటుందేమో!
    పక్కనే వున్న ఇరానీ హోటల్లో కుర్చున్నాడతను.
    ఆకలి ఎదురుగ్గా టేబుల్ మీద క్యాబరే డాన్స్ చేస్తోంది స్ట్రీట్ టీజ్.
    'క్యా హోనా భాయ్?"
    సమోసా, ఛాయ్."
    చటుక్కున గుర్తుకొచ్చింది సురేష్ కి.
    "డోంట్ వర్రీ సురేష్! ఇల్లు సమస్య సాల్వ్ అయిపొయింది. తులసి పొద్దున ఆ విషయం చెప్పింది కదా. ఆమె, ఆమె ఫ్రెండ్ విజయా కలిసి ఓ ఇల్లు చూశారనీ, ఆ ఇల్లు నచ్చిందనీ."
    అక్కడ సెటిల్ అయిపోవచ్చు.
    తులసి దూరంగా జన ప్రవాహం మధ్యలో ప్రత్యేకంగా, అందంగా ఠీవిగా నడుస్తోంది! యస్! ఆమె అందానికో ప్రత్యేకత వుంది. అందుకే ఆమెని తన లైఫ్ పార్టనర్ గా ఎన్నుకున్నాడు. లేచి హోటల్ నుంచి బయటికొచ్చాడు. తులసి పక్కన దీప అందం వెలవెలపోతోంది.
    "హలో........హలో" తులసినీ, దీపనూ పలకరించాడు.
    "హలో" అంది దీప అయిష్టంగా. తనంటే దీపకు ఎంత అయిష్టమో తనకు తెలుసు. ఆమె కెంత అయిష్టమో అంతగా టీజ్ చేస్తుంటాడు.
    "మాకు ఇల్లు దొరకలేదు. కనుక మీరూ మీ భర్తా సంసారానికి రిబ్బన్ కత్తిరించే కార్యక్రమంలో ఇంకో ఆరు నెలలు పోస్ట్ ఫోన్ చేసుకోవాలి" సీరియస్ గా అన్నాడు.
    ఆమె ముఖంలో రంగులు మారాయి.
    "తను నిన్నే వైజాగ్ నుంచి యిక్కడకు సామాను పంపించేశారు కదా?"
    "అయితే మీరే వేరే ఇల్లు చూచుకోండి"
    తులసి నవ్వేసింది.
    "లేదా యింకో చాయిస్ కూడా వుంది"
    "ఏమిటది" అడిగింది దీప.
    "మీ పెళ్ళి కాన్సిల్ చేసేసుకోవటం."
    దీప ముఖంలో కోపం ఎరుపు రంగు గూడు కడుతోంది.
    "ఏయ్!" అంది తులసి నవ్వేస్తూ.
    "అయినా మీరు ఆ రోజే నా ప్రపోజల్ కి వప్పుకుంటే ఈ గొడవంతా లేకపోను కదా!"
    దీప అసహనంగా చూసింది తులసి వైపు. ఆ మాట ఎత్తితే చాలు భరించరాని కోపం ఆ అమ్మాయికి.
    "నేను వెళుతున్నాను"
    "ఓ.కె. నేను యింకో గంటలో వచ్చి సామాను తీసికెళతాను" నవ్వాపుకుని చెప్పింది తులసి.
    దీప విసురుగా నడిచిందక్కడి నుంచి.
    "దీపతో అలా మాట్లాడవద్దని చెప్పానా" బస్ స్టాప్ వైపు నడుస్తూ అంది తులసి.
    "మాటలతో ప్రారంభించకుండా డైరెక్ట్ గా కార్యక్రమంలోకి దిగితే బాగుండదు కదా.'
    మోచేత్తో సురేష్ నడుము మీద పోడిచిందామె.
    "ఇంటికి అడ్వాన్స్ కట్టేశారా?"
    "లేదు, ఆ ఇల్లు కాన్సిల్ చేసేశాను"
    "ఎందుకని?"
    "ఇంటావిడ అందంగా లేదు."
    "ఆమె అందంతో నీకేమిటి పని?"
    "తెల్లారి లేస్తే మేమిద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి కదా! నువ్వు ఆఫీసు కెళతావు."
    తులసి నవ్వేసింది.
    "అసలు సంగతి ఏమిటంటే ఆవిడే ఇల్లు యివ్వనంది"
    తులసి ఆగిపోయింది.
    "ఎందుకని?"
    "నేను ఆమెకి నచ్చలేదట"
    "మరి ఇప్పుడెలా?"
    "ఆ ఇల్లు కావాలంటే నన్ను మార్చేసి యింకోకతన్ని తెచ్చుకో"
    "డోంటాక్!"
    "నువ్వూ , మీ 28-24-28 యింకో ఇల్లు చుశానన్నారు కదా! ఆ ఇంటికి వెళదాం."
    తులసి ఓ క్షణం ఆలోచించింది.
    "సరే పద"
    ఇద్దరూ బస్ లో బయల్దేరారు.
    బస్ దిగి నడుస్తుంటే సురేష్ కి అనుమానం వచ్చేసింది.
    "మీరు చూసిన ఇంటి ఓనరు పేరేమిటి?"
    "ఎందుకు?"
    "ఫన్ సేక్"
    "గంగాభవాని"
    టక్కున ఆగిపోయాడు సురేష్.
    "తులసీ! నేనిక్కడే నిలబదతాను. నువ్వెళ్ళి అడ్వాన్స్ యిచ్చేసిరా?
    "ఎందుకలా?"
    "మా యిద్దరికీ సరిపడదు"
    తులసి అనుమానంగా చూసింది. "నువ్ చూసిన ఇల్లు అదే కదూ?"
    "అవును"
    ఆమెకేం చేయాలో తెలీదు.
    "తులసీ ముందు వెళ్ళి అడ్వాన్స్ కట్టెయ్. రాత్రికి సామాను తెస్తున్నామని చెప్పు. ఉదయం నన్ను చూసినా అప్పుడిక ఏమీ ప్రాబ్లం వుండదు. ముందు ఇల్లు దొరకడం ముఖ్యం."
    తులసి వంటరిగానే వెళ్ళి పావుగంటలో తిరిగి వచ్చింది.
    "ఏమంది గంగాభవాని?"
    "ఓ.కె. అంది"
    "థాంక్ గాడ్! పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపొయింది. పద మీ రూమ్ కెళ్ళి సామాను తీసుకొచ్చేద్దాం."
    ఆటోని పిలిచిందామే.
    ఇద్దరూ యింటికి చేరుకున్నారు. దీప వారపత్రిక చదువుతోంది. తులసిని చూడగానే ఆతృతగా అడిగింది "ఇల్లు దొరికిందా?"
    "మీ సంసారం మూడు పగళ్ళూ ఆరు రాత్రులుగా ప్రారంభించవద్దు. అన్నట్లు దానిక్కూడా ప్రారంభోత్సవం లాంటిదేమయినా.....ఎందుకంటే రిబ్బన్లు కత్తిరించటంలో నేను ఎక్స్ ఫర్ట్ ని. హైస్కూల్లో మా క్లాస్ మెట్ నటాషా జడ రిబ్బన్ నేనే కత్తిరించాను."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS