Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 5


    "మీన్ వైల్....నాకు ఇంకా పూర్తిగా ఈ ప్రాజెక్ట్ బాక్ గ్రౌండ్ కావాలి. ఇన్ వాల్వ్ అయిన అందరి వివరాలు కావాలి....ఓ.కే....?"
    "ఓ.కే. సర్!"
    "మరో విషయం నీ మిగిలిన పనులన్నీ ప్రక్కనపెట్టు. దిస్ షుడ్ గెట్ టాప్ మోస్ట్ ప్రెయారిటీ. రేపు ఉదయానికల్లా నాక్కావలసిన వివరాలన్నీ నా టేబుల్ పైన ఉండాలి ఆఫీసులో ఓ.కే....?"
    "ఓ.కే. సర్!"
    అరనిముషం పాటు అలాగే నిశ్శబ్దంగా నిలబడ్డాడు భరద్వాజ.
    ఆ తరువాత చేతి గడియారం వంక చూసుకున్నాడు. సమయం సరిగ్గా ఒంటిగంటా పది నిమిషాలవుతోంది.
    "మూర్తీ....ఈ వింగ్ కి ఇదే మొట్టమొదటి బ్రేక్ త్రూ అవుతుంది  ఎట్టి పరిస్థితులలోనూ ఈ ప్రాజెక్ట్ మనది కావాలి."
    "తప్పకుండా అవుతుంది సార్."
    "గుడ్...." అని శ్రీధరం వైపు తిరిగాడు భరద్వాజ. న్యూస్ పేపర్ లో బిజినెస్ కాలమ్స్ లో మునిగిపోయాడతను.
    "శ్రీధరం!"
    తలెత్తాడు శ్రీధరం.
    "వై డోంట్ యూ జాయిన్ మి ఫర్ లంచ్?"
    "తప్పకుండా...." లేచాడు శ్రీధరం.
    "కరకరలాడుతోంది కడుపులో పద"
    ఇద్దరూ బయటికి నడిచారు.
    స్రింగ్ డోర్స్ వారి వెనకాలే మూసుకున్నాయి.
    వెంటనే టెలిఫోన్ అందుకొని ఒక నెంబరు తిప్పసాగాడు మేనేజర్ మూర్తి. మేనేజర్ కాబిన్ నుండి బయటకు వచ్చి బంగళా బయటకు కదిలారు, భరద్వాజ శ్రీధరం. ఎవరి ఆలోచనలలో వారున్నారు.
    నేరుగా వెళ్ళి కారులో కూర్చుని అటువైపు డోర్ లాక్ తీశాడు భరద్వాజ, కారెక్కాడు శ్రీధరం.
    డ్రయివర్ లేకుండా స్వయంగా కారు నడపటం సరదా భరద్వాజకి.
    "ఎక్కడికి వెళదాం?" ప్రశ్నించాడతను.
    "ఇంటికే వెళదాం."
    భరద్వాజ ఇంట్లో ఎవరయినా భోజనం చేస్తే మళ్ళీ ఆ అవకాశం కోసం ఎదురుచూసేలా వుంటాయి వంటలు.
    "సరే!" అంటూ కారు స్టార్ట్ చేశాడతను.
    "మళ్ళీ మర్చిపోతానేమో.... రేపు ప్రొద్దున్న త్వరగా రా ఆఫీసుకి. అంటే.... సే...ఎయిట్ ఓ క్లాక్ కల్లా. మూర్తి మంచి కేపబుల్. రేప్రొద్దున్నకల్లా కావలసిన వివరాలన్నీ టేబుల్ పైన వుంటాయి. ఇద్దరం కలిసి పరిశీలిస్తేనే మంచిది" అంటూ గేర్ వేశాడు భరద్వాజ.
    నున్నటి రోడ్డుమీద పరుగుతీసింది మారుతి.
    భరద్వాజ కారు రోడ్డు మలుపు తిరగగానే మరోవైపు నుండి నల్లటి అంబాసిడర్ కారొకటి వచ్చి ఆగింది ఆ బంగళా ముందు.
    అందులోంచి ఇందాక గదిలో ప్రాజెక్ట్ గురించి భరద్వాజ, శ్రీధరాలతో చర్చించిన వ్యక్తి దిగాడు. హడావుడిగా బంగళాలోకి నడిచాడు. నేరుగా మేనేజర్ మూర్తి గదిలోనికి ప్రవేశించాడు.
    దాదాపు అయిదడుగుల ఎనిమిదంగుళాల పొడవు వుంటాడతను. పెద్ద పెద్ద కళ్ళు, సూటిగా వున్న ముక్కు, చిన్న పెదవులు, చక్కని మీసకట్టు, దాదాపు గడ్డం చివరవరకూ వచ్చిన సైడ్ లాక్స్ అందంగా చూడముచ్చటగా వున్నాడతను.


                                                              3


    ఎండ మండిపోతోంది. ఏ.సి. రూమ్ లో కుర్చీలో సీలింగ్ కేసి చూస్తూ కూర్చున్నాడు సాగర్. అతని మెదడు నిండా ఆలోచనలు. క్రితం రోజు రాత్రి శృతి అన్న వాక్యం పదే పదే అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. తెరచి వున్న అతని కళ్ళల్లో ప్రతిబింబిస్తున్నది పైన వున్న రంగుల సీలింగే అయినా అతని కళ్ళు మాత్రం దాన్ని చూడటం లేదు. టేబుల్ పైన నిండిన యాష్ ట్రే అతను సుమారు ఎంతసేపటి నుండి అలా వున్నాడో గొంతెత్తి చాటుతోంది.
    సూపర్ ఫాస్ట్ రైలుబండిలా వెనక్కి పరిగెత్తిన అతని ఆలోచన దాదాపు పాతిక సంవత్సరాల క్రితం వరకూ పరిగెత్తి ఆగిపోయింది. అక్కడ నుండి ఎక్స్ ప్రెస్ స్పీడులో మళ్ళీ ప్రస్తుతం వైపుకి కదలసాగింది. తండ్రి చనిపోవడం అంటే ఇదీ అని తెలీదు సాగర్ కి. తండ్రి నిద్రపోతున్నట్టుగా వుంటే అమ్మ ప్రక్కనే కూర్చుని అదే పనిగా ఏడ్వటంతో అలా చేయాలి కాబోలుననుకుని తనూ ఆమెతో ఓ ఏడుపేడ్చి వూరుకున్నాడు.
    అతనికివన్నీ అర్థమయ్యే వయసు వచ్చేసరికి నాలుగిళ్ళల్లో పాచి పని చేస్తూ సాయంత్రం అప్పడాలొత్తి అమ్మేస్తూ శరీరాన్ని హోనం చేసుకుంటూన్న అమ్మ కనిపించింది. అతని తల్లికున్న అదృష్టం ఒక్కటే. అది సాగర్ తప్ప మరి పిల్లలు లేకపోవడం. ఆమె అంతంత మాత్రపు సంపాదన వాళ్ళిద్దరి కడుపులు నిండటానికి, సాగర్ చదువు నిరాటంకంగా సాగటానికి పనికొచ్చేది. ఇలాగే కష్టపడి ఇంటర్ అయ్యిందనిపించాడు సాగర్. చదువక్కడితో ఆపేసి ఉద్యోగం చేసుకుంటానన్నాడు సాగర్. ఇంతా చేసి ఒక్క డిగ్రీ కూడా లేకుండా ఈ స్థితిలో అతను చదువాపేయటం ససేమిరా ఇష్టంలేకపోయింది అతని తల్లికి. తల్లీ కొడుకుల మధ్య గంటపాటు హోరాహోరీగా జరిగిన వాదనలో చివరికి అతని తల్లే గెలిచింది.
    డిగ్రీలో చేరాడు సాగర్. రెండో సంవత్సరం జరుగుతూండగా కాలేజీ ఎలక్షన్ లో నిలబడ్డాడు. అదే అతని జీవితంలోని అతి ముఖ్య సంఘటన. ఎలక్షన్స్ లో తనకి వ్యతిరేకంగా పోటీ చేసిన 'శృతి'లోని గాంభీర్యం, అందం, పట్టుదల, వాక్చాతుర్యం సాగర్ ని విపరీతంగా ఆకర్షించాయి. మొట్టమొదటిసారిగా తనకే తెలియకుండా అతని హృదయంలో 'ప్రేమ' అనే స్పందన కలిగింది.
    పోటీ నుండి తను విరమించుకుందామని నిర్ణయించుకొని మిత్ర బృందంతో చెప్పాడది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
    ఒక్క దయాళ్ మాత్రం గొడవ చేశాడు. అప్పటికే తాను సాగర్ కాన్వాసింగ్ కోసం చాలా డబ్బు ఖర్చుపెట్టి వుండడంతో చిన్నగా మొదలైన గొడవ చిలికి_చిలికి గాలివాన అయింది. చివరకు జరిగిన తీవ్ర పోరాటంలో స్వరక్షణలో దయాళ్ ని దెబ్బతీశాడు సాగర్. కాలు విరిగి నెల్రోజులు మంచానపడ్డాడు దయాళ్.
    అయితే దయాళ్ ని కొట్టిన పశ్చాత్తాపంతో ఎలక్షన్ లో కంటిన్యూ అయ్యాడు సాగర్.... దాంతో వారి స్నేహం ఈ పోరాటాన్ని మరవగలిగింది.
    అయితే పోటీచేస్తూ కూడా శృతికి వ్యతిరేకంగా కాన్వాసింగ్ లేకపోవడం వల్ల సాగర్ ఓడిపోయాడు.
    ప్రేమించిన వ్యక్తి చేతిలో ఓటమి గెలుపులాంటిదే. ఆ అనుభూతి సాగర్ కి చిత్రంగా అనిపించింది. తనలా ఓడిపోవడంతో తనకే తెలియకుండా మానసికంగా అతను శృతిపట్ల తన ప్రేమను మరింత పెంచుకున్నాడు. తన ప్రేమను ఆమెకి తెలియజెప్పాలని అనేకరకాలుగా ప్రయత్నించాడు.
    ఆమెకి అవన్నీ అర్థమయ్యాయో లేదో తెలీదుగాని ఆమెనుండి అంతగా ప్రోత్సాహం లభించలేదు సాగర్ కి.
    రెండవ సంవత్సరంలోని మిగిలిన భాగమూ_మూడవ సంవత్సరం పూర్తిగా కూడా ఆమె ఆలోచనలతోనే గడిపేశాడు. ఆ తర్వాత దాదాపు సంవత్సరంపాటు శృతిని కలవలేదు సాగర్. అసలు కలిసే పరిస్థితుల్లో కూడా లేడు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాడు. రకరకాల ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాడు. అనేక ప్రయివేట్ సంస్థలలో దరఖాస్తులు పెట్టాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS