Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 4


    సరిగ్గా ఉదయం పదకొండు గంటలయ్యింది సమయం. అతను మేనేజర్ గదిలోనికి అడుగుపెట్టే సమయానికి. గది మరీ విశాలమైనది కాకపోయినా చాలా పొందిగ్గా అందంగా అమర్చబడి వుంది. అతను లోపలికొచ్చే సమయానికి మేనేజర్ తో పాటు మరి ఇద్దరు కూడా వున్నారా గదిలో.
    "రండి" లేచి నుంచుని చేయి అందించాడు మేనేజర్.
    "వీరు శ్రీధరం గారు. మా ఫైనాన్స్ కంట్రోలర్. ఇక వీరు మీకు తెలుసు."
    "అవును. మీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ భరద్వాజగారు" తనే పూర్తిచేసి వారిద్దరితో కూడా కరచాలనం చేసి కుర్చీలో కూర్చున్నాడతను.
    భరద్వాజ గొంతు సర్దుకున్నాడు.
    "మా మేనేజర్ విషయాలన్నీ పూర్తిగా చెప్పారు. అయినా మళ్ళీ కొన్ని పాయింట్స్ గురించి నిర్ధారణ చేసుకోవాలనుకుంటున్నాను."
    "చెప్పండి" కుతూహలంగా చూశాడతను భరద్వాజ వేపు.
    "మరేమీ లేదు. దాదాపు పదిహేను వందల ఇళ్ళ ప్రాజెక్ట్ ఇది. మొత్తం కాస్త ఎస్టిమేషన్ ఏడెనిమిది కోట్లకి తక్కువ కాదు...."
    "మేమిచ్చే రెండు మూడు కోట్లుకాక మిగిలినవి ఎలా సమకూర్చుకుంటారో చెప్తే...."
    "అన్నీ సవ్యంగా జరుగుతాయి. అన్ని సోర్పెస్ కీ మీకు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. సరేనా?"
    "సరేననుకోండి. ఎంతకాదనుకున్నా మా భం మాకుంటుంది కదా? రెండు మూడు కోట్లు ఒకేసారి_ అదీ ఈ లైన్ లో క్రొత్తగా అడుగుపెట్టి ఇంత తొందరలో ఇన్వెస్ట్ చెయ్యడమంటే...." నసిగాడు ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధరం.
    కూల్ డ్రింక్స్ వచ్చాయి గదిలోకి.
    అవి సిప్ చేస్తూ కూర్చున్నారు వారికి వారే తమ తమ ఆలోచనలతో.
    "ఎక్స్ క్యూజ్ మీ" కోటు పాకెట్ లో నుండి సిగరెట్ పాకెట్ తీసి తాపీగా ఓ సిగరెట్ నోటికి చేర్చి లైటర్ వెలిగించాడతను. అది మ్యూజికల్ లైటర్, మంటతోపాటు సన్నటి వినసొంపైన సంగీతం కూడా వస్తుంది. తాపీగా గుండెలనిండా పొగ పీల్చుకుని ముక్కుతో విడుస్తూ చెప్పాడతను.
    "ఒ.కే. థింక్ ఎబౌటిట్. కావాలనుకుంటే రెండే కాదు. నాలుగు కోట్లైనా ఇచ్చే సంస్థలతో పరిచయం ఉంది నాకు. అయినా మీ దగ్గరికి ప్రపోజల్ తెచ్చానూ అంటే ఏవిఁటో తెలుసా?"
    ఎవరూ మాట్లాడలేదు,
    "సింపుల్.... మీరు ఈ లైన్ కి క్రొత్త అందుకని పని చాలా తొందరగానూ, ఎఫిషియంట్ గానూ జరుగుతుంది. చాలా ఏంగిల్స్ లో ఉన్నత శిఖరాలెక్కిన మీకు మీరడుగుపెట్టిన ఏ లైన్ లో నన్నా ఇమేజ్ పెంచుకోవడమన్నది చాలా ముఖ్యమనిపించడం ఖాయం. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏదో_ నా ఫ్యాక్టరీ ఉద్యోగులందర్నీ ఇంటి యజమానుల్ని చేద్దామన్న చిన్న కోరికవల్ల అసలీ ప్రాజెక్ట్ టేకప్ చేశాను...."
    ఇంటర్ కమ్ మ్రోగింది.
    "ఎక్స్ క్యూజ్ మీ" అంటూ అందుకున్నాడు మేనేజర్, "ఏస్.... ఆఁ.... ఆఁ.... నో నో.... కుదర్దని చెప్పెయ్యి. అయినా ఇప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దని చెప్పానా?" చిరాగా డిస్కనెక్ట్ చేశాడు.
    తన మాట కొనసాగించాడు వచ్చిన వ్యక్తి "....సో.... ప్లాన్సూ, ఎస్టిమేట్సూ ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఇంకా మీకు కావలసినవన్నీ - ఒక్క లీగల్ డాక్యుమెంట్స్ తప్ప మీ ఆఫీసుకి సబ్ మిట్ చేశాను. మళ్ళీ ఒకసారి అవన్నీ చూసి మీ నిర్ణయం వెంటనే తెలియజేస్తే పని ప్రారంభించుకోవచ్చు. ఈ రోజున ఇలాంటి విషయాలు ఆలస్యంచేస్తే మొత్తం ప్రాజెక్టు రూపురేఖలే మారిపోతాయి."
    బస్తా సిమెంటు కొన్న డబ్బుకి రేపు సిమెంటు వాసన కూడా రాదు.
    ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని మార్చి మార్చి చూశాడతను.
    రెండు నిమిషాలు గడిచాయి.
    నోరు విప్పాడు భరద్వాజ. "ఓ.కే. మీరు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ వీ కాపీలు పంపించండొకసారి. జస్ట్ వెరిఫై చేస్తాం."
    "ఫైన్, రేపే పంపిస్తా."
    అతను లేచాడు. అందరితోనూ మరోసారి కరచాలనం చేసి బయటకు నడిచాడు. స్ప్రింగ్ డోర్స్ అతని వెనకాలే మూసుకున్నాయి.
    గదిలో మూగ్గురూ ఒకరికేసి ఒకరు చూసుకున్నారు.
    "మూర్తీ.... ఏవీ ఆ ఎస్టిమేట్స్?" చేయి సాచాడు భరద్వాజ.
    ఓ లావు పాటి ఫైలు అందించాడు మేనేజర్ మూర్తి.
    సిగార్ తీశాడు భరద్వాజ.
    "ప్చ్!.... మళ్ళీ.... ఇది కుదరదని స్ట్రిక్ట్ గా చెప్పాడా లేదా డాక్టర్?" కోపంగా అడిగాడు ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధరం.
    "సరే....ఒక్కటే ఒకటి." నసిగాడు భరద్వాజ.
    "కుదర్దు"
    "ప్లీజ్"
    "సర్లే నీ ఇష్టం. సాయంత్రం డాక్టర్ తో చెపుతానుండు. నోరు కుట్టేయమని వయసు పెరిగే కొద్దీ మరీ చిన్నపిల్లల చేష్టలు పెరిగిపోతున్నాయి. అసలు శృతితో చెప్పాలి చేతులు కట్టి కూర్చోబెట్టమని...." నవ్వుకున్నారిద్దరూ....
    ఆఫీస్ బాయ్ వచ్చి ఖాళీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకెళ్ళిపోయాడు.
    మళ్ళీ వాతావరణం క్రమంగా గాంభీర్యాన్ని సంతరించుకుంది గదిలో.
    ఫైలంతా నిశితంగా పరిశీలించసాగాడు భరద్వాజ.
    "శ్రీధరం...."
    "ఊఁ...."
    "మొత్తం పదిహేను వందల ఇళ్ళు....ఎవరేజ్ న ఆరువందల చదరపు అడుగుల పింత్ ఏరియా. కేవలం టోటల్ ఎస్టిమేట్స్ ఆరుకోట్ల కిచ్చారు. తక్కువ అనిపించడం లేదూ?"
    "మ్...." సాలోచనగా తల పంకించాడు శ్రీధర్.
    "ప్లాన్స్ లో కూడా ఏదో పొరపాటు కనిపిస్తోంది నాకు" అన్నాడు భరద్వాజ.
    "చాలా అద్భుతంగా వున్నాయి కద్సార్....?" మేనేజర్ మూర్తి ప్రశ్నించాడు.
    "చాలా కాదు మూర్తీ, మరీ అద్భుతంగా ఉన్నాయి...." శాంతంగా అన్నాడు శ్రీధరం. "అదే....అదే నాకూ అర్థం కావడంలేదు. దే ఆర్ ఎ లిటిల్ మోర్ దాన్ పర్ఫెక్ట్!"
    చాలాసేపు ఫైలు తిరగేస్తూ ఉండిపోయాడు భరద్వాజ. ఉన్నట్టుండి తలెత్తి మూర్తివంక చూస్తూ ప్రశ్నించాడు, "చౌదరి యింకా రాలేదా ఇన్పెక్షన్స్ నుండి?"
    "వన్ మూమెంట్ సర్....చెక్ చేస్తాను...." అని ఇంటర్ కమ్ ఎత్తాడు మూర్తి.
    "చౌదరి వచ్చాడా....? సరే....రాగానే నా దగ్గరికి పంపించు" ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు.
    భరద్వాజ లేచాడు.
    "ఓ.కే. మూర్తీ! ఈ ఫైలు నేను పట్టుకెళుతున్నాను. చౌదరి వస్తే ఈవినింగ్ ఎపాయింట్ మెంట్స్ త్వరగా పూర్తి చేసుకుని నన్ను కలవమని చెప్పు. ఏమీ లేకపోతే వెంటనే కలవమను....!"
    "ఓ.కే. సర్!"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS