Previous Page Next Page 
మగబుద్ధి పేజి 4


    అసహనంగా రోడ్డంట చూశాడు నరేష్.

 

    చచ్చిపోయిన నల్లత్రాచుపాములా రోడ్డు కనిపిస్తోంది.

 

    టైమ్ ఎంతైందో తెలుసుకోవాలని పక్కకు చూశాడు. ఇందాకట్నుంచి టైమ్ చెప్పిన వ్యక్తి తనను తప్పించుకోవాలనే దూరంగా వెళ్లి నిలబడి వుండడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు.

 

    మొదటి జీతం రాగానే గడియారం కొనుక్కోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వాచ్ కట్టుకున్న వాళ్ళని చూస్తే అతనికి ఈర్ష్య. ఎంచక్కా కాలాన్ని అలా ముంచేతి మీద కట్టేసుకోవడం థ్రిల్లింగ్ గా వుంటుందనుకున్నాడు.

 

    అంతలో ఓ అమ్మాయి అవతలి నుంచి రోడ్డు దాటి బస్టాప్ లోకి వచ్చింది.

 

    అక్కడున్న మగపురుషుల చూపులన్నీ ఓ క్షణంపాటు ఆమె మీద ప్రాకి చెదిరాయి. అయితే ఆమెనుంచి చూపు మరల్చంది ఒక్క నరేషే.

 

    అమ్మాయిల్ని పరిశీలించి చూడడం అతనికి ఇష్టం. అమ్మాయిల్నే కాదు స్త్రీ కనిపిస్తేనే అతను చూపు మరల్చుకోలేడు. వాళ్ళ లావణ్యం, వాళ్ళ సోయగం, వాళ్ళ ఒంటి అమరిక, వాళ్ళ అవయవాల్లోంచి తొంగిచూసే సౌందర్యం ఇవన్నీ అతనికి ఎంతో మత్తునిస్తాయి.

 

    పక్కన రంభలాంటి భార్య నడుస్తున్నా ఎదురుపడ్డ అనాకారినైనా ఓ క్షణంపాటు చూడాలనుకోవడం మగబుద్ధి. ఆ బుద్ధి కాస్తంత ఎక్కువయింది నరేష్ కి. ఎంత అనాకారి అయినా ఎక్కడో ఒక దగ్గర ఆమె అందం నిక్షిప్తమై వుంటుందనేది అతని ఫిలాసఫీ. అందుకే ఎదురుపడ్డ ఆడదాన్ని ఏ మగాడయినా ఓ క్షణంపాటు చూస్తే నరేష్ రెండు క్షణాలు చూస్తాడు. అది బలహీనతే అనుకుంటే ఆ బలహీనతపాళ్ళు ఎక్కువ అతనికి. ఆ ఒక్క వీక్ నెస్ తప్ప అతనికి మరో బలహీనత లేదు. ఆ బలహీనతే అతన్ని ముందు ముందు చాలా కష్టాల్లో పడేసింది.  

 

    బస్టాప్ లోకి వచ్చిన ఆ అమ్మాయి నరేష్ ముందు నిలుచుంది.

 

    "అంతా బావుంది ఆ ముక్కుపుడక తప్ప" అనుకున్నాడు నరేష్ ఆమెను నిశితంగా పరిశీలించాక.

 

    చుడీదార్ వేసుకుంది గనుక స్టయిల్ గా వుంది. అయితే ఆ ముక్కుపుడక వల్ల ఏదో పాతదనం కనిపిస్తోంది. అతి తీసేస్తే ఇంకా అందంగా వుంటుందనుకున్నాడు.

 

    తనకు ఆవేళ ఇంటర్వ్యూ అనీ, ఖచ్చితంగా పదిగంటలకల్లా స్మిత ఎక్స్ పోర్టింగ్ కంపెనీలో వుండాలన్న విషయం కూడా తాత్కాలికంగా మరిచి ఆమె అందాన్ని వీక్షించడంలో మునిగిపోయాడు.

 

    అంతలో హార్న్ మ్రోగించుకుంటూ వచ్చి ఆగిన బస్సు అతని కళ్ళల్లో పడడంతో ఇంటర్వ్యూ గుర్తుకొచ్చి జనంలో కలిసిపోయాడు.

 

    బస్సు అంత రష్ గా లేదు. నింపాదిగా ఎక్కి ఖాళీగావున్న సీట్లో కూర్చున్నాడు.

 

    దాదాపు పదిమంది ఎక్కారు. ఎక్కిన వాళ్ళవేపు విసుగ్గా చూసి టికెట్లు చించడం ప్రారంభించాడు కండక్టర్.

 

    ప్యాసెంజర్లను చూస్తూనే ఒంటికి కారం రాసుకున్నట్టు ఇబ్బంది పడిపోయే ఆ కండక్టర్ ను చూసి చిరునవ్వు నవ్వాడు నరేష్.

 

    విసుగ్గా చూస్తూ టికెట్లు కోస్తున్న కండక్టర్ కాసేపయ్యాక నరేష్ దగ్గరికి వచ్చాడు.

 

    "టికెట్."

 

    "గాంధీబజార్" రూపాయి బిళ్ళను చేతిలో పెట్టాడు నరేష్.

 

    "ఇంకా పదిపైసలివ్వు" మరింత విసుగ్గా అడిగాడు కండక్టర్.

 

    ఆ మాట వినగానే పై ప్రాణాలు పైనే పోయాయి నరేష్ కి.

 

    "టికెట్ రూపాయే కదా" బలహీనంగా అన్నాడు.

 

    "ఈరోజు నుంచి మినమమ్ టికెట్ రూపాయి పదిపైసలు చేశారు. ముందు పదిపైసలివ్వండి."    

 

    "నిన్నటివరకూ రూపాయే కదా మినమమ్ టికెట్టు ధర."

 

    "అది నిన్నటి సంగతి. ఈరోజు సంగతి ఇది."

 

    "నా దగ్గరున్నది అంతే" ఎవరికీ వినపడకూడదని చిన్నగా చెప్పాడు నరేష్. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పైనున్న దారం లాగాడు కండక్టర్.

 

    బస్సు ఠక్కున ఆగింది.

 

    "రేపు ఇదే రూట్ లో వస్తారు కదా అప్పుడిస్తాను. ప్లీజ్ టికెట్ ఇవ్వండి" దీనంగా ముఖం పెట్టాడు అతను.

 

    "లాభం లేదు సార్. ముందు దిగండి."

 

    అతని పైకిలేస్తూ మరోమారు అర్థిస్తున్నట్టు చూశాడు.

 

    "ముందు దిగండి" అని కాస్తంత గట్టిగా కసిరాడు కండక్టర్.

 

    మరో నిముషం అలానే నిలబడి వుంటే పరువు పోతుందని అక్కడ్నుంచి కదిలాడు అతను. వెనక సీట్లో కూర్చున్న ఓ అమ్మాయిని నిశితంగా చూస్తూ కిందకు దిగాడు.

 

    బస్సు వెళ్ళిపోయింది.

 

    నిస్తేజంగా అలా నిలబడిపోయాడు. ఎడారిలో నడుస్తూ దాహంతో ఆగిపోయిన మనిషిలా అయిపోయాడు. ఇక టైమ్ లో ఇంటర్వ్యూకి హాజరు కాలేనేమోనన్న భయం ప్రారంభమైంది.

 

    ఆ ప్రాంతంలో బస్టాప్ లేదు. బస్టాప్ కి వెళ్ళాలంటే పైకైనా, కిందకైనా రెండు ఫర్లాంగులు నడవాలి.

 

    సరిగ్గా అలాంటి సమయాల్లోనే అతనికి తనంటే అసహ్యమేస్తుంది. తన జీవితంపట్ల కసి పెరుగుతుంది. తన నిస్సహాయతకు బాధేస్తుంది. తను బాల్యం నుంచి అనాధగా పెరిగిన విషయం గుర్తుకొస్తుంది. తన పేదరికం కంబళి పురుగులా అతి జుగుప్సాకరంగా కనిపిస్తుంది.

 

    ఆ ఇబ్బంది నుంచి బయటపడితే మళ్ళీ మామూలుగా అయిపోతాడు. చలాకీగా వుంటాడు. ప్రపంచంలోని అందాలన్నింటినీ అప్పుడే చూస్తున్నట్లు అద్భుతంగా ఫీలవుతాడు. ప్రతి అనుభవంలోనూ ఆనందాన్ని జుర్రుకుంటాడు.  

 

    అయితే ప్రస్తుతం మాత్రం అతను మానసికంగా కుంగిపోతున్నాడు. క్షణాలు గడుస్తున్నకొద్దీ టెన్షన్ ఎక్కువైపోతోంది.

 

    అప్పుడప్పుడూ ఆటోలు దొర్లుకుంటూ పోతున్నాయి అయిదు రూపాయలుంటే ఆటోలో వెళ్ళుండవచ్చని మదనపడిపోయాడు. మరొక్క పదిపైసలుంటే హాయిగా బస్సులోనే వెళ్ళుండవచ్చన్న ఆలోచన రాలేదతనికి.  

 

    స్కూటరో, కారో ఎవరైనా దయతలచి నిలిపితే తప్ప తన ఇంటర్వ్యూకి వెళ్ళలేడనిపించి చేయి అడ్డం పెట్టడం మొదలెట్టాడు.

 

    ఎవరూ ఆపడం లేదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS