Previous Page Next Page 
మగబుద్ధి పేజి 3

   
    చిన్ని ఉద్యోగం వస్తే తన జీవితం ఒక గాటిలో పడిపోతుందని తెలిసి దానికోసం శ్రమ ఎరుగని సైనికుడిలా పోరాడుతున్నాడు. ఎప్పుడూ తిండి గురించి ఆలోచించడం అతనికిష్టం లేదు. కానీ ప్రస్తుతం చేతిలో కరెన్సీ చెట్టు పూలు పూయకపోవడంతో పూట ఎలా గడుస్తుందన్న దిగులు ఎక్కువగా వుంది. ఈ బాధే లేకపోతే ఫ్రూట్ సాలిడ్ లా జుర్రుకోవచ్చని తెలుసు. అందుకే పుస్తకం మీద వాలని మనసుని బలవంతంగా దానిమీద నిలిపాడు.

 

    మరో అయిదు నిమిషాలకు రాజా ఇడ్లీలు పట్టుకొచ్చాడు. వాటిని తిని బయల్దేరాడు. ఇంటర్వ్యూ కని నిన్న ఉతికి, చెంబుతో ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకున్నాడు. సర్టిఫికెట్లు ఎత్తుకున్నాక అలవాటు ప్రకారం జేబు తడుముకున్నాడు.

 

    రూపాయిబిళ్ళ తగిలింది. దానిని అరచేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి తిరిగి జేబులో వేసుకున్నాడు.

 

    గదికి గొళ్ళెం మాత్రంపెట్టి కిందకు దిగాడు.

 

    గేటు తెరవబోతుండగా పూర్ణానందం ఇంట్లోంచి వస్తూ పిలిచాడు.

 

    వెనక్కి తిరిగి ఏమిటన్నట్టు చూశాడు.

 

    "ఈ రోజైనా శుభవార్తతో రావయ్యా విష్ యు ఆల్ ది బెస్ట్" అన్నాడు ఆయన సిగరెట్ నుసిని కిందకు రాలుస్తూ.

 

    "ఉద్యోగం రాదనే బలమైన నమ్మకంతో బయలుదేరాను సార్" నిరాశతో అని ముందుకు అడుగువేశాడు నరేష్.

 

    కానీ అతనికి తెలీదు ఆ రోజు తన జీవితం గొప్ప మలుపు తిరగబోతూ వుందని.

 

                              *    *    *    *    *

 

    అటూ ఇటూ చూస్తూ నడుస్తున్న నరేష్ తనను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించడంతో ఠక్కున ఆగి వెనక్కి తిరిగాడు.

 

    తనని చూస్తూ చేయి పైకెత్తి గాల్లో వూపుతూ వస్తున్న ఓ యువకుడు కనిపించాడు. అతను ఎవరో గుర్తుకు రావడంలేదు.

 

    ఆ వ్యక్తి మరింత దగ్గర పడ్డాడు.

 

    అతనెవరో అప్పటికి తట్టింది. అతను యూనివర్శిటీలో తన క్లాస్ మేట్ రంగారావని గుర్తుకొచ్చింది. వెంటనే నవ్వుతూ అతనికి ఎదురెళ్ళాడు.

 

    "హలో నరేష్! బావున్నావా? ఎన్నాళ్ళకెన్నాళ్ళకు!" అతను మిత్రుడ్ని చూసి చాలా సంబరపడిపోతున్నాడు.

 

    "బావున్నాను. నువ్వు ఇక్కడ...?" వివరాలు తెలుసుకోవాలని ఉత్సాహపడిపోయాడు నరేష్.

 

    "ఇది మా అత్తగారి వూరు. పక్క కాలనీలోనే మా మామగారి ఇల్లు. ఈ మధ్యనే పెళ్ళయ్యింది. తరచూ ఇక్కడికి మా ఆవిడతో వస్తుంటాను. నువ్విక్కడున్నావని నిన్ననే మన క్లాస్ మేట్ అరుణ్ కనిపించి చెప్పాడు. చూసి వెళదామని నీ రూమ్ వెదుక్కుంటూ వచ్చాను. నువ్వు ఇప్పుడే ఏదో ఇంటర్వ్యూకు బయల్దేరావని మీ ఇంటి ఓనర్ చెబితే పరుగెత్తుకొస్తున్నాను. అది సరే... ఇంకా ఉద్యోగం రాలేదా?"

 

    "రాలేదు రంగారావు. ఆ ప్రయత్నంలోనే వున్నాను."

 

    "పెళ్ళి చేసుకున్నావా?"

 

    నరేష్ జీవంలేని నవ్వొక్కటి నవ్వి "నా కడుపు పోషణకే నానా అవస్థలూ పడుతున్నాను. ఇంకా పెళ్ళి కూడానా?" అన్నాడు.

 

    ఇద్దరూ ముందుకు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు.

 

    యూనివర్శిటీలో చదువుకున్న రోజుల్ని తలుచుకుంటూ రోడ్డు మలుపు తిరిగారు.

 

    ఎదురుగ్గా రోడ్డు కటువైపు తలవంచుకు వెళుతున్న అమ్మాయిని గమనించి "ఆమెవరోగానీ చాలా అందంగా వుందికదా. నడుమొక్కటే కాస్త లావుగా వుంది. అడిగానీ ఇంకాస్త సన్నగా ఉంటే మెరుపుతీగ అంటారు చూడు - అలా వుండేది. మిగిలిన పార్టులన్నీ కరెక్టుగా వున్నాయి. బ్రెస్ట్ 36, నడుము  30, సీటు 36- ఇవీ ఆమె సైజులు. కళ్ళు మరీ బావున్నాయి కదా" నరేష్ మిత్రుడివైపు చూస్తూ అన్నాడు.

 

    అతని నైజం తెలిసిన రంగారావు హాయిగా నవ్వి "ఈ యావ ఇంకా నీకు పోలేదన్న మాట మేమంతా అమ్మాయిల్ని ఓ క్షణం చూస్తే నువ్వు రెండు క్షణాలు చూసేవాడివి. చూసిన అమ్మాయి కొలతలన్నీ చెప్పేవాడివి, ఈ విద్య నీకు ఎలా అబ్బిందిరా?" అని అడిగాడు.

 

    "అదే మరి నా స్పెషాలిటి. మంచి ముత్యాల వ్యాపారస్థుడు ముత్యాన్ని చేతితో తాకకుండా ఎలా వాటి విలువ చెప్పగలడో, గొప్ప సౌందర్యోపాసకుడైన నేను అమ్మాయిని చూడగానే దూరం నుంచే ఆ అమ్మాయి ఎక్కడ అందం దాగివుందో, ఆమె కొలతలేమితో చెప్పగలను. అదే నరేష్ ప్రత్యేకత."

 

    "మొత్తానికి గొప్ప ప్రజ్ఞ కలిగినవాడివే. యూనివర్శిటీలో నువ్వు అమ్మాయిల కొలతలు చెబుతుంటే ఏదో నోటికొచ్చిన నెంబర్లు చెబుతున్నావని అందరితోపాటు నేనూ అనుకునేవాడిని. కానీ ఈరోజు నువ్వు చెప్పిన కొలతలన్నీ కరెక్టు కొలతలేనని తెలిసింది. హేట్స్ ఆఫ్ 'టు యు' రంగారావు మిత్రుడ్ని మనసారా అభినందించాడు.

 

    "ఈరోజే తెలుసుకున్నావా?"

 

    "అవును. ఇందాక నువ్వు చెప్పిన అమ్మాయి కొలతలన్నీ ఎగ్జాట్లీ కరెక్టు."

 

    "నేను చెప్పిన కొలతలు కరెక్టని నీకెలా తెలుసు" ఆశ్చర్యపోతూ అడిగాడు నరేష్.

 

    "ఆమె.... నా భార్య."

 

    నరేష్ కళ్ళు తిరిగాయి ఆ జవాబు విని. అమ్మాయి కనిపించగానే ఆబగా చూసి, ఎత్తుల కొలతలేమిటో లెక్క వేసుకునే తన బలహీనతను తిట్టుకున్నాడు.

 

    మిత్రుడి కళ్ళల్లోకి చూడడం ఏదోలా అనిపించి "మళ్ళీ కలుస్తాను రంగారావూ. ఇంటర్వ్యూకి టైమైంది" అని అతన్ని వదిలిపెట్టి వడివడిగా అడుగులేశాడు.

 

                                                *    *    *    *    *

 

    "టైమ్ ఎంతైంది సార్?" అప్పటికి ఆరోసారి టైమ్ అడగడంతో ఆ వ్యక్తి నరేష్వైపు విసుగ్గా చూసి "తొమ్మిదీ ముప్పై" అని చెప్పాడు.

 

    ఆ మాట వినగానే నరేష్ కి కంగారు బయలుదేరింది పదిగంటల కల్లా స్మిత ఎక్స్ పోర్టింగ్ కంపెనీకి చేరుకోకపోతే తన ఇంటర్వ్యూ ఉష్ కాకీ అయిపోతుంది. బస్సు ఒక్కటీ స్టేజీలో ఆగడం లేదు. ఆఫీసుల టైమ్ కావడంతో జనం విపరీతంగా వున్నారు.                             


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS