Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 3


    "అదేరా ! వారం క్రితం నువ్వు తీసుకున్న అయిదొందలూ."

    "వారం క్రితం నీ దగ్గర అయిదొందలు తీసుకున్నానా ?"

    సుధాకర్ రెండు చేతులూ నెత్తిమీద పెట్టుకున్నాడు.

    "నీ కింత మతిమరుపు ఎప్పుడొచ్చిందిరా బ్రదరూ ? చాలా ఆశ్చర్యంగా వుందే."

    "ఒరే పక్షీ ! నా జ్ఞాపకశక్తి కేమీ డోకా లేదుకాని - ఈ ఐదువందల సంగతేమిటో త్వరగా తేల్చు! నీకు అయిందొందలు అప్పు కావాల్సొచ్చి సరదాగా ఇలా డొంక తిరుగుడు కథ చెప్తున్నావ్ కదూ ?"

    సుధాకర్ విరగబడి నవ్వాడు.

    "బాబ్బాబు ! జోకులెయ్యకు ! నువు ఇంతవరకూ మాట ఎప్పుడూ తప్పలేదు. అలాంటిది రెండ్రోజుల్లో ఇస్తానని తీసుకుని వారం అయినా ఇవ్వకపోయేసరికి ఏ జ్వరమో ఏదో వచ్చివుంటుందని అనుమానించి ఇలా వచ్చాను."

    సుధాకర్ హాస్టల్లో వుండడు. వేరే రూమ్ తీసుకుని వుంటున్నాడు. సుధాకర్ ఇటువంటి జోకులు వెయ్యడు. వాడు సీరియస్ గానే మాట్లాడుతున్నాడు. ఓ క్షణం ఆలోచించాడు. నిజంగా తను తీసుకున్నాదా ? తీసుకుని మర్చిపోయాడా ? నో ఇంపాజిబుల్ ! అన్నట్టు మొహం పెట్టాడు.

    "నా దగ్గర డబ్బు లేకపోతే కదా నీ దగ్గర తీసుకోవడానికి. నేను డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను. అయినా నా రూమ్మేట్స్ నందరినీ వదిలి అప్పుకోసం నీదగ్గరకెందుకు పరిగెడతాను. అయినా ఎంతో అవసరమయితేగానీ ఎవరి దగ్గరా అప్పు తీసుకోను నేను. తీసుకున్నా ఆ అప్పు వెంటనే తీర్చేసేవరకూ నిద్ర పట్టదు. అదీ వారం క్రితం తీసుకున్న అప్పయితే నేనింత ఘోరంగా మర్చిపోవడం ఇంపాజిబుల్. అయినా సరిగ్గా చెప్పు. ఇంతకీ వారంక్రితం అంటే ఎప్పుడురా ?" అతన్నడిగాడు కృష్ణ.

    "అదే మొదటి ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర అవుతుందనుకుంటాను. 'అర్జంటుగా అయిదొందలివ్వు టైములేదు' అనేసి డబ్బు తీసుకుని అయిదు నిమిషాలేనా కూర్చోకుండా వెళ్ళిపోయావ్."

    కృష్ణ ఉలిక్కిపడ్డాడు. "ఆ ఆదివారం నాడు నేను ఉదయం పదిగంటలవరకూ రూమ్ లోనే నిద్రపోతున్నాను. ఆ రోజు మబ్బుపట్టి ఎండరాకపోవడం, అలారం టైంపీస్ మోగకపోవటం వల్ల తెల్లారుజామున ఏడింటికి మెలకువ రానేలేదు. ఆ రోజు అనుకున్నాను కూడా ! నిద్రమాత్రలు వేసుకున్నవాడిలా పదింటిదాకా ఎలా నిద్రపోయానా అని నాకే ఆశ్చర్యం కలిగింది ఆ రోజు... అయినా ఒరేయ్ ! నువ్వు చెప్పేదంతా పరమ అబద్ధం అనడానికి ఒకటే ఋజువు. క్రిందటి ఆదివారం పది గంటలవరకూ అసలు నిద్ర మెలకువ రాలేదు నాకు. అప్పటికయినా మన కనకారావ్ గాడు మార్నింగ్ షో కెళ్దామని లేపబట్టి మెలకువ వచ్చింది..."

    సుధాకర్ నవ్వాడు. "ఒకోసారి అంతేరా ! ఇలాగే మనం చేసిన పని గుర్తుండకుండా పోతుంది. నువ్వు నా దగ్గరకొచ్చిన సంగతి పూర్తిగా మర్చిపోయావ్ ! అంతే !"

    కృష్ణకు ఏం మాట్లాడాలో తోచలేదు. తనిప్పుడు ఏం మాట్లాడినా అయిదొందలు కోసం మాట్లాడినట్లు వుంటుంది.

    "ఒరేయ్ ! పోనీ ఓ సంగతి ఒప్పుకుంటావా ?"

    "ఏమిటది ?"

    "నా దగ్గర డబ్బుంటే నేనెవరినీ అప్పు అడగనన్న విషయం."

    "తప్పకుండా ఒప్పుకుంటాను.

    "అయితే ఇదిగో. నా పర్స్ చూడు" అంటూ జేబులో నుంచి పర్స్ తీసి చూపించాడు కృష్ణ.

    సుధాకర్ కి బాధ కలిగింది. ఇదంతా తను అబద్ధాలు చెప్తున్నాడని ఋజువు చేయటానికా !

    "ఒరే కృష్ణా ! నేను డబ్బుకంటే స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తానన్న సంగతి మర్చిపోకు. నాకెంత నమ్మకముంటే ఇంత గట్టిగా ఆర్గ్యూ చేస్తానో ఆలోచించు, ఆ రోజు నువ్వు డబ్బు అడిగినప్పుడు నేనేమన్నానో తెలుసా ? నా దగ్గర కాలేజీ ఫీజు డబ్బు ఉందిరా ? నాలుగు రోజుల్లో కట్టేయాలి. నాలుగు రోజుల్లో తిరిగి ఇవ్వగలననుకుంటే తీసుకెళ్ళు' అన్నాను. నువ్వేమన్నావో గుర్తుందా ? 'నాలుగు రోజులెందుకురా ? ఎల్లుండికల్లా తెచ్చి యిచ్చేస్తాను' అన్నావ్. ఇదంతా గుర్తుంది నాకు."

    మురళి మాట్లాడలేదు. చూస్తున్న సుధాకర్ కె అయోమయంగా వుంది. అతడి మనసులో ఆలోచనలు ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాయ్. అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే-అది నిజమే అయి ఉండవచ్చు. కానీ తను అతనికి డబ్బు ఇచ్చిందీ ఖచ్చితమే! ఆటువంటప్పుడు మరి... అంటే...అతనిలాగే ఇంకెవరయినా అలాంటి పోలికలున్నవాడు...ఉహుఁ ! ప్రాణస్నేహితుడు కూడా గుర్తు పట్టలేనంత పోలికలా ! అసాధ్యం.

    హఠాత్తుగా అతని ఆలోచనలు అంతకు ముందెప్పుడో  చదివిన న్యూస్' మీదకు మళ్ళినయ్. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కావలసిన విధంగా ముఖాన్ని మలచుకోవటం చాలా తేలిక పద్ధతట. అయితే అది చాలా ఖరీదయిన వ్యవహారం. అతని పోలికలున్న వారెవరయినా ప్లాస్టిక్ సర్జరీ సహాయంతో అతనిలా నటించి తన దగ్గర డబ్బు తీసుకున్నాడా ? కానీ అందువల్ల వాడికేమిటి లాభం ? అయిదువందలు అప్పుకోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాడా ?

    "సుధాకర్ ! సారీరా అయిందేదో అయింది ! ఇదిగో నీ డబ్బు నువ్వు తీసేసుకో."

    సుధాకర్ తీసుకోలేదు.

    "నీకు నా దగ్గర తీసుకున్నట్లు నిజంగా గుర్తుకొస్తేనే ఇవ్వు, లేకపోతే నాకొద్దు."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS