Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 2


    "పరిహాసానికిది సమయం కాదు. అయినా ఇన్నేళ్ళు జైలులో వుండివచ్చాక, కాలు బయట పెట్టిన మరుక్షణం, నువ్వు అనవలసిన మాటలేనట్రా ఇవి ? ఒక తల్లి తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డని కనుక్కోవటానికి ఒక్క చూపు చాలదట్రా ?"

    ఆ యువకుడు నవ్వేడు. "ఇన్నేళ్ళ తరువాత ఎదురొస్తే, నువ్వు నిజంగా ఎలా ప్రవర్తిస్తావో తెలుసుకోవాలని అన్నానే అమ్మా, పద." అంటూ దారితీశాడు.

    అంతలో ఓ కారు రివ్వున దగ్గరకొచ్చి స్లో అయింది. అందులో నుంచి ఓ రివాల్వర్ బయటకు కనిపించింది. మరుక్షణంలో రెండు  గుళ్ళు వరుసగా ఆమె పక్క నుంచి దూసుకుపోయాయ్.

    ఆ యువకుడు సమయానికి ఆమెను ప్రక్కకు లాగబట్టి బ్రతికిందిగానీ లేపోతే రక్తపు మడుగులో కూలి ఉండేది. మరుక్షణంలో ఆమెను వదిలి అటువేపు దూకాడు హరి. కానీ  కారు వాయువేగంతో వెళ్ళి మిగతా వాహనాల ప్రవాహంలో కలిసిపోయింది. జనమంతా పోగయ్యారక్కడ. "ఎవరిదా కారు ?"

    "కారుకి నెంబరే లేదు గురూ !" అంటున్నారెవరో.

    "నేను లోపల ఉన్న వాళ్ళను చూద్దామనుకున్నాను గానీ అద్దాల్లోంచి లోపల ఏం ఉన్నదీ కనబడలేదు."

    ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

    శారదమ్మ కొద్ది క్షణాలవరకూ మామూలు మనిషి కాలేకపోయింది. తనని చంపటానికి ఈ ప్రయత్నం ఎందుకు? అందులోనూ ఇన్నేళ్ళ తరువాత... ఆమె ఆలోచన్లు పరిపరి విధాల సాగినయ్ ! ఆమె మనసులో ఉవ్వెత్తున ఆలోచనలు ఎగసి పడుతున్నాయ్ ! ఎవరికి అవసరం - తనమీద ఇలా దాడి చేయటం? తన ప్రాణాలు కోల్పోవడం ఎవరికి ఉపయోగం?

    ఆలోచన్లతోనే ఆమె ఆ కొడుకుతో కలిసి ఒక ఇంటికి చేరుకుంది.

    "రామ్మా ! కూర్చో ! సరయిన భోజనం తిని ఎంతకాలమయిందో చూడు ఎలా చిక్కిపోయావో ?"

    పన్నెండు సంవత్సరాల తరువాత కనపడిన ఆ ఆప్యాయతకి ఆమె కనుల నీరు తిరిగింది. ఇద్దరికీ కంచాల్లో అతనే భోజనం వడ్డించాడు.

    భోజనం చేస్తూ వుండగా, "ఊఁ. ఇప్పుడు చెప్పమ్మా, ఎందుకు వెళ్ళావు నువ్వు జైలుకి ?" అని అడిగాడు.

    శారదమ్మ చప్పున తలెత్తి అతడివైపు చూసింది. నిజంగా మురళికి తెలీదా తను జైలుకెందుకు వెళ్ళిందో?- అయినా, ఏ తల్లి చెపుతుంది- "నీ కోసమే - నిన్ను రక్షించడం కోసమే నేను జైలుకి వెళ్ళాన్రా" అని. కానీ అతడు ఊరుకోలేదు, రెట్టించాడు.

    అంతలో దూరంగా రోడ్డుమీద పెద్ద చప్పుడు వినిపించింది. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. అతడు లేచి కిటికీ దగ్గరకు నడిచాడు. అతడి అనుమానం నిజమైంది. నాలుగు మోటారుసైకిళ్ళు ఇంటి ముందు నుండి సాగిపోతున్నాయి. అందుకే అంత శబ్దం. నలుగురూ ఆ ఇంటివైపు చూస్తూన్నారు.

    ఆమె ప్రాణం అపాయంలో వుందని అతడికి అర్ధమైంది.

    అతడు దగ్గిరకెళ్ళి- "అమ్మా, నువ్వు భోజనం చేశాక మనం మరో ఇంటికి వెళదాం. కొన్నాళ్ళపాటు అక్కడ వుందువుగాని" అన్నాడు.

    "ఏరా ! ఇది నీ ఇల్లు కాదా ?"

    అతడు జవాబు చెప్పలేదు. అప్పటికే తన ఆలోచనల్లో మునిగిపోయాడు. ఈమెని చంపటానికి ప్రయత్నిస్తున్న ఈ ఆగంతకులు ఎవరో వారికి తను సరిగ్గా బుద్ధి చెప్పబోతున్నాడు.

    ప్రారంభం :

    ఆ రోజునుంచే తనకి కష్టాలు ప్రారంభం కాబోతున్నాయని మురళీకృష్ణకి తెలీదు. రోజూలాగానే ఆ రోజు కూడా చాలా మామూలుగా తెల్లారింది. సూర్యుడు అలవాటు ప్రకారం తూర్పునే ఉదయించేడు. అంచేత ఎండ కూడా అలవాటు ప్రకారం తూర్పువైపు కిటికీలోనుంచి మురళీ గదిలోకొచ్చి, అతని మొఖంమీద పడి-నిద్ర లేపింది. ఈ హడావిడంతా చూసి ఇక బావుండదని అలారం కూడా మోగింది. ఇక తప్పేట్లు లేదని మురళీ లేచి టవల్ భుజాన వేసుకుని, బ్రష్షూ, పేస్టూ వగైరాలకోసం అల్మారాలో వెతకసాగాడు. శేషావతారం, కనకరావ్ ఇంకా గురకలు పెడుతూనే ఉన్నారు. ఈలోగా కొంపలు ముంచుకుపోయినట్లు తలుపు దబాదబ బాదేరెవరో.

    "అలా బాదకండ్రా బాబూ! అసలే గవర్నమెంట్ హాస్టలు...వీక్ డోర్స్! వచ్చేస్తున్నా" గట్టిగా అరుస్తూ వెళ్ళి తలుపులు తెరిచాడు. ఎదురుగా ప్రాణస్నేహితుడు సుధాకరం నిలబడి ఉన్నాడు.

    "ఏంట్రా ! అలా తెల్లారకుండానే వచ్చేశావ్ ? రాత్రంతా రోడ్ల మీదే తిరుగుతున్నావా ఏమిటి?" అడిగాడు మురళి ఆశ్చర్యంగా.

    "నీ మొహం. అదేం కాదుగానీ ఆ అయిదొందలూ అర్జంటుగా కావాలి."

    మురళీకృష్ణ అదిరిపడి అతనివంక ఆశ్చర్యంగా చూశాడు.

    "ఏ అయిదొందలూ ?"

    ఈసారి సుధాకర్ ఆశ్చర్యపోయాడు.

    "నిజంగా మర్చిపోయావేమిట్రా ?"

    "మర్చిపోవడమేమిటి ? ఏమిట్రా నువ్ మాట్లాడేది ? సరిగ్గా చెప్పి అఘోరించలేవూ ?" విసుక్కున్నాడు మురళీ. అందులో ప్రొద్దునే నిద్ర లేచిన బద్ధకం.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS