Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 3


    "ఇస్తాను... నా పని చేసిపెడితే...."

 

    "ఏంటా పని?" షాక్ నుంచి తేరుకుంటూ అడిగాడు ఆదిత్య.

 

    "క్రిమినల్ బ్రెయిన్ గదా! నువ్వే చెప్పు!" పొలిటీషియన్ నవ్వు నవ్వాడు అతను.

 

    ఆదిత్య ఆలోచిస్తున్నాడు. అవతలి వ్యక్తి మాటల్నీ, ముఖకవళికలను బట్టి, అంచనా వేసే శక్తి అతనికుంది.

 

    "నీకు క్రైమ్ స్టోరీస్ అన్నా, క్రిమినాలజీ అన్నా, క్రైమ్ ఎడ్వంచర్స్ అన్నా, క్రైమ్ కథల్ని చదివి తెలివిగల నేరస్తులు ఎలా తప్పించుకునేదీ నీ ఫ్రెండ్స్ కి చెప్పటం నీ హాబీ. అది చాలా యిష్టం కదూ?" అడిగాడు అహోబలపతి.

 

    "ఇట్స్ ఏ పార్ట్ ఇన్ మై సబ్జెక్ట్" సీరియస్ గా అన్నాడు ఆదిత్య.

 

    "అందుకే అడుగుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. క్రిమినాలజీ అంటే నీకే కాదు, నాక్కూడా యిష్టమే..." మూడో సిగరెట్ వెలిగించాడు అహోబలపతి.

 

    "మీకు వ్యతిరేకంగానో, ఫర్ గానో ఊరేగింపు తీయించాలా?"

 

    "నో... అలాంటివి చెయ్యడానికి మా గల్లీ లీడర్లున్నారు."  

 

    "యూనివర్శిటీ ఎలక్షన్ లలో మీ పార్టీ స్టూడెంట్ కి సపోర్ట్ చెయ్యాలా?"

 

    "ఇంత తక్కువ స్థాయిలో వూహిస్తున్నావు. ఇలాంటి పనులకు ఎవడైనా అయిదు లక్షలిస్తాడా?" నవ్వాడు అహోబలపతి.

 

    "కిడ్నాప్ ఆర్ మర్డర్?"

 

    "ఇప్పుడు నీ గురించి విన్నదాంట్లో నిజముంది..." హుషారుగా నవ్వాడు అహోబలపతి.

 

    "కరెక్ట్ గా ఐడెంటిఫై చేశావు. కానీ కిడ్నాప్ కాదు... మర్డర్..." మళ్ళీ అన్నాడు అహోబలపతి.

 

    "మర్డర్!" నోట్లో గొణుక్కున్నాడు ఆదిత్య వులిక్కిపడి.

 

    "ఎస్! మర్డర్... ఐ వాంట్ ఫర్ ఫెక్ట్ మర్డర్! సో... ఐ నీడ్ ఫర్ ఫెక్ట్ మర్డర్..."

 

    "నేను ఫర్ ఫెక్ట్ మర్డరర్ ని కాను! అసలు మర్డరర్నే కాను... లా స్టూడెంట్ ని! క్రిమినల్ లాయర్ ని కావాలనుకుంటున్న వాడ్ని. నాకు డబ్బు అవసరమే కానీ... దానికోసం మర్డర్ చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. రాంగ్ ఎడ్రస్ కొచ్చారు? సారీ సర్..." అన్నాడు ఆదిత్య ఒకింత కోపంగా.

 

    లేచి నిలబడ్డాడు అహోబలపతి. కిటికీలోంచి బయటికి చూశాడు. కింద అతని మనుష్యులు అసహనంగా చేతిలో కర్రలతో తిరుగుతున్నారు.

 

    "నాకు తెలుసు ఆదిత్యా! మర్డర్ ప్లాన్ చేసేవాడెప్పుడూ మర్డర్ చెయ్యలేడు. ముఖ్యంగా ఫర్ ఫెక్ట్ మర్డర్ చెయ్యలేడు. కానీ... నువ్వు అద్భుతమైన ప్లానర్ వి! అవసరమైతే మర్డర్ వి కాగలవు. నిన్నే నేనెందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెల్సా? ఫర్ ఫెక్ట్ గా మర్డర్ చెయ్యడానికి ఎంత తెలివితేటలు కావాలో, ఫర్ ఫెక్ట్ గా ఎస్కేప్ కావడానికిక్కూడా అంతే తెలివితేటలు కావాలి. ఆ తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు.

 

    ఆఫ్ట్రాల్ ఒన్ అవర్ వర్క్... ఒక గంటకు అయిదు లక్షలు! ఆలోచించు... జాగ్రత్తగా విను. ఎల్లుండి నుంచీ నువ్వు మళ్ళీ లా స్టూడెంట్ వి అయిపోతావు. ఎవరూ నిన్ను అనుమానించలేరు. ఏ పోలీసులూ, ఏ పొలిటికల్ లీడర్స్, మీ స్టూడెంట్స్..." చెప్పటం ఆపాడు అహోబలపతి.

 

    అయోమయంగానూ, మిస్టరీగానూ వుంది ఆదిత్యకు. లీడర్ టైములో, కాలేజీ క్యాంటీన్ లో, హాస్టల్ క్యాంపస్ లో కో స్టూడెంట్స్ కి వరల్డ్ గ్రేట్ క్రైమ్స్ చెప్పడం, అదే క్రైమ్ తను చేస్తే ఎలా ఎస్కేప్ అవుతాడో నెరేట్ చెయ్యడం, క్రైమ్ బ్రెయిన్ ఆదిత్యగా యూనివర్సిటీలో ముద్రపడటం అంతా గుర్తుకొచ్చింది ఆదిత్యకు.

 

    "కహానీలు అందరూ చెప్తారు. దిసీజ్ ఎ టెస్ట్ అండ్ ఛాలెంజ్ ఫర్ యూ! ప్రూవ్ యువర్ సెల్ఫ్! ఫైవ్ లాక్స్ టెస్ట్... నీ అవసరమూ తీరుతుంది. నా అవసరమూ తీరుతుంది. చెప్పు... ఓకేనా?"

 

    అహోబలపతి లాంటివాళ్ళు ఎవరి దగ్గరకూ స్వయంగా వెళ్ళరు. ఏదో మాస్టర్ ప్లాన్ వుంటేనే తప్ప! ఆ మాస్టర్ ప్లాన్ ఏమై వుంటుంది? ఇప్పుడు తను కాదంటే, రేపు కాకపోయినా ప్యూచర్ లో అయినా హాస్టల్ మీద పోలీసుల దాడి, అక్రమ కేసు, అవన్నీ అలా వుంచినా, తన చెల్లెలి పెళ్ళిప్పుడు తనకు చాలా ముఖ్యం. ఆలస్యమైతే పెళ్ళికాకుండానే తన చెల్లి గర్భవతి అయినట్లు నలుగురికీ తెలిసిపోతుంది. అదే జరిగితే అవమానాన్ని భరించలేక తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడం ఖాయం! ఆ పైన తన చెల్లెలు, అందరూ పోయాక తను కూడా మిగిలి వుద్ధరించేదేముంటుంది? తను చేసే తప్పు తనను బలితీసుకున్నా తనవాళ్ళను బతికిస్తుంది. ఎస్.. తనవాళ్ళు సుఖంగా బ్రతకడమే తనకు కావాలి. అందుకు తనేమైనా చేయాలి.

 

    పరిణామాలన్నీ ఊహిస్తున్నాడు ఆదిత్య.

 

    "నాకో ప్రశ్నకు జవాబు కావాలి. చెప్తారా?" నెమ్మదిగా అన్నాడు ఆదిత్య.

 

    "అడుగు! డౌటెందుకు?"

 

    "మీ మాస్టర్ ప్లాన్ కి నన్నే ఎందుకు సెలెక్ట్ చేశారు?"

 

    ఆదిత్య మెత్తబడటం గమనించాడు అహోబలపతి.

 

    "ఇదీపాటికే నీకు అర్ధమైవుండాలి. వెరీ సింపుల్! కొత్తవాడివి, పోలీస్ రికార్డుల్లోకి చేరనివాడివి! దీనివల్ల పోలీస్, పొలిటికల్ లీడర్స్ దృష్టి నీ మీద పడదు. అందుకు..."

 

    అతని జీనియస్ నెస్ నెమ్మది నెమ్మదిగా అర్ధమవటం మొదలుపెట్టింది ఆదిత్యకు.

 

    "నన్ను పోలీసులు పట్టుకుంటే?" ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆదిత్య కళ్ళముందు అయిదు లక్షల కరెన్సీ నోట్లు మెదిలాయి. తన చెల్లెలు ఆమె భర్తతో సుఖంగా బ్రతకటం వూహించుకున్నాడు. తన భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న అప్పుడతనిలో తలెత్తలేదు.

 

    "నా మీద నీకు నమ్మకం వుంటే ఐ విల్ సేవ్ యూ... మర్డర్ స్టోరీస్ చదివి, చదివి... ఇలా అయిపోయావని... నీ మీద కేసు లేకుండా చెయ్యగలను. అన్ని విషయాలూ... ఆలోచించుకునే... ఇక్కడి కొచ్చాను. నలభై ఎనిమిదేళ్ళ వయసులో... ఈ పొలిటికల్ లైఫ్ లో ఏమీ ఆలోచించకుండానే... ఈ ప్రపోజల్... పెట్టాననుకున్నావా...."

 

    ఆదిత్య ఏం మాట్లాడలేదు.

 

    "ఏం తేల్చుకున్నావ్....?" అడిగాడు అహోబలపతి.

 

    "న్యాయాన్ని కాపాడటానికి, నిర్దోషుల్ని రక్షించటానికి, దోషులకు శిక్ష పడేలా చేయటానికి నేను బి ఎల్. చదువుతున్నాను. కిడ్నాప్ లు, హత్యలు చేయటానికి కాదు..." ఆవేశంగా అన్నాడు ఆదిత్య. అవసరం వున్నా ఆదిత్య మనస్సు అంగీకరించటం లేదు.

 

    అహోబలపతి పెద్దగా నవ్వాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS