Previous Page Next Page 
కళ్ళు పేజి 3


    "ఎ... ఎవరు నువ్వు?" అంది వొణికే కంఠంతో.

 

    వెనకనుండి చిన్న నవ్వు వినిపించింది. గుండెల్ని పరపర కొస్తున్నట్లున్న కఠోరమైన నవ్వు.

 

    "నేనెవర్నో నీకర్థంకాదు, మాట్లాడకుండా పోనియ్యి."

 

    "ఎ... క్క... డ... కు?"

 

    "అలా తిన్నగా పోతూ వుండు. నే చెప్పేదాకా."

 

    "... అసలు... ఏం కావాలి నీకు...?"

 

    "చెబితే ఇప్పుడే హడలిచస్తావు, నోరు మూసుకుని పోనియ్."

 

    మందాకిని గుండె దడదడమని కొట్టుకుంటూన్నది. ఈ దుర్భరమైన పరిస్థితిలో చిక్కుకొన్నందుకు ఒక ప్రక్కనుంచి ఏడుపొస్తున్నది. అసలు కారులోకి ఎలా వచ్చాడు? అశ్వనీకుమార్ ఇంటిముందు కారు పార్క్ చేసినప్పుడు డోర్ లాక్ చేసే లోపలకు వెళ్ళింది. తిరిగి వచ్చేడప్పుడు లాక్ తీసే లోపలకు ఎక్కింది. డబుల్ లాక్ సిస్టం వున్న కారది.

 

    అశ్వని వస్తానంటే తానే వద్దన్నది. ముందుచూపుతోనే అంటే అని వుండవచ్చు. కాని అదెంత ప్రమాదానికి దారి తీస్తుందో ఊహించలేక పోయింది.

 

    కారు నాలుగయిదు ఫర్లాంగుల దూరంపోయాక "ఎడమ ప్రక్కకి త్రిప్పు" అన్నది ఆ గొంతు ఆజ్ఞాపిస్తున్నట్లు.

 

    మందాకిని ఎడమవైపు వీధిలోకి కారుని పోనిచ్చింది అతని ఆజ్ఞ శిరసావహిస్తున్నట్లు. ఆ వీధి మరీ నిర్జనంగా వుంది.

 

    ఏదో చెయ్యాలి. చేసి తప్పించుకోవాలి. లేకపోతే కొన్ని క్షణాలలో ప్రమాదం ముంచుకొచ్చేలా వుంది.

 

    అతని చేతులామె మెడకు చుట్టుకునే వున్నాయి. ఆమె కదలికల్లో ఏమయినా మార్పు వస్తే ఉక్కు తీగెలుగా మారి బిగుసుకునేందుకు సిద్ధంగా వున్నాయి.

 

    ఆమె మనసు చురుగ్గా పనిచేస్తోంది. ఫ్రంట్ సీటులో తన ప్రక్కనే హ్యాండ్ బ్యాగ్ వుంది. దాని ఓపెనింగ్ ను క్లోజ్ చేస్తూ చిన్న చిన్న మెటల్ రాడ్స్ ఉన్నాయి. ఆమె ఎడమచెయ్యి చీకట్లో మెల్లగా కదిలి ఆ బ్యాగ్ ని పట్టుకుంది. శరీరమంతా చెమటలు పడుతూనే ఉంది. గుండె వేగం ఇంకా హెచ్చయింది. అయినా తప్పదు. ఏదో ఒకటి చేసెయ్యాలి. చాలా డెస్పరేట్ గా ఉంది.

 

    ఎదురుగా ఓ కారు వస్తోంది. దాని హెడ్ లైట్స్ డిమ్ లో కాకుండా బ్రైట్ లో వెలుగుతున్నాయి. అసలే వర్షం వల్ల ఎంత వైపర్స్ పని చేస్తోన్నా కళ్ళు సరిగా కనబడటంలేదు. ఆ లైట్ల కాంతి కళ్ళలోపడి చూపును మరికొంత కష్టతరం చేస్తున్నాయి. ఇదే స్థితి వెనక కూర్చున్న వ్యక్తికి కలిగి వుండాలి. తాను కూర్చున్న సీటు ఎత్తుగా ఉంది. తల ఇంచుమించు సీటు ఎత్తుతో సమంగా ఉంది. వెనకనుంచి తన మెడ అందుకోవాలంటే చాలా కష్టం. తాను పొడగిరి కాబట్టిగానీ మామూలు హైట్ లో ఉన్న యువతినైతే ఇలా చెయ్యటం ఇంకా కష్టం. తననింత సులువుగా చేతుల్లో బిగించి పట్టుకున్నాడంటే అతను నిఠారుగా కూచుని ఉండాలి.

 

    ఎదురుగా వస్తోన్న కారు దగ్గర్లోకి చేరింది. దాని వేగం ఏమాత్రం తగ్గలేదు.

 

    టైము లేదు. తెగించాలి. మందాకిని ఊపిరి బిగపట్టింది. కారింకా దగ్గరకు వచ్చింది. తనని పట్టుకుని ఉన్న చేతుల్నిబట్టి అతనెంత దూరంలో ఉన్నాడో ఊహించింది. ఒక్కసారిగా బ్రేక్ వేస్తూ ఎడమచేత్తో హ్యాండ్ బ్యాగ్ తో వెనక్కి విసురుగా, బలమంతా ఉపయోగిస్తూ కొట్టింది.

 

    ఆమె మెడమీద నున్న చేతులు సడలిపోయాయి. కారు పెద్దకుదుపుతో గియ్ మన్న శబ్దం చేస్తూ కొన్ని గజాలు ముందుకు వెళ్ళి ఆగిపోయింది. మందాకిని క్షణమైనా ఆలస్యం చెయ్యలేదు. 'హెల్ప్' 'హెల్ప్' అని అరుస్తూ డోర్ తెరుచుకుని క్రిందకు దూకింది.

 

    అదే సమయానికి ఎదురుగా వస్తున్న కారు ఆమె ప్రక్కనుంచి సాగిపోతోంది. హఠాత్తుగా కారులోంచి దూకుతోన్న యువతిని చూసి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మెరుపులా ప్రక్కకి కోసుకోకపోతే ఆమెకు డ్యాష్ ఇచ్చి యాక్సిడెంటయ్యేదే.

 

    ఆ కారులో వెనక ఇద్దరు మనుషులు కూర్చుని వున్నారు. ఇద్దరూ పీకలదాకా తాగివున్న స్థితిలో ఉన్నారు.

 

    "ఎ... వ్వ... రో... అమ్మాయిలా... వుంది" అన్నాడు అందులో ఒకడు.

 

    "అ... వు... ను."

 

    "పాపం... ఏదో రిస్కులో... వున్నట్లుంది."

 

    "అలాగే కనబడుతోంది..."

 

    "ఏదో అరుస్తున్నట్లుగా వుంది... హెల్ప్ హెల్ప్... అనా?"

 

    "అలాగే వినబడుతోంది."

 

    "కారాపి... హెల్ప్ చేద్దామా?"

 

    "ఈ అర్ధరాత్రిపూట... విషయం తెలీకుండా... మనకి రిస్క్ ఎందుకు బ్రదర్... ఏయ్ డ్రైవర్... పోనియ్. కారాపకు.

 

    ఒకవేళ వాళ్ళు ఆపమన్నా డ్రైవర్ కారాపదల్చుకోలేదు. ఆ యువతెవరో ఆపదలో ఉన్నట్లు నిస్సందేహంగా అర్థమైంది. పరిస్థితి ఏమిటో అవతల ఎంతమంది ఉన్నారో తెలీకుండా రంగంలోకి దూకడం అవివేకం. తాముకూడా ఆపదలో ఇరుక్కోవచ్చు. ఈ త్రాగుబోతు బడుద్దాయలు తనకేవిధమైన సహాయానికీ రారు...

 

    అతని ఆలోచనలతో బాటు కారు వేగంగా ముందుకు దూసుకెళ్ళిపోయింది.

 

    మందాకిని ఒకే ఒక్క క్షణంలో కోలుకుంది. ఆ కారులో వారెవరో తన పరిస్థితి గమనించారో లేదో- ఆగకుండా వెళ్ళిపోయారు. క్రిందనుండి లేస్తూనే తన కారు బ్యాక్ డోర్ తెరుచుకోవటం గమనించింది. ముందూ వెనకా ఆలోచించకుండా ప్రక్కకు తిరిగి పరుగుతీయ నారంభించింది.

 

    తనకు రన్నింగ్ లో మంచి ప్రాక్టీసుంది. శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకుని పరిగెత్తగలిగితే తనని అందుకోవటమంత తేలికకాదు. ఈ లోపల ఏదయినా సహాయం లభించకపోదు.

 

    అక్కడక్కడ స్ట్రీట్ లైట్సు వెలుగుతుండడం వల్ల దారి తెలుస్తోంది. కాకపోతే వర్షం కురుస్తూ వుండటం వల్ల కాలుజారిపడే ప్రమాదముంది.

 

    ఆమె ఇవన్నీ ఆలోచించటంలేదు. రక్తనాళాలు తెగిపోయేలా గుండెలు పగిలిపోయేలా పరుగుతీస్తోంది.

 

    ఆ స్థితిలో కూడా ఆమె మస్తిష్కం పనిచేస్తోంది. ఒకవేళ అతను కారులో ఎక్కి తనని వెంటాడితే?

 

    ఈ ఆలోచన వచ్చాక ఆమె కొంచమైనా ఆలస్యం చెయ్యలేదు. మొదటగా కనిపించిన ప్రక్క సందులోకి గభాల్న దారితీసింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS