Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 3

    ఆ రోజుల్లోనే వీడు పెద్ద మేధావిలా మాట్లాడేవాడు. ఎప్పటికైనా వీడు ఓ గ్రేట్ జీనియస్ అవుతాడని స్నేహితులు అనుకొనేవారు.
   
    "అది సరే! నేను చీర కొంటున్నప్పుడే నన్ను చూశావు గదా? అప్పుడే ఎందుకు పలకరించలేదూ?"
   
    "నిజం చెప్పొద్దూ! ముందు నిన్ను చూసినప్పుడు "నువ్వా-కాదా" అనే అనుమానం వచ్చింది. నువ్వు చీరెలు చూస్తున్నంతసేపూ నేను నిన్నే చూస్తూ నిల్చున్నాను. నువ్వు సేల్స్ మేన్ తో మాట్లాడటం విన్నాకే నమ్మకం కలిగింది. మనం కలిసి దాదాపు పదేళ్ళు అవుతుంది. పది రాశాక మళ్ళీ మనం కలవలేదు కదూ?" జగన్మోహనరావు అడిగాడు.
   
    "అంతే! ఆతర్వాత మనం కలవలేదు. సరే పద. ఈ షాపులో ఎందుకూ? హోటల్ కు వెళ్ళి  మాట్లాడుకుందాం. పామ్ గ్రోవ్ హోటల్లో ఉన్నాను" జగన్మోగానరావు చెయ్యి పట్టుకొని అన్నాడతను.
   
    "ఐదు నిముషాలు. నేను ఈ షాపుకు వచ్చిన పని పూర్తికాలేదు. రెడీమేడ్ ఎన్ క్లోజర్ లోకి వెళుతుంటే నువ్వు కనిపించావు. అప్పటినుంచీ నిన్ను చూస్తూ నిలబడ్డాను. నువ్వేనని నమ్మకం కుదిరాక పలకరించాను. అంతా కోఇన్సిడెన్స్! చూశావా తమాషా, పదేళ్ళుగా మనం కలవలేదు. ఆఫ్ ఆల్ ది ప్లేసెస్. ఇక్కడ మద్రాసులో ఈ షాపులో కలిశాము. మా పాపకు బట్టలు కొందామని వచ్చాను. మనం ఇలా కలవడం జరిగింది. సంటైమ్స్ థింగ్స్ హాపెన్ లైక్ దిస్ ఓన్లీ" మాట్లాడుతూ జగన్మోహనరావు రెడీమేడ్ గార్మెంట్సు వున్న భాగంలోకి నడిచాడు.
   
    మురళీకృష్ణ అతడిని అనుసరించాడు.
   
    "జగన్! పిల్లలెంతమందిరా!" అడిగాడు కృష్ణ. రెడీమేడ్ గార్మెంట్సు కేసి చూస్తున్న ఫ్రెండ్ ని.
   
    "ఒక్కతే పాప."
   
    "వయసెంతా?"
   
    "మూడో ఏడు ఇంకో మూడు నెలలకుగాని మూడేళ్ళు నిండవు."
   
    ఓ జత గౌనులుకొని ప్యాక్ చేయించి, బిల్లు చెల్లించబోతుండగా "జగన్ ప్లీజ్! నేను ఇస్తాను" అన్నాడతడు.
   
    "అరే! అదే అదేమిటి? నువ్వు పే చెయ్యడం ఏమిటి? ఆగు!"
   
    "మీ పాపకు ఒక ఫ్రాక్ అన్నా ప్రెజెంటు చెయ్యనివ్వరా జగన్!"
   
    జగన్మోహనరావు అతడి చెయ్యి పట్టుకొని డబ్బు చెల్లించకుండా ఆపుతూ "ముందు మా పాపను చూడరా!" అంటూ తను పేచేసి ముందుకు నడిచాడు.
   
    "స్నేహితులిద్దరూ "చెల్లెరాం అండ్ సన్స్" లో నుంచి బయటకు వచ్చారు.
   
    టాక్సీ ఆపి ఎక్కి కూర్చున్నారు.
   
    శాంథోమ్ పోనివ్వమని జగన్మోహనరావు డ్రైవర్ తో చెప్పాడు.
   
    "ఇప్పుడు చెప్పరా" ఈ ఊరెప్పుడొచ్చావ్? ఎక్కడ ఉంటున్నావ్? ఏం చేస్తున్నావ్? డాక్టర్ అయావా లేక ఇంజనీరయ్యావా? జగన్మోహనరావు ప్రశ్నలవర్షం కురిపించాడు.
   
    "రెండూ కాలేదు. సి.ఏ. చేశాను. హైదరాబాద్ లో నేషనల్ మినరల్ కార్పొరేషన్ లో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నాను. మొన్న సాయంత్రం ఆఫీసుపనిమీదే ఇక్కడకొచ్చాను. రేపు మార్నింగ్ ఫ్లయిట్ లో వెళ్ళిపోతున్నాను.
   
    "రేపుదయమే వెళతావా? వీల్లేదు. రేపు వుండిపో. ఎల్లుండి వెళ్ళొచ్చు."
   
    "నువ్వు ఇక్కడ కన్పిస్తావని కలలోకూడా ఊహించడానికి ఆస్కారంలేదు కదరా? మార్నింగ్ ఫ్లయిట్ కు నా టికెట్ కూడా కన్ఫర్మ్ ఐంది. అర్జంటు పనిమీద వచ్చాను. కార్పొరేషన్ కు సంబంధించిన ఫైనాన్షియల్ మాటర్స్ సెటిల్ చెయ్యడానికి వచ్చాను. పని పూర్తయింది. రేపు తిరిగి వెళ్ళాలి."
   
    "అదేం కుదరదు. త్రోవలోనే ఎయిర్ లైన్స్ ఆఫీసుంది. రేపు క్యాన్సిల్ చేయించి ఎల్లుండికి కన్ ఫరమ్ చేయిద్దాం."   
   
    "అలా కుదర్ధురా బాబూ! రేపు తప్పకుండా తిరిగి వెళ్ళాలి."
   
    "పని అయిపోయిందన్నావుగా? తిరిగి వెళ్ళడానికి అంత తొందరేమిటి?" మందలిస్తున్నట్టుగా అన్నాడు జగన్మోహనరావు.
   
    ఇప్పటికే సుధ తనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. బయలుదేరేప్పుడే రెండు రోజులా అంటూ నిట్టూర్పులు విడిచింది. రేపుకూడా వెళ్ళకపోతే సుధకు తను ఏమని సంజాయిషీ ఇచ్చుకోగలడు? ఆ మాటకొస్తే తనకూ వెంటనే సుధను చూడాలనే ఉంది. సుధకు దూరంగా తనూ వుండలేడు. పెళ్ళయ్యాక సుధను వదిలి వుండటం యిదే మొదటిసారి.
   
    "డ్రైవర్ ఇండియన్ ఎయిర్ లైన్సుకు పోంగో!"
   
    తెలుగు అరవంలో చెబుతున్న జగన్ మాటలు విన్న మురళీకృష్ణ శ్రీమతిగారి స్వీట్ డ్రీమ్స్ లోనుంచి బయటపడ్డాడు.
   
    "ప్లీజ్! జగన్! నామాట విను. రేపు ఆఫీస్ లో ఉండాలి. మా ఆఫీసర్ తో విషయాలన్నీ మాట్లాడి ఎల్లుండి బోర్డు మీటింగులో స్టేట్ మెంట్ ప్రెజెంటు చెయ్యాలి-ఈసారి వచ్చినప్పుడు నువ్వు ఉండమన్నన్ని రోజులు ఉండిపోతా! ఈసారికి వదిలేయ్."
   
    "డ్రైవర్! ఎయిర్ లైన్సుకు వేండాం-నేరా శాంధోం పోంగో!" అన్నాడు జగన్.
   
    గడ్డంలో వేళ్ళు గుచ్చి నిమురుకుంటూ కృష్ణ ముఖం లోకి చూశాడు.
   
    "అవును! జగన్! నీ సంగతి చెప్పలేదు. మద్రాసులో ఎప్పట్నుంచి ఉంటున్నావూ? ఏంచేస్తున్నావూ? ఆఁ ఇంకా__"
   
    "ఆఁ ఇంకా__" అంటూ తమాషాగా నవ్వాడు జగన్మోహనరావు.
   
    "అదేరా! ఆ రోజుల్లో ఏవేవో పిచ్చి పిచ్చి రాకలు రాస్తుందే వాడివికదరా? ఇంకా రాస్తూనే ఉన్నావా అని...."
   
    జగన్మోహనరావు వెంటనే సమాధానం ఇవ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు.
   
    "నిన్నేరా? మాట్లాడవేం? ఇంకా ఆ రచనా వ్యాసంగంకూడా వుందా అని అడుగుతున్నా."
   
    "లేదు," చాలా ముక్తసరిగా సమాధానం ఇచ్చిన జగన్మోహనరావును చూసి కృష్ణ ఆశ్చర్యపోయాడు.
   
    అతని కళ్ళల్లో ఏదో నిర్లిప్తత, విషాదం కొట్టొచ్చినట్టు కన్పించాయి కృష్ణకు.
   
    "అది పోనీయ్ రా! ఇంతకూ ఏంచేస్తున్నావో కూడా చెప్పలేదేం?"
   
    "ప్రస్తుతం ఏమీ చెయ్యడంలేదు."
   
    "ఏమీ చెయ్యడంలేదా?"
   
    "ప్రస్తుతం!"
   
    అంతవరకు తనను ఎన్నో ప్రశ్నలు వేసిన జగన్-ఊపిరి సలపకుండా మాట్లాడిన జగన్ తన విషయం చెప్పాల్సివచ్చేసరికి ఎందుకంత ముభావంగ ఉన్నాడో కృష్ణకు అర్ధంకాలేదు.
   
    అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ ఏదో వెదకడానికి ప్రయత్నించాడు కృష్ణ. చూపుల్లో అలజడి, ముఖంలో ఏదో ఉద్వేగం-
   
    "మద్రాస్ ఎప్పుడొచ్చావ్?"
   
    "మా పాపకు ఆరునెలల వయసప్పుడు వచ్చాను - అంటే ఇప్పటికి రెండున్నర ఏళ్ళయింది."
   
    "అప్పట్నుంచీ ఖాళీగానే ఉన్నావా?"
   
    "లేదు."
   
    "మరి?"
   
    "ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్ గా ఉన్నాను."
   
    "ఏ సబ్జక్టు!"
   
    "లిటరేచర్! ఇంగ్లీషు లిటరేచర్!"
   
    "అయితే ఇంకేం? మొత్తంమీద అదే లైన్ లో ఉన్నావన్నమాట! హైస్కూలు రోజుల్లోనే నీకు లిటరేచర్ ఇంటరెస్టు ఉండేదికదరా! అప్పుడే అదీ ఇదీ రాస్తుండేవాడివిగా? ఇంతకీ ఉద్యోగం ఎందుకు మానేశావ్?"
   
    "నేను మానెయ్యలేదు."
   
    "మరి!"
   
    "వాళ్ళే తీసేశారు,"
   
    "ఎందుకూ? ఖాళీలేదనా?"
   
    "ఖాళీ లేకపోతే ఉద్యోగం ఎలా ఇచ్చారూ?"
   
    "అయితే ఎందుకు తీసేసినట్టు?"
   
    "సార్! శాంథోంలో ఎక్కడికిదా పూడుస్తారూ?" డ్రైవర్ అడిగాడు అరవ తెలుగు తనకూ వచ్చునని తెలియజేయడానికన్నట్టు.
   
    "మేరీ కాన్వెంటుకు పోబ్బా!"
   
    "అదేమిటి జగన్? ఈ టైమ్ లో పాప కాన్వెంటులోనే ఎందుకుందీ?" ఆశ్చర్యపోతూ అడిగాడు కృష్ణ.

    "పాప ఇక్కడే ఉంటున్నది. బోర్డర్ గా చేర్చాను."
   
    "ఇంత చిన్న వయసులోనా? మూడేళ్ళుకూడా నిండలేదన్నావ్?"
   
    "పరిస్థితి అలాంటిది. ఐయామ్ హెల్ప్ లెస్" నిట్టూర్పు విడిచాడు జగన్మోహనరావు.
   
    "అంటే?" అయోమయంగా స్నేహితుడివేపు చూశాడు కృష్ణ.
   
    జగన్ మౌనంగా టాక్సీలోనుంచి బయటకి చూశాడు.
   
    "పాప మదర్__అదే నీ మిసెస్...." ఆ తర్వాత ఏమనాలో తెలియక ఆగిపోయాడు కృష్ణ.
   
    ఆ ప్రశ్న వింటూనే జగన్ ముఖం పాలిపోయింది.
   
    కళ్ళల్లో విషాదఛాయలు కమ్ముకున్నాయి.
   
    కృష్ణ కలవరపడ్డాడు.
   
    "ఐయామ్ సారీ జగన్!" కృష్ణ ఆలోచనలో పడ్డాడు.
   
    ఇంత పసివయసులోనే తల్లిని పోగొట్టుకున్న పాప దురదృష్ణవంతురాలు. పాపనుగురించి చెప్పేటప్పుడు జగన్ లో వచ్చిన మార్పును తను ముందు అర్ధంచేసుకోలేకపోయాడు. జగన్ ఎంత బాధపడుతున్నాడో తనకు ఇప్పుడర్ధమౌతోంది.
   
    "ఆమె ఎప్పుడు పోయిందీ?" జాలిగా అడిగాడు కృష్ణ.
   
    జగన్ చటుక్కున తలతిప్పి కృష్ణ ముఖంలోకి చూశాడు.
   
    అతని కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS