Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 2

    పంకజం లేడిపిల్లలా గెంతుతూ వంటింటిలోకి పరుగు తీసింది.
   
    చేతికందితే దాని జడ పట్టుకొని గుంజాలనిపించింది సుధకు. బుగ్గలు పొడవాలనిపించింది. కాని పంకజం తూనీగలా తుర్రున పారిపోయింది.
   
    కొంటెపిల్ల!
   
    చిలిపి అల్లరి!
   
    అయినా పనిపిల్లకు ఇంత చొరవ పనికిరాదు. దాని హద్దులేవో దానికి తెలియకుండా వాగుతుంది. దాన్ని అదుపులో పెట్టడానికి తను ప్రయత్నిస్తే కృష్ణ అడ్డుపడ్తాడు. పంకజమంటే ఆయనకు ఎంతో ఇష్టం, అభిమానం. తను కాపరానికి వచ్చేసరికే ఆ పిల్ల ఇంట్లో ఉంది. మొదటిలో ఐతే దాని వరస చూస్తుంటే తనపైన ఆడబిడ్డ పెత్తనం చలాయిస్తున్నట్టనిపించేది. ఆమాటే ఆయనతో అంటే__
   
    "సుధా! పంకజం మా ఇంట్లోనే పుట్టి మా ఇంటిలోనే పెరిగిన పిల్ల. పదహారేళ్ళక్రితం పంకజం తల్లి సుభద్ర మా ఇంటిలో పనిమనిషిగా కుదిరింది. చాలా నమ్మకమైన మనిషి. మా అమ్మకు సుభద్రంటే ప్రాణం. అమ్మ పోయేంతవరకూ ఆమెనే కనిపెట్టుకొని ఉండి ఎంతో సేవచేసింది. సుభద్ర ఇంటిపనంతా చేస్తుంటే, ఏడాది బిడ్డగా ఉన్న పంకజం అమ్మ ఒళ్లోనే ఆడుకుంటూ ఉండేది. పంకజమలా దాదాపు అమ్మ చేతుల్లోనే పెరిగి పెద్దదైంది. కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుభద్ర భర్త పని చేస్తూనే యాక్సిడెంటులో చనిపోయాడు. తర్వాత సుభద్రకు ఆ ఫ్యాక్టరీలో స్వీపర్ గా ఉద్యోగం ఇచ్చారు. అప్పటినుంచి తల్లి పంకజాన్ని ఈ ఇంట్లో పనిపిల్లగా పెట్టింది. అందుకే దాన్ని ఈ ఇంటిలో ఎవరం పనిపిల్లగా చూడలేదు. పంకజంకూడా ఇంటిలో పిల్లగానే మసలుకుంటూ ఉంటుంది. అందుకని ఆ పిల్ల తెలిసీ తెలియక మాట్లాడే మాటలకు తప్పు పట్టించుకోకు."
   
    అంటూ కృష్ణ తనకు హితబోధ ప్రారంభించాడు ఓరోజు.
   
    పంకజంగురించి ఆలోచిస్తూ బట్టలు సర్దుతున్న సుధకు డోర్ బెల్ వినిపించింది. చివ్వున లేచింది. పరుగు పరుగున వెళ్ళి తలుపు తీసింది.
   
    "వచ్చేశారా?" ఆయాసాన్ని అదుపులో పెట్టుకుంటూ అంది.
   
    "సారీ సుధా! అనుకోకుండా పని తగిలింది. నా బట్టలు సర్దేవా? ఆఫీసువాళ్ళే టికెట్ కన్ ఫరమ్ చేసి తెచ్చి ఇచ్చారు. ఐదున్నరకు ఎయిర్ పోర్టులో రిపోర్టు చెయ్యాలి" అంటూ మురళీకృష్ణ లోపలకు వచ్చాడు.
   
    సుధ వాచీ చూసుకొని "ఇంకా గంటకుపైగా టైమ్ ఉందిలెండి. సేమ్యా పాయసమన్నా తిందురుగాని రండి" అంటూ సుధ డైనింగ్ హాల్లోకి దారితీసింది.
   
    "నో! నో! ఇప్పుడేమీ తినలేను."
   
    "ప్లీజ్ నాకోసం!" భర్త కళ్ళల్లోకి చూస్తూ గోముగా అంది సుధ.
   
    "సుధా! ఇంకా నువ్వు తినలేదా? నాకోసం వైట్ చేస్తున్నావా?" కంగారుపడిపోయాడు కృష్ణ భార్య ముఖం చూస్తూ.
   
    "ఇంకా నయం. మీరు ఊరినుంచి తిరిగొచ్చేవరకూ తినకుండా ఉంటావా అని అడగలేదు" పెదవుల్ని నొక్కిపెట్టి అంది సుధ.
   
    "నువ్వంతపనీ చేస్తావు నాకు తెలుసు. పద! పద!" సుధ భుజం పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గిరకు నడిపించాడు మురళీకృష్ణ.
   
                                            2
   
    బయట కారు హారన్ మోగుతూ ఉంది. సుధ తలుపు తెరిచింది. ఆఫీసుకారు ఇంటిముందు ఆగివుంది.
   
    మురళీకృష్ణ సూట్ కేస్ అందుకొని సుధవేపు చూచాడు.
   
    "అరెరే! ఏమిటి అలా ఐపోయావ్?" సుధను చూస్తూ కంగారు పడిపోయాడు కృష్ణ.
   
    "రేపురాత్రికి వచ్చేస్తారుగా?"
   
    "రేపురాత్రికా? అదెలా కుదురుతుందోయ్? ఎల్లుండి ఈవెనింగ్ ఫ్లయిట్ కు రావడానికి ప్రయత్నిస్తాను."
   
    "ప్రయత్నించడం ఏమిటండీ ప్రయత్నించడం? తప్పకుండా రావాలి."
   
    "అలాగే! వస్తామరి!"
   
    "వెళ్ళొస్తాననండి."
   
    "సూటుకేసు కిందపెట్టి కృష్ణ, సుధ భుజాలు పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూశాడు.
   
    "రెండు రోజులుకూడా నన్ను విడిచి ఉండలేవా!"
   
    "రెండ్రోజులు కాదు, రెండు క్షణాలుకూడా ఉండలేనేమోననిపిస్తుందండీ."
   
    సుధను దగ్గరగా తీసుకున్నాడు కృష్ణ.
   
    "అదంతా మీరు తిరిగొచ్చాక వదలండి" అంటూ ముఖం పక్కకి తిప్పుకుంది సుధ.
   
    "బ్రష్షూ, పేస్టూ మర్చిపోయారమ్మా!" అంటూ పంకజం పరిగెత్తుకుంటూ వచ్చింది.
   
    సుధా కృష్ణ చేతులను విడిపించుకొని దూరంగా జరిగింది.
   
    పంకజంనుంచి పేస్టూ బ్రెష్షూ అందుకొని సూట్ కేసులో వేసుకున్నాడు కృష్ణ.
   
    "పంకజం రాత్రిళ్ళు ఇక్కడే పడుకో. నేను వచ్చేదాకా సుధకు తోడుగా ఉండు" పంకజంతో అన్నాడు కృష్ణ.
   
    "ఓ! అట్టాగే!" పంకజం హుషారుగా అంది.
   
    "దానితోడా నాకు? ఆడబిడ్డ అర్ధమొగుడన్న సామెతలా దీనితోడు నాకెందుకు బాబూ!" పంకజం జడ పట్టుకొని గుంజుతూ మురిపెంగా అంది సుధ.
   
    "అట్టయితే నేనసలు పనిలోకే రాను" మూతి ఎడాపెడా తిప్పుతూ, నేలమీద అరికాళ్ళు బాదుతూ అంది పంకజం.
   
    "నువ్వెక్కడికి పోతావే దెయ్యమా మమ్మల్నొదిలి? కదిలితే మెదిలైతే తన్నేవాడిని చూసి ఆ ముడివేసేస్తేగాని నువ్వు దారికి రావు. అంతవరకూ ఆగు!"
   
    "అట్టాంటోడొస్తే నెత్తి కుండ పగలేసి రైలెక్కేసి వచ్చేస్తా. ఏంటనుకుంటున్నారో!"
   
    "చూశావా దాని ధైర్యం? నువ్వూ ఉన్నావెందుకూ? రెండురోజులు క్యాంపు కెళుతుంటే జావకారిపోతున్నావ్!" వస్తున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు కృష్ణ భార్య ముఖంలోకి చూస్తూ.
   
    "పెళ్ళికాకముందు మేమూ అలాగే అనుకొనేవాళ్ళం. అయినతర్వాత తెలిస్తుందే నీకు" పంకజం నెత్తిమీద మొట్టికాయ వేసింది సుధ.
   
    సుధా, పంకజం కారుదాకా వచ్చి కృష్ణను సాగనంపారు.
   
                                         3

   
    "మురళీ!"
   
    వెనకనుంచి ఎవరో పిలవడం వినిపించింది! కౌంటర్ దగ్గిర నిలబడి బిల్లు చెల్లిస్తున్న కృష్ణకు.
   
    వెనక్కు తిరిగి చూశాడు.
   
    కాని అక్కడ వున్నవాళ్ళల్లో ఎవరూ తనకు తెలిసినవాళ్ళున్నట్టుగా అనిపించలేదు.
   
    ఆఫీసుపని పూర్తిచేసుకొని రెండోరోజు సాయంత్రం రతన్ బజార్లో వున్న "చెల్లారాం అండ్ సన్స్ సిల్క్ ప్యాలెస్" కు వచ్చాడు. ఒక చీరా, డానికి సరిపోయే జాకెట్ ముక్కా కొని కౌంటర్ దగ్గిర బిల్లు చెల్లిస్తున్న కృష్ణకు ఎవరో తనను వెనుకనుంచి పిలుస్తున్నట్టు అన్పించింది. తిరిగి చూశాడు.
   
    డబ్బు చెల్లించి, ప్యాకెట్ తీసుకొని ముందుకు అడుగువేసిన కృష్ణ భుజాన్ని ఓ చెయ్యి మృదువుగా తాకింది.
   
    "కృష్ణా! నన్ను గుర్తుపట్టలేదా?"
   
    స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్నాడు.
   
    ఆ కంఠం ఎక్కడో విన్నట్టుంది.
   
    కృష్ణ గిర్రున వెనక్కు తిరిగిచూశాడు.
   
    నల్లటి గడ్డం, మెడమీద వాలిపోతున్న జుట్టు, సిల్కు లాల్చీ, గ్లాస్కో పంచ- భావకవిలాగానో సినీమాపాటలు రాసే కవిగానో ఉన్నాడు.
   
    కృష్ణ అతడిని పోల్చుకోవడానికి ప్రయత్నించాడు.
   
    బాగా తెలిసినవాడిలాగే కన్పించాడు.
   
    కాని ఎవరో గుర్తు రావడంలేదు.
   
    అయోమయంగా, తెలిసీ తెలియనట్టు పెట్టిన కృష్ణ ముఖాన్ని చూస్తూ, అవతలి మనిషి ఏదో అనుమానంవచ్చినట్టు చటుక్కున చెయ్యి వెనక్కు తీసుకున్నాడు.
   
    "మీ పేరు.....మురళీకృష్ణే కదూ?" అతను సూటిగా ముఖంలోకి చూస్తూ అడిగాడు.
   
    "అవును!" తల ఊపుతూ నొక్కి పలికాడు.
   
    "ఒరేయ్ నువ్వేనట్రా? నన్ను గుర్తుపట్టలేదట్రా?" ఈసారి రెండు చేతులతో కృష్ణ భుజాలు పట్టుకొని ఊపుతూ అడిగాడు.
   
    "అరే! నువ్వట్రా జగన్! ఈ గడ్డం, ఈ వేషం ఏమిట్రా దేవదాసులా?" కృష్ణ ఊపిరి పీల్చుకున్నాడు.
   
    "ఏమిట్రా చీరెలు కొనేస్తున్నావ్, పెళ్ళానికా చెల్లెలికా?"

    అతని మనసు చివుక్కుమంది.
   
    ఇంతవరకు చెల్లెలికి ఒక్క చీర కొనలేదు. ఎక్కడో పల్లెటూరిలో వుంది. చీరెల సెలెక్షన్ అసలు తనకు తెలియదు. ఇదే మొదటిసారి. ఎందుకో కొనాలనిపించింది. షాపుకు వచ్చాడు. తను కొనిన చీర సుధకు నచ్చుతుందో లేదోకూడా తెలియదు. ఆఫీసులో నాలుగుగంటలకన్నా పని పూర్తిఅయిపోయింది. జబారుకు బయలుదేరాడు. అనుకోకుండానే బట్టల షాపులోకి నడిచాడు.
   
    "పెళ్ళెప్పుడయిందిరా? మీఆవిడ బాగా ఫైర్ గా ఉంటుందా?"
   
    "సరిగ్గా మొన్నటికి సంవత్సరం అయింది. అవునూ - ఫైర్ గా ఉంటుందని ఎలా ఊహించావ్?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడతను.
   
    "నువ్వు కొనిన చీరెనుబట్టి ఊహించాను. ఫెయిర్ గా వున్నవాళ్ళకే ఆ చీరె బాగుంటుంది. నీది మంచి టేస్టేరా! నీ శ్రీమతికూడా అందంగా ఉండిఉండాలి" జగన్మోహనరావు అలా మాట్లాడుతూంటే, మురళీకృష్ణకు ఎన్నో చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS