Previous Page Next Page 
గురవాయణం పేజి 2

                                                   సైకిల్

    సైసై అంటూ పరుగులు తీసే సైకిలు జంటపక్షులు లాంటి రెండు చక్రాలు ముందుకు మాత్రమే పరిగెత్తు అని తెలిపేసాధనం నిశ్శబ్దంతో విజయం సాధించు అని అందులో మర్మం.
    కాలుష్య రహిత పర్యావరణ హితచక్రం పాదచారుల, జంతువుల రక్షక నేస్తం! ఇంధనమే అవసరంలేని యంత్రం మన స్వేదమే దానికి ఇంధనం!
    ప్రకృతి అందాలను చూపే విహంగం మానసిక ప్రశాంతతను ఇచ్చే ఔషధం! పిల్లలకు వినోదాన్నిచ్చే కీలుగుఱ్ఱం క్రీడాకారులకు పతకాలు తెచ్చే రేసుగుర్రం! లేనివాడికి పొట్టను నింపే జీవిత చక్రం  ఉన్నవాడికి పొట్టను కరిగించే ఆరోగ్య చక్రం!
    సైకిల్ తొక్కనివాడు, తొక్కలేనివాడు ఎవరూ ఉండరేమో. నేను ఈ జనరేషన్ గురించి చెప్పటంలేదు. నాలాగా ఆరుపదులు దాటిన ఆ తరం గురించి అంటున్నాను.
    నా చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడం అంటే ఓ పెద్ద అనుభవం, అంతకంటే పెద్ద గౌరవం.
    నాన్న కొడుక్కి, అన్న తమ్ముడికి సైకిల్ నేర్పడం సంప్రదాయం కోడా. నా పిల్లలిద్దరికీ ఇంగ్లండ్ లో ఉన్నప్పుడు కారు పార్క్ లో ఆదివారాల్లో నేర్పించడం, వాళ్ళంతట వాళ్ళు రైయని దూసుకెళ్ళడం, ఆ జ్ఞాపకాలచెమ్మ ఇంకా తడిగానే ఉంది.
    మరీ చిన్నప్పుడు మూడు చక్రాల సైకిల్ ఒకటి ఉండేది. నాకు గుర్తుండి దానికి ఎప్పుడూ రెండు చక్రాలు తప్ప చూడలేదు. ఉన్నదానితో సర్దుకోవడం అన్నది అప్పట్నుంచే అలవాటు పడిందేమో.
    అదే సైకిల్ మీద వీరోచితంగా కిందా మీదా పడుతూ ఆడుకున్నట్టు బాగా గుర్తు. నాకు తెలిసి నాకు ఎప్పుడూ సొంత సైకిల్ లేదు. బాబాయ్ కి ఉండేది. రెండో ప్రపంచయుద్ధంలో తయారైన హంబర్ సైకిల్.
    తర్వాత ర్యాలీ, ఆ తర్వాత హీరో సైకిల్స్ వచ్చినట్టు గుర్తు. ఆ రోజుల్లో తినే ఐస్ ఫ్రూట్ దగ్గర్నుంచి తొక్కే సైకిల్ దాకా రెండు మోడల్స్ వుండేవి. ఐస్ ఫ్రూట్ లో 1/3 సేమియా ఉంటే ఎకానమీ మోడల్. మొత్తం సేమియా ఉంటే డీలక్స్ మోడల్.
    అలానే సైకిల్ కి చైన్ కనపడుతుంటే ఎకానమీ. కనపడకుండా కవర్ ఉంటే డీలక్స్ మోడల్.
    అమ్మాయిల సైకిల్ ముందు రాడ్ ఉండేది కాదు. చైను ఊడిపోవడం, పంచరు పడటం మా పిల్ల సైక్లిస్ట్ లకి తలనొప్పి తెచ్చే ఇబ్బందులు. ఊడిపోయిన చైన్ ని కర్రపుల్ల సహాయంతో మళ్ళీ లైన్లోకి తేవడం ఓ గొప్ప కళ. ముందుగా అడ్డతొక్కుడు నేర్చుకోవాలి. ఆ తర్వాత నిలువు తొక్కుడు.
    ఆ తర్వాత డబుల్స్, త్రిబుల్స్, ఆడపిల్లల్ని ఎప్పుడు ముందు కూర్చోపెట్టుకోవాలి. ఇవన్నీ సైకిల్ శాస్త్రంలో నియమాలు, మర్యాదలు.
    అమ్మాయిల్ని అతిగా ఆకట్టుకునే విన్యాసం చేతులు వదిలిపెట్టి సైకిల్ తొక్కడం.
    కానీ ఇది కనీసం రెండు మోకాలు చిప్పల త్యాగంతో కూడిన కఠోరశ్రమ.
    ఓసారి ఈ ప్రక్రియలో చేతులతోపాటు కాళ్ళు కూడా సైకిల్ ని వదిలేసి తద్వారా కాలవలో పడి మయసభలో దుర్యోధనుడు పోలిన అవమానం పొందినట్టు చేదు గుర్తులు. ఆ రోజుల్లో దాసరిగారు ఓ సినిమాలో సంసారాన్ని సైకిల్ తో పోల్చి తన సంభాషణా చాతుర్యం మనందరికీ పంచాడు.
    సైకిల్ అనేది భార్యభర్తల సంసారం. ముందు చక్రం భర్త... వెనుకచక్రం భార్య. చైన్ మంగళసూత్రం... ఒక పెడల్ సుఖం, ఒక పెడల్ దుఃఖం.
    ఏది ఏమైనా ఆ రోజుల్లో జీవనోపాధికి సైకిల్ ఎంతో అవసరమైన ఇంట్లో మనిషి లాంటి సాధనం. ఎన్నివేల మంది చిన్న వ్యాపారులకో ఈ సైకిల్ ఇంధనంలా పనిచేసి ధనం సంపాదించిపెట్టింది అంటే అతిశయోక్తి కాదు.
    మొన్నీమధ్యన నా స్నేహితుడు సుధాకర్ రెడ్డి అమెరికాలో అయిదు లక్షల రూపాయలు పెట్టి సైకిల్ కొనుక్కుంటే ఔరా అనుకున్నాను. కాకపోతే తేడా ఏంటంటే నా చిన్నప్పటి సైకిల్ పొట్ట నింపుకోవడానికి ఇప్పుడు సైకిల్ పొట్ట దింపుకోడానికి.
    మొన్నే డాక్టర్ పురుషోత్తంగారి అద్భుతమైన కవిత చదవడం జరిగింది.
    కొంతమందికి వినోదాన్ని, కొంతమందికి ఆరోగ్యాన్ని, మరికొంతమందికి జీవనోపాధిని అలవోకగా అందిస్తూ వాతావరణ కాలుష్యనివారణకి సేవచేస్తూ, ప్రకృతిలో మమేకమవుతూ మనందరినీ వందల సంవత్సరాలుగా అలరిస్తున్న ఈ చిన్న యంత్రానికి నివాళులర్పిస్తూ... *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS