Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 2


    ఇద్దరి మధ్యా కాసేపు మౌనం.

 

    తర్వాత మళ్ళీ అవినాష్-

 

    "ఇంతకీ నా గుప్పెట్లో ఏం వుందో... ఇప్పటికీ తెలీలేదా..." అడిగాడు.

 

    మళ్ళీ ఏవంటాడోనని ఆ అమ్మాయి జవాబివ్వలేదు.

 

    "అయితే చూడు..." గుప్పెట తీసి, రెండు అరచేతుల్నీ అమ్మాయికి చూపించాడు.

 

    "ఎడమ అరచేతి మీద I love, కుడి అరచేతి మీద you అని రాసుంది.

 

    ఆ అమ్మాయి వాటిని చూసి మెల్లగా నవ్వింది.

 

    "ఆర్నెల్ల నుంచీ ఇదే పాట... నాకు చూపించడానికి ఎప్పుడు రాసుకున్నావ్ చేతుల మీద... అన్నీ మాయలు..." అతని భుజమ్మీద గిల్లుతూ అంది.

 

    "చేతులమీదే కాదు... నా వళ్ళంతా రాసుకున్నాను... చూబెట్టమంటావా..." షర్టు గుండీల మీద చేతులు వేస్తూ అన్నాడు.

 

    "వద్దు బాబు... చాలు...నాకు తెల్సులే...పద... పోదాం... ఇప్పటికే చాలా లేటైంది..." ఆ అమ్మాయి లేవడానికి ప్రయత్నిస్తూ అంది.

 

    ఆ అమ్మాయి చెయ్యిపట్టి కిందకు లాగుతూ-

 

    "రావడమే నీ ఇష్టం...వెళ్ళడం నీ ఇష్టమేనా..." అని అడిగాడు.

 

    "మరి..." తలతిప్పి అందామ్మాయి.

 

    "ఒన్ మినిట్ ప్లీజ్...రో..." బుజ్జగింపుగా అడిగాడు అవినాష్.

 

    "నీతో ఇదే గొడవ...నీ ఎదురుగా గంటలు గంటలు కూర్చోవాలంటే నాక్కుదర్దు...లాస్ట్ టైమ్... అలాగే...వద్దు వద్దంటే...అదేదో చెత్త సినిమాకి తీసికెళ్ళావు...ఇంటికెళ్లేసరికి ఎంత లేటైందో తెల్సా... మా డాడీ చిందులు తొక్కారు..." కూర్చుంటూ అన్నది రోష్ణీ.

 

    అప్పటికి వెలుగు పూర్తిగా పోయింది.  

 

    చిక్కని చీకటి సముద్రం నిండా కప్పేసింది.

 

    దూరంగా ఔటర్ హార్బర్లో నిల్చున్న అమెరికన్ షిప్ రంగు రంగుల దీపాల్తో కొండలా మెరుస్తోంది. అక్కడకు కొంచెం దూరంలో ఉన్న ఏరాడ కొండ నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్న ఏనుగులా ఉంది. రామకృష్ణా బీచ్ రోడ్ మీద, నియాన్ లైట్ల వెలుగులో చకచకా జారిపోతూ, పారిపోతున్న అందమైన కార్లు.

 

    "ఈ చీకట్లో నువ్వూ, నేనే కదూ...ఇద్దరే ఉన్నప్పుడు ఏం చేయాలో తెల్సా...పాపా..." అంటూ రోష్ణీ చేతుల్ని తన మెడచుట్టూ వేసుకుని, ఆమె పైటను తన చేతుల్తో తీసి, తన భుజాలచుట్టూ కప్పుకొని గట్టిగా ఆమెను వాటేసుకున్నాడు.

 

    "అబ్బా" అంటూ విసుక్కుంది రోష్ణీ. కానీ అవినాష్ ని వారించలేదు.

 

    అవినాష్ పెదాలు ఆ అమ్మాయి పెదాల్ని చుట్టుముట్టేసాయి.

 

    గట్టిగా ముద్దుపెట్టుకుంటూ, తన చేతుల్ని ఆ అమ్మాయి భుజాల మీంచి జరిపి, జాకెట్టు మీద వేసాడు.

 

    "ఇదిగో... అవినాష్... అలాంటి పనులు చేశావంటే ఊరుకోను... జాగ్రత్త..." అంటూ రోష్ణీ, అతన్ని వెనక్కి తోసేసి, పైట సర్దుకుని లేచి నిలబడింది. ఇసకలో పడిపోయిన అవినాష్ లేచి, ఫాంటుకి అంటుకున్న ఇసకను తుడుచుకుంటూ ముందుకి నడుస్తున్న ఆమె దగ్గరకు పరుగు పరుగున వచ్చి ఆమె చెవి దగ్గర నోరు పెట్టి-

 

    "I LOVE ROSHNI, I LOVE YOU" అని గట్టిగా అరిచాడు.

 

    ఆ అరుపు ఆ నిశ్శబ్ద సమయంలో ఆ చుట్టుపక్కలంతా ప్రతిధ్వనించింది.

 

    రోష్ణీ గబుక్కున అవినాష్ నోటిని తన చేతుల్తో కప్పేసింది. అయినా అవినాష్ మళ్ళీ అరవబోయాడు. అతన్ని వారించడం కోసం రోష్ణీ తన పెదవుల్ని అతని పెదవులకు అందించింది.

 

    రెండు నిమిషాలు గడిచాయి.

 

    "ఊఁ... చాలా... ఇంకేవైనా కావాలా..." విసుక్కుంటూ తన భుజాలమీదున్న అతని చేతుల్ని తీసేసి, చిలిపిగా అతని బుగ్గని గిల్లి అంది రోష్ణీ.

 

    "కావాలంటే చాలా కావాలి... ఇస్తావా..." కవ్వింపుగా అడిగాడు అవినాష్.

 

    "ఎప్పుడూ ఆ వెధవాలోచనే... మగాళ్ళంతా ఇంతే... పాడు..." విసుక్కుంటూ... "అయ్యా... లెక్చరర్ గారూ - ఇవాల్టికిది చాలు..." అంటూ చెయ్యిపట్టి చీకటిలోంచి వెల్తురులోకి లాక్కొచ్చింది.

 

    ఇద్దరూ ఇసకలోంచి నడుచుకుంటూ రోడ్డుకి, బీచ్ కీ అడ్డుగా ఉన్న చిన్న పిట్టగోడ దగ్గర కొచ్చారు.

 

    "మళ్ళెప్పుడు..." ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అవినాష్.

 

    "నేను చెప్పలేను... ఎప్పుడో ఇలాగే... వచ్చేస్తానులే..." అతని చేతిని నొక్కుతూ అంది రోష్ణీ.

 

    "నీ కిష్టమైనప్పుడు నువ్వొస్తే నేనుండగలనా... రోజుకొక్కసారైనా నువ్వు కన్పించకపోతే... నేను పిచ్చెక్కిపోతాను... ప్లీజ్ రోష్ణీ... ప్రతి రోజూ నేను నీతో మాట్లాడాలి... తప్పదు..."

 

    "ఎలా..." కోపంగా అడిగింది రోష్ణీ.

 

    "ఫోన్లో... ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటలకు నేను ఫోన్ చేస్తాను... ఆ టైంకి ఫోనుకు దగ్గర నువ్వుంటే చాలు..."

 

    "ఇంటికి ఫోనా... బాబ్బాబు... ఆ పని చెయ్యకు... చచ్చిపోతాను... అసలే మా ఆంటీ డిటెక్టివ్... ఫోన్ పక్కనే ఎప్పుడూ ఆవిడ నవల్లు చదువుతూ కూర్చుంటుంది..."

 

    "మరెలా...? ఓ ఐడియా... మీ కాలేజీకి ఫోన్ చేస్తాను..."

 

    "అది మరీ డేంజర్..." రోష్ణీ అంది.

 

    "మరి... మీ కాలేజీ వదిలే టైంకి నేనే వచ్చేస్తాను..."

 

    "ఇదిగో అవినాష్... ఇలాంటి వెధవైడియాలు వెయ్యకు. నన్ను నీతో చూస్తే... ఎవరో ఒకరు మా డాడీకి చెప్పేస్తారు... ఆ తర్వాత నన్ను కైమా కావడం ఖాయం- నన్ను కాలేజీ మాన్పించడం ఖాయం."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS