Previous Page Next Page 
అశ్వభారతం పేజి 2


    ఆ సమయంలో సముద్రం నిర్మలంగా వుంది. జుహు బీచ్ మాత్రం కోలాహలంగా వుంది. విశాలమైన ఆ బీచ్ లో ఎడమవైపు చివర రెండు పోక చెట్లున్నాయి. ఆ చెట్ల దగ్గర ఒక అందమయిన స్టెయిన్ లెస్ స్టీల్ కుర్చీ ఉంది. ఆ కుర్చీలో ఓ వ్యక్తి కూర్చుని సాయం సంధ్య, సముద్రపు అందాల్ని ఆస్వాదిస్తున్నాడు. ఆ వ్యక్తికి దాదాపు యాభై ఏళ్ళుంటాయి. తల బాగా నెరిసిపోయింది. కానీ ఆయన ముద్దుగా పెంచుకున్న చిన్న గెడ్డం మాత్రం నలుపు రంగులో వుంది. అందువల్ల ఆయన ఎర్రటి ముఖం చిత్రంగా కనిపిస్తోంది.

    సముద్రం వేపు....

    అలల వేపు ....

    పరిసరాల వేపు చూస్తున్నాడాయన దీర్ఘంగా మధ్యమధ్యలో చేతిలో వున్న "రొత్ మన్స్" సిగరెట్ ప్యాకెట్ లోంచి ఎడతెగకుండా సిగరెట్స్ తీసి కాలుస్తున్నాడు.

    చైన్ స్మోకింగ్.

    కాసేపటికి బాగా చీకటి పడింది.

    చుట్టూ దీపాలు వెలిగాయి.

    పాలలో ముంచి తీసినట్లుగా నగరం మెరుస్తూ దీపాల వెలుగులో అందంగా అస్పష్టంగా కనిపిస్తోంది.

    ఆయనే ప్రపంచ ప్రఖ్యాత పొందిన భారతీయ చిత్రకారుడు దివ్యతేజ.

    ఆయన చిత్రాలకు విదేశాలలో సయితం మంచి క్రేజ్ వుంది. సాంప్రదాయ చిత్రకళ జానపద చిత్ర కళలతోపాటు మారుతున్న నవీన చిత్రకళ తీరు తెన్నులు బాగా తెల్సిన వ్యక్తి. అన్నిటిలోకి హర్సెస్ కి సంబంధించిన చిత్రకళలో ఆయనను ఢీ కొట్టగలవారు లేరు.

    ఆవేశంలో రోషంతో కసితో పరిగెత్తే గుర్రం బొమ్మ వేయటంలో ఆయన బ్రష్ హార్స్ పవర్ ని మించి నర్తిస్తుంది కాన్వాయ్ క్లాత్ పై.

    ఆయన దగ్గర ఎంతోమంది శిష్యులు తయారయ్యారు. తయారవుతున్నారు. ఆయన స్టూడియో ఆ జుహు బీచ్ కు దగ్గర్లోనే ఉన్న తారా రోడ్ లో ఉంది.

    "సార్....చీకటి పడింది వెళ్దామా?" అన్న మాటలు వినపడి దివ్యతేజ పక్కకి తిరిగి చూసాడు.

    స్టుడియోబోయ్ చేతులు కట్టుకొని నిలబడి వున్నాడు వినయంగా.

    దివ్యతేజ మౌనంగా బీచ్ లోంచి బయటకొచ్చి తారారోడ్ వేపు నడుస్తున్నాడు.

    వెనుక బోయ్ కుర్చీ మోసుకొని వస్తున్నాడు.

    ఇది దివ్యతేజ దినచర్యలో ఒక భాగం.

    ఆ రోడ్ విశాలంగా ఉంది.

    ఆ రోడ్లో కుడివేపు ఐదో ప్లాట్ దివ్యతేజ ఆఫీస్. లేత బూడిద రంగులో వున్న ఆ రెండంతస్తుల భవనం మెట్లెక్కి స్టూడియోలోకి నడిచాడు దివ్యతేజ.

    రకరకాల రంగురంగుల డబ్బాలు ఆ హాల్లో ఎక్కడబడితే అక్కడ పడేసి వున్నాయి.

    దివ్యతేజ రెండు రోజుల నుంచి ఏకదీక్షగా చేస్తున్న గుర్రం చిత్రం వేపు చూసాడు సునిశితంగా.

    ఆ బొమ్మలో ఏదో లోపం వుంది.

    ఆ లోపం ఏమిటో ఎక్కడుందో ఎంత నిశితంగా పరిశీలించినా తెలీడం లేదు. దాని గురించే మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తున్నాడు. మరోసారి ఒరిజినల్ ఫోటో తీసి చూసాడు_వెంటనే తను వేసిన చిత్రం వేపు చూసాడు. కాలం గడిచిపోతోంది.

    రాత్రి పదిగంటలు కావస్తోంది.

    అప్పుడు జ్ఞాపకానికొచ్చింది. ఆ గుర్రం చిత్రాన్ని తీసికెళ్ళేందుకు వచ్చే మనిషి పదిగంటల కొస్తాడని.

    దివ్యతేజకు చాలా ఆశ్చర్యంగా వుంది. ఒక గుర్రం చిత్రాన్ని యధాతధంగా వేయడానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వటం.

    రెండు రోజుల క్రితం ఇదే సమయంలో ఎక్కడనుంచో ఫోన్ వచ్చింది.

    ఆ ఫోన్లో....ఎవరో....ఏమిటో....ఎక్కడినుంచో తెలీని ఒక వ్యక్తి "మిస్టర్ దివ్యతేజా.... ప్రపంచంలో పేరు పొందిన చిత్రకారుల్లో మీరొకరని నాకు తెలుసు. అందునా గుర్రాల చిత్రాల్లో మీకు మీరే సాటని 1983 హైదరాబాద్ బంజారా హోటల్ లో ఏర్పాటు చేసిన మీ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసాక నాకీ అభిప్రాయం కలిగింది. అంచేత మీకోపని అప్పగిస్తున్నాను. నేనొక గుర్రం ఫోటోని పంపిస్తాను. ఆ ఫోటో వెనుక వివరాలుంటాయి. దాని ప్రకారం ఆ గుర్రం బొమ్మను మీరు పెయింట్ చేయాలి. అంతపెద్ద చిత్రకారుడికి ఇంత చిన్న పనా? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ....నాకది....పెద్ద పనే....చాలా అవసరమైన పని.... ఇష్టమైన పని టైం విలువ నాకు తెలుసు.... రెండురోజుల సమయాన్ని నాకు కేటాయించినందుకు మీకు రెండు లక్షలు ఇస్తున్నాను. తక్కువని మీరనుకుంటే.... ఇంకో లక్ష రూపాయలు అదనంగా ఇవ్వటానికి నేను సిద్ధమే.... ఏమంటారు....?" మళ్ళీ ఆగాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి గొంతు బొంగురుగా కరుకుగా వుంది.

    దివ్యతేజ మాట్లాడలేదు. వింటున్నాడు. "టైం సెన్స్ నాకు ముఖ్యం" రెండురోజుల్లో నాకు పెయింటింగ్ కావాలి ఇంకో అరగంటలో నా మనిషి మీకో ఫోటో అడ్వాన్స్ గా లక్ష రూపాయలు తెచ్చి, ఇస్తాడు. ఇంకో ముఖ్యమైన విషయం. నేను పంపించే ఫోటోని జాగ్రత్తగా ఎవరి కళ్ళాపడకుండా నాకు అప్పగించాలి....లేకపోతే....మీ ప్రాణాలకే ప్రమాదం."

    అప్పుడు నోరు విప్పాడు దివ్యతేజ.

    "బైదిబై.... మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్....అండ్ అడ్రస్ ఆల్ సో...."

    "అయామ్ ఎ కస్టమర్ ఆఫ్ యు....దట్సాల్" అవతల ఫోన్ పెట్టేసిన సౌండ్.

    అతను చెప్పినట్లుగానే మరో అరగంట తర్వాత నల్లటి, పొడువాటి వ్యక్తి రావటం ఒక గుర్రం ఫోటో, దానితోపాటు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది.!

    తేజ వర్తమానంలోకి వచ్చాడు.

    మరో అరగంటలో ఆ వ్యక్తి ఆ గుర్రం చిత్రాన్ని తీసుకెళ్ళటానికొస్తాడు.

    గుర్రం వేపు, ఫోటో వేపు తదేకంగా చూస్తున్న దివ్యతేజ దృష్టి హఠాత్తుగా గుర్రం కంటిమీద పడింది. చిత్రంలో లోపం ఎక్కడుందో అతనికి తెల్సిపోయింది.

    వెంటనే హుషారుగా బ్రష్ అందుకున్నాడు. తెలుపురంగులో ముంచాడు, ఆ గుర్రం ఎడం కన్ను క్రింద తెలుపురంగులో చిన్న మచ్చ దిద్దాడు.

    ఇప్పుడు తేజ మనస్సు సంతృప్తిగా వుంది. లోపాన్ని సరిదిద్దినందుకు.

    అప్పటికి సరిగ్గా సమయం 9.45 నిమిషాలు. యింకా పావుగంట మాత్రమే టైమ్ ఉంది.

    టేబుల్ మీద భోజనం సర్దేసి బోయ్ అప్పుడే వెళ్ళిపోయాడు.

    చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు తేజ.

    తేజ భార్య అయిదేళ్ళ క్రితం ఏక్సిడెంట్లో చనిపోయింది. ఒకే ఒక్క కూతురు హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తోంది.

    భోజనం మధ్యలో కాలింగ్ బెల్ మోగింది. చెప్పిన టైమ్ కి వచ్చాడనుకుంటూ భోజనం ముందు నుంచి లేచి క్రిందికొచ్చి తలుపు తీసాడు.

    బయట ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను అంతకుముందు ఫోటో, డబ్బు తెచ్చిన వ్యక్తి కాదు. పొట్టిగా, ధృడంగా ఉన్నాడు. అతని కళ్ళు పిల్లి కళ్ళలా చీకట్లో మెరుస్తున్నాయ్, రేర్ వెస్ ....

    (ఇద్దరి మధ్య సంభాషణ హిందీలో జరుగుతోంది)

    "మీరేనా దివ్యతేజ...." ఆవ్యక్తి అడిగాడు.

    "అవును...."

    "మీతో కొంచెం మాట్లాడాలి...."

    అప్పుడు వచ్చింది అనుమానం ఆ వ్యక్తి మీద దివ్యతేజకు. బయటపడకుండా "ఓ.... కే....కమిన్" అంటూ దారిచ్చాడు. ఇద్దరూ డ్రాయింగ్ రూం వేపు నడుస్తుండగా దివ్యతేజకి అనుమానం బలపడసాగింది. అతను పంపించిన వ్యక్తే అయితే మొదటి ప్రశ్న మీరేనా దివ్యతేజ ని వేయడు. చిత్రం పూర్తయిందా....? అని అడగాలి.

    రెండో మాటగా మీతో మాట్లాడాలి అనరు. డబ్బు తెచ్చాను చిత్రం, ఫోటో ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అని అనాలి. అంతేగాని తనతో తాపీగా మాట్లాడవల్సిన అవసరం లేదు. ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి టైం సెన్స్ ప్రకారం పని ముఖ్యం-మాటల అవసరం తక్కువ.

    తను అనుమానం తనకున్నా, ముందు తనే బయటపడటంకన్నా అతన్నే మాట్లాడనివ్వటం మంచిది. అతను మరో పనిమీద వస్తే రహస్యంగా ఉంచమన్న చిత్రం విషయం తనే పొరపడి చెప్పినట్లు కావచ్చు.

    ఇద్దరూ డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు.

    "ఇచ్చేస్తారా వెళ్ళిపోతాను...." అన్నాడతను.

    తొందరలోనే తెలివి తెచ్చుకున్నాడు. అంటే తన కళ్ళలో కదలాడిన భావాన్ని పసిగట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడా...."

    "ఎంత తెచ్చారు?...."

    ఎంతో చెప్పకుండా బ్రీఫ్ కేసు ముందుంచాడు.

    "ఎమౌంట్ ఎంతో చెప్పండి...." దివ్యతేజ అనుమానం బలపడిపోయింది.

    అతను మౌనంగా వుండిపోయాడు. కరెక్ట్ వ్యక్తి అయితే మిగతా బ్యాలెన్స్ లక్ష తెచ్చాననాలి ఎంతో చెప్పకుండా వూరుకున్నాడు అంటే మరో వ్యక్తి అన్నమాట.

    "మిస్టర్ సూటిగా విషయంలోకి రండి మీరెవరు? ఎందుకొచ్చారు? ఇచ్చేస్తే వెళ్ళిపోతానన్నారు, ఏం ఇవ్వాలి? నేనేం ఇవ్వాలనుకుంటుంన్నారు?" గట్టిగా అడిగాడు దివ్యతేజ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS