అష్టావక్ర
__ యండమూరి వీరేంద్రనాథ్
అతడు-
తనలోని ఇరవైమూడు అంశాల్ని తీసుకుని-
తన పరిమాణంతో పోల్చుకుంటే, దానికి లక్షరెట్ల దూరాన్ని పయనించే లక్ష్యంతో-
వేగంగా ఆమెని చేరుకుంటున్నాడు.
ఆమె-
తనలో ఇరవై మూడు అందాల్ని నిక్షిప్తపరచి-
స్వాతి జల్లుకోసం ముత్యపుచిప్పలా వేచి వుంది.
రెండు ఇరవైమూడులు కలిసి ఒక సజీవాకృతి ధరించబోయే సమయాన-
పర్వతాంతర్భాగాల్లో, సముద్ర జలనిధి క్రింద, అడవుల్లో అట్టడుగున అలుముకున్న చెత్తచెదారం క్రింద, ఎండుటాకుల అడుగున, ఎక్కడో ఏ మూలో- ఎవరో బద్ధకంగా నిట్టూర్చిన ధ్వని.
ఎగురుతున్న పక్షులు కూడా తమ పయనాన్ని ఆపి క్రిందకి చూశాయి. గడ్డిపరకలు తింటున్న ఒక లేడిపిల్ల ఎవరో తరిమినట్టు పరుగుతీయటం ప్రారంభించింది. మందనుండి విడివడి దూరంగా వచ్చిన గొర్రెపిల్లని కనురెప్పపాటులో మింగి, బద్ధకంగా చెట్టుకు చుట్టుకుని పడుకున్న కొండచిలువ కూడా సుషుప్తావస్థ నుంచి ఎవరో లేపినట్టు హడావుడిగా లేచి మరింత పైకి వెళ్ళింది. ఒక్కసారిగా పక్షుల హడావుడి, ఉన్నట్లుండి కోతుల అలజడి- వీటితో అక్కడ అకస్మాత్తుగా సృష్టి చైతన్యవంతమయింది.
భూమి పొరల్లో ఎప్పుడో ఎక్కడో నిక్షిప్తమైపోయిన రెండు కళేబరాలు... ఒరిస్సాలో... బిస్తాలో...
ఎవరో కాస్త కదిపినట్టు ఒకేసారి కదిలినవా? భూమినుంచి పైకి పొడుచుకు వచ్చిన అరచేతులు... కాలగర్భంలో నుసి అయినవి- తిరిగి ఆకృతి ధరించినట్టు గాలిలో ఊగినవా? అనంతానంత విశ్వంలోంచి, శూన్యంలోంచి, గాలిపొరల అవతల్నుంచి వస్తూన్న తమ అధిపతికి ఆహ్వాన సూచకంగా చేతులు వూపినవా?
ప్రపంచమంతా ఏదో ఇబ్బందిగా లిప్తపాటూ అలజడి చెందిన క్షణం... కేవలం కొందరు మాత్రమే ఆనందంతో పైశాచిక నృత్యం జరిపిన క్షణం-
అంగుళంలో మూడు వందలో వంతు మాత్రమే వున్న అతడు- చిన్న తల, పెద్ద తోక వేసుకుని, చేప ఎదురీదినట్టూ ప్రవాహానికి కొన్ని వేల మైళ్ళు ఎదురీదుతూ, ఎదురొచ్చే ద్రవాలతో పోరాడి తన ఉనికి నిలుపుకుంటూ, ఆమెని చేరుకున్నాడు.
జైగోట్!
ఒక శుక్లకణం, ఒక బీజాన్ని వలయంలా చుట్టుముట్టి ఇరవై మూడుని ఇరవై మూడు జతలు చేసే సమయాన-
అదే సమయాన-
ఆ గర్భంలో నిక్షిప్తం అవటంకోసం- సుషుప్తిలోంచి నెమ్మదిగా కనులు విప్పింది-
కాష్మోరా!!!
ఆ పిండానికే ప్రారంభిస్తే- తొమ్మిది నెలల తరువాత పుడతాడు- ప్రపంచాన్ని ఏలటానికి, భీభత్సం సృష్టించటానికి, కాష్మోరా అంశగల...
అష్టావక్ర
భవిష్యత్తులో ఒకరోజు :
అరేబియా సముద్రపు కెరటాలు కొండ ఎత్తున లేచి వేగంగా వచ్చి తీరానికి కొట్టుకుని మధ్యకి విరుగుతున్నాయి. ఆ చప్పుడుకి భవనాలే కదిలిపోయేటట్టు వున్నాయి. మెరీన్ డ్రైవ్ మీద వెళుతూన్న కార్ల వాళ్ళకి సముద్రంవైపు చూడటానికి భయంగా వుంది. పది అడుగుల తరువాత సముద్రం మీద ఏముందో కనపడటంలేదు. ఆకాశం మీదనుంచి సముద్రం మీదకి తెల్లటి దారాలు వదులుతున్నట్టుంది వర్షం.
ఓషన్ వ్యూ నర్శింగ్ హోం.
బోంబేలోకెల్లా పెద్దదైన ఆస్పత్రి- మొదటి అంతస్థు.
మూసివున్న కిటికీ తలుపు సందుల్లోంచి బైట వాతావరణం లోపల పరిస్థితిని మరింత భీతావహం చేయటానికి ప్రయత్నం చేస్తూంది. ఉరిమిన చప్పుళ్ళు లోపలికి లీలగా వినపడుతున్నాయి. కరెంట్ పోయి చాలా సేపయింది. జనరేటర్ పనిచేస్తూంది.
భారతదేశపు అత్యుత్తమ గైనకాలజిస్టు డాక్టర్ (మిసెస్) పరాంజిపే నుదుట చెమట చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. దాదాపు అరగంట నుంచీ ఆవిడ తన శాయశక్తులా ప్రయత్నిస్తూ విఫలమవుతూంది. ఆమెకు సాయం చేస్తూన్న ఇద్దరు డాక్టర్లూ పానిక్ అవుతున్నారు.
డాక్టర్ పరాంజిపే ఇంజెక్షన్ తీసుకుంది. పక్కనున్న టీ.వీ. స్క్రీన్ మీద, రోగి కడుపులో శిశువు తాలూకు ఎక్స్-రే స్పష్టంగా కనిపిస్తూంది. శిశువుకాదు కవలలు. రెండు తలలు- రెండు శరీరాలు కనపడుతున్నాయి.
అందుకే ఈ కాన్పు కష్టమవుతుందని ఆమెకి ముందే తెలుసు. ఫలితంగా, ఏమీ కంగారుపడకుండా ఇంజెక్షన్ ఇవ్వటానికి ప్రయత్నించింది.
అంతలో ప్రతిమా అగర్వాల్ వున్నట్టుండి బాధ తగ్గిపోయి, హాయిగా రికాల్సయింది. అప్పటివరకూ వున్న అమితమైన నొప్పి అకస్మాత్తుగా పోయింది! కానీ అదే ప్రమాదం.
అనుభవజ్ఞులైన డాక్టర్ క్షణంలో జరిగిందేమిటో గ్రహించింది. గర్భంలో శిశువుని కుషన్ లా జాగ్రత్తగా కాపాడే ఉన్న నీటి సంచి పెంకులా పగిలిపోయి, శిశువు ఆ నీటితో సహా గర్భంనించి కడుపులోకి ప్రవేశించింది. దేన్నైతే పూర్వులు 'పిండం ఎగదట్టటం' అంటారో, ఏం జరిగితే మామూలు చోటైతే తల్లీ పిల్లల జీవితాలు అక్కడితో సమాప్తమయేవో ఆ ప్రమాదం జరిగింది. కానీ దేశంలో కెల్లా అధునాతనమైన ఆస్పత్రి అది! గైనకాలజీలో డాక్టర్ (మిసెస్) పరాంజిపేని మించినవారు లేరు.
క్షణంలో పేషెంట్ కడుపు కోయబడింది.
మిగతా ఇద్దరు డాక్టర్లూ తమ తమ విధులు నిర్వర్తించటం ప్రారంభించారు. ఒకరు గర్భసంచిని పూర్తిగా తీసేసి తల్లి ప్రాణం కాపాడే పనిలో నిమగ్నమయ్యారు. మరొకరు రక్తనాళాల్ని బంధించి స్రావాన్ని ఆపే చర్యలు మొదలుపెట్టారు. డాక్టర్ పరాంజిపే బిడ్డల సంరక్షణా భారాన్ని తీసుకుంది. చీల్చిన కడుపులోంచి బిడ్డల్ని బయటికి లాగబోయింది. అంతే!
ఆమెకి షాక్ తగిలినట్టయింది. అనుమానంగా టీవీ వైపు చూసింది. సైన్సు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. స్క్రీన్ మీద కేవలం ఎముకల ఆకృతి మాత్రమే కవలల్లా కనబడుతూంది.
కానీ కడుపులో ఇద్దరు పిల్లలు లేరు.
రెండు తలలు- నాలుగు చేతులు- నాలుగు కాళ్ళు-
అంత అనుభవజ్ఞురాలూ క్షణంపాటూ తటపటాయించింది. అంతలో తేరుకుని, గ్లవుస్ వేసుకున్న చేతుల్తో ఆ శరీరాన్ని బయటికి తీసింది.
కవలలు అయితే బ్రతుకుతారు. రెండు శరీరాలు అతుక్కుని పుట్టి బ్రతికిన సందర్భాలు కూడా అక్కడక్కడా వున్నాయి. కానీ వికృతాకృతిలో పెరిగిన పిండం మాత్రం బ్రతకదు. గర్భం నుంచి బయటపడిన ఒకటి రెండు క్షణాలు ఊపిరి పీల్చినా, వెంటనే మరణించటం ఖాయం.
అందువల్ల ఆమె శిశువుని బ్రతికించే ప్రయత్నం ఏమీ చేయలేదు. మామూలుగా శిశువు వైపు చూసింది.
చూసి ఉలిక్కిపడింది.
తన జీవితంలో ఎప్పుడూ ఆమె అంత భయపడలేదు.
శిశువు తాలూకు రెండు జతల కళ్ళూ ఆమెనే పరీక్షగా చూస్తున్నాయి. రెండు మొహాలు ఆమె హృదయపు లోతుల్ని గమనిస్తున్నట్టూ నిశ్చలంగా వున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డ అసలు కళ్ళు తెరిచి చూడటమే అపురూపం. అందులోనూ ఆ చూపు!! తను భ్రమపడుతున్నానేమో అనుకుని ఆమె తల విదిలించింది. ఆమె అవస్థ చూసి అన్నట్లు, ఆ రెండింటిలో ఒక మొహం చిరునవ్వుతో నెమ్మదిగా విచ్చుకుంది. రెండో మొహం మాత్రం ఆమెని అలాగే పరకాయించి చూస్తూంది. ఆమె పరిస్థితి చూసి మొదటి మొహంలో చిరునవ్వు మరింత ఎక్కువైంది.
ఆమె కెవ్వున కేక పెట్టాలనుకుంది. కానీ భయంతో బిర్ర బిగుసుకుపోయింది. ఆమె తన ముప్పైఏళ్ళ వైద్యవృత్తిలో గానీ, అరవైఏళ్ళ జీవితంలోగానీ అంత భయభ్రాంతురాలెప్పుడూ అవలేదు. మరో క్షణమయితే ఆమె ఏం చెయ్యబోయేదో తెలీదుకానీ, అంతలో ఆ తలలు రెండూ పక్కకి వాలిపోయాయి. ప్రాణం పోయింది.
ఇదంతా లిప్తమాత్రంలో జరిగింది. సిస్టర్స్ గానీ, పక్కనున్న డాక్టర్లుగానీ గమనించలేదు. అందరూ తల్లి ప్రాణాన్ని నిలబెట్టడంలో నిమగ్నమై వున్నారు.
మరో పది నిముషాలకి ఆపరేషన్ పూర్తయింది.
* * * *
అదే అరేబియా సముద్రపు మరో అంచున, దక్షిణాన....
ఎర్నాకులానికి పది కిలోమీటర్ల దూరాన- ఒక పల్లెలో- సముద్రం మీదనుంచి వచ్చే కెరటాల చప్పుళ్ళ మధ్య, పాకలో- ఓ నాటు మంత్రసాని పురుషు పోస్తూంది. శిశు దర్శనమై రెండు గంటలు కావొస్తుంది. అంతే అక్కడే ఆగిపోయింది. 'ముక్కు ముక్కు' అని గర్భిణీని బాధ పెడుతూందే తప్ప మంత్రసాని మరేమీ చేయటంలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. దానికేమీ క్వాలిఫికేషన్ లేదు. పది కాన్పులు పోసిన అనుభవం వుందంతే. బిడ్డ జారటానికి ఆముదం మాత్రం తెగ రాస్తోంది. ఎవరైనా ఇదేమిటని అడిగితే మలయాళీ గ్రామీణ యాసలో "మీ తాతల్నాటి నుంచీ ఇలాగే చేస్తున్నాను. ఇప్పుడొచ్చి నాకు చెపుతున్నావా?" అని తిడుతుంది. అటువంటి నర్స్ కూడా ప్రస్తుతం ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో పడిపోయింది. కడుపుమీద నొక్కి నొక్కి ఆమెని మరణానికి మరింత దగ్గిర చేసింది.
మరణానికి సరిగ్గా నిముషం ముందు ఆ గర్భిణీ స్త్రీకి మైకంనుంచి మెలకువ వచ్చింది. మరణం ఆసన్నమైందని కూడా తెలుసుకుంది. ఆమె ఒక కూలీ- పొలం పనులు చేసుకుంటూ వుంటుంది. మరణించేముందు తనకు తెలిసిన రహస్యాన్ని లోకానికి వెల్లడి చేద్దామనుకుంది. అతి భయంకరమైన ఆ సత్యం ఆమె నోటివెంట బయట పడివుంటే ఏమైవుండేదో? కానీ ఆ విషయం బయటపడటం తనకి యిష్టంలేదన్నట్లుగా ఒక పైశాచిక గణాధిపతి మోకాళ్ళమీద దీపం పక్కనే కూర్చుని 'ఉఫ్' మని ఊదినట్టు దీపం ఆరిపోయింది. దానితోపాటే ఆమె ప్రాణం కూడా పోయింది. అదే సమయానికి ప్రసవమయింది. చీకట్లో... ఆ కూలీ స్త్రీ ముసలి అత్త మరో దీపం పట్టుకొచ్చే లోపులో ఆ నాటు మంత్రసాని 'మాయచేరు'ని పట్టుకుని బయటకు లాగింది. మాయ పడకముందే బొడ్డుకొస్తే అది తల్లీ బిడ్డకు అపాయకరమన్న మూఢనమ్మకం ఆ మంత్రసానిది.
అంతలో ముసలావిడ దీపం తెచ్చింది. అప్పటికే మంత్రసాని బిడ్డ కదలకపోవడాన్ని గమనించింది. తన అనుమానం నిర్ధారణ చేసుకోవటం కోసం వంగి, భయంతో కీచుగా అరిచింది. శిశువుకి నుదుట ఒక కన్నే వుంది. ముక్కు లేదు. నోరు వుండవలసిన స్థానంలో చిన్న రంధ్రం వుంది. భూమ్మీద పడగానే ఆ శిశువు మరణించింది.
బొంబాయిలాటి పెద్ద ఊరు కాదు కాబట్టి క్షణాల్లో ఈ వార్త పల్లె అంతా పాకిపోయింది. జనం అంతా వచ్చి వింతగా చూశారు.
సాయంత్రానికి విషయం పాతబడింది. తల్లీ పిల్లల్ని ఆచారం ప్రకారం పాతిపెట్టారు.
అదే రోజు అర్ధరాత్రి దాటేక, ముసలి గొర్రెల కాపర్లలా వున్న ఇద్దరు వ్యక్తులు అడుగులోతు తిరిగి తవ్వి ఆ బిడ్డని బయటికి తీసి పరీక్షగా చూసేరు. మళ్ళీ మామూలుగా పాతిపెట్టేసి లేచి నిలబడ్డారు. నల్లటి కంబళ్ళు వాళ్ళ తలల్ని కప్పుతున్నాయి. చీకట్లో కలిసిపోయారు.
మరో అరగంటకి వాళ్ళున్న హెలికాప్టర్ బొంబాయివైపు సాగిపోతూంది.
దేశానికి ఇటో మూలా, అటో మూలా జరిగిన ఈ రెండు కాన్పులకి ఎ సంబంధమూ వూహించలేని ప్రపంచం గాఢనిద్రలో వుంది....
2
గులాబిరంగు ఫియట్ కారువచ్చి పోర్టికోలో ఆగింది. కారు ఆగీ ఆగగానే డ్రైవరే హడావుడిగా దిగి, వెనుక తలుపు తీసి నమ్రతగా నిలబడ్డాడు.
నెమ్మదిగా దిగింది కేదారగౌరి.
ఆ అమ్మాయి వయసు ఇరవై - ఇరవై రెండు మధ్య వుంటుంది. ఆ వయసులో చాలామందిలో వుండనీదీ కనపడనీదీ ఆమెలో వుంది కరుణ! ఆమె మొహం వర్షంపడి అప్పుడే మబ్బు విచ్చిన ఆకాశంలా వుంటుంది. వయసులో వున్న కుర్రవాళ్ళు- వాళ్ళెంత అల్లరి వాళ్ళయినా సరే- ఆ అమ్మాయిని చూడగానే ఇలాటి చెల్లెలుంటే ఎంత బావుణ్ణు అనుకుంటారు. కొంచెం వయసు మీరిన దంపతులైతే ఇలాంటి అమ్మాయి కూతురైతే ఇల్లు కళకళలాడుతుంది అనుకుంటారు. గాంభీర్యత వేరు- నిర్మలత వేరు- మొదటి దానిలో అహంభావం వుంటుంది. రెండో దానిలో నమ్రత వుంటుంది.
