చెంగల్వ పూదండ
-యండమూరి వీరేంద్రనాథ్
జైలు గంటలు పన్నెండుసార్లు మ్రోగినయ్.
"తిను" అన్నాడు జవాను.
పళ్ళెంలోకి చూసేను. అన్నం అనబడే ముద్ద గోధుమ రంగులో కనబడింది. కళ్ళనిండా నీళ్ళు నిలిచినయ్. అది గమనించినట్టున్నాడు అతను. జాలిగా నవ్వాడు.
"మొదట్లో అలాగే వుంటుంది. అలావాటు చేసుకోవాలి" అన్నాడు. ఆ మాత్రం ఆప్యాయతకే నాలో దుఃఖం పెల్లుబికి వచ్చింది. బిగపట్టి ఆపుకొన్నాను. అతనితో బ్రతిమాలించుకోవటం యిష్టంలేక వేళ్ళతో అన్నాన్ని కెలుకుతూ కూర్చున్నాను. జవాను దూరంగా వెళ్ళిపోయాడు. ముద్ద నోట్లోకి దిగటంలేదు. కిలుం పట్టిన ఆ పళ్ళెం చూస్తుంటే కడుపులో తిప్పుతోంది. తల్లీ తండ్రి లేనివాణ్నే కావచ్చు. కానీ చిన్నతనం నుంచీ కాయకష్టం చేయటం తెలిసినవాణ్ణేమో - శుభమైన తిండికీ, మంచి బట్టలకీ లోటు లేకపోయింది.
అప్రయత్నంగా నా బట్టలవైపు చూసుకొన్నాను. ఈ రోజే వేసుకోవటం వల్ల తెల్లగా వున్నాయి. మెడ దగ్గర గుండ్రంగా పట్టీ......కొంత కాలానికి ఈ బట్టలు నల్లబడిపోతాయి. బట్టల వెనకనుంచి - వాటి తెల్లదనంతో పోటీపడే ఈ శరీరం చల్లబడిపోతుంది.
పన్నెండు సంవత్సరాలు......
ఈ ఎత్తయిన జైలు గోడల మధ్య స్వాతంత్ర్యం అనే పదానికి అర్థం మర్చిపోయి పన్నెండు సంవత్సరాలు బ్రతకాలి......పన్నెండు సుదీర్ఘమైన సంవత్సరాలు......అప్పటికి అమ్మెలా వుంటుందో? పార్వతి ఏమవుతుందో?
ఇంకా తినటం ఆవలేదా?" ఉలిక్కిపడి తలేత్తాను. "తొందరగా తిను" అని హెచ్చరించి వెళ్ళిపోయేడు. కళ్ళు మూసుకుని తినటానికి ప్రయత్నం చేయసాగేను.
"పాపం చాలా అమాయకంగా వున్నాడు. ఎలా వుంటాడో యిక్కడ!" అని దూరం నుంచి జవాను అనటం వినిపించింది. పార్వతీ సరిగ్గా యిలానే అంది.
"నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా?"
"ఏమనిపిస్తుంది?"
"ఏ రాజభవనం నుంచో ఇప్పుడే, ఇక్కడికి వచ్చావేమో అనిపిస్తుంది!"
"అవును వచ్చేను, నిన్ను తీసుకెళ్ళటం కోసం-"
"ఎక్కడికి?"
అవును! ఎక్కడికి తీసుకు వెళ్ళగలను? ఎవరున్నారు నాకు? చిన్నతనం నుంచీ కళ్ళల్లో పెట్టుకు సాకిన అమ్మ తప్ప.
పార్వతి తెలివైంది. నా మనసులోని ఆలోచన్లన్నీ ఇట్టే కనిపెట్టేసేది.
"మనవేఁ పోనీ ఓ ఇల్లు కట్టుకొందాం - సరేనా?"
నవ్వేవాణ్ణి. "ఓ, అలాగే కట్టుకొందాం. నేనే అడవికి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన కర్ర కొట్టుకోస్తాను. అదిగాక నేను సంపాదించింది,ఓ రెండు వేలున్నాయి."
"నాన్నో రెండు వేలిస్తాడు."
"చా" అసహ్యంగా మొహం పెట్టి "మీ నాన్న డబ్బు మనకెందుకు? అంతగా కావాలంటే ఇంకో రెండువేలు సంపాదిస్తాను-" అనేవాణ్ని.
"ఎలా?"
"అడవికెళ్ళి తేనెపట్టు పడతాను."
నవ్వేది. "అంత డబ్బు ఎప్పుడు జమ అయ్యేను గనుక?"
నాకు ఉక్రోషం వచ్చేది. "నా మీద నమ్మకం లేదా?"
గుండెల మీద వాలి "నీ మీద పెట్టుకోకపోతే నమ్మకం ఇంకెవరిమీద పెట్టుకోను?" అనేది కళ్ళు మూసుకొని.
వెన్నెల రాత్రుల్లో పల్లెనానుకొని కొండా, కొండపక్క నుంచి పారే సన్నట్టి సెలయేరూ అన్నీ మావే. ఏటి పక్కన ఇసుక తిన్నెల మీద వెల్లకితలా పడుకొని నిర్మలాకాశం వైపు చూస్తూ, నక్షత్రాలు లెక్క పెట్టే వాళ్ళం. లెక్కయిద్దరిదీ ఎప్పుడు సరిపోయేదికాదు. అడవిలో అపురూపంగా దొరికే పాల వెన్నెల పూలను తెచ్చి యిచ్చేవాణ్ని.
"ఇన్ని పూలెక్కడివి?"
"ఏరి తెచ్చాను."
"ఇన్ని పూలే-"
"నీకేం తెలుసు, వీటి కోసం ఎంత కష్టపడ్డానో."
"ఎందుకో?"
"నీ కోసం-"
"పని చెయ్యటం మానేసి ఇలా పూలు ఏరుతున్నావని మీ అమ్మతో చెపుతానుండు."
"చెప్పుకో, నాకేం భయమా-" ఇద్దరం అమ్మ దగ్గరకి వెళ్ళే వాళ్ళం. ఆమెప్పుడూ పార్వతి పక్షం. అయితేనేం- నాకు తెలుసు, అమ్మ నన్నెంతగా ప్రేమిస్తుందో. చిన్న పిల్లాడిలా ఆమె ఒళ్ళో తల దాచుకొనే వాణ్ణి. నా జుట్టులోకి వ్రేళ్ళు పోనిచ్చి దువ్వుతూ 'ఒరేయ్ కృష్ణా! నిన్ను కన్నదెవరోగాని ఆమె చాలా అదృష్టవంతురాల్రా.'
నేను మాట్లాడకుండా మౌనంగా వుండిపోయేవాణ్ని. నాకు నా కథ అంటే చాలా యిష్టం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరేది కాదు. మళ్ళీ మళ్ళీ చెప్పమని వేధించేవాణ్ని.
"అప్పుడేమయింది-"
"పాపం ఏడుపు వినిపించింది-"
"తర్వాత-"
"ఆయన వెతికేరుట. పొదలో నువ్వు కనిపించావు దూరంగా విరిగిపోయిన పల్లకీ, చిన్నపోట్లాట జరిగిన గుర్తులూ కనిపించేయి. ఇప్పుడంటే కొద్దిగా తగ్గినయ్ కాని, ఆ రోజుల్లో బందిపోట్లు విచ్చలవిడిగా సంచరించేవారు."
నాలో ఉత్సుకత పెరిగేది.
ఆ జ్ఞాపకల్తో ఆమె మౌనంగా వుండిపోతే "చెప్పమ్మా-" అని బ్రతిమాలేవాణ్ని.
"ఎవరన్నా కనబడతరేమోనని ఆయన చాలాసేపు వెతికేరుట. దొంగలూ లేరు, పల్లకి తాలూకువాళ్ళూ లేరు. ఆయన నిన్ను తీసుకొచ్చేసేరు. అప్పుడు నువ్వెలా వుండేవాడివో తెలుసా? దబ్బపండులా వుండేవాడివి. ఆ వయసులో కూడా రాజఠీవి నీలో కనబడుతూ వుండేది. ఎవరో గొప్ప రాజవంశానికి చెందినవాళ్ళు నిన్ను పారేసుకొన్నారని అనుకునే వాళ్ళందరూ-"
అప్పటివరకూ శ్రద్ధగా వినేదల్లా కిసుక్కున నవ్వేది పార్వతి. "అలా ఎందుకనుకోవాలి? ఆ దొంగలే పారేసుకొన్నారని ఎందుకనుకోకూడదు?" అని కవ్వించేది. నా మొహం కోపంతో ఎర్రబారేది. చెవి మెలిపెట్టబోతే అమ్మ వారించేది.
"వీడు రాచబిడ్డేనమ్మా! చూడు, యెంత ఆపని చేసినా సుకుమారం పోని ఆ బుగ్గలు చూడు" పార్వతి నవ్వేది చిలిపిగా. సిగ్గుతో తల వంచుకొనేవాడిని.
అమ్మ మాటలు నిజం. ఎంత పనిచేసినా, ఎంత ఎండలో కాయ కష్టం చేసినా ఈ సుకుమారత్వం, లాలిత్వం నన్ను వదలిపోయేవి కావు. బహుశా నన్ను కన్నతల్లి ఎండకన్నెరుగకుండా అంతఃపురాంతర్భాగంలో పెరిగిన లావణ్యవతియై వుండాలి.
"నా చెక్కిళ్ళకన్నా నీవే సున్నితంగా వున్నాయి" అనేది పార్వతి ఈర్ష్యతో నవ్వుతూ వెక్కిరించేవాడ్ని. ఉడుక్కునేది.
"ఆడపిల్లలా వున్నావు. నేను నిన్ను చేసుకోను. పో!"
ఈ ఊళ్ళో ఏ మొగాణ్ణయినా రమ్మను. పందెం."
"ఆ బలం గురించి కాదు నేను చెప్పేది."
"ఇంకోదాని గురించి అయితే, యే ఆడపిల్లనన్నా రమ్మను."
"ఛప్" పరుగెత్తి వెళ్ళిపోయేది.
ఆ రోజులు రావు. అవును, ఎలా వస్తాయి? పన్నెండు సంవత్సరాలు! అధికారులు జాలి తల్చి తగ్గిస్తే కొద్దిగా శిక్ష తగ్గించవచ్చు.
జవాబు వచ్చి 'లే' అన్నాడు. లేచి పళ్ళెం కడిగి పెట్టి, గదిలోకి వచ్చేను. వెనుక తాళం వేసిన చప్పుడు వినిపించింది. పైనున్న చిన్న కిటికీలోంచి సన్నగా వెలుతురు పడుతోంది. గదంతా అదో విధమైన వాసనలతో నిండి వుంది. ఈ పరిస్థితులకి ఇమడలేకపోతున్నాను.
"రేపటి నుంచి నువ్వూ పనికి వెళ్ళవలసి వుంటుంది" కటకటాల అవతల్నుంచి అన్నాడు సెంట్రీ.
తలూపేను. అదే బావుంటుంది. ఈ గది నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
"నిన్ను చూస్తూంటే జాలేస్తుంది" అన్నాడు అతడు అవతల్నుంచి. మాట్లాడలేడు నేను.
"ఇంత అమాయకంగా కనబడేవాడివి, హత్య చేసేవంటే నమ్మ లేకుండా వున్నాను."
'లేదు! నేను చెయ్యలేదు-' అని అరుద్డామనిపించింది. కానీ నాలో యిక సత్తువలేదు - కోర్టులో అరిచీ అరిచీ బలం తగ్గిపోయింది. ఓపికలేదు. సెంట్రీ నా జవాబు కోసం చూడలేదు. బీడీ వెలిగించుకొంటూ చెప్పేడు.
"ఈ గదిలో నువ్వు కాక ఇంకో ముగ్గురున్నారు. వాళ్ళు సాయంత్రం ఆరింటింకి వస్తారు. మనుష్యుల నెత్తురు తాగే పచ్చి కసాయివాళ్ళు. ఈ జైలు గోడల మధ్య ఎన్ని సంవత్సరాల నుంచి వుంటున్నారో వాళ్ళకే తెలీదు. దాదాపు పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు వాళ్ళ అరుపుల్తో, కేకల్తో జైలు దద్దిరిల్లిపోతూ వుంటుంది. వాళ్ళకి జైలరన్నా లెక్కలేదు- భయపడకు వాళ్ళని చూసి-"
నవ్వొచ్చింది. ఎందుకు నాకు భయం? జరగవలసిన అన్యాయం ఎలాగూ జరిగిపోయింది - ఇంకా ఎం జరుగుతుందని భయం వుండాలి?
నా మౌనాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకో. ఏం చెప్తే అది చెయ్యి. నేనూ చెప్తాన్లే వాళ్ళకి" అన్నాడు.
జైలుకు ఎవరన్నా కొత్తగా వస్తే పాతవాళ్ళు యెలా ప్రవర్తిస్తారో నాక తెలుసు. అందులోనూ వచ్చినవాడు కొంచెం అమాయకంగా కనిపిస్తే మరీ పెట్రేగిపోతారు. వచ్చినవాడు బయట ప్రపంచపు మనిషి. ఆ ప్రపంచం మీద వున్న కసి అంతా అతడి మీద తీర్చుకోవాలి. అదే వాళ్ళ ధ్యేయం కానీ పాతబడ్డాక, వాళ్ళల్లో వున్న ఐక్యత ఇంకెవర్లోనూ వుండదనిపిస్తుంది. వాళ్ళ గురించి అతడు వివరించేడు, 'ఒకడు మూడు హత్యలు చేసినవాడు, ఇంకొకడు పచ్చి రౌడి, మూడోవాడు భార్యమీద అనుమానంతో గొడ్డలితో నరికి చంపేశాడట' -నా వళ్ళు జలదరించింది.
సెంట్రీ ఏదో చెబుతున్నాడు. వినటంలేదు నేను. నా ఆలోచనలన్నీ పార్వతి చుట్టే తిరుగుతున్నాయి.
ఎలా వుందో?
చివరి క్షణం వరకూ ఆమెని చూడాలని మనసు తహతహలాడింది. జడ్జీ శిక్ష విధించినపుడు కూడా నేను బాధపడలేదు. శిక్ష పడుతుందని తెలుసు. అంత పకడ్బందీగా వుంది సాక్ష్యం. నా వ్యధంతా పార్వతి కనిపించకపోవటం గురించే.
ఏమయింది?
కోర్టులో వాద ప్రతివాదనలు జరిగేటప్పుడు నా కళ్ళు ఆశగా చుట్టూ వెతికేవి. ఎక్కడా కనిపించలేదు. కనీసం అమ్మ..... అమ్మ కూడా కనిపించలేదు. కన్న మమకారం కన్నా పెంచిన మమకారం గొప్పదంటారు. అలాటిది అందరూ కూడబలుక్కున్నట్టు ఎందుకు నన్ను ఒంటరివాడ్ని చేశారు?
ఈ ఊహల్తో యెప్పుడు నిద్రలోకి జారుకొన్నానో తెలీదు. హఠాత్తుగా పెద్ద పెద్ద కేకలూ, రణగొణ ధ్వనీ వినిపించేసరికి మెలకువ వచ్చింది.
గదంతా చీకటిగా వుంది. శీతాకాలం అవటంవల్ల తొందరగా చీకటి పడింది.
జైలు తలుపు తీసిన శబ్దం వినిపించింది. ముగ్గురూ లోపలి వచ్చేరు. ఒకడు ఎలుగెత్తి బూతుపాట పాడుతున్నాడు. మిగతా యిద్దరూ నోటితో తాళం వేస్తున్నట్టు అరుస్తున్నారు. చీకట్లో వుండటంవల్ల వాళ్ళు నన్ను గమనించలేదనుకుంటాను. వాళ్ళలో వాళ్ళే యేదో మాట్లాడుకొంటున్నారు.
