Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం


    'నా భార్య మంచం పట్టింది. నా కిక వేరే దారిలేదు. దయచేసి నా బిల్ త్వరగా పాసయేటట్లు చూడు. దానికి వైద్యం చేయించి బ్రతికించుకుంటాను' అని వేడుకున్న మనిషి దగ్గరా డబ్బు గుంజాను. నోరెత్తి ఒక్కమాట మాట్లాడకపోయినా కళ్ళనిండా దైన్యం నింపుకుని చూపులతోటే అర్థించినవ్యక్తి దగ్గరా డబ్బు పుచ్చుకున్నాను. అప్పుడు నాలో మానవత్వం ఏమయిపోయింది? ప్రతిరోజు ఉదయం అరగంటైనా పూజ చేసేవాడిని. దైవం ఎదురుగా కూర్చునప్పుడయినా నేను చేసిన తప్పులు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోయాను? లంచం తీసుకున్న డబ్బుతో పూజాద్రవ్యాలు కొనేప్పుడయినా అది పాపం అని ఎందుకు కనిపించలేదు? నేను దేముడిమీద వేసినవి పూలుకాదు. బురద చల్లాను. భక్తి అనే పన్నీరు కలిపిన బురద చల్లి పొంగిపోయాను. కళ్ళుండి గుడ్డివాడినయ్యాను. మనసుండీ రాక్షసుడినయ్యాను.

    రెండు నెలలు శెలవు పొడిగించి దేశమంతా తిరిగాను. అన్ని గుడులకి వెళ్ళేవాడిని. పూజ చేసేవాడిని కాదు. అక్కడికి వచ్చే భక్తులని గమనిస్తుండేవాడిని. చాలామంది భక్తిలో నిజాయితీ లేదు. గుడికి ఎందుకు వస్తున్నారో, ఆ పూజలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. అదికూడా ఒక రొటీన్ గా చేస్తుంటారు. అదొక మానసిక తృప్తి అంతే. గుడిలో ఆడవాళ్ళ మీదపడి వినోదించే వాళ్ళు కొందరు. అవకాశం దొరికితే దేవుడి సమక్షంలోనే దొంగతనం చెయ్యడానికి కూడా వెరవని వాళ్ళు మరికొందరు. అవన్నీ చూస్తుంటే రక్తం మరిగినట్లయ్యేది.

    హైదరాబాద్ తిరిగివచ్చాను. ఉద్యోగంలో జాయినయ్యాను. ఆనాటినుంచి ఆ రోజువరకు అన్యాయంగా ఒక్క పైసాకూడా ఎవ్వరి దగ్గరా తీసుకోలేదు. కాని నా కళ్ళ ఎదురుగా జరిగే అన్యాయాలని అరికట్టే శక్తినాకు లేకపోయింది. కారణం వాళ్ళ ఎదురుగానే నేనిన్నాళ్ళూ తప్పుచేశాను. తప్పు చేయవద్దనే నీతులు చెప్పే అర్హత పోగొట్టుకున్నాను" ఆగాను.

    "మీ అనుమానాన్ని తీర్చే మార్గం మరేది కనిపించలేదంటారా?" అడిగింది అనుపమ.

    "ఒకప్పుడు సందేహినివృత్తి చేసేవాళ్ళు గురువులు. ఆ ఉద్దేశ్యంతో కొన్ని ఉపన్యాసాలకు వెళ్ళాను. కాని నేను పుస్తకాల ద్వారా తెలుసుకున్నది తప్ప వాళ్ళు కొత్తగా చెపుతున్నదేమీ లేదనిపించింది. కొందరు ప్రజల్ని మరీ చెడు మార్గంలోకి మళ్ళించే బోధలు చేస్తున్నారనిపించింది. వాళ్ళు చెప్పేదెలా వుంటుందంటే 'తప్పు చేయడం మానవ సహజం. కోరికల్ని అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాదు. కాని దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచిది. భగవద్గీత మొదటి అధ్యాయం ఉపాసన చెయ్యి. నీ పాపాలన్నీ పోతాయి. మరో అధ్యాయం చదువు. కావలసిన సిరులన్నీ లభిస్తాయి. రకరకాలుగా దేవుడిని స్తుతించు, పూజించు, భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఈ రకమైన ఉపదేశాలు మనిషి నైతిక ప్రవర్తనమీద మంచి ప్రభావం చూపించవు. హరిశ్చంద్రుడి కథ వింటే 'ఎన్ని కష్టాలయినా ఓర్చి సత్యమే చెప్పాలి' అనుకోడు. 'సత్యాన్ని ఆచరించాలంటే చాలా కష్టాలు పడాలి' అనే భావాన్ని మనసులో నిలుపుకుంటాడు. అలాంటి నెగటివ్ అప్రోచ్ కాకుండా డైరక్టుగా 'తప్పు చెయ్యడమే తప్పు. దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు' అని గట్టిగా చెప్పగలిగితే ప్రయోజనం వుంటుంది."

    "మీరన్నది నిజమే. కొంతమంది బాబాలకు, స్వామీజీలకు చాలా పెద్ద భక్త బృందాలున్నాయి. అందులో చాలామంది ఉన్నతాధికారులు, వ్యాపారస్థులు, రాజకీయ నాయకులు. అంతెందుకు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా వున్నారు. అలాంటి బాబాలని 'కొల్లేటి సరస్సుని పెట్రోలుగా మార్చమని, కోటప్పకొండని బంగారంగా మార్చమని' అడుగుతుంటారు విమర్శకులు. కాని నన్నడిగితే అలాంటి మాయలు కాదు వాళ్ళని చెయ్యమని ఆడగాల్సింది. నీ దగ్గరకు వచ్చే భక్తబృందాన్ని తమ అధికారంతో దేశంలో అవినీతిని అరికట్టించమని, నీతిగా, నిజాయితీగా దేశాన్ని అభివృద్ధిలోకి తేవడానికి కృషి చెయ్యమని. ముఖ్యంగా రాజకీయ రంగంలోని అరాచకాలను పూర్తిగా అణచివెయ్యమని గట్టిగా శాసించమని అడగాలి. ఆ బాబాలను దేవుడిగా పూజించే ఈ అధికార్లు, ఆయన మాటను వేదవాక్కుగా భావించే లక్షలాది ప్రజలు అప్పుడయినా తమ ప్రవర్తనని మార్చుకుంటారు. లంచాలు పట్టడం, అక్రమ కృత్యాలకు పాల్పడడం, దేశసంపదను ఇష్టం వచ్చినట్లుగా కొల్లగొట్టి పంచుకోవడం, అధికార దాహం అన్నీ తగ్గించుకుంటారు" అంది అనుపమ.

    "అప్పుడు వాళ్ళకింత ఫాలోయింగ్ వుండదు. ఈ స్వామీజీలకు, బాబాలకు కావలసింది కేవలం డబ్బు కాదు. తమని అందరూ భగవంతుడిగా గుర్తించడం కావాలి."

    "పుస్తకాలు చదివి మనిషి చాలా నేర్చుకుంటాడు. పుస్తకాలు చదువుతూ, ప్రపంచాన్ని దానితో అన్వయించుకుని కాస్త జ్ఞానాన్ని సమకూర్చుకుంటాడు. కాని, స్వీయానుభవంతో తర్కాన్ని జోడించి, ఆలోచించినప్పుడు జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞానమే అతడిని మనిషిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. కాని ఈనాటి మనిషి పూర్తిగా యంత్రమై పోతున్నాడు. గతాన్ని, గతం నేర్పిన పాఠాలను పక్కకు నెట్టేసి తాత్కాలిక సుఖాలకోసం అర్రులు చాస్తూ స్వార్ధపూరితుడవుతున్నాడు. దైవాన్ని కూడా వ్యాపార వస్తువుగా మార్చేస్తున్నాడు." అంది అనుపమ బాధగా.

    "మీరన్నది చాలా నిజం. నా చిన్నతనంలో వినేవాడిని. తిరుపతిలో ఎక్కడైనా పావలా దొరికినా జేబులో వేసుకున్నవాడిని దైవం శిక్షిస్తాడని, అది హుండీలో వేసేవరకు వూరుకోడనీ చెప్పేవారు. ఎవరికేం దొరికినా భక్తిగా తీసుకెళ్ళి హుండీలో వేసి వచ్చేవారు. ఈ రోజున హుండీల్లో డబ్బు లెక్కపెట్టేవారే ఆ ధనాన్ని దొంగతనం చేస్తున్నారు. వాళ్ళని గమనించడానికి క్లోజ్ డ్ సర్క్యూట్ టీవీలు పెట్టవలసివస్తోంది. ఆ నిధులు మరిన్ని రకాలుగా దుర్వినియోగం అవుతున్నాయో ఆ భగవంతుడికే తెలియాలి. ఆ కుబేరుడి అప్పు తీరిందో లేదోగాని ఆ డబ్బుతో ఎంతమంది కుబేరులై పోతున్నారో మరి."

    అనుపమ కూడా ఆలోచనలో పడింది. ఇక ఈ సంభాషణకి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిదనిపించింది. మొన్నటివరకూ ఆమె ఎవరో నాకు తెలియదు. ఈ రోజు ఎంతో ఆత్మీయురాలై పోయింది. ఇద్దరు వ్యక్తులమధ్య స్నేహం పెరగడానికి, నెలలు, సంవత్సరాలు పరిచయం అవసరం లేదు. మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఒక గంటైనా చాలు.

    నా మనసిప్పుడు తెరిపిన పడింది. నేను ఒంటరినన్న భావం ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. నాకెంతో తృప్తిగా వుంది. నా ఆలోచన గ్రహించినట్లుగా-

    "కాసేపు విశ్రాంతి తీసుకోండి. భోజనానికి ఏర్పాట్లు చేసి వస్తాను" చెప్పి లోపలకు వెళ్ళిపోయింది అనుపమ. వద్దని వారించలేదు. సోఫాలోనే పడుకుని కళ్ళు మూసుకున్నాను.

    ఆ రాత్రి డైరీలో ఒక వాక్యం వ్రాసుకున్నాను.

    "నేనీ రోజు ద్విజుడినయ్యాను" అని.


                 *    *    *    *


    కారు దిగి తలెత్తి చూశాను. చాలా పెద్ద బిల్డింగు అది. చాలా ఆఫీసులున్న పెద్ద కాంప్లెక్సు. అనుపమ కారు తాళంవేసి వచ్చింది. ఇద్దరం లోపలకు వెళ్ళాం. లోపల 'సహాయ' అన్న ఆఫీసు ముందాగింది అనుపమ.

    "ఇదే నేను పనిచేసే ఆఫీసు. రండి" లోపలకు దారితీసింది. చాలా పెద్ద హాలది. ప్రశాంతంగా వుంది. గోడమీద చక్కటి సీనరీలు. ఒక పక్క విజిటర్సు కూర్చోవటానికి సోఫాలున్నాయి.

    పేపర్లో ఎడ్వర్టయిజ్ మెంట్ చూశానుగాని ఎన్నడూ దీని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. 'సహాయ' ఎంత మంచి పేరు, ఏ రకమైన సహాయం చేస్తారు వీళ్ళు.

    "ఇలా రండి" ఒక గదిలోకి తీసుకెళ్ళింది అనుపమ.

    ఒక టేబులు, దానిమీద టెలిఫోన్ వుంది. రెండు సోఫాలున్నాయి. చెరో సోఫాలో కూర్చున్నాం.

    "ఇక్కడ నేను రోజుకు రెండు గంటలు పనిచేస్తాను" అంది.

    "ఏం చేస్తారిక్కడ?" అడిగాను.

    "సమస్యలతో సతమతమవుతూ, చెప్పుకోవడానికి ఎవరూ లేక బాధపడే అసహాయులకి చేయూతనిస్తాం. మానసికంగా వాళ్ళకు శాంతి కలిగేలా ప్రయత్నిస్తాం. వాళ్ళ సమస్యలు వింటాం. సలహాలిస్తాం" అంది.

    "చాలా మంది వస్తుంటారా?"

    "మరీ ఎక్కువ రారు. ఇంకా ప్రజలకు బాగా అలవాటు కాలేదు. కాకపోతే టెలిఫోన్ సౌకర్యం వుంది. చాలామంది ఫోన్ చేస్తారు. వాళ్ళ వివరాలేవీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ లోనే వాళ్ళ సమస్య వింటాం. మానసిక వూరట కలిగిస్తాం. ముఖ్యంగా జీవితంలో దెబ్బతిని, ఏం చేయాలో తోచక చెప్పుకునేవారు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళకు జీవితం మీద ఆశ పుట్టించాలన్నది మా సంస్థ ముఖ్యోద్దేశం."

    "ఎవరికింత చక్కటి ఆలోచన వచ్చింది?"

    "మనిషికి స్నేహరాహిత్యం ఎంత పెద్ద శాపమో అర్ధం చేసుకున్న ఒక మహనీయుడు స్థాపించిన సంస్థ. బంధువులు, స్నేహితులు వున్నా కొన్ని సందర్భాల్లో తమ సమస్యలను వాళ్ళకు చెప్పలేక పోవచ్చు. అప్పుడా వ్యక్తి తనలో తాను బాధపడి, ఏకాకిగా ఫీలవుతాడు. అలాంటప్పుడు ఇక్కడికి రావడమో, ఫోన్ చెయ్యడమో చేస్తారు. నాలాంటి వాళ్ళం ఇక్కడ వాలంటరీగా సర్వీస్ చేస్తాం. అవతల వాళ్ళ గురించి ఏ వివరమూ అడగం. ఇష్టం అయితే వాళ్ళే చెప్తారు. అలా మాట్లాడాక, ఒకరితో మనసువిప్పి చెప్పుకున్నాక ఓదార్పుతో ఉపశమనం పొందుతారు."

    "ఒకరకమైన మానసిక చికిత్సాలయం అన్నమాట."

    "అవును! కాని ఇక్కడుండేది డాక్టర్లు కాదు. అవసరమైతే వచ్చి ఉచిత సేవచేసే డాక్టర్లు మెంబర్లుగా వున్నారనుకోండి. మీరెప్పుడూ ఈ సంస్థ పేరు వినలేదనుకుంటాను. వింటే ఏనాడో ఫోన్ చేసేవారు."

    "పేపర్లో ప్రకటన చేశాను. కాని నాదొక సమస్యలా అనిపించలేదు. ఏమని చెప్పుకోను? నా ఆలోచనలని ఎవరయినా అర్ధం చేసుకుంటారా అని అనుమానం. కుటుంబ కష్టాలను, ఆర్ధికంగా ఇబ్బందులను అర్ధం చేసుకున్నట్లుగా దైవాన్ని గురించి, దైవభక్తి గురించి చర్చించేవాళ్ళు తక్కువగదా! చాలామంది దృష్టిలో 'దైవం' అంటే తర్కానికి అతీతుడని, భక్తి అనేది రక్తంలో ప్రవహించే సుగుణమనీ నమ్మకం. అది అంతర్లీనంగా మనిషి జీవితంలో భాగాలయిపోయాయి తప్ప వాటి పరమార్ధం ఏమిటో ఆలోచించే అవసరం కనిపించదు. అందుకే ఈ విషయం ఎవరితో చర్చించాలన్నా సంకోచించేవాడిని."

    "మీరు మా స్నేహబృందాన్ని కలవలేదు కాబట్టి అలా భావించారు. పూర్తిగా కాకపోయినా చాలామందిలో ఆలోచన మొదలయింది. మా బృందాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హేతువాదులు, ఆస్తికులు, నాస్తికులు అందరూ వున్నారు. చర్చలతో కొన్ని గంటలు గడిపేస్తాం. ఆ రకమైన చర్చలవల్ల మానసిక చైతన్యం కలుగుతుందని మా ఉద్దేశ్యం. ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించాలన్న నియమం లేదు. ఎంత వాదించుకున్నా, పోట్లాడుకున్నా అది ఆ చర్చలవరకే."

    "అయితే మీ వాళ్ళను తప్పకుండా కలవాలి" అన్నాను.

    ఫోన్ మ్రోగింది. అనుపమ రిసీవర్ అందుకుని స్నేహపూరిత స్వరంతో మాట్లాడుతోంది. నేను లేచి బయటకు వచ్చాను.

    ఇన్నాళ్ళూ నేనెంత అజ్ఞానంలో బ్రతికానో తలుచుకుంటే బాధగా అనిపించ సాగింది. నేనేమిటి చాలామంది ఇలాంటివేమీ పట్టించుకోరు. జీవితం అతి సాధారణంగా గడిపేస్తారు. రానురాను మనిషి జీవితపు పరిధి సంకుచితమై పోతోంది. తను, తన కుటుంబం వారి వినోదం, సుఖజీవనానికి కావలసిన డబ్బు ఏ రకంగా పొందాలో అది తప్ప సామాజిక బాధ్యత కొరవడుతోంది. ఇలాంటి రోజుల్లో స్వంత కుటుంబంలో వ్యక్తుల కష్టాలనే వినడానికి ఇష్టపడని వ్యక్తులున్న ఈ సమాజంలో ఎవరో తెలియని అపరిచితుల బాధలని పంచుకోవడానికి ముందుకు వస్తున్న వీళ్ళెంత పుణ్యాత్ములు! అందరి గుండెలు కొట్టుకుంటాయి. కాని కొందరి హృదయాలే స్పందించగలవు. స్పందించే గుండె వున్న మనిషికి తరతమభేదం వుండదు. ఏదో చేయాలన్న తపనతో అలమటించిపోతారు. అదొక రకమైన ఆకలి దొరికిందేదో తిని తృప్తిపడే ఆకలి కాదది. పదిమందిలోకి చొచ్చుకుపోయి వాళ్ళ బాధల్ని, కష్టాలని తనవిగా చేసుకుని, వాళ్ళకు మనశ్శాంతినిస్తేగాని తీరని ఆకలి అది. చాలా తక్కువమందిలో కలిగే ఆరాటం అది.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More