Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం


    ఈ ఆలోచన వచ్చాక మనసు ఊరటపడింది. నా భవిష్యత్ బాటలో వెలుగురేఖలు విచ్చుకోవటం మొదలయింది.

    అనుపమ డ్యూటీ ముగించుకుని రాగానే అక్కడనించి రాధాకృష్ణ హోంకి వెళ్ళాం. అక్కడ పిల్లల్ని చూస్తుంటే వర్ణించలేని బాధ. ఎక్కడి వాళ్ళీ పిల్లలు? ఎవరి పిల్లలు? ఎందుకిలా అనాధల్లా పెరగాల్సిన అవసరం వచ్చింది? ఎక్కువమంది ఆడపిల్లలే. ఏడాదినించి పదిహేనేళ్ళవరకు వుంటారు. నేనెవరో తెలియకపోయినా అందరూ వినయంగా నమస్కరించారు. అడిగిన ప్రశ్నలకు నమ్రతగా సమాధానం చెప్పారు.

    అనాధశ్రమాల్లో పిల్లలంటే బలహీనంగా, ఈసురోమంటూ వుంటారని నాకో నమ్మకం. కానీ వీళ్ళు అలా లేరు. పిల్లలు ఆరోగ్యంగానే వున్నారు. చదువుకుంటున్నారట. పెద్ద పిల్లలు పదోతరగతి పరీక్షలు వ్రాయబోతున్నారట. వాళ్ళనలా చూస్తుంటే నేను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది.

    కనీసం ఒక్క పాపనయినా దత్తు చేసుకుని పోషించి వుంటే ఎంత బావుండేది. ఎంత మానసిక తృప్తి లభించేది.

    అనుపమ కోసం చూశాను. అకౌంట్స్ చూస్తూ, అక్కడి వాళ్ళతో మాట్లాడుతూ బిజీగా వుంది. అక్కడ ఆయాని అడిగాను. వచ్చినప్పుడల్లా రెండు మూడు గంటలసేపుండి అన్నీ చూసుకుంటుందట. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వచ్చాను. జేబులో చూసుకుంటే నాలుగు వందల చిల్లర కనిపించింది. బిస్కట్లు, చాక్ లెట్లూ, పళ్ళు తీసుకున్నాను. తిరిగి వచ్చేసరికి అనుపమ పనింకా పూర్తికాలేదు. నేను వెళ్ళి పిల్లలకు అన్నీ పంచిపెట్టాను. ఆ చిన్ని కళ్ళలో ఎంత కృతజ్ఞత, సిగ్గుపడుతూ తీసుకుని 'థాంక్స్ అంకుల్' అంటుంటే, కళ్ళు చెమర్చాయి. ఎవరూ వెంటనే తినలేదు.

    పెద్ద పిల్లలు చిన్నవాళ్ళందర్నీ వరుసగా కూర్చోపెట్టారు. అందరూ కలసి ప్రార్ధన చేసి, మరోసారి నాకు థాంక్స్ చెప్పి తర్వాతనే నోట్లో పెట్టుకున్నారు. అనుపమ వచ్చేవరకు వాళ్ళతో కబుర్లు చెపుతూ గడిపాను. వాళ్ళ గురించి వింటుంటే గుండెల్ని పిండేసే బాధ. కొందరు చెత్తకుండీల్లో దొరికారట. కొందర్ని తల్లీ తండ్రీ లేనివాళ్ళని చెప్పి స్వంత తల్లిదండ్రులే తీసుకొచ్చి వదిలేసి పోతారట. మరికొందర్ని ఎక్కడెక్కడో వదిలేసిపోతే పోలీసులు తీసుకొచ్చి వదిలి వెళతారట.

    పిల్లలు లేనివాళ్ళు వచ్చి కాస్త చక్కగా వున్న పిల్లల్ని పెంచుకోవడానికి తీసుకెళతారట.

    అనుపమ వచ్చేసరికి పిల్లలతో బాగా కలిసిపోయాను. నన్ను చూడగానే వచ్చింది. ఆ నవ్వులోనే అర్ధమయింది. ఆమె నన్ను కావాలనే తీసుకొచ్చిందని, ఆమె ఆశించినట్లు నేనిక్కడ ఇమిడి పోయాననీ.

    అక్కడనుంచి 'హోమ్ ఫర్ ది ఏజ్ డ్' కి తీసుకెళ్ళింది. అక్కడ వృద్ధులకి పుస్తకాలు చదివి వినిపించింది. తిరిగి వస్తూంటే చెప్పింది. ఈ రకమైన సాంఘిక సేవ కోసమే ఆమె వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుందట. ఆమె ఏ గుడికీ వెళ్ళదు, ఏ పూజలూ చేయదు. అసలలాంటి ఆలోచనే ఆమెకు రావు. కాని ఆమె జీవితం సంతృప్తిగా గడిచిపోతోంది. తనకు కావలసిన వాళ్ళెవరూ లేరని దిగులు పడదు. తనవాళ్ళు తనకు లేకుండా పోయారని విచారిస్తూ కూర్చోదు. జీవితాన్ని సార్ధకం చేసుకునే ప్రయత్నాల్లో గతంలోని విషాదాన్ని పూర్తిగా మర్చిపోగలిగింది.

    కాని నేనేం చేశాను? ఇరవయ్యేళ్ళ కాలాన్ని వ్యర్ధమైన ఆలోచనలతో గడిపేశాను. ఈ రోజు నాకు అర్ధం అవుతోంది. ఆలోచనలతో సంవత్సరాలు గడపడంకంటే ఒక చిన్న క్రియ మనసుకెంతో తృప్తి కలుగుతోందని.

    'గుడి' అంటే ఏమిటో తెలిసింది.


                  *    *    *    *


    ఆ రోజు గొడవచేసి వెళ్ళిపోయాక ఆఫీసులో నేను ఎవరితోటే ఎక్కువగా మాట్లాడటం లేదు. నా పనేదో నేను చేసుకుపోతున్నాను. మిగతా స్టాఫ్ కూడా నా ఎదుట ఎక్కువ మాట్లాడటంలేదు. లంచాలు తీసుకోవడం మాననూ లేదు. కానీ నేను చూస్తుండగా బేరాలు మాత్రం చేయడంలేదు.

    అయినా నాలో గిల్టీఫీలింగ్ రోజురోజుకీ పెరుగుతోంది. నేను స్వయంగా చేయకపోయినా ఈ అవినీతిలో భాగస్వామిననే అనిపిస్తోంది. కాని నేను చేయగలిగిందేమీ లేదు. కారణం నేను తప్ప మిగతా స్టాఫ్ అందరూ కలసికట్టుగా వుంటారు. నేను సంతకం చేయడానికి అంగీకరించకపోతే నా పై అధికారి వెంటనే సంతకం పెట్టి బిల్స్ పాస్ చేస్తాడు.

    ఈ వ్యవస్థని ఒక్కసారిగా మార్చడం నా ఒక్కడి తరం కాదన్న సత్యం నాకూ తెలుసు. వ్యర్ధపుటాలోచనలతో సమయం వృధా చేసుకోవడం కూడా అవివేకం.

    అనుపమ తన అనుభవాన్ని చెప్పిందొకసారి. భర్తతో కలిసి విదేశీయాత్ర చేసివచ్చింది. బాంబే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కనిపించినంత లంచగొండితనం ఎక్కడా చూడలేదంది.

    వాళ్ళు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాలేదు. ఆ విషయం చెపితే ఎవరూ నమ్మలేదు. మొత్తం లగేజి తెరిపించి గంటసేపు వెతికారు. ఆ గంటలో ఆమె చుట్టూ జరుగుతున్నదంతా గమనించింది. టీవీ, వీసీఆర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులమీద ఖరీదుకి మూడు రెట్లు టాక్స్ కట్టాలి. కాని కస్టమ్స్ అధికార్లు ప్రయాణికులతో లాలూచీ పడి, బేరం కుదుర్చుకుంటారు. డాలర్లలో ఇస్తే ఇంకా మంచిది. విదేశీ లిక్కర్లు, సెంట్లు చాలా చేతులు మారతాయి. తెచ్చిన వస్తువుల్లో తమకు నచ్చినవి వుంటే తీసి పక్కన పెట్టేసుకుంటారు. ఆ రకంగా ఒకో ఆఫీసరు ఒక గంటలో కొన్నివేలు సంపాదిస్తున్నాడు. ఇదంతా పబ్లిగ్గానే జరుగుతుంది. కాని అధికార్లు ఎవరూ ఆ విషయమై ఎందుకు పట్టించుకోరు? కారణం వాళ్ళూ అందులో భాగస్వాములే కాబట్టి. ఒక కస్టమ్స్ అధికారి తన జీతానికి పదిరెట్లకు పైగా సంపాదించుకోగలుగుతున్నాడు. అది ఇన్ కంటాక్స్ వాళ్ళ దృష్టికి రాకపోవడానికి కారణమేమిటి? వాళ్ళకు దాన్లో భాగం దొరుకుతోంది కాబట్టి. రాజకీయ నాయకులకి తెలుసుకాని పట్టించుకోరు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళి వాళ్ళూ చాలా పెద్ద లగేజితో వస్తారు కాబట్టి. ఇక్కడ ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటారు. దేశానికి వచ్చే నష్టం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళతో పోలిస్తే మా ఆఫీసు వాళ్ళది లంచం కాదు. చిన్న 'మామూలు' మాత్రమే. అది దేశానికి సంబంధించినదయితే ఇది ఇండివిడ్యువల్స్ కి సంబంధించినది. అదే తేడా. ఇలా సరిపెట్టుకుని తృప్తిపడనా? 

    ఎంత పట్టించుకోకుండా వుండాలన్నా నాకు సాధ్యం కావడంలేదు. వాళ్ళను మంచి మార్గంలో పెట్టే శక్తి నాకు లేదు. కళ్ళెదుట జరుగుతున్నది చూసీ చూడనట్లుగా మర్చిపోవడం అంతకంటే కావడంలేదు. ఆ సంఘర్షణలోనే ఒక నిర్ణయం తీసుకున్నాను.

    హెడ్ ఆఫీస్ నించి మా ఆఫీసుకి చేరేసరికి పన్నెండు దాటింది. నేనిక రానేమోనని పబ్లిగ్గా హాల్లోనే కూర్చుని తమ కమీషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు.

    "శర్మా" పిలిచాను సీట్లో కూర్చుని. శర్మ వచ్చాడు.

    "చిన్న ఇన్ ఫర్ మేషన్ కావాలి శర్మా" అన్నాను.

    "చెప్పండి సార్. ఏం కావాలి?" కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగాడు. అందరూ నా వైపు కుతూహలంగా చూస్తున్నారు. కొత్త ఉపదేశం మొదలు పెడతానేమోనని అనుమానం కాబోలు.

    "మీ కమీషన్ రేటెంత?" అడిగాను. శర్మ జవాబు చెప్పలేదు- ఎందుకు అడుగుతున్నానోనని భయపడుతున్నాడు.

    "ఫర్వాలేదు శర్మా- చెప్పు".

    "అంటే దేనికి అడుగుతున్నారు?" అడిగాడు.

    "ఒక రిటైరయిన మనిషి పెన్షన్, గ్రాడ్యుయిటీ ఇతర బెనిఫిట్స్ అన్నీ కలిసి బాగానే వస్తుందిగా. దానిమీద మీ పర్సంటేజి ఎంతుంటుంది? అడ్వాన్స్ ఎంతివ్వాలి?"

    "మీ వాళ్ళెవరయినా వున్నారా సార్! చెప్పండి. నేను చేసి పెడతాను" అన్నాడు నమ్రతగా.

    "అలాకాదు. అందరి దగ్గరా తీసుకున్నట్లే నా దగ్గరా తీసుకో."

    "మీ దగ్గరా? అంటే?"

    "నేనిప్పుడే వాలంటరీ రిటైర్ మెంట్ రాసిచ్చి వచ్చాను. ప్రస్తుతం నెలరోజులు సెలవు అనుకో. అడ్వాన్స్ ఎంతివ్వాలో చెప్తే ఇచ్చి వెళతాను. మిగతాది చెక్కు తీసుకోవడానికి వచ్చినప్పుడు యిచ్చేస్తాను" అన్నాను కూల్ గా.

    శర్మ దెబ్బతిన్నట్లు చూశాడు. మిగతా వాళ్ళందరూ పని ఆపేసి నా వైపు వింతగా చూస్తున్నారు. అవును మరి. ఇంకో ఏడేళ్ళ సర్వీసుంది. ఇప్పుడు రిటైర్ మెంట్ తీసుకుని ఏం చేయాలనుకుంటున్నానని అనుమానం రావడంలో తప్పులేదు.

    "నేను జోక్ చేయడంలేదు. నిజమే చెపుతున్నాను. డబ్బు విషయం చెప్తే ఇచ్చేసి వెళ్ళిపోతాను."

    "నాకు తెలియదండీ" శర్మ లేచి బయటకు వెళ్ళిపోయాడు.

    జేబులోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టాను. ఎగిరి పోకుండా వెయిట్ పెట్టాను.

    "రెండువేలు పెట్టి వెళుతున్నాను. నా పని చేసి పెట్టగలిగితే కృతజ్ఞుడిని. మీ రుణం వుంచుకోను. మిగతాది తప్పకుండా సెటిల్ చేస్తానని హామీ యిస్తున్నాను బై" అందర్నీ ఉద్దేశించి చెప్పి బయటపడ్డాను.

    ఎందుకో దిగులుగా అనిపించింది. పాతికేళ్ళ అనుబంధం. నా జీవితంలో ఎగుడు దిగుళ్ళకి కారణమైన స్థలం. నా పతనానికి, తర్వాత నాలోని పరివర్తనకూ నిశ్శబ్ద సాక్షి.

    పాతికేళ్ళ సహవాసంలో ఎవరూ నాకు దగ్గర కాలేకపోయారు. నేను ఎవరికీ ఆత్మీయుడిని కాలేకపోయాను. అదొక చేదు నిజం. నా నిష్క్రమణ అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది తప్ప దుఃఖాన్ని కాదు అని తల్చుకుంటే ఏదో బాధ.

    అనుపమ చెప్పినట్లు ఇంత చదువుకునీ ఇలాంటి సెంటిమెంట్సుకి లొంగిపోవడం ఒక బలహీనత.

    రాధాకృష్ణా హోమ్ కి చేరుకుని రోజంతా పిల్లలతో గడిపాను. రిలీఫ్ గా అనిపించింది కాని ఇంటికి రాగానే మళ్ళీ దిగులు. ఉద్యోగం వదులుకోవడం ద్వారా నేను ఓడిపోయానా? అది నాలో చేతకానితనాన్ని రుజువు చేస్తోందా?

    రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. తెల్లవారుజామున ఎవరో తలుపు కొడుతుంటే మెలకువ వచ్చింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా విశ్వేశ్వర్. అతడి ముఖంలో బాధ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. కళ్ళు ఎర్రగా వున్నాయి.

    "ఏం జరిగింది విశ్వేశ్వర్? ఎందుకలా వున్నావు?" అడిగాను గాభరాగా.

    "ఏం లేదు. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను" అన్నాడు. లోపలకు ఆహ్వానించాను.

    "నిన్న నేను చేసిన పని నిన్ను బాధ పెట్టినట్లుంది విశ్వేశ్వర్. నేను ఎవర్నీ అఫెండ్ చేయాలనుకోలేదు. కాని నా వల్ల మీరంతా నష్టపోకూడదని అలా చేశానంతే" అన్నాను ఓదార్పుగా.

    "మీతో కలసి పదేళ్ళుగా పనిచేస్తున్నాను. సాధారణంగా మన ఆఫీసులో ట్రాన్సఫరయి వెళ్ళినా, రిటైరయినా చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటాం. వీడ్కోలిస్తూ గుర్తుగా ఏదో జ్ఞాపిక కూడా బహూకరిస్తుంటాము"

    "అలా నాకు ఏమీ ఇవ్వలేదనా ఇంత బాధపడుతున్నావు. భలేవాడివే. మీరిచ్చే బహుమతులతోనే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానా విశ్వేశ్వర్! ఇన్నేళ్ళు కలసి పనిచేశాం. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను?" అనునయంగా భుజం తడుతూ అన్నాను.

    "నేను మీకొక చిన్న ఫేర్ వెల్ గిఫ్టు ఇద్దామని వచ్చాను సార్! ఇది నా ఒక్కడిదే. ఎవరికీ తెలియదు కూడా" అన్నాడు.

    "నా కలాంటివి ఇష్టం వుండవని నీకు తెలుసు విశ్వేశ్వర్! దయచేసి అలాంటి పనిచెయ్యకు. అది నన్ను బాధపెడుతుంది" అన్నాను సీరియస్ గా.

    "కాని నేనిచ్చే బహుమతి మిమ్మల్ని చాలా సంతోష పెడుతుందని నా నమ్మకం. సార్ నేను వస్తువుగా మీకేం ఇవ్వడం లేదు."

    "మరి?"


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More