Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం


    సర్వస్వాన్ని త్యజించైనా సత్యాన్ని కాపాడాలి. అబద్ధం చెప్పనని వందమంది కొడుకుల్ని పోగొట్టుకున్న వశిష్టుడిని, హరిశ్చంద్రుడిని ఉదాహరణగా చూపించారు" ఆవేశంగా చెపుతూ ఆగాను. అనుపమ నావైపు చిరునవ్వుతో చూస్తోంది.

    "సారీ! మీరేదో అడగ్గానే ఉపన్యాసం యిచ్చేసాను" అన్నాను.

    "అలా ఎందుకనుకుంటున్నారు. మీరు చెపుతున్నది చాలా ఇంటరెస్టింగ్ గా వుంది. కాని ఒక్కటే అనుమానం! ఇన్ని తెలిసిన వారు ఇన్నాళ్ళూ మీ ఆఫీసులో అంత అరాచకం జరుగుతున్నా మౌనంగా ఎందుకుండిపోయారు?"

    "చెప్తాను. ఈ రోజు నా మనసు పూర్తిగా విప్పుతాను. మీలాంటి స్నేహితురాలు దగ్గర సర్వం చెప్పుకుంటేగాని నాకు మనశ్శాంతి లభించదు."

    మరో కప్పు టీ అడిగి తీసుకుని తాగి మొదలుపెట్టాను.

    "ఇన్నాళ్ళు మౌనంగా ఎందుకు పాటించారు? అన్న ప్రశ్నకి ఒకే పదంతో జవాబు చెప్పగలను. గిల్టీకాన్షస్. తప్పు చేసినవాడు ఎదుటివాడిలోని తప్పుల్ని ఎత్తిచూసే అర్హత పోగొట్టుకుంటాడని నమ్మినందువల్ల." ఆగి అన్నాడు.

    "మా నాన్న స్కూలు టీచర్. "బ్రతకలేక బడిపంతులు" అన్న నానుడికి సరిపోయిన జీవితం ఆయనది. నేను ఒక్కడినే కొడుకుని. నాకు ఇద్దరు అక్కయ్యలు. అతికష్టంమీద వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళు చేశాడు నాన్న. పెద్దక్కయ్య జంషెడ్ పూర్. పెళ్ళయ్యాక ఒకటి రెండుసార్లు మాత్రమే వచ్చింది. చిన్నక్కయ్య ఒక బాబుని కని చనిపోయింది. ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళతోమాకు పెద్దగా సంబంధాలు లేవు. అందుకే దాదాపు ఒంటరివాడిగానే పెరిగాను నేను. నేను పి.యు.సి చదువుతుండగా అమ్మపోయింది. నాన్న ఆరోగ్యం అంతంతమాత్రం. ఆవిడ మరణంతో మరింత కృంగిపోయాడు. ఇంటిపని, బయటపని అన్నే నేనే చేసుకునేవాడిని. అందువల్ల నలుగుర్లో ఫ్రీగా తిరిగే అలవాటు కూడా తగ్గిపోయింది. బియ్యేలో నా క్లాస్ మేట్ సుజాత అందమైనది. బాగా డబ్బున్న వాళ్ళమ్మాయి. ఆ వయసులో సహజంగానే ఆమె నన్నాకర్షించింది. కాకపోతే ఒకపక్క బీదరికం, మరోపక్క ఆత్మన్యూనతా భావంతో పెరిగిన నేను నా ప్రేమను ఎక్కడా వ్యక్తం చేయలేదు. మా క్లాసులో అన్ని రకాలుగా ఉన్నతస్థాయిలో వున్న అబ్బాయిలు చాలామంది వున్నారు. సుజాత అలాంటి వారిపట్ల ఆకర్షితురాలవుతుందిగాని, నా మొహం అయినా చూస్తుందా అనుకునేవాడిని. ఫైనలియర్ లోకి వచ్చాం. కాలేజీ డే ఫంక్షనప్పుడు సెక్రటరీ నాకూ, సుజాతకు కలిపి కొన్ని పనులప్పగించాడు. వారం రోజులపాటు కలిసి తిరిగాం. అప్పుడే సుజాత నాకు చెప్పింది నేనంటే తనకు చాలా ఇష్టమని. నా గురించి ఆమెకు సరిగ్గా తెలియదేమోనని అన్నీ వివరంగా చెప్పాను. 'డిగ్రీ అవగానే ఉద్యోగం సంపాదించుకో వెంకట్. మనం పెళ్ళి చేసుకుందాం. ఏదో ఒక రకంగా బ్రతలేకపోము' అంది ధైర్యంగా. నేను సంతోషించడంపోయి భయపడ్డాను. అందులో ఆమె ఉన్నత కులానికి చెందింది. పైగా డబ్బున్న వాళ్ళు. కాని సుజాత నాకెప్పుడూ ధైర్యం చెప్పేది. నా డిగ్రీ అయిపోయింది. సుజాత ఫెయిలయింది. ఉద్యోగాల వేటలో పడ్డాను. సుజాత మాత్రం రెగ్యులర్ గా వచ్చి కలిసేది. వాళ్ళింట్లో సంబంధాలు చూస్తున్నారని, త్వరగా ఉద్యోగం సంపాదించుకొమ్మని వేడుకునేది. నాన్నతో ఆ విషయం చెప్పాను. ఆయన తన ప్రావిడెంటుఫండ్ మొత్తం తీసుకుని లంచం ఇచ్చి నాకీ ఉద్యోగం వచ్చేలా చేశారు.    

    మొదటి జీతం తీసుకున్న రోజు సుజాత ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్ద వాళ్ళను కలిశాను. వాళ్ళకు చాలా కోపం వచ్చింది. నన్ను యింట్లోంచి బయటకు వెళ్ళగొట్టారు. సుజాత నన్ను కలవకుండా కట్టడిచేశారు. సుజాత వాళ్ళను ఎదిరించి కట్టుబట్టలతో నా దగ్గరకు వచ్చేసింది. నాన్నగారికి చెప్పి ఇద్దరం తిరుఅతి వెళ్ళిపోయి అక్కడ పెళ్ళి చేసుకున్నాం. అప్పట్లో నేను గొప్ప దైవభక్తుడిని. వేంకటేశ్వరుడు మా కులదైవం. నాకు సమయానికి ఉద్యోగం రావడం, ప్రేమించిన సుజాతను పెళ్ళి చేసుకోగలగడం అంతా ఆ వెంకటేశ్వరుడి దయేనని నమ్మినవాడిని. సుజాత కూడా మాతో బాగా కలిసిపోయింది. నా కోసం, తన వాళ్ళందర్నీ దూరం చేసుకున్నాననిగాని, అక్కడున్న సుఖం ఇక్కడ లేకపోయిందని ఎప్పుడూ ఫీలవలేదు. కానీ నేనే బాధపడేవాడిని. ఆమెను అన్ని రకాలుగా సుఖపెట్టాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే ఆఫీసులో అందరికీ పై సంపాదన బాగా వుందని తెలుసు. అప్పట్లో రాష్ట్రం మొత్తంనించి పెన్షన్ కోసం మా దగ్గరకే రావలసి వచ్చేది. వూళ్ళనించి వచ్చినవాళ్ళు మొదట్లో ఎవరయినా తృప్తితో యిస్తే తీసుకునేవాడిని. తర్వాత్తర్వాత అడిగి తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ రకంగా సంపాదన ఎక్కువయినకొద్దీ సుజాతకి ఏ లోటూ లేకుండా అన్నీ సమకూర్చిపెట్టి తృప్తిపడేవాడిని. అంతలో నాన్నగారు రిటైరయ్యారు. వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నాం. సుజాత గర్భవతిఅయింది. సంతోషంతో పొంగిపోయాను. ఆఫీసులో లంచాలు పట్టడం ఎక్కువ అయింది. డబ్బు బాగా వచ్చేది. సుజాతని కాలు కింద పెట్టనిచ్చేవాడిని కాదు. పాప పుట్టింది. దీపిక అని పేరు పెట్టుకున్నాం. ఏడాదికి రెండు మూడుసార్లు కొండకి వెళ్ళి వచ్చేవాళ్ళం. నాలుగేళ్ళు చాలా హాయిగా గడిచి పోయాయి. ఈ మధ్య నాన్నగారుపోయారు. నేను జీవితంలో సెటిలయి అన్ని విధాలుగా సంతోషంగా వుండడం చివరిరోజుల్లో ఆయనకు చాలా తృప్తినిచ్చింది.

    ఆ రోజు దీపిక పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజు చాలా ఘనంగా చేసేవాడిని. అలాగే చాలామంది స్నేహితులని పిలిచాను. రాత్రి డిన్నర్. డ్రింకు పార్టీ అరేంజ్ చేశాను. అందంగా, ఆరోగ్యంగా, ఖరీదయిన ఫ్రాక్ లో పాప ముద్దుగా వుంది. పట్టుచీరతో, వంటినిండా నగలతో సుజాత తిరుగుతుంటే చూసి గర్వపడ్డాను. నా స్నేహితురాలంతా నా అదృష్టాన్ని పొగిడేవాళ్ళే.

    కేక్ కట్ చేశాక నేను ఫ్రెండ్స్ తో కలిసి లోపల గదిలోకి వెళ్ళిపోయాను. సుజాత పిల్లల భోజనాలు అయ్యాక మిగతా ఆడవాళ్ళకు వడ్డిస్తోంది. ఒక స్నేహితుడు ఆలస్యంగా రావడంతో నేను బయటకు వచ్చాను. దీపికకు ప్రజంటేషన్ ఇవ్వాలని పిలవమన్నాడు. చూస్తే పాప ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. చుట్టు పక్కల ఇళ్ళకెళ్ళిందేమోనని వెళ్ళి వెతికాం. ఎక్కడా లేదు. పాపని ఎవరో ఎత్తుకెళ్ళి వుంటారన్న ఆలోచన రాగానే భయంతో వణికిపోయాం. మెడలో గొలుసు, చేతులకు గాజులు వున్నాయి. వెంటనే పోలీసు రిపోర్టు యిచ్చాను. ఆ రాత్రంతా వెతికాం కనిపించలేదు. సుజాత అప్పటికే ఏడ్చి ఏడికళ్ళు తిరిగి పడిపోయింది."

    జరిగిన విషయం జ్ఞాపకం రాగానే గొంతుకేదో అడ్డం పడ్డట్లయింది. అంతసేపు కంట్రోలు చేసుకున్న బాధ ఎగిసి పడబోతున్నట్లు గ్రహించి ఆగిపోయాను. అనుపమ నా స్థితికి అర్ధం చేసుకున్నట్లుంది. దగ్గరగా వచ్చి కూర్చుంది- ఓదార్పుగా భుజంమీద చెయ్యి వేసింది. అంతే కరుడు గట్టిన దుఃఖం కరిగి కన్నీరై ప్రవహించసాగింది. ఒకటి కాదు, రెండు కాదు- ఇరవై ఏళ్ళుగా గుండెల్లో నిక్షిప్తమైన దుఃఖం. అనుపమ ఆత్మీయతా స్పర్శతో పెల్లుబికి పైకి వచ్చింది. అది విషాదానికి, దుఃఖానికి, బాధకీ కూడా పరాకాష్ట. అయినా ఉద్విగ్నత. ఎంతో ప్రియమయిన వ్యక్తి చనిపోయాడనగానే విషాదం కన్నీరై పొంగుతుంది. ఆ మృతదేహాన్ని చూడగానే పెల్లుబికే దుఃఖం గండి పడిన ఆనకట్టలాంటిది. ఆపశక్యం కానిది. ఆ వ్యక్తి ఇక చూపులకి అందడని అదే చివరిసారిగా చూడమని తెలిసినప్పుడు కలిగే బాధ గుండెల్ని పిండి రక్తంగా స్రవించే అశ్రుధార. అది అనుభవించిన వారికే అర్ధమయ్యే ఉద్వేగ భరితస్థితి. ఆ స్థితిని రెండుసార్లు అనుభవించిన వాడిని.

    కొద్ది నిమిషాలకు తేరుకున్నాను. "పాప క్షేమంగా దొరికితే నిలువుదోపిడి యిస్తామని, తలనీలాలు సమర్పించుకుంటామని" మొక్కుకున్నాం. భగవంతుడు అప్పటివరకూ మాకు అన్నీ అనుకూలంగానే అందిస్తున్నాడు. మేము చేసిన పూజలు వృధా కావు అని గట్టినమ్మకం. నగలు పోయి పాప క్షేమంగా దొరుకుతుందని ఆశ. కాని మర్నాడు కూడా పాప దొరకలేదు. రెండోరోజు శవందొరికింది-" దుఃఖం మళ్ళీ పొంగి పొర్లింది. అనుపమ నా చేతిని తన చేతిలోకి తీసుకుని. ఆప్యాయంగా నిమురుతోంది. కామానికి, కోరికకు అతీతమైన ఆత్మీయతా స్పర్శ జీవితంలో మొదటిసారిగా అనుభవిస్తున్నట్లనిపించింది. వెంటనే తేరుకున్నాను.   

    "ఎవరు అంత ఘాతుకం చేసింది?" అడిగింది అనుపమ.

    "నాకు స్నేహితుడే రవికిశోర్ అని. మా ఇంటి దగ్గర్లోనే వుండేవాడు. నాలాగే వేంకటేశ్వర భక్తుడు. ఎక్కువగా గుడిలో కలుసుకునే వాళ్ళం. పాప వంటిమీద నగలకు ఆశపడి ఆ పని చేసుంటే ఇంత బాధ కలిగేది కాదు."

    "మరి దేనికి?" అనుపమ అనుమానంగా అడిగింది. వాడి కామానికి పాప బలయిపోయిందేమోనని అనుమానం అని అర్ధమైంది.

    "ఎవరో సాధువు చెప్పాడట. అందమైన పాపని బలిస్తే ఏవో సిద్దులు లభిస్తాయని, పరుసవేది విద్య తెలుస్తుందనీ." సమయానికి దీపిక కనిపించింది. తెలిసినవాడే కాబట్టి రమ్మనగానే వెళ్ళింది. ఊరి చివరకు తీసుకెళ్ళి ఒక పాడుపడిన గుడిలో బలిచ్చాడు. తల, మొండెం విడిపోయిన పాప శరీరాన్ని చూడగానే సుజాత తల తిరిగి పడిపోయింది. ఆమె తిరిగి కోలుకోనేలేదు. కృశించి, కృశించి మూడు నెలలకే పోయింది. ఆమెనైనా బ్రతికించుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఫలించలేదు.

    నేను ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న సుజాత శవాన్ని చూస్తుంటే నేను బ్రతకడం వ్యర్ధం అనిపించింది. దుఃఖానికి పరాకాష్ట స్తబ్దత అయినట్లు రాయిలా కూర్చుండిపోయాను. ఎన్ని పూజలు చేశాను? భగవంతుడిని ఎంతగా ఆరాధించాను. అయినా నాకిలా ఎందుకు జరిగింది? నేనేం పాపం చేశానని ఇంత ఘోరమైన శిక్ష నాకు విధించాడు? నా ప్రశ్నలను అర్ధం చేసుకున్నట్లుగా నా వెనుక ఎవరో మాట్లాడుకోవటం వినిపించింది. "ఎంత దైవభక్తులో! ప్రతి శనివారం గుడికి వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజూ పూజ చెయ్యకుండా ఏ పనీ చేసేవారుకాదు. అయినా ఆ భగవంతుడికి వీళ్ళమీద కనికరం లేకపోయింది." అన్నది ఒకావిడ. "నీకేం తెలుసు ఈయన సంగతి? మా వారు చెప్పారు. అందర్నీ పీడించి లంచాలు పుచ్చుకుంటాడట. డబ్బు చేతిలో పడందే పని చెయ్యడట. ఎవరి ఉసురు పోసుకున్నాడో భగవంతుడికి మాత్రం తెలియదా? ఆ పాపిష్టి సొమ్ముతో ఎన్ని పూజలు చేస్తే నేమి ఆయనకు రుచించొద్దూ? "అదిరిపోయాను. అది నిజమా? నేను చేసిన పాపం వల్లనే భార్యాబిడ్డలు ఆహుతైపోయారా? ఇది భగవంతుడు నాకు వేసిన శిక్షా? నమ్మలేకపోయాను. అది నిజం కాదా? ప్రశ్నిస్తోంది నా అంతరాత్మ. ఇన్నాళ్ళూ నా అంతరాత్మని అష్టదిగ్బంధనం చేసి పెట్టాను. అది అన్ని బంధనాలు తెంచుకుని నన్ను నిర్మొహమాటంగా ప్రశ్నిస్తోంది. నన్ను చిత్రవధ చేస్తోంది. ఆ దాడికి తట్టుకోలేక పోయాను. పిచ్చిపట్టినట్లయింది. 

    బార్ కెళ్ళి ఫుల్ గా తాగాను. ఆ మత్తులో సర్వం మర్చిపోగలననుకున్నాను. అలా తాగి తాగి చచ్చిపోవాలనుకున్నాను. కాని అదేం చిత్రమో రెండోరోజు డ్రింక్ ముట్టుకోలేకపోయాను. అది నా మార్గం కాదనిపించింది. నెలరోజులు సెలవుపెట్టి ముందుగా తిరుపతి వెళ్ళాను. అక్కడా ఇమడలేకపోయాను. జీవితంలో మొదటిసారి కొండపైకి వెళ్ళి దైవదర్శనానికి వెళ్ళకపోవడం.

    నా ప్రవర్తన నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. నా స్థితిలో వున్న వాళ్ళెవరైనా రెండు మార్గాలని ఎన్నుకుంటారు. ఒకటి మత్తులో మునిగిపోయి సర్వస్వాన్ని మర్చిపోవడం, లేదా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో పడిపోవడం. నేనా రెండింటిలోనూ ఇమడలేకపోయాను. తిరుపతి నించి కన్యాకుమారి వెళ్ళాను. ఆ పరిసరాలు, వాతావరణం నాకు కాస్త తెరిపినిచ్చాయి. కాని నా ఆలోచనని అరికట్టలేకపోయాను. అక్కడే దొరికినన్ని పుస్తకాలు కొన్నాను. అవి చదువుతున్నకొద్దీ ప్రశ్నలు, ఆలోచనలు. నాలో అంతర్మధనం మొదలయింది. నను నేను విశ్లేషించుకోవడం మొదలుపెట్టాను. నా భార్యబిడ్డల మరణం యాదృచ్చికమే కావచ్చు కాని దాన్ని పాపాలకు అన్వయించుకుని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

    నేను భగవంతుడిని నమ్మినవాడిని. ఆ శక్తిమీద అపారనమ్మకం, గౌరవం, భయం అన్నీ వున్నవాడిని. కాని నేను చేసిందేమిటి? దైవాన్ని, దైవశక్తిని విడదీశాను. దానికి దీనికి పొంతన లేదని భావించాను. కాదు. అలాంటి ఆలోచనే నాకు రాలేదు. పుస్తకం తొక్కితే, తీసి తుడిచి కళ్ళకద్దుకుంటాం. అది బూతుపుస్తకం అయినా సరే. ఎందుకని? పుస్తకమన్నా, కాగితమన్నా అది సరస్వతి స్వరూపమని. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అది తొక్కినా కళ్ళకద్దుకుంటాం. అడుగడుగునా మనకు కనిపించే ఈ దైవస్వరూపం తోటి మనుషుల్లో ఎందుకు కనిపించడము లేదు? మనం చేసే ఇతర చర్యల్లో పాపం మన దృష్టికి ఎందుకురావడములేదు? భగవంతుడి మీద అపార నమ్మకం వున్న మనిషి, తోటి మనిషికి అపకారం ఎలా చేయగలుగుతున్నాడు? మన మనసునే భగవంతుడు చదవగలడని నమ్మినపుడు మన చేతలు ఆయనకు తెలుస్తాయనే ఆలోచన ఎందుకు రావడంలేదు?


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More