Home » vasireddy seeta devi novels » ఆమె నవ్వింది

    శేషయ్య దంతధావనంచేసి, నదిలో స్నానంచేసి సత్రానికి తిరిగొచ్చాడు. నదినుండి తిరిగొచ్చిన దగ్గర నుంచీ అతని మనసు పీకుతూనే వుంది.

    తను భయపడుతున్నాడా? ప్రాణంమీద తనకు మమకారం తీరలేదా? ఏమిటి తను ఇలా మెత్తబడి పోతున్నాడు.

    శేషయ్య అంతరాత్మ ఘోషించింది. కాని శేషయ్య మళ్ళీ తన అంతరాత్మను తనే సమాధానపర్చుకున్నాడు.

    వైకుంఠం తలుపులు రేపు బార్లాగా తెరిచి వుంటాయి. లోపలకు తను సునాయాసంగా ప్రవేశించగలడు.

    ఆ రాత్రి శేషయ్య మళ్ళీ మధనపడసాగాడు.

    ఇంకా కొన్ని గంటల్లో తను ప్రాణాల్ని త్యజించబోతున్నాడు. జీవితం ఎంత చిద్రమైందీ? ఇవ్వాల్టి తెల్లవారుఝామున తను నదిలో పడివుంటే తను ఇప్పుడు ఇక్కడ వుండేవాడా? తను పడుకొన్నచోటు ఖాళీగా వుండేది.

    శేషయ్య శరీరం జలదరించింది.

    ఇప్పుడు తన శరీరం గచ్చుమీద బరువుగా వాలి వుంది. తను ఈరోజు ఎన్ని వింతలు చూశాడు? ముష్టివాళ్ళూ రిక్షావాళ్లూ-అంతా బతుకుమీది ఆశతో ఎంత కోలాహలంగా తిరుగుతున్నారు?

    అరే! ఏమిటి తను ఇలా ఆలోచిస్తున్నాడు? తను బతికి ఇంకేం చేస్తాడు? తిరిగి ఇంటికి వెళ్ళగలడా? వెళ్ళి ఊళ్ళోవాళ్ళ ముఖం చూడగలడా? ఇంతపనీ జరిగాక తను పెళ్ళాం ముఖం చూడగలడా? అది ఇడ్డెన్ల వ్యాపారం చేస్తుంటే చూసి సహించగలడా? తన ఆత్మాభిమానం ఏమైంది? తన పౌరుషం మంటగలిసిందా? ఏమైనా తను ఈ నిర్ణయాన్నుంచి వెనుదిరగలేడు! తన హృదయంలో రగులుతున్న ఈ చిచ్చు, గంగా గర్భంలో ఆరవలసిందే! తను మరణిస్తాడు__మరణిస్తాడు__వైకుంఠ ఏకాదశి తెల్లవారుఝామున ఆ గంగమ్మ పొత్తిళ్ళలో శాశ్వితంగా కళ్ళుమూస్తాడు.

    తన ఆత్మకు శాంతీ__ముక్తీ....మోక్షం లభిస్తాయి. తను జన్మరాహిత్యం పొందుతాడు!

    గంగానది రొద మృత్యు దేవత లాలిపాటలా వినబడుతోంది శేషయ్య చెవులకు.

    అతని హృదయంలో-ఆశా-నిరాశా-జీవితమూ-మృత్యువూ-పెనుగులాటతో నిండిపోగా, భయంకరమైన ఆలోచనలతో, పీడా కలలతో ఆ రాత్రి మూడు ఝాములు గడిపాడు శేషయ్య.

    నాలుగో ఝామున శేషయ్య లేచి, బట్టలసంచి సర్దుకొని నిశ్శబ్దంగా సత్రంలోనుంచి బయటకు నడిచాడు.

    వీధులన్నీ నిర్మానుష్యంగా వున్నాయి.

    గంగానది హోరు దూరంగా వినబడుతోంది.

    పిండి ఆరబోసినట్టు వెన్నెల.

    శేషయ్య చకచకా నదికేసి నడక సాగించాడు.

    గంగానది తెల్ల త్రాచులా మెరుస్తూ గంభీరంగా కదిలిపోతోంది.

    శేషయ్య నది దరిదాపులకు వచ్చేసరికి వెనకనుండి ఏదో శబ్దం వినిపించింది. శేషయ్య వేగంగా నడుస్తూ నదిని సమీపించాడు. వెనకనుంచి వస్తోన్న శబ్దం శేషయ్య వేగాన్ని మించి దగ్గరౌతూంది.

    శేషయ్య నది మెట్లమీద కాలు పెడుతూనే చేతిలోని సంచిని నదిలోకి విసిరేశాడు. పంచెను మొలకు దోపుకొని నదిలోకి దూకబోతున్న శేషయ్య భుజాలమీద బలమైన చేతులు పడ్డాయి. నదిలోకి ఒరిగిపోతున్న శేషయ్య శరీరాన్ని బలవంతంగా ఒక్క గుంజు గుంజాయి ఆ చేతులు.

    శేషయ్య వెనక్కు తిరిగిచూసి నివ్వెరపోయాడు.

    పోలీసులు శేషయ్య చెరో రెక్కా పట్టుకొని నిల్చున్నారు.

    నదిలో పోవాల్సిన శేషయ్య ప్రాణాలు పోలీసుల చేతుల్లో పోయినట్టయినయ్.

    'నగలన్నీ నదిలోనే పారేశావా?' అన్నాడు ఒకడు.

    శేషయ్య అయోమయంగా చూశాడు.

    'పంచెలో ఏమన్నా దాచాడేమో?' అంటూ ఒకడు శేషయ్య చేతులు పట్టుకోగా, రెండవవాడు బట్టలు తనిఖీ చేశాడు.

    'ఊ! పద! స్టేషన్ కు. అక్కడగాని అసలు వ్యవహారం బయటపడదు', మెడమీద చెయ్యివేసి పోలీసు స్టేషన్ కు నడిపించారు శేషయ్యను.

                                           *    *    *

    ఆ క్రితం రాత్రే సత్రంలో పడుకొన్న ఒక బాలిక చేతి గాజులూ, మెళ్ళో గొలుసూ మాయమవడంవల్లా, శేషయ్య ప్రవర్తన అనుమానం కలిగించేదిగా వుండటంవల్లా, అతణ్ణి వెంబడించి పట్టుకోబోగా, చేతిలోవున్న నగల సంచిని నదిలోకి విసిరినట్టూ అది పోలీసులు కళ్ళారా చూసినట్టూ కేసు బనాయించబడింది.

    తన పేరు తప్ప, ఊరూ, జిల్లా కూడా చెప్ప నిరాకరించిన శేషయ్యకు మూడు సంవత్సరాలు కఠినశిక్ష పడింది.

                                           *    *    *
       
    జైలు సెల్లులో కూర్చుని శేషయ్య తన విధిని నిందించుకున్నాడు.

    ఏకాదశి ముందు రాత్రే నదిలో దూకివుంటే తనకు ఈ అవస్థ పట్టేది కాదుగా? తెగింపు చెయ్యలేని తనకు తగిన శాస్తే జరిగింది.


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More