Home » vasireddy seeta devi novels » ఆమె నవ్వింది
ఒక్క క్షణం ముందయితే తను నదిలోకి దూకి వుండేవాడు. ఆ ఒక్క క్షణం ఆలస్యమే తనను ఈ నరకంలోకి తోసింది.
భగవంతుడు తనను ఇంకా పరీక్షిస్తున్నాడు. ఈ జీవుడికి విముక్తి దొరికేరోజు ఇంకా రాలేదు కాబోలు. తను ఎంత నికృష్టమైన జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది? హంతకుల - దొంగలమధ్య తన నివాసం నేడు!
అమర్య మనమడికి ఎంత దుర్గతి పట్టింది?
ఇంకా నయం తన ఊళ్ళో, తనవాళ్ళ కీ విషయం తెలియదు. తెలిస్తే ఇంకేమయినా వుందా? తన తరతరాల వాళ్ళకూ అపవింద చుట్టుకోదూ?
తను ధైర్యంగా పోలీసు లాఠీపోట్లకు నిలబడ్డాడు. కాని తన ఊరేదో, తనెక్కడివాడో చెప్పలేదు.
ఆ ఆలోచనలో శేషయ్య మనసుకు తృప్తి కలిగింది.
తను ఈరోజు చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు. తను దొంగతనం చెయ్యడమా? శివ! శివ! శిష్టజన రక్షకుడవే! ఆపద్బాంధవా! ఎక్కడున్నావయ్యా! ఇంత ఘోరం జరుగుతూవుంటే చూస్తూ వున్నావేమయ్యా!
"అవును! నువ్వు దొంగవే!" శేషయ్య అంతరాత్మ ఘోషించింది.
"అవును! తను దొంగే! తన భార్య దాచుకొన్న డబ్బు కాజేసి తను పరారి అయ్యాడు.
"హే భగవాన్! క్షమించు! అందుకు నన్ను ఈ విధంగా శిక్షించావా?"
తన సొమ్ము తను తీసుకోవడం దొంగతనమా? ఆ ముండ ఇడ్డెన్ల వ్యాపారం పెడ్తాననకపోతే తను ఈపని చేసివుండేవాడా?
"ఏంది సేసయ్యా! మా ఏదాంతిలా కూకున్నావు! లే!లే! రాళ్లు పగలగొట్టాలంట. వార్డర్ పిలుత్తున్నాడు" అన్నాడు ఒక ఖైదీ.
"సేసయ్యంటే సేసయ్యే! మాలావు ఏదాంతిలే! దొంగేశాలు ఏత్తాడు. మనందర్నీ మించిపోయాడనుకో!
బీడీ దమ్ములు లాగుతూ నలుగురైదుగురు ఖైదీలు శేషయ్య చుట్టూ చేరారు.
"ఇంకా కూర్చున్నారేమర్రా లేవండి!" వార్డర్ లాఠీ తిప్పుకుంటూ వచ్చాడు.
తాగే బీడీలు అవతల పారేసి, నెత్తి టోపీలు సర్దుకుంటూ బయలుదేరారు ఖైదీలు. శేషయ్య మౌనంగా వాళ్ళతో కలిసి నడిచాడు.
రాళ్లు పగలగొడ్తూ శేషయ్య అరచేతులు చూసుకొని ఖిన్నుడైనాడు.
ఏనాడూ పూచికపుల్ల పనిచెయ్యని తనకు ఈ గతి పట్టిందా!
పని సరిగా చెయ్యనివాళ్ళని వార్డర్ బూతులు తిడుతుంటే శేషయ్యకు రోషం ముంచుకొచ్చేది. తననెక్కడ తిడతాడోనన్న భయంకొద్దీ ఒళ్లోంచి పనిచేసేవాడు. రాళ్ళు పగలగొట్టడం నీళ్ళు తోడడం, కొయ్యలు చెక్కడం, శేషయ్య దినచర్య అయింది.
రాత్రిళ్ళు తనతోటివాళ్ళు తమ అనుభవాలు కథలల్లి చెపుతూ వుంటే, వింటూ వుండేవాడు శేషయ్య. రాను రాను శేషయ్యంటే మిగతా ఖైదీలకు గురి ఏర్పడింది. అధికారులకూ మంచి అభిప్రాయం వుండేది. శేషయ్య ఖైదీల తరపున వాళ్ళ కష్టసుఖాలు అధికారులకు విన్నవించేవాడు.
తోటి ఖైదీలు తమ గతాన్ని తవ్వి చెబుతూ వుంటే శేషయ్య ఆసక్తితో వినేవాడు. చిన్నతనంనుంచీ, సోమరితనానికి అలవాటుపడి, ఏ పనీ చెయ్యకుండా దొంగతనానికి దిగి, జీవితంలో సగభాగం జైళ్ళలోనే గడిపిన ఖైదీలను చూసి మధనపడేవాడు శేషయ్య.
కొందరి జీవితాలు ఎందుకిలా అవుతాయ్! అని ఆలోచించేవాడు.
తనకు అంతకుముందు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నట్టుగా వుంది శేషయ్యకు.
ప్రతి చిన్నదానికోసం మానవుడు ఎంత తహతహ లాడిపోతున్నాడో, పరిశ్రమిస్తున్నాడో, జైలు జీవితంలో అర్ధం అయింది శేషయ్యకు.
ఒక్క బీడీముక్క ఎంత శ్రమపడి సంపాదిస్తారు ఈ ఖైదీలు!
తను ఆత్మహత్య చేసుకోనందుకు శేషయ్య ఇప్పుడు బాధపడడంలేదు.
ఎన్నెన్నో వింత గాధలూ, పతితల చరిత్రలూ తను విన్నాడు. పగలంతా పనిచేసి రాత్రిళ్ళు వళ్ళు ఆదమరచి నిద్రపోవడంలో ఎంత సుఖం వుంది!
వీళ్ళందరకూ లేని కారణాలు తనకు మాత్రం ఏమున్నాయి? ఆత్మహత్య చేసుకోవడానికి? తనెంత పొరపాటు చేసిందీ ఇప్పుడు తనకు అర్ధం అవుతోంది. భార్య ఇడ్డెన్ల వ్యాపారం పెట్టి సంసారాన్ని ఈదుకొస్తానంటే తనెంత అవివేకంగా ప్రవర్తించాడు? ఆనాటి అభిమానం పౌరుషం ఇప్పుడేమైనాయి? తనవంశ గౌరవం, కీర్తి ప్రతిష్టలూ, ఈవాడు తనకు అక్కరకు వచ్చాయా? వళ్ళు వంచి పనిచేస్తే వార్డరు ఊరుకుంటాడు. లేకపోతే కర్ర పై కెత్తుతాడు.



