Home » vasireddy seeta devi novels » ఆమె నవ్వింది

    శేషయ్యకు తనమీదనే కాకుండా తన శరీరంమీద కూడా వల్లమాలిన అభిమానం ఏర్పడింది.

    తన జీవితకాలమంతా చాలా సత్కార్యాలూ, దాన ధర్మాలూ, చేసి పుణ్యం ఆర్జించాడు. అలాంటి తను హీనమైన చావు చావలేడు. తన శరీరాన్ని పవిత్రమైన గంగాజలాల్లోనే వదల దల్చాడు. గంగలో ప్రాణాలు అర్పించినవారికోసం కైలాసం తలుపులు బార్లాగా తెరిచి వుంటాయట! తను అంతకంటే కోరుకోతగిన చావులేదు.

    ఏమైనా దాన్నిగురించిగానీ, పిల్లనుగురించికానీ ఆలోచించడం అనవసరం. వాళ్ళతో తనకు రుణం తీరిపోయింది. ఈ లోకంతోటే తనకు రుణం తీరిపోయింది. ఈ డబ్బుతో పుణ్యక్షేత్రాలు దర్సించి కాశీచేరి గంగలో ప్రాణాలు త్యజిస్తాడు.

    శేషయ్య కృష్ణా గోదావరీ నదుల్లో స్నానాలుచేసి ఇంత పుణ్యం మూట గట్టుకొని తన ప్రయాణాన్ని సాగించాడు. పూరీ జగన్నాధుని దర్శించి, త్రివేణి సంగమానికి పయనమైనాడు. త్రివేణిలో మునిగి కాశీకి ప్రయాణం కట్టాడు. మార్గమధ్యంలో వున్న పుణ్యతీర్ధాలు సేవించీ, పుణ్యక్షేత్రాలు సందర్సించీ, ఎట్టకేలకు శేషయ్య కాశీ చేరాడు.

    కాశీ చేరేసరికి శేషయ్య చేతిలో పదిరూపాయలు మాత్రమే మిగిలివున్నాయ్. వెళ్ళినరోజే గంగలో స్నానం చేసి కాళికాదేవిని దర్శించి రాత్రి అయేసరికి కాళీఘాటుకు దగ్గిరలోవున్న ఓ సత్రానికి చేరుకున్నాడు. ఆరోజు భోజనానికీ అదీపోగా ఇంకా ఆరు రూపాయలూ, చిల్లరా మిగిలివుంది.

    ఆ రాత్రి పడుకొని శేషయ్య ఆలోచించాడు__

    తను రేపు ఈ జీవితాన్ని చాలించబోతున్నాడు. తనకు భూమిమీద నూకలు నిండాయి. తనకు భగవంతుని ఆజ్ఞ అయింది తెల్లవారుఝామున నదిలో స్నానంచేస్తూ__అలా....అలా....లోపలకు పోయి గంగమ్మతల్లి ఒడిలో శాశ్వితంగా కన్నుమూస్తాడు. తనకు ఆఖరు రాత్రి ఇదే. తను పడుకున్న చోటున రేపు ఈ శేషయ్య వుండడు. ఈ చోటు - తను ఇప్పుడు పడుకొన్న చోటు - రేపు ఖాళీగా వుంటుంది.

    శేషయ్య లేచి కూర్చొని తను పడుకొన్న చోటును మమకారంతో తడిమి చూచుకున్నాడు. శేషయ్య అంతరంగంలోని అజ్ఞాత శక్తులేవో జీవితంమీద ఆశల్నీ, మమకారాన్నీ రెచ్చగొడుతున్నాయి. భార్యా బిడ్డల్ని తల్చుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

    ఛీ! తను ఇంటికి తిరిగిపోవడమా? ఏ ముఖం పెట్టుకొని తిరిగిపోతాడు? తను ఇంత దిగజారిపోతాడేం! తనకోసం ఓ వైపు కైలాస ద్వారాలు తెరిచివుంటే__మళ్ళీ ఆ నరకంలోకి పోతాడా? ఈ గుక్కెడు ప్రాణం_కళ్ళుమూసుకొని బుడుంగుమంటే సరిపోయె? ఆ తర్వాత తనకు బోలెడంత శాంతి! శివుడి ఆజ్ఞ అయింది. ఇక ఈ జీవితానికి మంగళం పాడాల్సిందే!

    ఎవరి కెవరు? ఏది శాశ్వితం! అంతా మాయ! అంతా మిధ్య!

    గంగానది హోరు వినబడుతోంది. శేషయ్య బుర్రలో ఆలోచనలు, నదిలోని అలల్లా అనంతంగా లేచిపడుతున్నాయి. ఆలోచిస్తూనే శేషయ్య మగతగా, మత్తుగా నిద్రలోకి జారిపోయాడు.

    ఏ తెల్లవారుఝాముకు నిద్రపట్టిందో పాపం! శేషయ్య నిద్రలేచేటప్పటికి తెల్లగా తెల్లవారిపోయింది. సూర్యకిరణాలు శేషయ్య వంటికి చురచుర తగిలాయి.

    శేషయ్య ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.

    ఎంతపని జరిగింది? తను చావదల్చుకున్న మనిషే? మరణించాలనుకొంటూ అంత మైమరచి నిద్రపోయాడా?

    శేషయ్యకు తనమీద తనకేదో రోత పుట్టింది.

    అంత రోతలోనూ, శేషయ్యకు హృదయాంతరాళాల్లో ఎక్కడో ఆనందం మువ్వలచప్పుడు చేస్తూ గంతులేసింది. శేషయ్యలోని నైరాశ్యం దాని గొంతు నులిమి పైకి వచ్చింది.


    ఛీ! ఏం బ్రతుకు? తను చావడానికి సందేహిస్తున్నాడా? ముమ్మాటికీ లేదు. తను సందేహించడం లేదు. ఇటు సూర్యుడు అటు పొడిచినా ఇక తను ఆగడు. తను చచ్చితీరుతాడు!

    శేషయ్య లేచి సంచి సర్దుకొని వేగంగా గంగానది ఒడ్డుకేసి బయలుదేరాడు.

    ఉదయభానుడి కిరణాలు గంగమ్మ తల్లిని పొదివి పట్టుకున్నాయి. వెండి తళుకులు కప్పుకొని గంగానది మెరుస్తోంది.

    నదిఒడ్డుకు వచ్చిన శేషయ్య జేబులో చెయ్యిపెట్టుకొని తడిమి చూచుకున్నాడు. ఇంకా ఆరు రూపాయలూ, కొంత చిల్లరా వుంది.

    ఈ డబ్బుతో ఈరోజు కూడా మహారాజులా జీవితం గడపొచ్చు. మళ్ళీ తను ఈ జీవితాన్ని చూడబోతున్నాడా ఏం? గంగానదిలో ప్రాణాలు విడిచే తనకు మళ్ళీ జన్మంటూ వుండదు. హాయిగా ఈ డబ్బుల్తో ఈరోజు తిని, రేపు చావచ్చు! మిగిలిన డబ్బులు....మిగిల్తేనే గుడ్డివాళ్ళకు దానం చెయ్యవచ్చు. ఆ ఫలితం కూడా దక్కుతుంది. ఆఖరు రోజు తను మనసారా తిని, ఆనందించీ, మరీ చస్తాడు. అదీగాక ఇప్పుడు నదిలోపడ్తే ఎవరైనా చూసి బయటికి లాగుతారు. అప్పుడు తన పనేంగాను? అన్నట్టు గుర్తొచ్చింది. తన మతిమండ! అసలు సంగతే ఇంతవరకూ గుర్తులేదు. రేపు వైకుంఠ ఏకాదశి. పర్వదినం! ఏకాదశినాడు మరణిస్తే స్వర్గద్వారాలు తెరిచివుంటాయనీ, పుష్పవిమానం వచ్చి తీసుకెళుతుందనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయ్. ఇన్నాళ్ళూ వుంది, తను చూస్తూ చూస్తూ ఈరోజు చావడం ఏమిటి? రేపు ఏకాదశి! తెల్లవారుఝామున ఈ తుచ్చ దేహాన్ని విసర్జించి తను పరమాత్మలో లీనం అయిపోతాడు. తెల్లవారుఝామునైతే తను మునగడం ఎవరూ చూసి బయటకు లాగరు కూడా.


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More