Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"మహారాజా! ఇది దేవ కార్యము. ఇది నీకు తప్పదు. వెళ్లితీరవలెను. దమయంతి గృహమున ప్రవేశించి నపుడు నీవు ఇతరులకు కనపడకుండునట్లు ఏర్పాటు చేసినాము. దమయంతి గృహమున ప్రవేశించి మమ్ములను గురించి ఆమెకు చెప్పి, మాలో ఒకరిని వరించునట్లు చేయవలసి ఉన్నది" అని ఆజ్ఞాపించినాడు. ఆదేశించినాడు. నలునకు తప్పలేదు ఒప్పుకున్నాడు.
నలుడు ఒంటరిగా విదర్భ ప్రవేశించినాడు. అతడు దమయంతి గృహమును చేరినాడు. పూర్వము హంస వర్ణించిన దానినిబట్టి దమయంతిని తెలుసుకున్నాడు. ఆమె దేవకన్యలను మించిన అందము కలిగి ఉన్నది. నూరు మంది చెలికత్తెలు ఆమెను సేవించుచున్నారు. నలుడు దమయంతిని చూచినాడు. ఆమె సౌందర్యరాశి. అతడు చకితుడు అయినాడు.
దమయంతి నలుని చూచినది. పూర్వము హంస వర్ణించిన దానినిబట్టి నలుని గుర్తించినది. అతడు ఇంద్రుని వంటి వైభవము కలిగి ఉన్నాడు. సూర్యుని వంటి తేజస్సు కలిగి ఉన్నాడు. చంద్రునివలె మనోహరముగా ఉన్నాడు. వరుణుని సౌందర్యము కలిగి ఉన్నాడు. కుబేరుని ఐశ్వర్యము కలిగి ఉన్నాడు. అశ్వినీ దేవతల వంటి రూపము కలిగి ఉన్నాడు.
దమయంతి నలుని చూచినది. లేచినది. నలునకు ఎదురుగా నిలిచినది.
నలుడు దమయంతి ముందు, దమయంతి నలుని ముందు ఒకరిని ఒకరు చూచినారు. ఎవరును మాట్లాడలేదు.
"రాజేంద్రా! ఎందుకింత సాహసించినావు! ఏల ఒంటరిగా వచ్చినావు? ఇది అంతఃపురముగదా! మానాయన భయంకర శాసకుడు కదా! విచ్చు కత్తులనుండి ఉరికి వచ్చినావు! నా కొఱకేనా? నీవు నలుడవేనా?".
నలుని మనసు కల్లోలితమయినది. ఈమె దమయంతి. తనకొఱకు తపించుచున్నది. తాను చేయవలసిన కార్యమేమి? కొంత విసిగినాడు. లోలోన తనను తిట్టుకున్నాడు. తుదకు అన్నాడు.
"రాజకుమారీ! నిజమే. నేను నలుడనే. కాని నీ ప్రియుడనుగా రాలేదు. దేవతల దూతగా వచ్చినాను. విధి అట్లున్నది. నీవు మరొకరిని వరించమని చెప్పుటకు వచ్చినాను. నన్ను ఇంద్రుడు, కుబేరుడు మున్నగు దేవతలు పంపినారు. అందుకే ఎవరికిని కనిపించక రాగలిగినాను. నీవు ఆ దేవతలలో ఎవరినైన వరింపుము. అట్లని వారు నీకు చెప్పమన్నారు. చెప్పినాను. నేను ప్రియురాలివద్దకే పరులదూతనయి రావలసి వచ్చినది. నేను దేవతల కార్యము నిర్వర్తించినాను. ఇక నీవు నిర్వర్తించవలసి ఉన్నది".
దమయంతి నలుని మాటలు విన్నది. ఆమె మీద పిడుగు పడినట్లయినది. కోరుకున్న ప్రియుడు ముందున్నాడు. మరొకరిని వరించమన్నాడు. ఇది ఎక్కడయిన కలదా? ఆమెలో సముద్రములు ఉప్పొంగినవి. కన్నీరు రాలినది.
"మహారాజా! ఏల మాటల కత్తులతో చీల్చెదవు. ఒక్కసారే తల నరుకరాదా? నేను మానవకాంతను. నీవు చెప్పినవారు దేవతలు, వారికి నాకు పొసగుటెట్లు? నేను నలుని వరించినాను. నిన్ను వరించినాను. నాకు దేవతలు అక్కరలేదు. నీవే కావలెను. అట్లు కాకున్నా ఇంత విషము మింగి ప్రాణములు విడుతును. కాని వేరొకరిని వరించను" అని బాష్పాకులనేత్ర అయి నలుని చూచినది.
నలుగు మగవాడు. దమయంతి మాటలు విన్నాడు. ఆమెను మరింత మండించినాడు. దమయంతి ప్రేమను పరీక్షించుటకా? అన్నట్లు అన్నాడు.
"దమయంతీ! ఐశ్వర్యవంతులు, కీర్తిమంతులు అయిన దేవతలు నిన్ను కోరుచున్నారు. నేను సామాన్య మానవుడను. బలహీనుడను. అది కాక దేవతలకు ఇష్టముకాని పని చేసిన కష్టముల పాలగుదుము. దేవతలలో ఒకరిని వరించి సుఖించుము. కష్టములను ఏల కొనితెచ్చుకొందువు?".
నలుని మాటలు దమయంతిని అగ్గివలె కాల్చినవి. దమయంతి ఆడది. పరీక్షలకు నిలుచుట ఆమె స్వభావము. ఆమె తలవంచుకున్నది. నలుని చూడలేదు. నేలనే చూచినది. మౌనముగా ఆలోచించినది. ఆలోచించినది. మెరుపువలె ఆలోచన తట్టినది. తల ఎత్తి ఎదుట నిలిచిన నలుని చూచినది అన్నది:-
"మహారాజా! నేను దేవతలను వరించను. కష్టములనే వరింతును. నీవులేని సుఖము నాకు అక్కరలేదు, నిన్నే వరింతును. అపాయములేని ఉపాయము ఆలోచించినాను. నీవు చెప్పిన ఇంద్రాదులు నా స్వయంవరమునకు వత్తురు కదా! రానిమ్ము. నిండు సభలోన, దేవతల ఎదుట నా ప్రియుని, నలుని, నేను వరింతును. ఏమందువు?".
"దమయంతీ!" నలుని పిలుపులో వలపులు జాలువారినవి. "దమయంతీ! నేను ఎంత అదృష్టవంతుడను!" నలుని గొంతు పూడిపోయినది. మరొక్క మాటరాలేదు.
దమయంతి మురిసిపోయినది. కూలబడినది. ఇరువురకు మాటలు పెకలలేదు. వారి చూపులు మాట్లాడినవి. పూల జల్లులు కురిసినవి.
నలుడు దమయంతి వద్దనుండి ఇంద్రాదుల వద్దకు వెళ్లినాడు. జరిగినదంతయు సవిస్తరముగ వివరించినాడు. తన మార్గమున విదర్భకు సాగినాడు.
ఇంద్రాది దేవతలు నలుని మాటలు విన్నారు. దమయంతి నలుని తప్ప అన్యుని వరించననిన చందము తెలుసుకున్నారు. నలుని రూపము ధరించి స్వయంవరమునకు వెళ్లుటకు నిశ్చయించినారు. విదర్భలో దమయంతి స్వయంవరము జరిగినది. దమయంతి సభలోనికి వచ్చినది. చంద్రకాంతి వచ్చినట్లయినది. ఆమె తెల్లని పుష్పమాల చేతపట్టి నిలిచినది. రాజులు, రారాజులు, మహారాజులు కనిపించినారు. సాగినది. ఒక్కొక్కరి విభవము చూచుచు, వారిని దాటినది. నలునికై వెదకుచు సాగినది. ఆమెకు నలుడు కనిపించినాడు. సంబరపడినది. వరుసగా మరి నలుగురు నలులు కనిపించినారు. ఆశ్చర్యపడినది. చకిత అయినది. పూలమాలతో చిత్తరువువలె నిలిచినది. ఇంద్రాది దేవతలు నలుని రూపమున వచ్చినారని గ్రహించినది. మనసులో దేవతలను ప్రార్థించినది :-
"ఇంద్రాది దేవతలారా! నేను నలుని వరించినాను. మీలో నలుని తెలియదగు ఉపాయము తెలియపరచుడు. మీ కృత్రిమ రూపములు ఉపసంహరించుడు. నా ప్రార్థనను మన్నింపుడు".
"దేవతలు దాని పరిదేవనంబు విని కరుణించి యనిమిష లోచనంబులు నస్వేద గాత్రంబులు నొప్ప నవనీతలంబు ముట్టక యాసన్నులయి నిలిచి రంత లోకపాలురును భూలోకంబున గల రాజలోకంబు నవలోకించుచుండ బుణ్యశ్లోకుండయిన నలు ధర్మవిధానంబున వరియించి దమయంతి తదీయ స్కంధంబున సుగంధి కుసుమదామకంబు వెట్టిన,
దేవతల సాధువాదము
తో విప్రాశీరవంబుతో బహుతూర్యా
రావంబులు సెలగెను బా
రావారరవంబుబోలె ననివార్యములై"
ఆ విధముగా దమయంతి నలుని వరించినది. నల దమయంతులకు మహా విభవముగా వివాహము జరిగినది. ఇంద్రాదులు అది చూచి సంతసించినారు.
"ఆ నలునకు నింద్రుండు వాని యజ్ఞంబుల యందు నిజరూపంబు జూపను, నగ్నియు, వరుణుండును వాని వలచిన చోటున యగ్ని జలంబులు త్పాదింపను ధర్ముండు ధర్మువునంద వాని బుద్ధి వర్తిల్లను వరంబులిచ్చి దేవలోకంబున కరగువారెదుర ద్వాపరంబుతో వచ్చి కలింగని యెందులకు బోయెదవని యడిగిన నింద్రాదులకు గలి యిట్లనియె"



