Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


    ఆకాలమున విదర్భరాజ్యమును భీముడు అను రాజు పాలించినాడు. అతనికి చాలాకాలము సంతానము కలుగలేదు. భీమరాజు భార్యాసహితుడయి "దమనుడు" అను మునిని ఉపాసించినాడు. దమనుని వరమున భీమరాజు దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు కలిగినారు. కూతురు పేరు దమయంతి. కొడుకులు దమనాంతుడు, దమనుడు అనువారు.
    దమయంతి యవ్వనవతి అయి అత్యంత కాంతి, రూప, లావణ్యములు కలిగి ఉన్నది. ఆమె సౌందర్యము నందే కాక సద్గుణములందును తేజోరాశియయి విలసిల్లినది. దమయంతిని గురించి నలుడు విన్నాడు. నలుని గురించి దమయంతి విన్నది. ఆ విధముగా నల దమయంతులకు పరస్పరము అనురాగము ఏర్పడినది. ఒకనాడు నలుడు ఉద్యానమున విహరించుచున్నాడు. అతని మనసున దమయంతి చేరి ఉన్నది. అతడు ఆమె ధ్యాసలోనే ఉన్నాడు. అప్పుడు అతనికి ఆకాశమున హంసల విహారము కనిపించినది. అవి 'అంతరిక్షకాంతా హారావళి వళి' వలె కనిపించినవి. నలుడు చూచుచుండగనే హంసలు ఆకసమునుండి దిగిన హారము వలె అవనికి అవతరించినవి. నలుడు ఉన్న ఉద్యానమున దిగినవి.
    హంసల గుంపు నలునకు అందముగా కనిపించినది. అతడు అటువైపు సాగినాడు. ఆ గుంపు నుండి ఒక హంసను పట్టుకున్నాడు. అది చూచి మిగిలిన హంసలు ఎగిరిపోయినవి. ఆ హంసను విడిచి పోలేక మిగత హంసలు ఆకాశమున ఎగుర సాగినవి. అవి శరత్కాల మేఘశకలముల వలె కనిపించినవి. నలునకు చిక్కిన హంస "తన కమ్మనుజేశ్వరు డపాయంబు సేయుంగా వగచి మనుష్య వాక్యంబుల నిట్లనియె నయ్యా యేను నీకుం బ్రియంబు సేసెద నీహృదయేశ్వరియైన దమయంతి పాలికింబోయి నీ గుణంబులు దానికి వర్ణించి యక్కన్య యన్యుల నపేక్షింపక నీయందు బద్ధానురాగ యగు నట్లుగా జేసెద" అన్నది.
    హంస మాటలు నలుని మనసునకు అమృతధారవలె ఆనందము కలిగించినవి. అతనికి హంస విషయమున అభిమానము ఏర్పడినది. దానిని అలరించినాడు. లాలించినాడు. ముద్దు పెట్టుకొని, ఆకాశమునకు వదలినాడు. ఆ హంస బంధవిముక్తి అయి, ఆకాశమునకు ఎగిరి, ఇతర హంసలను కలిసినది. అవి కనుల పండువగా ఆకాశమున, విదర్భవైపు సాగిపోయినవి.
    నలుని మనసున హంసలు మసలినవి.
    హంసలు విదర్భ చేరినవి. అప్పటికి దమయంతి, తన చెలికత్తెలతో ఉద్యానమున విహరించుచున్నది. హంసలు ఉద్యానమున వాలినవి. వానిని పట్టుటకు అందరు ఉరికినారు. తలా ఒక హంసను పట్టినారు. నలుడు పట్టిన హంసనే దమయంతి పట్టినది. హంస దమయంతితో మాట్లాడినది. అన్నది:-
    "దమయంతీ! నలుడు నీకు ప్రియుడు. నాకు తెలియును. నేను ఇప్పుడు నలుని దగ్గరి నుండియే వచ్చుచున్నాను" ఆ మాటలు విన్న దమయంతి ఉత్సాహము ఉదయించినది. ఆసక్తి కనబరచినది. హంస సాగించినది. "నేను లోకమందలి రాజులందరిని చూచినాను. నలుని వంటివాడు కానరాలేదు. రూపమందును, గుణమందును అతనికి సాటి వచ్చువారు లేరు. అతడు పురుషులలో శ్రేష్ఠుడు. నీవు స్త్రీలలో శ్రేష్ఠురాలవు. మీ ఇద్దరి జత కలసిన అన్యోన్య శోభగా ఉండును. నీవు అతనికి భార్యవు కమ్ము. నలుడు అదే కోరుచున్నాడు".
    దమయంతి హంస మాటలు విన్నది. ఆమె మనసునకు రెక్కలు మొలచినవి. రెపరెపలాడినవి. ఆ హంసను లాలించినది. "హంసా! నీవు ఎంత మంచిదానవు. అతనిని గురించి నాకు చెప్పినావు. నన్ను గురించి అతనికి చెప్పవా?" అని హంసను వదలినది.
    హంస వచ్చిన నాటినుంచి దమయంతి మనసు మనసులో లేదు. ఆమె వన్నె తగ్గినది. శుష్కించ సాగినది. మౌనము దాల్చినది. పూలు ముడవలేదు. ఆభరణములు ధరించలేదు. వనమున విహరించలేదు. గువ్వవలె ముడుచుకొని ఉన్నది. అది చూచినారు ఆమె చెలికత్తెలు. వారి గుండెలు దడదడలాడినవి. భీమరాజు దగ్గరికి ఉరికినారు. విన్నవించినారు:-
    "మహారాజా! దమయంతి మనసు మనసులో లేదు. నాడు ఒక హంస వచ్చినది. నలుని గురించి వివరించినది. నాటి నుండి దమయంతి మనసున నలుడు నిలిచినాడు. ఆమె నలుగురితో ఆడుటలేదు, పాడుటలేదు. నలునియందు చిక్కి ఉన్నది. నలుని తప్ప మరొకటి తలచుటలేదు".
    విదర్భరాజు భీముడు చెలికత్తెల మాటలు విన్నాడు. దమయంతిని చూచినాడు. కూతురు మనసు గ్రహించినాడు. దమయంతీ స్వయంవరము ప్రకటించినాడు.
    దమయంతీ స్వయంవరపు సంగతి భూలోకమందలి రాజులందరకు తెలిసినది. రాజులందరును విదర్భకు బయలుదేరినారు. వారి రథ, గజ, తురగముల పదఘట్టనలకు భూమి కదలినది. నారద, పర్వతులు అది చూచినారు. వారు స్వర్గమునకు వెళ్లినారు. దమయంతి స్వయంవరమును గురించి ఇంద్రునకు చెప్పినారు. నారదుడు దమయంతి సౌందర్యమును వివరించి చెప్పినాడు. దేవతా స్త్రీలలో కూడా ఆమెవంటి అందగత్తె లేదని చెప్పినాడు. పర్వత నారదులు అది చెప్పి వెళ్లిపోయినారు.
    ఇంద్రుడు, కుబేరాది దిక్పాలురు దమయంతి సోయగమును గురించి విన్నారు. వారు ఆమెను పొందవలెను అనుకున్నారు. రత్నమయములయిన విమానములను ఎక్కినారు. భూలోకమునకు దమయంతీ స్వయంవరమునకు సాగినారు.
    దేవతలు ఆకాశమార్గమున విదర్భకు సాగినారు. భూమార్గమున నలుడు బయలుదేరినాడు. సూర్యులలో మహా విష్ణువువలె రాజులందు నలమహారాజు ప్రకాశించుచున్నాడు. అతని రూపమును దేవతలు చూచినారు. ఆకసమున నిలిచినారు. భూమి మీదికి వచ్చినారు. నలుని ముందు వాలినారు.
    దివి నుండి దిగి వచ్చిన వారిని చూచి నలుడు ఆశ్చర్యపడినాడు. వారికి నమస్కరించినాడు. వారు చెప్పిన కార్యము చేతునని మాట ఇచ్చినాడు. అప్పుడు ఇంద్రుడు నలునితో "మహారాజా! నేను ఇంద్రుడను, వీరు దిక్పాలురు. దమయంతీ స్వయవరమునకు వెళ్లుచున్నాము. నీవు మాకు దూతవయి దమయంతి దగ్గరికి వెళ్లుము. మా రూప గుణములను వివరించుము. మాలో ఒకరిని ఆమె వరించునట్లు చేయుము" అన్నాడు.
    "దేవేంద్రా!" నలుడు అంజలి ఘటించి అన్నాడు. "ఇట్టికార్యమునకు నన్ను పంపుట భావ్యము కాదు. ఇది హీన కార్యము, నేను మహారాజును. నన్ను నియమించ తగదు".


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More