Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


    "ఇంద్రా! భూలోకమున దమయంతీ స్వయంవరము జరగనున్నదని విన్నాను. దమయంతి నన్ను వరించునను ఆశతో అచటికి వెళ్లుచున్నాను"
    కలిపురుషుని మాటలు విని ఇంద్రాదులు నవ్వినారు. "కలిపురుషా! పిచ్చివాని వలె ఉన్నావు. జరిగిపోయిన స్వయంవరమునకు పయనమయినావా? మేమందరము ఆ స్వయంవరము నుండియే వచ్చుచున్నాము. దమయంతి మరెవ్వరిని వరించదట. నలుని మాత్రమే వరించునట. ఆమె నలుని వరించినది. నల దమయంతుల వివాహము జరిగినది. మేము ఆ తరువాతనే బయలుదేరినాము" అన్నారు. దేవలోకమునకు వెళ్లినారు.
    దేవతల మాటలు విని కలిపురుషుడు మండిపడినాడు. "మిత్రమా! ద్వాపరా! నల దమయంతులు రాజ్యము విడిచి పోవునట్లు చేతును. నలునకు జూదమనిన ప్రీతి. జూదముననే అతనిని ఓడింతును. నీవు సొగటాల కాయలందు నిలిచి ఉండవలెను" అని కోరినాడు. ద్వాపరుడు అందుకు అంగీకరించినాడు. సొగటాల కాయలందు ప్రవేశించినాడు.
    కలి పురుషుడు సొగటాల కాయలతో నిషధమున ప్రవేశించినాడు. అప్పటికి నలుడు అశ్వమేధాది యజ్ఞములు చేయుటయందు నిమగ్నుడు అయి ఉన్నాడు. అతడు జప, హోమ, దానాదుల వంటి పుణ్యకార్యములు చేయుచున్నాడు. అందువలన నలునిలో ప్రవేశించుటకు కలి పురుషునకు అవకాశము లభించలేదు.
    ఒకనాటి మాట. నలుడు అల్పాచమానము చేసినాడు. కాళ్లు కడుగుట మరచినాడు. అట్లే సంధ్యావందనము చేసినాడు. సమయము కనిపెట్టి ఉన్నాడు కలి. నలునిలో ప్రవేశించినాడు. దానితో నలునకు నీచ విషయములందు ధ్యాస కలిగినది.
    ఒకనాడు పుష్కరుడు అనురాజు విదర్భకు వచ్చినాడు. జూదమునకు రావలసినదని నలుని ఆహ్వానించినాడు. నలునిలో కలి ప్రవేశించినది. జూదమునకు పిలువబడి, జూదమాడకుండుట ధర్మము కాదనుకున్నాడు. జూదమాడుట ప్రారంభించినాడు. పుష్కరుని దగ్గర ఉన్న కాయలు కలిపురుషుడు ఇచ్చినవి. అందు ద్వాపరుడు ప్రవేశించి ఉన్నాడు.
    జూదమున నలునకు ఓటమి ప్రారంభమయినది. అతడు ధనమును, సామగ్రిని ఓడసాగినాడు. అయినను ఆటమానలేదు. ఆహార విహారములు మానినాడు. ఆట మానలేదు. రాజ్యపాలన మానినాడు. ఆటమానలేదు. భార్యాబిడ్డలను చూచుట మానినాడు. ఆట మానలేదు. మంత్రులు మిత్రులు చెప్పి చూచినారు, వినలేదు. తుదకు దమయంతి స్వయముగా ఆట వద్దకు వచ్చినది. నలుని వారించినది. నలుడు పిచ్చివానివలె ప్రవర్తించినాడు. చపల చిత్తునివలె చూచినాడు. ఆటమాత్రము మానలేదు.
    దమయంతి మరలి అంతఃపురము చేరినది. చింతాక్రాంత అయినది. "దైవమా! నా భర్తకు ఓడిన కొలది జూదమందు అభిలాష పెరుగుచున్నది. జూదము కీడు కలుగుటకు మూల కారణము. అందునను కాయలు నా భర్తకు ప్రతికూలముగను, పుష్కరునకు అనుకూలముగను పడుచున్నవి. ఏమి చేయవలెనో తోచకున్నది" అని విచారించినది. దమయంతి మంత్రులను, మిత్రులను పిలిపించినది. తన కొడుకును, కూతురును విదర్భ పంపుటను గురించి ఆలోచించినది. రానున్న ప్రమాదమును గుర్తించి ఉపాయము కనుగొన్నందులకు వారు దమయంతిని శ్లాఘించినారు. నల దమయంతుల కుమారుడు ఇంద్రసేనుని, కుమార్తె ఇంద్రసేనిని విదర్భ పంపుటకు అంగీకరించినారు. దమయంతి వార్షేయుడు అను సారథిని పిలిచినది. పిల్లలను ముద్దు పెట్టుకున్నది. విడువలేక విడువలేక పిల్లలను అతనికి అప్పగించినది. విదర్భలో వదిలి రావలసినదని పంపినది.
    దమయంతి ఊహించినంత జరిగినది. నలుడు సకల రాజ్యమును పుష్కరునకు ఓడినాడు. కట్టుబట్టలతో అడవులకు తరలినాడు. వెంట దమయంతి సాగినది. నలుడు పిచ్చివాడయి సాగినాడు. అతని బుద్ధి మందగించినది. ఆ పట్టణపు పరిసరారణ్యములందే మూడురోజులు ఉన్నాడు.
    నలుడు మహారాజు, వీరుడు, ధర్మజ్ఞుడు. ఇప్పుడు అన్నియు పోయినవి. నలుడు పిచ్చివాడు. ప్రజలు అతనిని పట్టించుకొనలేదు. ఒక్కడు మాట్లాడలేదు. పలకరించలేదు.
    ప్రజలు గెలిచిన వానినే భజింతురు.
    నలునకు ఆకలి బాధ ఎక్కువ అయినది. తినుటకు తిండిలేదు. ఆకలి మండిపోవుచున్నది. అతనికి అచట తిరుగు పక్షులు కనిపించినవి. వాటిని పట్టి ఆకలి బాధ తీర్చుకొనవలెననుకున్నాడు. మొలనున్న బట్ట విప్పినాడు. పక్షుల మీదకు విసరినాడు. పక్షులు ఆ బట్టతోనే ఆకసమునకు ఎగిరిపోయినవి. దిసమొలతో నలుడు ఆకసమునకు ఎగిరిన పక్షులను చూచినాడు.
    "మహారాజా! మేము జూదమందు నిన్ను ఓడించి, నీ రాజ్యము అపహరించిన సొగటాల కాయలము. ఇప్పుడు నీ వస్త్రము హరించుటకు పక్షుల రూపమున వచ్చినాము. హరించినాము. ఎగిరిపోవుచున్నాము" అని దిగంబరుడయిన నలుని చూచి వెక్కిరించుచు పక్షులు ఎగిరిపోయినవి.
    నలుడు పక్షుల మాటలు విన్నాడు. తలదించుకున్నాడు. జూదము వలన ఈ గతి పట్టినదని దుఃఖించినాడు. దమయంతి గమనించినది. గ్రహించినది తన చీరలో సగము చించి నలునకు ఇచ్చినది. ఆవిధముగా నలదమయంతులు ఒకే బట్టను కట్టుకున్నారు. ఒకే రకమయిన దుఃఖమును మనములందు మోసినారు. ఒకరికి ఒకరై దుఃఖించుచు అచటినుండి సాగినారు.
    నలదమయంతులు కొంత దూరము సాగినారు ఒకచోట బాటల కూడలి వచ్చినది. వారు అచట ఆగినారు. నలుడు దమయంతితో అన్నాడు:-
    "దమయంతీ! ఇచట నాలుగు మార్గములున్నవి. ఒకటి దక్షిణమునకు, రెండవది విదర్భకు, మూడవది కోసలకు, నాలుగవది ఉజ్జయినికి వెళ్లును. నీవు నాతో అడవులకు వచ్చి కష్టములు పడజాలవు. మీ తల్లిగారి ఇల్లయిన విదర్భకు వెళ్లుము."
    "మహారాజా! నేను ఉండజాలని అడవులందు నీవును ఉండజాలవు. భయంకరములగు అడవులందు క్రూరమృగములతో ఉండవలసిన పనిలేదు రండి ఉభయులము విదర్భకు వెళ్లుదము." అని ఆలోచనము చెప్పినది దమయంతి.
    నలుడు అందుకు అంగీకరించలేదు. "నేను పూర్వము విదర్భ వెళ్లునపుడు సకల ఐశ్వర్యములతో వెళ్లినాను. ఈ దశలో నేను విదర్భకు వెళ్లలేను, వెళ్లినచో సకల బంధువులు నన్ను, నా వెఱ్ఱితనమును చూచి నవ్వుదురు. కావున నేను రాలేను. నీవు వెళ్లుము" అన్నాడు. అప్పుడు దమయంతి ఇట్లన్నది:-
    "నాథా! బాధలు, వ్యాధులుగల భర్తకు భార్యయే పరమౌషధము. భార్యతో కూడి ఉండిన భర్తకు ఆపదలు కష్టములుగా తోచవు. భర్తకు శ్రమ, అలసట, ఆకలి దప్పులు కలిగినపుడు భార్య నివర్తింపచేయును. కావున నేను కష్టపడుదునని నీవు భావించరాదు. నీతోడి కష్టము నాకు సర్వసుఖము. నీవు నన్ను విడువకుము. నేను వెంట వచ్చెదను. అందుకు నీవు సమ్మతింపవలెను."


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More