Home » Dr Ravuri Bharadwaja » పాకుడురాళ్ళు
డాక్టర్ రావూరి భరద్వాజ సాహిత్యం
పాకుడురాళ్ళు
ఈ పుస్తకం....
చదివి ముగించిన తరువాత, తొలిగా నేను చేసిన పని గాఢంగా నిట్టూర్చడం. యధాలాపంగా చదవడం ప్రారంభించి, మరింక విడువలేక, పుస్తకం చివరికంటా పూర్తి చేసిన తరువాతగానీ సుఖంగా గాలిపీల్చ లేకపోయాను. నిజానికీ నవలలోని కొన్ని భాగాలు అప్పుడప్పుడు 'కృష్ణా పత్రిక' లో చదివినవే! ఐనా మొత్తంగా కలిసి చదివినప్పుడు, నేను పొందిన ఆనందం వేరు.
మనలో చాలమందికి ఆధునిక నాగరికత ప్రసాదిస్తున్న సదుపాయాలను అనుభవించడమేతప్ప, వాటి వెనుకగల చరిత్ర తెలియదనుకుంటాను. రేడియో వాడుతున్న సామాన్యవ్యక్తికి, మార్కోనీ' పడినస్రమ తెలియదు. తంత్రీ వార్తా ప్రసార సాధనాలను ఉపయోగించుకొంటున్న వ్యక్తికి, 'గ్రహమ్ బెల్' పడినపాట్లు తెలియవు. అలాగే సినిమా చూస్తున్న ప్రేక్షకునికి, ఆ వెనుక జరిగే కథ కూడా తెలియని అనుకోవచ్చు.
'పాకుడు రాళ్ళు' ఒక నవలగా నాకు నచ్చడానికి కారణం, సినిమా వెనుక గల సినిమా చరిత్రను, రచయిత కథాత్మకంగా చిత్రించడమే కాదు; జరిగిన, జరుగుతున్న, జరగడానికి అవకాశాలున్న వేలాది సంఘటనలను మనోజ్ఞంగా తన రచనలో పోహణించడం కూడా కాదు; వీటన్నింటినీ మించి, వీటన్నింటి గురించి రచయితపడుతున్న మనోవేదన, వాటిని మార్చితీరాలని అతని ప్రగాఢ వాంఛ నన్ను కదిలించింది. నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా భావిస్తూ, వేలాదిమందిని తనవైపుకు ఆకర్షించే ఈ రంగంలో, పాతుకుపోయిన అవాంఛనీయమైన శక్తులను గురించి రచయిత మనకు కనువిప్పు కలిగిస్తున్నాడు. చిరునవ్వుల వెనుక మణగిపోయే ఆత్మఘోష, తళుకు చూపుల చాటున దాగిన కన్నీరు, తియ్యని మాటల మాటున పొంచున్న విషజ్వాలలు, మనకీ నవలలో ప్రత్యక్షమౌతాయి.
'రచనల్లో వాస్త వికత ఉండాలి' అనే వారు, ఈ నవలలోని వాస్తవికతను ఎంతవరకు అంగీకరిస్తారన్న దొక ప్రశ్న. ఎందుకిలా అంటున్నానంటే మనలో చాలా మందికి, అసలైన వాస్తవికత అవసరం లేదు. వాస్తవికత అని మనలకు భ్రమించ చేయగల దేదో మనకు కావాలి. అసలైన సిసలైన సత్యాన్ని మనం చూడనూలేము, చూసి భరించనూలేము.
ఈ సందర్భంలో అలెగ్జాండర్ కుప్రిన్ ను వొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అతను వ్రాసిన 'యమకూపం' చదివినప్పుడు అందులోని సంఘటనలు, పాత్రలు, చాలా కాలం నాకు మనశ్శాంతి లేకుండా జేశాయి. హృదయం కన్నీటితో నిండిపోయింది. ఆ పాత్రలపట్ల అనంతమైన అనురాగంతో, సానుభూతితో మనం చలించిపోతాం.కుప్రిన్ కుముందు, ఆతరువాత కూడా ఆ నవలలో చిత్రించిన సంఘటనలూ, అలా బ్రతుకుతున్న వ్యక్తులూ వున్నమాట నిజమే. కానీ కుప్రిన్ మాత్రమే ఆ జీవితాన్ని కథావస్తువుగా స్వీకరించి, లోకోత్తరమైన కళాఖండాన్ని సృష్టించగలిగాడు.
మిత్రులు శ్రీ భరద్వాజకూడా, యీ నవలదాంతో అటువంటి విజయాన్నే సాధించారు. ఇందులోని కొన్ని సంఘటనలతో మనం ఏకీభవించక పోవచ్చు. కానీ_ఈనాడీ వ్యవస్థలో అవి పేరుకుపోయి వున్నాయో లేదో మనం చూడాలి. కారు చీకట్లో మారుమూలాల పడిఉన్న వాస్తవిక సంఘటనలు ఏర్చి, కూర్చి మనముందుంచారు శ్రీ భరద్వాజ.
రచయిత నిజాయితీ, బాధ్యత, ఇలాంటి ఘట్టాలతోనే బైటపడుతుంది. సమకాలీన సమాజానికి కోపంవస్తుందని భయపడి, చేతులు ముడుచుకు కూచున్న రచయిత, సంఘంపట్ల తనకున్న బాధ్యతను విస్మరించాడన్న మాట. ఉత్తమ రచయిత లెవ్వరూ అలాచేయరు, చేయలేరు కూడాను. వీరేశలింగం పంతులుగారూ, గురజాడ అప్పారావుగారూ, గిడుగు రామమూర్తి పంతులుగారూ, త్రిపురనేని రామస్వామి చౌదరిగారూ, గుడిపాటి వెంకటచలంగారూ_సమకాలీన సమాజాన్ని చూసి భయపడి ఉన్నట్లయితే, తెలుగుజాతి ఇప్పుడేస్థితిలో ఉండేది మనం ఊహించనుకూడా లేము.
చెప్పవచ్చిందేమిటంటే 'పాకుడురాళ్ళు' నవలలోని కొన్ని సంఘటనలు,సన్నివేశాలు, సామాన్య పాఠకునికి చాలా కొత్తగా కనిపిస్తాయి. వాటిని అభివ్యక్తం చేయడంలో రచయిత ప్రదర్శించిన చొరవ, తెగువ అభినందనీయమైనవి. 'దారుణాఖండల శస్త్రతలన్యము' లైన వాక్యాలతో శ్రీ భరద్వాజ ఆయా ఘట్టాలను చిత్రించిన విధానం అపూర్వంగా ఉన్నది. తను చెప్పదలచుకున్నదేదో బలంగా చెప్పగల బహుకొద్దిమంది రచయితలలో భరద్వాజ వొకరు. ఆయన విమర్శ, వ్యక్తి గతంగా ఉండదు. ఆ వ్యక్తులతాలూకు సమాజమూ, అందులోని వాతావరణమూ, ఆయన విమర్శకు గురిఅవుతాయి.
అట్టడుగు నుండి జీవితం ప్రారంభించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రతిభాశాలి మంజరి. నీగ్రో బానిసగా జన్మించి, అమెరికా చరిత్రనే మార్చి వేసిన 'జార్జి వాషింగ్ టన్ కార్వర్'; మామూలు కార్మికుడుగా బ్రతుకు ప్రారంభించి, కార్ల సామ్రాజ్యాధిపతిగా పేరు సంపాదించిన 'వాల్టర్ పెర్సీ క్రిజ్లర్'; మట్టిలో పుట్టి, మణిమందిరాలలో నివసించిన 'మార్లిన్ మన్రో' -వీరందరూ అనుసరించిన మార్గాలనే మంజరికూడా అవలంబించింది. తమ ధ్యేయాన్ని సాధించుకోవడానికి నిరంతరకృషీ, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమూ, వారి విజయాలకు కారణాలు. మంజరి కూడా ఈ రెండు సూత్రాలనూ అక్షరాలా పాటించింది. గుంటూరు గుడిసెల్లో తిరిగి, బొంబాయిలోని చలువరాతి మందిరం చేరిన ఈ మధ్య కాలంలో, మనకొక విచిత్రమైన చలనచిత్ర ప్రపంచాన్ని చూపించింది.
సినిమారంగం ఆధారంగా, తెలుగులో చాలా చిన్నా కథలొచ్చాయిగానీ, పెద్ద నవలారూపంలో రావడం మాత్రం ఇదే ప్రథమం. ఆ గౌరవం శ్రీ భరద్వాజకు లభించినందుకు, అతన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
బుద్ధిపూర్ణిమ విశ్వావసు - ఆలపాటి వెంకట్రామయ్య.