Home » Dr Ravuri Bharadwaja » పాకుడురాళ్ళు
స్నేహాంజలి
ఇరవై అయిదు సంవత్సరాల కిందటి మాట. అప్పట్లో గుంటూరుజిల్లాలోని తాడికొండ గ్రామంలో _"బాల భారతీ నాట్యమండలి" పేరుతో నాటకసంఘం వొకటుండేది. అందులో నేనూ, నా మిత్రుడు పందిటి రామచంద్రరావూ సభ్యులం. ఈ సంఘంవారు చాలా నాటకాలాడారు; భక్త శ్రీయాళ", "సరోఖముఖి", "గాయోపాఖ్యానం", "తులాభారం", "చింతామణి", "ఉద్యోగ విజయాలు"- ఇలా ఎన్నో నాటకాలు, తాడికొండలోనూ ఆచుట్టు ప్రక్కలా ప్రదర్శించాము.
ఆ నాటకాల్లోని స్త్రీ వేషాలను మొగవాళ్ళే వేస్తుండేవారు. మా రామచంద్రరావు అందులో ప్రసిద్ధుడు. తొలిగా స్త్రీ వేషాలను స్త్రీలే వేయాలన్న సూచన చేసింది మా కంపెనీ హీరో అప్పయ్యగారు. ఆ సూచన మేరకు మా రామచంద్రరావు గుంటూరు నుండి వొక 'నటి'ని తీసుకొచ్చాడు. ఆ తరువాత కొద్దికాలానికే కంపెనీ మూతపడిపోయింది.
తిరిగి దాన్ని పునరుద్దరించినవారు, మిత్రులు శ్రీ కొల్లూరి వెంకటేశ్వర్లుగారూ, శ్రీ బి.వీరయ్య గారూను యువజనుల్లోని ఉత్సాహోద్వేగాలు వృధాకాకూడదనీ అవి సమాజాభ్యుదయానికి తోడుపడాలన్న ఉద్దేశంతో సాంఘిక నాటకాలు ప్రదర్శించవలసిందని వారు మమ్మల్ని ప్రోత్సహించారు. ఒకటి రెండేళ్ళపాటు గావును, రకరకాల సాంఘిక నాటకాలను దూరప్రాంతాలకు కూడా వెళ్ళి మేము ప్రదర్శించాం.
ఈ ఇద్దరు మిత్రులు అండదండలూ, మాకు అనుక్షణం ఉండేవి.
1944 ప్రాంతాలలో నేను రచనలు చేయడం ప్రారంభించాను. నా ముఖ్య శ్రోత కొల్లూరి వెంకటేశ్వర్లుగారు. కథ వినిపించి 'ఎలా ఉంది?' అని అడిగినప్పుడు, నవ్వుతూ నా తప్పులను వేలెత్తి చూపించేవారాయన. తాడికొండలో ఉన్నప్పుడు నేను వ్రాసిన చాలాకథలు, ముందుగా చదివినవారు వెంకటేశ్వర్లుగారే! ఆనాటి, వారి నిశితవిమర్శ నా అభివృద్ధికి చాలా తోడుపడింది. ఆ తరువాత నేను పొట్టచేతపట్టుకొని, తాడికొండ వదిలాను. 'కొల్లూరి' ఇతర వ్యాపకాల్లో మునిగిపోయారు.
ఇరవై సంవత్సరాల తరవాత, గుంటూరులో కలుసుకొన్నప్పుడు, మళ్ళీ ఆ వెనుకటి ఆప్యాయతా, ఆదరణా నేననుభవించాను. ఈమధ్య కాలంలో నేనూ, వారు కూడా చాలా మారిపోయాం. కానీ మా స్నేహం మాత్రం చెక్కుచెదర కుండా అలానే ఉన్నది.
"పాకుడురాళ్ళు మీకు అంకితమిస్తున్నాను" అన్నప్పుడు_
"ఎందుకోయ్ ఇదంతా?" అన్నారాయన నవ్వుతూ.
"ఇంతకన్నా మన స్నేహానికి గుర్తుగా నేనివ్వగలిగిందేమీ లేదు అన్నాను.
నవ్వుతూ భుజం తట్టారు శ్రీ కొల్లూరి.
ఆ సౌజన్యమూర్తికి మిత్రునిగా నేనిది వారికిస్తున్నాను.
__ భరద్వాజ.