Home » Pasupuleti Mallikharjuna Rao » Samanthara Rekhalu


   
    "ఎందుకుంటాను? ఉండను, డాక్టర్, ఉండను. మామయ్యతో చెప్పి ఒప్పించండి. వేణు పెళ్ళి విషయంలో ఆయన ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. కాదంటే పాప చెప్పిందనండి. డాక్టర్ ..... డాక్టర్ .... నా కోరిక తీర్చరూ?"
    సునీతను దగ్గిరికి తీసుకుంది. నీరు నిండుతున్న కళ్ళతో, "పాపా! అమరసందేశాలన్నీ నీలో నిండి ఉన్నాయి. బృందావనిలో మహత్తరమైన రాధామాధవుల రాగవాహినులన్నీ నీలో ప్రవహిస్తున్నాయి. నువ్వు నాకు ఒక్క వాగ్ధానం చెయ్యాలి" అంది.
    "చేస్తాను, డాక్టర్."
    "రాధ, వేణుల పెళ్ళి అయ్యాక నువ్వీ ఉద్యోగం వదిలెయ్యాలి. నువ్వు ఎమ్. బి. బి. ఎస్. చదవాలి. నువ్వు, నాన్న నా దగ్గరే ఉండిపోవాలి."
    "చూస్తాను, డాక్టర్!"
    "చూడటం కాదు. నీ చెయ్యి అమృతసంజీవిగా తయారవ్వాలి. నీ చేతి స్పర్శకు మృత్యువు బీతి చెందాలి."
    "................."
    "పాపా, నువ్వు ఊఁ అనక తప్పదు. నేను అర్ధిస్తున్నానమ్మా."
    "అలాగే!"
    "ఓహ్! మళ్ళీ ఒకసారి..... ఆ రోజులా..... 'అమ్మ .... అమ్మ' అను, పాపా!"
    సునీత మూడుసార్లు ఉచ్చరించింది "అమ్మ" అని.
    గోవిందరావు ఆర్తినోట సునీత కోరిక విని ఖిన్నుడయ్యాడు. అయిష్టంగా తల ఊపుతూ, "వేణు నడగాలి. సునీతతో కూడా మాట్లాడాలి" అన్నాడు.
    "ఎవరినడిగినా అంతే, నాన్నా! సునీత నిశ్చయం మారదు. వేణు రాధవైపే మొగ్గవచ్చు."
    "నీకు గట్టిగా తెలుసా, ఆర్తీ?" సారథి ప్రశ్న.
    "అనుకుంటున్నాను. సాయంత్రం రాగానే అడుగుదాం."

                                 *    *    *

    "అమ్మగారీ చీటీ ఇవ్వమని వెళ్ళిపోయారు." ఫ్యూన్ కాగితం తెచ్చి ఇచ్చాడు.
    దాన్ని తీసుకుని వెళ్ళబోతున్నవాడల్లా అలాగే కూర్చుని దాన్ని చదవసాగాడు.
    "వేణూ,
    మిమ్మల్ని ఏది కోరానో, కోరలేదో నాకు గుర్తు లేదు. అన్నీపోగా మిగిలినవి రెండే వాంఛలు.ప్రస్తుతం అందులో ఒకదాన్ని అడుగుతున్నాను. రెండవది త్వరలోనే.
    మీరు ఇంటికి వెళ్ళగానే నాన్నగారు పెళ్ళి విషయం ఎత్తుతారు. మీరు నిస్సంకోచంగా రాదనే చేసుకుంటాననండి. అందులో ఏమాత్రం వెనుకంజ వద్దు.
    ఎన్నో రోజులనుండి అనుకొంటున్నాను, రాధా మాధవుల కల్యాణం కళ్ళారా చూద్దామని. అది మీ ద్వారా సఫలం కాబోతున్నది. మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తున్నందుకు క్షంతవ్యురాలిని.
    మరొక రహస్యం, నేను ఎవరో, నా పుట్టు పూర్వోత్తరాలేమిటో మీరు తెలుసుకోబోతున్నారు. అందుకు ఏర్పాట్లన్నీ చేస్తున్నాను. మీ వివాహమైన రాత్రి అంతా తెలుసుకోగలరు.
    ఒకదానివెంట ఒకటి అన్నీ శుభప్రదమైన పనులే జరుగుతున్నాయి. ఇకముందు ఇంతకన్నా జరగవలసిన శుభం ఏదీ లేదనుకుంటాను. మీ వివాహానంతరం అతి సాఫీగా రోజులు వెళ్ళిపోతూంటాయి.
    నేను చేసేదేదీ నాకోసం కాదు. దేవుడు అప్పగించిన బాధ్యతకోసం, పనిచెయ్యటం మనది. ఫలితం తనకు వదలమనీ భగవాన్ కృష్ణదేవుని ఆదేశం. ఆయన చెప్పి నట్లు ఒకరి మంచికోసం ఇది చేస్తున్నాను స్వల్పంగా! దీనికి దేవదేవునినుండి నాకేం లభిస్తుందో తెలియదు. దొరకకపోయినా విచారమెందుకు?
    ప్రేమించాలి! వాఛ కూడదు. తను ప్రేమించిన దానికోసం ఏదైనా చెయ్యగలగాలి. ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉంది. ప్రేమ పూసలో దారం వంటిది. అంతర్గతమై, నిష్కామమై తనవారికోసం దహించబడే ప్రేమ ఉత్తమమైంది.
    ప్రభూ, నా మాట కాదనరు కదూ?
                                                                                               -నీత."
    "కాదనను. కాదనను, నీతా!" వేణు దాన్ని జేబులో వేసుకుని లేచాడు.
            
                                  25

    వివాహ ముహూర్తం నిశ్చయమైంది. వానాకాలం ఇంకా పూర్తిగా ప్రవేశించలేదు.
    ముందు మాటగానైనా అనుకుని ఉండలేదు. తండ్రి వ్రాసిన ఉత్తరం చూసిన వర్ధనమ్మకు ఓ పట్టాన విశ్వాసం కలగలేదు. అది ఆమె చదివినా అంతే; రఘుపతి చదివాడు అదే!
    అప్పటికప్పుడు రఘుపతి హైదరాబాదు ప్రయాణ మయ్యాడు భార్యతోసహా. అంతా నిజమేనని తెలిసి బరువు తీరినట్లు 'హమ్మయ్య' అనుకున్నారు.
    సారధికి అంతకుముందే కళ్యాణి చరిత్ర తెలుసు. ఆమె రజనీప్రియను అప్పగించి మరణించిందనికూడా ఆర్తి చెప్పగా విన్నాడు. అతనికి మనస్సులో కొంత వైరాగ్యం మళ్ళీ కలిగింది. ఈసారి ఎక్కడికీ వెళ్ళలేదు. కాని ప్రతిరోజు ఎక్కువభాగం కృష్ణమందిరం ముందు ఉన్న వేపచెట్టు నీడలో మట్టి అరుగుమీద నిశ్చలంగా కూర్చోవటం అలవాటు చేసుకున్నాడు.
    ఆశ్రమం రోజురోజుకు అభివృద్ధి చెందుతూనే ఉంది. నిస్పృహతో అక్కడికి వచ్చినవారు తిరిగి ధైర్యంగా వెళ్ళి ఎక్కడో ఒకచోట జీవించగలుగుతున్నారు. ప్రభుత్వంకూడా కొంత సహాయాన్ని మంజూరు చేసింది.
    వేణుమాత్రం దీన్ని పట్టించుకోవటం లేదు. ఆఫీసు, ఇల్లు, సునీతనుకూడా మాట్లాడించడం లేదు. సునీత ఆశ్రమానికి కూడా రావటం మానేసింది.
    సోమవారం తెల్లవారుజామున ముహూర్తం. నాలుగు రోజులే ఉంది.
    శుక్రవారం రోజున తన భవిష్యత్తుతోబాటు యాదగిరి భవిష్యత్తు నిర్ణయించేసింది. అయితే ఎవరికీ చెప్పలేదు.
    నీలకంఠం దంపతులను రమ్మని వ్రాయమన్నాడు వేణు.
    ఒక మధ్యాహ్నం ఆఫీసుకు ఫోన్ చేసి విశ్వాన్ని తనను కలుసుకోమన్నది. విశ్వం వచ్చాక అతనికొక కవరు సీలు చేసింది-ఇస్తూ, "ప్రియమైన నీ చెల్లి సాక్షిగా ఇది నువ్వు చదవవద్దు. మంగళవారంనాటి రాత్రి వేణుకు అందజెయ్యి" అంది.
    "ఏమిటిది?"
    "తెలుస్తుంది. ఆరోజు ఉదయం తొమ్మిదిమ్ముప్పావుకు నేను నిన్ను మీ ఇంటిదగ్గిర-నిర్మల సహించలేని విషయమైనా-కలుసుకోగలను. ఆ రోజు నువ్వెక్కడికి వెళ్ళవద్దు."
    పెళ్ళి లగ్నంకూడా దగ్గిరపడింది.
    ఆ రాత్రి కొన్ని అవసరమైన వస్తువులన్నీ తనవీ, యాదగిరినీ సర్దివేయించింది. రాజు ఎక్కడికి వెళుతున్నారని అడిగాడు. మళ్ళీ తనను దిక్కులేనివాడిగా చెయ్యవద్దన్నాడు.
    "ఎవరూ దిక్కులేని వాళ్ళు కాదు. వేణుగారితో చెప్పి ఏదో ఏర్పాటు చేయిస్తాను. నువ్వు దిగులు పడకు, రాజూ!"
    "రేపు రాత్రే మన ప్రయాణం, నాన్నా! ముందు అమ్మ సమాధి దగ్గిరికి వెళదాం."
    "ఆ ఇంటికి తాళంవేసి ఉంటుందమ్మా!"
    "నేనడిగి తెస్తాను. అటు తరవాత అన్నయ్యల దగ్గిరికి వెళదాం."
    "వద్దమ్మా!"
    "వాళ్ళను ఒక్కసారి చూడాలని ఉంది."
    "నీకా సోదరప్రేమ ఉందేమో? వాళ్ళకు ఉండవద్దూ? నువ్వు గాయపడవచ్చు."
    "నేను ఫలానా అని వాళ్ళకు తెలియనివ్వద్దు."
    "లేనిపోని నిందలు అంటగడతారు. ఎదురుగా కాకున్నా చాటుగా అనుకుంటారు. వాళ్ళ దోవ వేరు. నీ దోవ వేరు."
    "సరే! మళ్ళీ మనం ఈ వైపుకు రాకూడదు, నాన్నా. రమణాశ్రమంలాంటి ప్రదేశాలెన్నో ఉన్నాయి. అక్కడే మనం ప్రశాంతంగా బ్రతకగలం."
    తెల్లవారుజామున వాళ్ళు వివాహమంటపానికి వెళ్లారు. సునీత ఆ తంతు దీక్షగా చూస్తూంది. ఆర్తి దగ్గిర నిలుచుంది. గోవిందరావు యాదగిరిని చూసి అమితానందం పొందాడు.
    "అబ్బ! ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, గిరీ?"
    "ఇక్కడే! ఆర్తికి తెలుసు."
    చిరకాలం తరవాత కలుసుకున్న వాళ్ళిద్దరూ చిన్న నాటి కబుర్లలో పడిపోయారు. సునీత ఎవరో తెలియకుండా జాగ్రత్తపడ్డాడు గిరి.
    వేణు నిర్మలంగా సునీతను, ఆర్తిని చూస్తున్నాడు. రాధ పెళ్ళి కూతురుగా, అతని ఎదురుగా తెరవెనక సిగ్గుతో తలవంచుకుని కలలు కంటూంది. వేణు నిశ్చలమైన కళ్ళలో నీరు సుళ్ళు తిరుగుతున్నది. వేదఘోషలు, భజంత్రీలు ఏవీ అతనికి వినపడటం లేదు. అతనికి వినపడేది ఒక్కటే, "వేణూ.... వేణూ..." అన్న రాగపూరితమైన పిలుపు.
    సునీత స్థితీ అలాగే ఉన్నది. ఆమె చెవుల్లో, "నీతా.... నీతా..." అన్న ప్రతిధ్వనులే తప్ప ఈగొ డవేదీ లేదు.




Related Novels


Samanthara Rekhalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.