Home » Pasupuleti Mallikharjuna Rao » Samanthara Rekhalu



    "అబ్బ! ఈ సంతోషంతో చచ్చిపోతానేమో ననిపిస్తూంది, పాపా!"
    "శుభసమయంలో అలా అనకూడదు, డాక్టర్!"
    కాసేపు మాట్లాడి ఆమె వెళ్ళిపోయింది. సునీత రిమెంబరేన్సర్ వైపు చూసింది. ఆ రోజు శనివారం. ఆ ఉత్తరం పోస్టుచేసి వారమైంది. వచ్చే శనివారమే వాళ్ళు వస్తున్నారన్నమాట.
    అదే మధ్యాహ్నం నీలకంఠం ఆదరాబాదరాగా వచ్చాడు. వాలకం చూస్తే ఎక్కడో కొట్లాడి వచ్చినట్లున్నాడు. షర్టు కున్న గుండీల్లో ఏ ఒక్కటీ సరిగా లేదు. జుట్టంతా చిందరవందరగా ఉంది.
    వస్తూనే జేబులోనుంచి ఒక కాగితం తీశాడు. "నన్ను ట్రాన్స్ ఫర్ చేశారు, పెద్దమ్మా!"
    "ట్రాన్స్ ఫర్?" ఆ కాగితం అందుకుని చదివింది.
    "ఎప్పుడు వెళుతున్నారు, మరి?" అంది.
    "ఆఁయ్! వెళ్ళటం? వెళుతున్నానని ఎవరన్నారు?"
    "మానేస్తారా?"
    "ఆఁ. నాకు ఇక్కడే బావుంది."
    "బావున్నంత మాత్రాన? వాళ్ళు ఒప్పుకోవద్దూ?"
    "పోనీ, రిజైన్ చేస్తాను. లేకపోతే మానె ఈ ఉద్యోగం."
    "ఊరికే ఉంటారా?"
    "దీని బాబులాంటిది సంపాదిస్తాను."
    "ఉఫ్, మీరు సాయంత్రం ఇంటి దగ్గిర ఉండండి! అప్పుడంతా నిర్ణయించవచ్చు!"
    అతను వెళ్ళాడు.
    "ప్రభూ, అన్నీ ఒకదాని వెంట ఒకటి తరుముకు వస్తున్నాయి! దీని పర్యవసానం నాకు ఎలా పరిణమించినా సరే, కాని అందరికీ క్షేమం చేకూర్చు!"
    
                            *    *    *

    శనివారంకూడా రానే వచ్చింది. శనివారంతోబాటు సారథి, గోవిందరావు వచ్చారు. విమానాశ్రయంలో ఢిల్లీనుంచి వచ్చే విమానం రన్ వే మీద దిగి పరిగెత్తు తూంటే దాని ప్రాసెల్లరుకన్నా వేగంగా ఆర్తి గుండె కొట్టుకున్నది.
    అక్కడికి సునీత ఆ రోజు రాలేదు. శతవిధాల చెప్పి నీలకంఠాన్ని, కరుణను ప్రయాణంచేయించింది. కరుణ కూడా ఓ పట్టాన అంగీకరించలేదు. ఆ రోజు తను, గిరీ స్టేషనుకు వచ్చారు. కాకతాళీయంగా వాళ్ళ ఆఫీసును సెలవుమీద ఊరు వెళుతూంటే పంపించటానికి విశ్వంకూడా వచ్చాడు.
    బండి కదిలేముందు సునీత చెప్పింది; "వారం రోజులు చెప్పవలసివచ్చింది, మీరు వెళ్ళేందుకు, బాటన పోతూంటే ఎవరో కలుస్తారు; విడిపోతారు. ఈమధ్య ఎన్నో మలుపులున్నా అవి తిరగవలసిందే. తప్పుకోలేం. అన్నిటిని దాటుతూ సాగిపోవటమే సార్ధకత. ఇవ్వాళ ఇక్కడ మేము, అక్కడ మరొకరు స్నేహితులవుతారు. అంతమాత్రం చేత అక్కడే తప్ప మరొక చోటికి వెళ్ళనని భీష్మించుకోరాదు. తటస్థ పడ్డంత మాత్రాన స్థిరంగా ఒకచోట ఉండాలనుకుంటే పడదు. అవసరమైతే వీటన్నిటిని మరిచిపోవటమో, విడి పడటమో చెయ్యగలిగిన మనోబలం అవసరం. మనం దీనికే వీల్లేదని కూచుంటే ఇంతకన్నా బలమైన ఎడబాటులు సంభవిస్తాయి."
    కంటినీరు పర్యంతమై, "నువ్వు మమ్మల్ని పంపించెయ్యాలని చూస్తున్నావే!" అంది కరుణ కళ్ళు డస్తీతో ఒత్తుకుంటూ.
    "ఉఫ్! అలా అనుకోకు, కరుణా. మనం బతికున్న న్నాళ్ళూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది."
    నీలకంఠం అన్నాడు! "మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటాను."
    "తరవాత ఏదన్నా చెయ్యవచ్చు! కానీ సునీత అన్నట్లు అన్నిటినీ సర్దుకు పోగలిగేందుకు తయారుగా ఉండాలి." యాదగిరి అన్నాడు.
    "అవును, బ్రదర్! ఇన్ని రకాల మిట్టపల్లాలను ఏర్పరుస్తూ, వియోగ సంయోగాలను, కష్టసుఖాలను ఘనీభవింపజేస్తూ సాగిపోయేదే జీవితం." విశ్వం అన్నాడు.
    కంపార్ట్ మెంట్ ముందు నిలుచున్న నీలకంఠంతో పాటు అందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి.
    "నాకు వ్యాసాలెవరు వ్రాసిస్తారు? ఎవరు చర్చిస్తారు?"
    "మీ సహచరి కరుణ ఉన్నది. అహర్నిశలూ ఆమె మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటుంది."
    "సునీతా, రెండుమూడు రోజుల కొకసారి ఉత్తరాలు రాయాలే!"
    "తప్పకుండా. దిరిసెనపువ్వులాంటివాడు నీలకంఠం. ఎలా కాపాడుకుంటావో?"
    ట్రెయిను కేకవేసింది.
    కరుణ, నీలకంఠం ఎక్కారు. బండి మరోసారి కేక వేసి కదిలింది.
    "నమస్తే, పెద్దమ్మా! నమస్తే, తాతయ్య గారూ! నమస్తే, బ్రదర్!"    
    కరుణ కూడా నమస్కరించింది. వాళ్ళు ప్రతి నమస్కరించారు.
    మూడుగంటలకు ఆర్తి ఫోన్ చేసింది: "నువ్వు వస్తానని రాలేదేం, పాపా?"
    "రాలేకపోయాను. నీలకంఠంగారిని పంపడానికి స్టేషనుకు వెళ్లాను. డాక్టర్!"
    "పోనీ, ఇప్పుడు రాకూడదూ?"
    "సాయంత్రం ఎలాగూ ప్రార్ధనకు వస్తాను కదా?"
    "నాన్న చూడాలనుకుంటున్నాడు."
    "నే నిప్పుడే చచ్చిపోతున్నానా? ఏం, డాక్టర్?...."
    "శ్.....శ్......శ్.....ఏం మాటలు, పాపా!"
    "ఇన్నాళ్ళూ నా మాటలు ఎక్కువగా అర్ధం చేసుకున్నారు. ఇప్పుడవి అర్ధంకావు. నా చేష్టలే అర్ధమవుతాయి."
    "ఏమిటో? సాయంత్రం తప్పకుండా రావాలి."
    "ఆఁ, రేపు మీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఎప్పుడు వీలుపడుతుంది, డాక్టర్?"
    "నువ్వెప్పుడంటే అప్పుడే."
    "ఉదయం పదకొండున్నరకు. థాంక్స్, డాక్టర్!" ఫోన్ పెట్టేసింది.
    ఆ రాత్రి యాదగిరితో అన్నది: "మన పాత్ర ఇక్కడ త్వరలో ముగిసిపోబోతున్నది. అన్నిటికీ సిద్ధంగా ఉండు, నాన్నా."
    "ఎక్కడికి వెళదాం?"
    "ఎక్కడికైనా సరే మళ్ళీ మరొక మలుపు. బహుశా ఇదే చివరి మజిలీ అవుతుందేమో?"
    "నువ్వు.... నువ్వు.... పెళ్ళిచేసుకుని..."
    "నాన్నా, అందరి తండ్రుల్లా నువ్వలా కోరితే?"
    "లేదు. అది నీ ఇష్టం. ఊరికే అడుగుతున్నాను. నేను నీ తండ్రినే అయినా పెంచి పెద్ద చెయ్యలేదు. నిన్ను పెంచిన అవ్వనైనా కాదు. నీకు శాసనకర్తవు నువ్వే. ఆ అధికారం నీ ఒక్కదానికే ఉందమ్మా. నేను ... నేనంతటివాడిని కాదు."
    'డాక్టరు గారు చెప్పిన తుఫాను వస్తూంది. మొదటి నిష్క్రమణం నాదే కాబోతున్నది.' స్వగతం చెప్పు కుంది సునీత.
    నీలకంఠం , కరుణ ఉండిపోయిన భగం బావురు మంటూంది. గుమ్మంలోనుంచి అటు చూస్తే వాళ్ళ మాటలు, పిలుపులు చెవుల్లో ధ్వనిస్తున్నాయి.
    'నేను వాళ్ళను పంపించడం తప్పయితే నన్ను క్షమించు, భగవాన్! పసిమనసులగు వాళ్ళకు నీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండేటట్లు చెయ్యి.'
    "ఏమిటో ఈ మనుష్య జీవితాలన్నీ క్షణిక నాటకాలు." యాదగిరి బరువుగా కళ్ళు మూసుకున్నాడు.
    పదకొండు గంటలకు వస్తానంది కాని రాలేదు. ఆర్తి రెండు మూడుసార్లు ఫోన్ చేసింది కాని రాలేనని చెప్పలేకపోయింది సునీత. సాయంత్రం మామూలుగా వెళ్ళింది ప్రార్ధనాసమయానికి.
    "ఈమధ్య కొన్ని రోజులనుంచీ నీ తీరు అదోవిధంగా ఉంటూంది. నీ నోటితో చెప్పితే, ఆరునూరైనా, నూరు ఆరైనా చేసితీరేదానివి. అబద్దాలు నేర్చుకుంటున్నావు, పాపా!"
    "నూరు అబద్ధాలు అయ్యాక, ఒక పెళ్ళి చేద్దామని." సన్నగా నవ్వు.
    "ఏం పెళ్ళో! నువ్విలాగే ఉంటేమాత్రం వేణుతో, రాధతో చెప్పక తప్పదు."    
    "ఎప్పుడైనా చెప్పేదే ..... కొన్ని రోజులే ఉందది. మీ నాన్నగారికి తెలిసింది అనుకుంటాను. మీరు చెప్పారా, డాక్టర్?"
    "చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు అనుజ్ఞఇవ్వలేదు."
    "నేనాజ్ఞాపించేదాన్ని కాదు. మీ పాపను, డాక్టర్!"
    "అది వదిలెయ్యి. నిన్న ఒంటరిగా ఎందుకు మాట్లాడాలనుకున్నావో చెప్పు!"    
    "అదా? వేణు ... వేణు.... పెళ్ళి విషయం. అదొక్కటే మిగిలి ఉంది. వారిని .... వారిని.... పెళ్ళి కొడుకుగా చూడాలనుంది, డాక్టర్."
    ఆర్తి సునీత చెయ్యి పట్టుకున్నది. గట్టిగా ఒత్తుతూ "అదెలాగూ జరుగుతుంది. నువ్వు...." అంది.
    "సాధ్యమైనంత త్వరలో జరగాలి. అందుకు నేను తహతహపడుతున్నాను. వీలయితే ఈ నెలలోనే జరిగిపోవాలి."
    "ఈ నెలలోనా?"
    "ఆలస్యమయితే అమృతమే విషమవుతుంది, డాక్టర్. మిమ్మల్ని నేను కోరేది ఇది ఒక్కటే! ఈ జన్మలో మళ్ళీ ఏదీ కోరను."
    "వేణు పెళ్ళి అవుతుంది. నువ్వు ఏకాకిగానే ఉండిపోతావా?"




Related Novels


Samanthara Rekhalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.