Home » Pasupuleti Mallikharjuna Rao » Samanthara Rekhalu



    తెర తొలగించబడింది. రాధ అతని పక్కకు వచ్చింది.
    మాంగల్యం చేతికి ఇవ్వబడింది. సునీత గుండెమీద చెయ్యి వేసుకుని లాకెట్ ను బిగ్గరగా గుప్పిట్లో పట్టుకుంది.
    రాధ మెడలో రెండు తనువులను గట్టిగా బంధిస్తూ మూడు ముడులు వెయ్యబడ్డాయి. సునీత లోతు గుండెల్లో మూడుకోట్ల మాంగల్యాలు ముడివెయ్యబడ్డాయి.
    తలంబ్రాలు పడుతున్నాయి.
    కళ్ళు మూసుకుంది సునీత. ఆ వివాహవేదికమీద తనే! తన ఎదురుగా ఉన్నది వేణు. కళ్ళలోకి చూస్తూ చిలిపిగా నవ్వి, ఏమిటో అంటున్నాడు భుజంమీద చెయ్యివేసి.
    "వేణూ ... వేణూ ..."
    ఎవరిదో హస్తస్పర్శ సునీత నీలోకంలో పడేసింది. కళ్ళు తెరిస్తే ఆర్తి. ఆమె వైపే చూస్తూంది. సారథి కూడా ఉన్నాడు. అదృష్టవశాత్తు అక్కడ ఇంకెవరూ లేరు. ఉన్న ఒకరిద్దరూ వధూవరులు తలంబ్రాలు పోసుకోవటాన్ని ఆసక్తిగా తిలకిస్తూ ఇదేం పట్టించు కునేటట్లు లేరు.
    కానుకలు చదివించే సమయం వచ్చింది.
    సునీత ఒక పుస్తకం మాత్రం పట్టుకు వచ్చింది. అంతమందిలో ఆ చిన్న పుస్తకం చదివిస్తున్నందుకు ఆమెకు నామోషీ అనిపించలేదు. ఎవరేమనుకుంటే తనకెందుకు? తన వేణు దానిని మనఃపూర్వకంగా స్వీకరిస్తాడు. అదె తనకు చాలు.
    ఆర్తి అడుగుతూంది, "ఏం తెచ్చావు, పాపా?" అని.
    దానికీ జవాబివ్వలేదు. ఒక్కొక్కరే తమ కానుకలను వధూవరులకు అందజేస్తున్నారు. యాదగిరి తన వేలికి ఉన్న ఉంగరాన్ని ఇచ్చాడు.
    బ్రాహ్మడు అంటున్నాడు: "మీ అక్కయ్య ఆర్తీదేవి, బావ సారధిగారలు కలిసి యాభైవేలు రొక్కం." అదికూడా అయిపోయింది.
    "మీ స్నేహితుడు విశ్వం...." అదీ అయిపోయింది.
    తనకు సెలవు దొరకని కారణాన తాము రాలేక నీలకంఠం పంపిన విజ్ఞానసర్వస్వాలు మూడు సునీతే చదివించింది.    
    ఆఖరిసారిగా తన పుస్తకం అందించాలనుకుంటుండగా ఒక రేడియో వచ్చింది. తెచ్చినాయన బ్రాహ్మడికేదో చెప్పాడు.
    "మీ స్నేహితురాలు సునీతాదేవి వధూవరుల నాశీర్వ..."
    "డాక్టర్.... డాక్టర్..... నేనది తేలేదు, తేలేదు."
    ఆర్తి మృదువుగా ఆమె భుజం నొక్కి, "నువ్వు తెచ్చావు. ఆ రేడియో నీ తరపు నుంచే అందుకున్నట్లు వేణు అనుకోవాలి. సునీతా, ఇప్పుడు నువ్వేది అడ్డు పెట్టినా బావుండదు. నీ చేతిలో ఆ పుస్తకం కూడా ఇచ్చెయ్యి" అంటూ అది తీసుకుని ముందుకు వెళ్ళి అదికూడా అందివ్వమని బంధువు ఒకామెకు ఇచ్చింది.
    ఆమె బలవంతంమీదనే టిఫిను, కాఫీ తీసుకుని వెళతానంది. గోవిందరావు యాదగిరి ని వదిలేట్లు లేడు. కొద్దిగా ఆగి వస్తానన్నాడు. వెళుతూంటే ఒక ఆరేళ్ళ కుర్రవాడు వచ్చి ఒక  కాగితం ఆమెకిస్తూ, "మరే, చిన్నాన్న ఇది ఇయ్యమన్నాడు" అంటూ తుర్రున జారుకున్నాడు. ఇంటికి వచ్చి దాన్ని విప్పింది.
    "నీతా!
    నా గుండెలోనే కాదు, నీ హృదయంలోకూడా ఆరని చిచ్చు పెట్టావు. ఎందుకీ పని చేశావో నాకు అర్ధం కావటంలేదు. ఇది తెలిసిననాటినుండీ నాకిది అర్ధరహితంగానే ఉంటున్నది. ఎన్నటికీ అర్ధం కాదేమో?
    సమాంతరరేఖలుగా ఊహించుకున్నాను. కానీ నువ్వు ఒక ధృవానికి పయనిస్తున్నావు. రెండవ ధృవానికి చేరుకున్న నేను చుక్కానిలేని నీ పయనాన్ని చూస్తూనే ఉన్నాను. ఎన్నాళ్ళిలా సాగిపోతూంటావు?
    నీ పరిచయం కాకున్నా బావుండేది. నీ పరిచయంలో స్వర్గాలెన్నో ఊహించుకున్నాను. కోటి దివ్యవీణల సంగీతాన్ని వినాలని ఆరాటపడ్డాను. అవేవీ పొందలేదు. కానీ నీ ప్రేమలో ఒక మహోన్నతపథాన్ని, ఉత్తుంగ శిఖరాలను చూపించావు. కాని హఠాత్తుగా అగాథంలోకి తోసేశావు! అయితే ఆ అనుభూతినిమాత్రం నే నెన్నడూ మరవను.
    నీకోసం, నీ అధరాలనుండి మధుర సంగీతాలను, వేణుగానాలను స్మరింపచేసే నీ పిలుపుకోసం నా సర్వ స్వాన్ని అర్పణం చెయ్యడానికి సిద్ధపడ్డాను. నిజంగా నేనెంత స్వార్ధపరుణ్ణి! ఒక వ్యక్తికోసం, ఒక స్త్రీ ఆశలను భగ్నం చేయవద్దని నన్నే ధారపోయగల నీ త్యాగానికి నేను సిగ్గుపడుతున్నాను.
    నా మనసులో మనస్సువయ్యావు. నా భావాలను మలిచిన శిల్పానివయ్యావు. నా ఆవేశాన్ని చిత్రించిన రేఖాసుందరివయ్యావు. నా హృదయవీణను మీటిరాగాలాపన చేసే గాయనివయ్యావు. నా జీవన జ్యోతిని, నా అమృత కలశానివి, న ప్రియురాలివి .... అన్నీ అయ్యావు!
    మొదటిసారి నీ పెదవులను చుంబించిన దృశ్యం చెరిగిపోలేదు. మొదటిసారి నువ్వు నన్ను పిలిచిన "వేణూ!" అన్న పిలుపు మాసిపోలేదు. అన్నీ సజీవంగా నా కళ్ళముందు నాట్యమాడుతూనే ఉన్నాయి.
    రేడియో చదివించావు. దానికన్నా నువ్వు నీ హస్తాలతో నా వివాహానికి కానుక అని రాసి ఇచ్చిన పుస్తకమే బావుంది. అది నువ్వు కొని ఇచ్చావు. అందుకే దానికి నా దృష్టిలో అనంతమైన విలవ. నా కెవ్వరు చెప్పకపోయినా ఆ రేడియో నువ్వు కొని ఇచ్చింది కాదని తెలుసు.
    ఇది రాస్తూంటే రాధ సిగ్గుల వెలుగులుగా కాఫీ తీసుకుని నా దగ్గిరకి వచ్చింది. నేను కాగితం మూసే శాను. కప్పు నాకు అందిస్తూ, 'ఎవరికి, మామయ్యా!' అంది.
    నిజం చెప్పాను!
    పెదవి విరుస్తూ నన్ను చూసింది. నేనన్నాను- 'ఆఫీసు విషయం. ఒక వారంపాటు చూసుకోమని రాస్తున్నాను' అని.
    నమ్మినట్లు లేదు. అయినా వెళ్ళిపోయింది.
    నీమీద వీళ్ళకెందుకు ఈ అనుమానం? పునీత వైన నువ్వు నిష్కళంకజీవివని వీళ్ళు అనుకోరు. ఎవరనుకుంటేనేం. అనుకోకపోతేనేం? నిజం నాకు తెలుసు, సునీతా!
    అక్కయ్య నాతో అన్నది, నిన్ను తనదగ్గిరే ఉంచుకుంటుందిట. అయిదారు రోజుల్లోనే రజనీ ప్రియను దత్తత చేసుకునేందుకు ముహూర్తం ఏర్పాటు చేయిస్తుందిట. ఆ ముహూర్తంలోనే నిన్ను గూడా తన ఇంటికి తెచ్చుకొంటుందిట. అక్కయ్య అదృష్టవంతురాలు కదూ?    
    ఒక పని చెయ్యమని ఆజ్ఞాపించావు. చేశాను. అది నాకు నచ్చిందా, లేదా అని నేను ఆలోచించను. నా మనస్సులోని మనసువైన నువ్వే అన్నీ ఆలోచించే చేశావు. ఇంకా ఆలోచన ఎందుకు?
    నిన్ను పోగొట్టుకున్నానన్న విచారం నాకు లేదు. నేను నిన్ను ఇంకా పోగొట్టుకోలేదు. బాహ్యంగా వేరయ్యాం. అంతరంగంలో ఎప్పుడూ మనం జీవించి నంతకాలం కలిసే ఉంటాం.
    కన్న కలలు నిజం కాలేదు. అయిన నిజాన్ని కలగా మార్చుకోవాలి. ఇక కలల్లోనే జీవించాలి.
    వాస్తవికతనుంచి సాధ్యమై నంత దూరంగా ఉంటాను. ఇప్పుడు రాధ-రాధ మాత్రమే కాదు. రాధలో సునీత! సునీతే రాధ!
    చాలారోజులక్రితం ఒక యువకుడు ఒక కల గన్నాడు. అందులో తాను సర్వశక్తులనూ కూడగట్టు కుని ఒక చిన్న సామ్రాజ్యం స్థాపించుకున్నాడు. దానికి అతని ప్రియురాలు పట్టమహిషి అయింది.
    హఠాత్తుగా కల కరిగింది. ఆ ఛాయమాత్రమే మిగిలింది.
    సునీత అనే ఒక ప్రేమవాహిని తనలో ఒక పిల్లకాలవను లయం చేసుకున్నది. దానికి మరొక పిల్లకాలవను జతపరిచింది. తననుండివిడివడి, ఒక కొత్తపంథాలో పయనించమని ఆదేశించింది.
    గతమంతా జ్ఞాపకంగానే మిగిలిపోయింది. 'వేణూ!' అన్న ఒక మధురమైన పిలుపు ప్రతిధ్వని మాత్రమే అయింది.
    నీవు లేవు. నేను ఉన్నాను.
    నేనిక్కడే ఉన్నాను. నువ్వెక్కడో దూరతీరాలకు వెళ్ళావు.
    నువ్వు నా ప్రేమకు అధిదేవివి. నేను నీ ఆరాధకుణ్ణి.
    నేనూ సజీవమూర్తినే. నాలో ఆ జీవచైతన్యమంతా నీదే!
    నువ్వు నాకు దూరమైన మరుక్షణాన నాలో సజీవచైతన్యం పంచభూతాల్లో లీనమవుతుంది.
    నాలో ప్రత్యణువు నీ రూపభరితం. నా ప్రతివాక్కు నీ ప్రేరణ ఫలితం. నా ప్రాణం, నా జీవం, నా ఆత్మ - అన్నీ నువ్వే.
    రెండుమూడు రోజులవరకూ ఎక్కడికి కదల వద్దంటున్నది పెద్దక్కయ్య. గురువారం మధ్యాహ్నం ఆఫీసుకు వస్తాను. గోల్కొండకు వెళదాం. తిరిగి వచ్చేస్తూ చివరిసారిగా జంటగా చిన్నక్కయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం పొందుదాం.




Related Novels


Samanthara Rekhalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.