Home » Pasupuleti Mallikharjuna Rao » Samanthara Rekhalu



    తలుపు కొట్టాను. గోవిందు చెల్లెలు దేవకి తలుపు తీసింది. నన్ను గుర్తించలేదు. తలుపు గడియవేసి టోపీ, కళ్ళజోడు తియ్యగానే నవ్వుతూ, 'ఇదేం వేషం, గిరీ' అన్నది నేనంతా చెప్పాను.
    దేవకికి పద్దెనిమిది లేక పందొమ్మిదేళ్ళు ఉంటాయి. బాల వితంతువు. గోవిందు పాత ఆచారాల పుట్ట కాక పోవటంవల్ల ఆమెను కన్యలాగే పెంచాడు. అలాగే చూసేవారు వాళ్ళ ఇంట్లో, ఆమె అప్పటికి బి. ఎ. పూర్తి చేసింది. తను బాలవితంతువని ఆమెకుకూడా తెలుసు. ఆమెకు పెళ్ళి చెయ్యడానికి వాళ్ళన్నయ్య ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
    నే నెప్పుడు వచ్చినా అందరమూ చనువుగా మసలే వాళ్ళం. దేవకి నాతో కలుపుగోలుగా ఉండటం చూసి గోవిందుకానీ, శ్రీదేవికానీ ఏమీ అనకపోయేవారు. వాళ్ళ రెండవ అమ్మాయి ఆర్తికి మా ఇద్దరి దగ్గిర తల్లిదండ్రులకన్నా చనువెక్కువ. వేణు రెండేళ్ళు, మూడేళ్ళ లోపువాడే! నాకూ ఇద్దరు పిల్లలు. అందుకే అనుమానాలకు ఆస్కారం ఉండకపోయేది.
    దేవకి నడిగాను అన్నయ్యేడని. ఆమె చెప్పింది, వాళ్ళ వదినను కాన్పుకు పుట్టింటికి పంపించిరావడానికి వెళ్ళాడని.
    పోలీసులు నన్ను పసికట్టారు. వెంబడిస్తూ వచ్చారు.
    తలుపు చప్పుడయింది. నేను తుళ్ళిపడ్డాను. అప్పుడు దేవకి నాతో మాట్లాడుతున్నది. ఒకవైపు కంగారుగా ఉన్నా, ఆమె మాటల విధానం కొత్తగా ఉండటం నేను కనిపెట్టగలిగాను.
    తలుపు చప్పుడు విని, దేవకి నావైపు చూసి నవ్వుతూ, వెళ్ళి తలుపు తీసింది. నేను కళ్ళజోడు, టోపీ పెట్టుకున్నాను. సబిన్ స్పెక్టరు, ఇందాకటి పోలీసు కాక మరో ఇద్దరున్నారు పోలీసులు.
    ఆ సబిన్ స్పెక్టర్ పోలీసు వైపు ప్రశ్నార్ధకంగా చూసి, నా వైపు పరిశీలనగా చూశాడు. ఆ పోలీసు తల ఊపడం గమనించాను.
    'ఆయనెవరు?' సబిన్ స్పెక్టరు ప్రశ్న.
    నేను తోచిన అబద్దమేదో చెప్పబోయాను.
    అంతలో దేవకి అన్నది: 'నా భర్త!'
    నా తల తిరిగిపోయింది, ఆమె సాహసానికి, సబిన్ స్పెక్టర్ ఇంకా అనుమానం తీరక ఇల్లంతా కలయ జూస్తున్నాడు. పెద్ధవాళ్ళిల్లు. డబ్బున్నవాళ్ళతో ఎలా ఉన్నా పీకలమీదికి రావచ్చు. అడ్డకోలుగా లోపలికి వచ్చి వెతుక్కోడానికి వీల్లేదాయెను.
    మళ్ళీ దేవకి అంది: 'మీకు అనుమానంగా ఉంటే సెర్చి వారంట్ చూపించి వెతుక్కోవచ్చు.'
    వెతికేవాడేమో? దేవకి కోరిన సెర్చివారంటు లేదా యెను. మరోమాట లేకుండా తిరుగుముఖం పట్టాడు వచ్చిన పోలీసులతో సహా!
    'నువ్వేం పనిచేశావు! అతనితో ఏమన్నావు?' కొంచెం కోపంగా అన్నాను.
    'తప్పా, గిరీ' అంది దగ్గిరికి వస్తూ.
    'తప్పో, ఒప్పో! అలా చెప్పడం నాకు బాగులేదు.' ఆమె కన్నీరు నింపుకుంది.
    'అరె! ఎందుకు? కన్నీరేమిటి?'
    'కాక, ఎన్నాళ్ళీ మోడులా జీవించను! నేనిలా దాటి పోవలసిందేనా, గిరీ?'
    నేను కరిగిపోయాను. ఓదార్చాను. నా పక్కనే కూర్చుంది. ఒక్కోనిమిషమే గడుస్తుంటే మాటల తీరు మారజొచ్చింది. ఆమె మనోరథం అవగాహన మవుతున్నది. ఆమె మాటలు ఉద్వేగభరితములై ఉన్నాయి. ఆమె చేష్టలు నన్ను నిశ్చేష్టున్ని చేశాయి.
    అప్పటికే దేవకి నన్నూ, నాలో నిగ్రహాన్నీ జయించింది.
    ఆచారాలు కొన్ని జీవితాలను నాశనం చేస్తాయి. ఆమెకు బాల్యవివాహం చెయ్యకపోయినట్లయితే ఏనాడో పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళి ఉండేది. ఈ మలుపు తిరిగి, మరో మర్గాన బ్రతుకుబాట వెయ్యబడేది కాదు. పరిపూర్ణ యౌవనవతి అయిన ఆమె వయస్సు కలిగించే కోరికలను అదుపులో ఉంచుకోలేక పోయింది. ఎంత తొక్కిపట్టినా వేగంగా విసిరిన బంతిలా విజ్రుంభించాయి.
    నేను ఆనాడు వెళ్లకున్నా, గోవిందు ఉన్నా ఇంత జరిగి ఉండదు. ఏమైనా, విధిని తప్పించుకోలేం. నేను కూడా వెళ్ళిపోదామన్న తలంపును ఏదో పొంగుతున్న వాంఛలముందు తొక్కిపట్టేశాను.
    కోటి వసంతాలు ఆ రాత్రి వెల్లివిరిశాయి. నర నరాల్లో రక్తం పరుగులు తీసింది.
    ఉద్రేకాలు చల్లారాక చేసిన తప్పు తెలిసింది. 'ఎందుకిక్కడికి వచ్చానురా దేవుడా!' అని బాధపడ్డాను. పైగా ఇద్దరు బిడ్డల తండ్రిని నేను.
    ఒకరినొకరం చూసుకోలేక పోయాము. మాట్లాడ టానికి కూడా మొహంలేదు నాకు.    
    'ఇప్పుడెక్కడికి వెళతావు? తెల్లవారి వెళుదువుగాని పడుకో, గిరీ!' అంది దేవకి.
    'వద్దు, దేవకీ! నన్ను వెళ్ళిపోనీ. పోలీసులు వస్తే ...' బదులు చెప్పలేదామె.
    నే నెందుకు వచ్చానో, ఒక కాగితం మీద గోవిందు పేరుమీద వ్రాశాను. వెనకనుంచి అదంతా చూసింది దేవకి. డబ్బుసంచీ, కాగితమూ ఆమెకిచ్చాను.
    ఆమె అంది: 'గిరీ, తప్ప నాది ఆశ్రయం కోరి వచ్చిన నిన్ను న కోరికలకు దాసుణ్ణి చేసుకున్నాను. నేనేం చెయ్యను? దైనందిన జీవితంలో చూస్తున్న దృశ్యాలు నాలో వాంఛలకు ఇంధనాలు అయ్యాయి. గిరీ, నన్ను క్షమిస్తావు కదూ?'
    నే నేమనగలను?
    'చచ్చిపోయినా సరే, ఏ సందర్భంలోనూ నీ పేరు వెలువరించను. దీని ఫలితాలకు బాధ్యత నాదే అయి ఉంటుంది. అన్నయ్య నా పెళ్ళికి ప్రయత్నిస్తూనే ఉన్నడు, ఒకసారి చెరిగిన కుంకుమ మళ్ళీ ఉంచటానికి నేను నోచుకోలేదు. కానీ .... కానీ.... మన ఈ సమాగమానికి గుర్తుగా చిరంజీవి పుడితే ఎంతబాగు! "అమ్మా" అన్న పిలుపుకోసం నేను పరితపిస్తున్నాను. గిరి.'
    'దేవకీ .... దేవకి ...'
    'అన్నయ్య తనకు అవమానమని వెళ్ళగొట్టినా, పాపతో నే నెక్కడయినా జీవించగలను, గిరీ ..... వెళ్ళి పో..' పోలీసులు వస్తారేమో...'
    అన్నట్లే తలుపు చప్పుడయింది.
    'అదిగో! వాళ్ళు వచ్చారు. వెళ్ళు. వెళ్ళిపో, గిరీ...' నాకు వెళ్ళాలనిపించలేదు.
    'నాకోసం......నాకోసం వెళ్ళు, గిరీ....' నా గుండెల్లో తలదాచుకుంది. మేమిద్దరం అలా ఉండగానే, లోపల ఏదో కుట్ర జరుగుతున్నదని చాకుతో గడియ పైకెత్తి. తలుపుతోసిన సబిన్ స్పెక్టరు, మమ్మల్ని చూసి వెనకడుగు వేశాడు.
    'క్షమించండి! నేను సెర్చివారంటు తెచ్చాను.'
    నామీద వాళ్ళ అనుమానం పోలేదన్నమాట. వాళ్ళు ఇల్లంతా గాలించారు. ఏమీ దొరకలేదు. నేను నిశ్శబ్దంగా చూస్తున్నాను. దేవకి నా పక్కనే నిల్చుంది.
    వెళుతూ ఇన్ స్పెక్టరు నావైపు చూసి, 'దయచేసి మీ కళ్ళజోడు, టోపీ ఒకసారి తియ్యగలరా?' అన్నాడు.
    నేను టోపీమీద చెయ్యి వేశాను.
    దేవకి నా చెయ్యి పట్టుకుని గట్టిగా అరిచింది: 'వీల్లేదు! ఇన్ స్పెక్టర్ ...'
    అప్పటికే నేను టోపీ తీశాను. ఎడం చేత్తో కళ్ళజోడూ తీశాను.
    నేను ఎక్కడ కనపడ్డా అరెస్టు చెయ్యటానికి వారంట్లు జారీచెయ్యబడ్డాయి. ఆ కాగితం తీస్తూ, 'ప్చ్ ప్! మీబోటి పెద్దవాళ్ళుకూడా ఇలా చేస్తే ఎలాగ చెప్పండి! మీకు అరదండాలు వేయటం నాకిష్టంలేదు. స్టేషనుదాకా వస్తే కృతజ్ఞున్ని' అన్నాడు.
    దేవకి ఏడవలేదు. నిశ్చలమైన దృష్టితో నన్ను సాగనంపింది. యుద్ధ రంగానికి భర్తను పంపుతున్న వీరపత్నిలా గేటుదాకా వచ్చింది.
    నామీద కేసు పెట్టబడింది. అప్పట్లో ప్రభుత్వాన్ని ఏమాత్రం వ్యతిరేకించినా దయాదాక్షిణ్యాలు ఉండేవి కావు. కేసు రెండు రోజులు నడిచింది. నా నేరాలకు నేను ఏమీ సంజాయిషీ ఇవ్వలేదు.
    అయిదు సంవత్సరాల రెండు నెలలు కఠిన శిక్ష పడింది.
    ఆ రెండు రోజులూ దేవకి వాళ్ళ జట్కాలో కోర్టుకు వచ్చింది. నన్ను దీక్షగా చూస్తూండేది. నాకు శిక్ష వినిపిస్తున్నప్పుడు, దుఃఖాన్ని ఆపుకోలేక వెలుపలికి పోవడం నేను చూశాను.
    నన్ను వానులో ఎక్కించారు. ఈ హైదరాబాదు లోనే నేను కారాగారవాసం అనుభవించాలి. కోర్టు అలా శాసించింది.
    అదే ఆమెను చివరిసారి చూడటం. అదేనమ్మా, చివరిచూపు .... మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చూడలేక పోతానని నేను మాటగానైనా అనుకుని ఉండలేదు. వాను ఎక్కేముందు అన్నది: పెళ్ళయి అత్తవారింటికి చెప్పలేననీ, లేకపోతే పాపాయితో ఎదురు చూస్తుంటాననీ..."
    యాదగిరి ఆగాడు. కట్టలు తెంచుకున్న చెరువులా వస్తున్న దుఃఖం ఆయన కంఠానికి అడ్డుకట్ట అయింది.
    సునీత కేకవేసింది: "చెప్పు.... అమ్మ ఏమైంది? అమ్మ ఏమైందో చెప్పు....!"
    "నా వాను వెనకే ఆమె జట్కా వస్తూంది. మా దోవలు కొంతదూరం వచ్చాక చీలాయి. ఆమె అటు ..... నేనిటు, అంతేనమ్మా. తిరిగి మా దోవలు ఎన్నడూ కలుసుకోలేదు. ఆమె ఒక మహాపథకంలోకి పయనించి అదృశ్య అయింది. నేనీ బాటమీద ఇంకా పయనిస్తూనే ఉన్నాను.
    మా వాను కనబడేవరకు జట్కా ఆపించి చూస్తూనే ఉంది. ఆఖరి మలుపు తిరిగేటప్పుడు ఆమె చేతిలో ఎర్రరుమాలు ఊపటం చూశాను.
    ఆ రాత్రే నన్ను హైదరాబాదు తీసుకువచ్చారు.
    పది రోజుల తరవాత గోవిందు ఉత్తరం అందింది. తను ఉంటే ఇంతదాకా రానిచ్చేవాడిని కాదనీ, దేవకి నన్ను అడిగిందనీ వ్రాశాడు. వేరే దేవకినుండికూడా ఉత్తరాలు వస్తూండేవి. అటు మా అత్తవారి ఇంటినుండిగూడా వస్తూండేవి.
    ఆరు నెలల వరకు అలా వస్తూనే ఉండేవి. ఒక వారం దేవకి ఉత్తరం రాలేదు. గోవిందుకూడా వ్రాయలేదు. మళ్ళీ వారం వచ్చేసరికి రెండు భయంకరమైన లేఖలు అందాయి, ఒకేరోజు.
    అందులో ఒకటి మా అత్త వారి ఇంటినుండి వచ్చింది. అందులో కుటుంబం చితికిపోయి, నేను జైలుకు వెళ్ళానన్న బెంగచేత నా భార్య మరణించిందని మా మామగారు రాశారు.
    రెండవది గోవిందు రాశాడు - దేవకి గర్భవతి అని. '
    నాలో పేరుకున్న కన్నీటిగిరులు కరిగి కాలవ లైనాయి. ఆ రాత్రి జ్వరం వచ్చింది, ఆ జ్వరంలోనే ఏవో వేడికోలు, ఏడుపులు, కలవరింతలు, ఉలిక్కి పడటాలు.
    ఒక నెలపైగా ఎవ్వరి దగ్గిరనుండీ ఉత్తరాలు లేవు.
    ఒకనాడు దేవకినుండి చిన్న కార్డుమాత్రం అందుకో గలిగాను.
    'గిరీ,
    ఎంతో ప్రయత్నిస్తే ఈ కార్డు రాసే అవకాశం కలిగింది. అన్నయ్య చండశాసనం చేశాడు ఎక్కడికీ కదలవద్దని.
    మన చిరంజీవి త్వరలో ప్రపంచం ఎటువంటిదో చూడబోతున్నది. అన్నయ్య నన్నెంతో వేధించాడు, నా పాపకు తండ్రి ఎవరో చెప్పమని. నేను చెప్పలేదు. నీకు ఈ విషయం రాయవచ్చు. నువ్వు ఆవేశంలో రాయవద్దు. రాస్తే నామీద, పాపమీద ఒట్టు.
    నా కొకటే సంతోషం. నా పాప కెవరో పరాయి వ్యక్తి తండ్రికాదు. దగ్గిర బంధువు, జీవన మాధుర్యం చవిచూపించగలిగిన నువ్వే...నేను మరణించినా చింతలేదు.
    ఇదే నా ఆఖరి ఉత్తరమేమో? నేను ఉత్తరాలు రాయలేకపోవటం నా తప్పయితే మన్నించు. నువ్వు రాయి. అన్నయ్యకు నీమీద అనుమానం లేదు.
                                                                            నీ ఉత్తరంకోసం, నీకోసం
                                                                             ఎదురుచూపులతో నీ
                                                                                       -దేవి.'
    మరొక ఆరునెలలకుపైగా ఉత్తరాలు నేను రాయటంతప్ప ఆమె రాయలేదు. ఒక రోజు గోవిందు నుండి ఒక సుదీర్ఘమైన లేఖ అందుకున్నాను."
    యాదగిరి ఒక కవరు టేబిల్ మీద నుంచి తీసి సునీతకు ఇచ్చాడు. అదివరకు చేతిలో ఉన్న కార్డు వదిలేసి దాన్ని అందుకున్నది. ఆమె కళ్ళు అక్షరాలలో లోతులను వెలికితీస్తున్నాయి.
    "ప్రియమిత్రునికి.
    గిరీ, ఇన్నాళ్ళనుండీ ఉత్తరాలు రాయలేదు. దాని కేమని చెప్పాలి.....ఒక సంఘటన..... అది..... దేవకి ఆత్మ హత్య చేసుకోవటం...... జరిగింది.
    అందుకు జవాబుదారీ నాదే ననిపిస్తూంది.
    పసిది ఆర్తికూడా నన్ను బెబ్బులిలా చూసింది, వాళ్ళ అత్తయ్య మరణానికి నేనే కారకుడన్నట్లు. ఆ పసిపిల్లలకు - లోకం తెలియని ఆర్తికి - కూడా ఏం తోచిందో మరి?
    ఇంతవరకూ మనమధ్య రహస్యాలు లేవు. అక్షరాభ్యాసం నాటినుండీ మన విలవైన స్నేహం బంధుత్వమైంది. నేను ఇక ఇక్కడినుండి వెళ్ళిపోతున్నాను. అక్కడికి, అంటే హైదరాబాదుకు వస్తున్నాను. నువ్వు విడుదల అయ్యాక నన్ను కలుసుకుంటావు కదూ?
    అవసరమైతే నీ భార్యకిమ్మని నువ్విచ్చిన డబ్బు ఇన్నాళ్ళూ ఈ గొడవలమూలంగా అందజేయలేక పోయాను. దానిని ఇవ్వాళే కీర్తి శేషురాలైన నీ భార్య పేర మీ మామగారికి పంపించాను.
    ముద్దుచెల్లెలు, దేవకి తిరిగిన ఈ బంగళాలో ఉండలేకపోతున్నాను, గిరీ. ఇక్కడి వ్యాపారం అమ్మేసి వచ్చేస్తున్నాను. అక్కడే స్థిరపడతాను. ఈ బంగళాలో మన మందరమూ వాదనలు వేసుకున్న మధ్యహాలులో దేవకికి సమాధి కట్టించాను. అప్పుడప్పుడూ వచ్చి చూసుకుపోవటానికి ఆమె చిహ్నం ఈ సమాధే మిగిలింది గిరీ!
    ఇంతవరకూ నీ కెన్నడూ సరియైన వివరాలు రాయలేదు. నీకన్నా చెప్పుకోగల స్నేహితులు నా కెవరున్నారు?
    ఆరవ నెలదాకా తను గర్భవతినన్న విషయం ఎలాగో దాచగలిగింది దేవకి. కానీ అది ఎన్నాళ్ళు దాగుతుంది? ఒకనాడు అదీ బయటపడింది. అది తెలిసిన రోజు ఈ పాడుచేతులతోనేపశువును బాదినట్లు బాదాను. విచక్షణ నశించింది. దెబ్బలకు చర్మం చిట్లిపోయింది. నా పరువు, ప్రతిష్టలు అన్నీ మంటగలిపావన్నాను. చావకుండా బతకటంకూడా అనవసరమన్నాను. ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం ఏడవనైనాలేదు. అన్నీ ఓరిమిగా సహించింది. 'భగవాన్..... ప్రభూ' అన్న మాటలే నేను వినగలిగాను. ఆ రోజు అన్నంగూడా పెట్టవద్దని శాసించాను. గదిలో పెట్టి బయట తాళం వేశాను. ఆనాడే కిటికీ చువ్వలు పట్టుకుని లోపల నిల్చుంది. హాలులో నేను సోఫాలో ఉన్నాను. అప్పుడు అన్నది..... 'నీ పరువు, ప్రతిష్టలు తప్పకుండా కాపాడతానన్నయ్యా! కనీసం పాపను చూసుకునేదాకా నైనా బ్రతకనిస్తే కృతజ్ఞురాలిని.'




Related Novels


Samanthara Rekhalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.