Home » Pasupuleti Mallikharjuna Rao » Samanthara Rekhalu



    అప్పుడైనా తెలుసుకోలేకపోయాను. ఆర్తి అత్తయ్య దగ్గిరికి పోతానని ఏడ్చింది. పసిదాన్ని రెండు వేశాను. కిటికీలోనుంచి ఆమెకు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. నేను ఆర్తిని కొట్టటం చూసి, 'ఆర్తీ, వద్దమ్మా. నా దగ్గిరికి రాకూడదు. దేవుడు కొడతాడు' అంది. ఆర్తి మళ్ళీ అడగలేదు.
    అర్ధరాత్రి ఎవరో మాట్లాడుతున్నట్లు వినబడి లేచాను. కిటికీకి ఇవతల ఆర్తి ఉంది. కిటికీలో నుంచి చేతులతో ఆర్తి తల నిమురుతూ, 'ఆనమ్మా! నేను తప్పు చేశాను. దేవుడు నాన్నలో ప్రవేశించి నన్ను కొట్టించాడు. నాన్న మంచివాడమ్మా!' అంటున్నది దేవకి. నన్ను చూసి నీడలోకి వెళ్ళింది. నేను ఆర్హిని లాక్కురావటానికి చెయ్యి పట్టుకున్నాను. లోపలి నించి చెల్లి మాటలు వినవచ్చాయి: 'నేను తప్పుచేస్తే పసివాళ్ళను దండించటం మెందుకన్నయ్యా? నువ్వు కావాలంటే నా కంఠానికి ఉరితాడు వేసి బిగించు.'
    ఆమె నిక్కడ ఉంచితే, అడిగేవాళ్ళ నోళ్ళు మూయించటం కష్టం. ఎక్కడికన్నా దూరంగా పంపాలి. వరంగల్ లో మా దూరపుబంధువు ఒకామె ఉంది. ఆమె దగ్గిరికి దేవకిని పంపాను. అవసరమైన డబ్బు పంపుతూ ఉండేవాడిని.
    దేవకి ప్రసవించినట్లు ఉత్తరం వచ్చింది. వెళ్ళాను.
    దేవకి అందాలన్నీ పుణికిపుచ్చుకున్న పాపాయి జ్యోతిలా మెరిసిపోతున్నది, నా బిడ్డలలో ఎవరిలోనూ ఆ కళాకాంతులు చూడలేకపోయాను, ఒక్క ఆర్తికి తప్ప.
    దేవకి బంధువులింటికి వెళ్ళిందని రోజులు నెట్టుకు వస్తున్నాను. ఆలస్యం అయితే నిజం తెలిసి కొంప మునిగిపోతుందన్న ఆరాటం. అయిదు రోజులైనా నిండని ఆ పాపను వదిలి నాతో వచ్చెయ్యమన్నాను.
    గిరీ, నా పరువునూ, కీర్తినీ, నన్నూ తగలేసినా బావుండును. తన పాపనూ, తననూ వేరుచెయ్యవద్దని న కాళ్ళు పట్టుకున్నది. కావలిస్తే తామిద్దరమూ ఎటయినా జాడలేకుండా వెళ్ళిపోతామన్నది. నా గుండె పాషాణం. ఆ వేదనామూర్తి దీనఘోషలు నా చెవినాటలేదు. ఆ బిడ్డను వదలటం ఇష్టం లేకపోతే, నన్ను చంపెయ్యమని జేబులో చాకు ముందు ఉంచాను. దానితో పొడిచినా మంచిదైఉండేది కదూ?
    నా నీచ ప్రాణానికోసం, కీర్తికోసం దుస్సహమైన కడుపుకోతను భరించటానికే ఒప్పుకున్నది, గిరీ! పాపను ఆ వృద్దురాలికే పెంచుకోవటానికి ఇచ్చెయ్య మన్నాను. నేను నెలనెలా కొంత డబ్బు ఇస్తానన్నాను. ఆ వృద్దురాలికి పిల్లలెవరూ లేరు. ఆమె ఏకాకిని. అంగీకరించింది. ఈ రహస్యం ఎక్కడా వెల్లడి చెయ్యవద్దని మాట తీసుకున్నాను. తరుచు వచ్చి పాపను చూసి పోతూండమని దేవకికి ధైర్యం చెప్పి ఓదార్చింది.
    లోకమూర్తి అయి, వణికే చేతులతో బిడ్డను ముద్దుపెట్టుకుని హృదయానికి అదుముకున్నది. ఇవ్వలేక ఇచ్చింది.
    'పాపా, వెళ్ళిపోతున్నానమ్మా, అమ్మ ఇక ఎప్పటికీ తిరిగి రాదు, తల్లీ. అవ్వ దగ్గిర రోజూ ఆడుకుంటావు కదూ అల్లరి చెయ్యవద్దు.'
    అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాను. ఆ వృద్దురాలు అన్నది: 'గోవిందరావ్, ధనగర్వంతో తల్లిని బిడ్డను వేరుచేస్తున్నావు. చూడు .... ఆ ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది.'
    రైల్లో వస్తూంటే శూన్యంలోకి చూస్తూ కూర్చున్నది. కాఫీ ఇస్తే తాగలేదు. శుష్కంగా, 'నా పాపకు పాలివ్వడానికి అభ్యంతరం చూపే నువ్వు..... కాఫీ బదులు విషమిస్తే మంచిదన్నయ్యా' అన్నది. దిక్కరిస్తున్నావని చెంపదెబ్బ కొట్టాను. ఇంటిదగ్గిర అన్నంకూడా తినలేదు. ఆర్తికి తన చేతితోనే తినిపించింది. అత్తయ్యతప్ప ఎవరు తినిపించినా తిననన్నది ఆర్తి. నువ్వు తినవేమని ఆర్తి దేవకిని అడిగితే, అది ఆఖరి శివరాత్రి కనక ఉప వాసం ఉండాలంది. అన్నట్లు ఆ రోజు మహాశివరాత్రి. పండుగని ..... వాళ్ళమ్మకూడా ఉంది కనక ఆర్తి మళ్ళీ ప్రశ్నించలేదు.
    తనతోపటు ఆర్తిని గదిలోనికి తీసుకువెళ్ళింది. చాలాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నేను ఆర్తిని కేకవేశాను. రాలేదు. రెండు మూడుసార్లు పిలిచినా అంతే! కోపంగా వెళ్లాను. ఆర్తి దేవకి ఒడిలో ఆమె పాపాయిలాగే నిద్రపోతున్నది, దేవకి జోకొడుతున్నది. నేను వెళ్ళి ఆర్తిని ఎత్తుకున్నాను. తనుకూడా నిల్చుంటూ, చివరిసారిగా అన్నది: 'బహుశా నీ పంతం నెరవేరి ఉంటుంది. ఇక తప్పుచేస్తే కొట్టి హింస చెయ్యటాని కేవరూలేరు. ఉండబోరు. కానీ...నా భర్త.... నా పాపకు తండ్రి, నువ్వనుకున్నంత నీచులు కారు. ఆయనలో ఏ పొరపాటూ లేదు. నేనే తొందరపడ్డాను. నువ్వు నాకూ, పాపకూ మధ్యకొంత దూరాన్ని మాత్రమే ఉంచగలిగావు. అంతకన్నా నువ్వు సృష్టించగలిగిన ఎడబాటు లేదు. కాని.....కాని....నీకోసం, మన కుటుంబం పరువుకోసం నాకూ, నా పాపకూ మధ్య నువ్వుగానీ, మరొకరు గానీ భేదించి చూడలేని ఇనపతెర దించబోతున్నాను. నన్ను మీ రెవరూ అర్ధం చేసుకోలేదు. నా చిట్టి తల్లి ..... ఆర్తికి తెలుసు. ఆర్తికి తెలుసన్నయ్యా!"
    అవును, గిరీ! దేవకిని అర్ధం చేసుకోగలిగింది ఆర్తి ఒక్కతే!
    అవే ఆమె ఆఖరి మాటలు. దేవకి ఆత్మహత్య చేసుకుంటుందన్న ఆలోచనే నాకు లేదు. అందుకే ఆ మాటల గూడార్ధం నాకు తలకెక్కలేదు.
    శివరాత్రి ...... అర్ధరాత్రి ..... మానవులందరూ చేరుకునే గమ్యానికి వెళ్ళిపోయింది. ఆమె ..... ఆమె ..... శివునిలో ఐక్యమయింది, గిరీ!
    చెయ్యి జారాక వగచి లాభంలేదు. విధవ అయినా, సధవ అయినా మాతృమూర్తి మాతృమూర్తే! ఆమె హృదయంలోని మాతృప్రేమను అణిచిపట్టిన పాపం నాకు తగిలింది. పాలుపోస్తుంటే పొలమారి ఊపిరాడని చిన్నపాప మరణంకూడా కళ్ళారా చూశాను. ఆ వృద్దురాలి మాట నిజమయింది.
    అమ్మా, నాన్నా పోయాక ఈ చేతులతో పెంచిన దేవకిని నా చేతులారా హత్యచేశాను. దీనికి జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. పడాలి, గిరీ!
    పాపాయినైనా తెచ్చి పెంచుకుందామని వరంగల్ కు వెళ్ళాను. అ వృద్దురాలికి జరిగింది చెప్పాను. పాపను ఇచ్చేస్తుందనుకున్నాను.
    కాని విరుద్ధంగా జరిగింది. ఆమె పాప నివ్వనన్నది. ఎంత డబ్బు అయినా ఇస్తానని, కుమిలిపోతున్న నాకు శాంతి నివ్వగలిగేది పాపాయే అని అన్నాను.    
    ఆమె అంది: 'డబ్బుతో వచ్చే పరువుకోసం ఈ పసిదాన్ని, దేవకిని విడదీశావు. వాళ్ళిద్దరూ శాశ్వతంగా వేరయ్యారు. మళ్ళీ ఆ డబ్బుతో పాపను కొనాలనా?' కాదన్నాను.    
    'అయినా, కాకపోయినా చచ్చిపోయిన పాపతల్లిని, తిరిగి తెచ్చి ఇవ్వగల శక్తి ఉంటే తీసుకువెళ్ళవచ్చు! అంతవరకూ నీవంటి కఠినుడి చేతుల్లో పాపను ఉంచటం అసంభవం!'
    బెదిరించాను.
    ఆమె భయపడలేదు. ఈ బిడ్డ ఎవరి పాపాయో సకారణంగా ఋజువుచేసి, పురిటిలో బిడ్డను వేరుచేసిన నేరానికి నలుగురిచేతా చీవాట్లు వేయిస్తానన్నది. పాప తన మనవరాలేనని గుడిసె అమ్మి అయినా కోర్టులో కేసు పెడతానంది. నాకు ఋజువుకోసం ఏ ఆధారాలు ఉన్నాయని అడిగింది.
    మళ్ళీ ప్రార్దించాను. ససేమిరా ఒప్పుకోలేదు. కావాలంటే ఎప్పుడు వచ్చినా చూసి వెళ్ళవచ్చు అన్నది. కనీసం పాప పోషణ కోసం కొంత డబ్బు ఇస్తాను, తీసుకో మన్నాను. నెలనెలా యాభై రూపాయలు పంపితే చాలు అంది. తన భర్త తరపున వచ్చే పెనసుతో, తన రెక్కల కష్టంతో సాకగల నన్నది.
    ఆవేళ అక్కడినుంచి వచ్చేశాను. మళ్ళీ ఓ వారం క్రితం అక్కడికి వెళ్ళాను. ఆ వృద్దురాలు అక్కడలేదు. గుడిసె అమ్మి ఎక్కడికో వెళ్ళిపోయిందట. రెండు రోజుల వెనక ఒక కార్డు ఆమె దగ్గిరనుండి వచ్చింది. ఒకవైపు పాపాయి చిన్ని చేతిముద్ర ఉన్నది. ఆమె ఇలా రాసింది: 'మేము హైదరాబాదు వెళుతున్నాము. ఎక్కడో నీకు తెలియకుండా జీవిస్తాం. మమ్మల్ని వెతకటం వృథా. నువ్వు పంపే యాభై రూపాయలు పోస్టు మాస్టరు పేరుమీద పంపు. నేను ప్రతినెలా వచ్చి వాటిని తీసుకోగలను. దీని రెండవవైపు పాప చేతిముద్ర వేయిస్తున్నాను. దానిలో పాపను, దేవకిని చూసుకుని తృప్తి పడు.'
    గిరీ. అక్కడికే వస్తున్నాను. ఆ మహానగరంలో ఎక్కడని వెతకగలను? అయినా ఏదో ఆశ!
    చివరి మాటలు రాస్తున్నాను. నా చెల్లి దేవకి నన్ను క్షమిస్తుందనే నమ్మకం ఉంది. ఆర్తి నాతో అసలు మాట్లాడటం లేదు. ఆమె మాట్లాడిననాడు దేవకి మాట్లాడిందనే అనుకుంటాను.
    నేనీ తాపంతో నశించినా నాకు బాధలేదు. ఇంత చేసినా తన పాపకు తండ్రి ఎవరో దేవకి చెప్పనేలేదు. ఆ పేరు తనలోనే నిక్షిప్తం చేసుకున్నది. ఆమెను భూగర్భంలో నిక్షిప్తం చేశాను నేను. స్త్రీకి సహజ మైన మాతృత్వాన్ని క్రూరంగా దహనం చేశాను. వివాహంకోసం గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే జరిగి ఉండేది. అది నా అశ్రద్దే. నా తప్పే!
    గిరీ, తిరిగిరాని దేవకికోసం, కనిపించని పాపాయి కోసమే మిగిలింది నా బతుకు. ఈ బుద్ది లో వెయ్యో వంతు దేవకి బతికి ఉన్ననాడు ఉన్నా బావుండేది కదూ?
    నువ్వు విడుదల అయ్యాక నన్ను తప్పకుండా కలుసుకో! నీకు నా కొత్త అడ్రసు ఇస్తూ ఉత్తరం వ్రాస్తాను. ఆ తరవాత నే నెవ్వరికీ ఉత్తరాలు వ్రాయను.
    పాపాయిని అన్వేషించటమే నా పరమావధి!  
    స్నేహితుని చెల్లెలుగా దేవకి నీకు జ్ఞాపకం వస్తే రెండు అశ్రుబిందువులు ఆమె స్మృతికోసం ఖర్చు పెట్టు, సెలవు.
                                                                                          నీ
                                                                                        -గోవిందు."
    సునీత ముగించి యాదగిరిని చూసింది. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఎక్కడో చూస్తున్నాడు.
    సునీత ఆపాదమస్తకం వణుకుతున్నది. నాలుక పిడచగట్టి నట్లయింది.
    ఆమె చదవటం అయిపోయిందని గ్రహించి తిరిగి మొదలుపెట్టాడు: "అది చదివి వలవలా ఏడిచాను. గోడకేసి తల బాదుకున్నాను. పక్కవాడు తాగుతున్న చుట్ట తీసి ఒళ్ళు కాల్చుకున్నాను.
    ఆనాటినుంచి విడుదల అయ్యాక కూడా మళ్ళీ నేనెన్నడూ ఏ ఉద్యమంలోనూ పాల్గొనలేదు. అటు దేవకి, ఇటు నా భార్య మరణాలు నాలో జీవచైతన్యాన్ని నిస్సారం చేసివేశాయి.
    అబ్బాయిలిద్దరూ తాతగారి ఇంటివద్ద చదువుకుంటున్నారు. ఇంటికి వెళ్ళలేదు. గోవిందునుకూడా చూడలేదు. ఇటునుండి ఇటే దేశాలమీద పడ్డాను. మరొక ఎనిమిది ఏళ్లపాటు ఇంటిమొగమైనా చూడలేదు. మా మామగారు మరణించారని తెలిసి వెళ్ళాను. తరవాత అబ్బాయిలిద్ధరినీ చదువుకు ఇక్కడికే తెచ్చాను. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. ఉద్యోగాలు సంపాదించు కున్నారు. మా స్వగ్రామంలో ఇల్లు అమ్మి ఇక్కడే ఉద్యోగం కనక ఈ ఇల్లు కట్టించుకున్నారు. తరవాత బదిలీ అయిందనుకో!
    ఇప్పటివరకూ గోవిందుకు నేనిక్కడే ఉన్నానని తెలియదు. ఈ గాథ మనసులో ఉండబట్టి, ఆర్తిని గూడా కలుసుకోవాలనిపించలేదు.  వాళ్ళందరిలో నీ తల్లిని తెలుసుకోగలిగింది ఆమె ఒక్కతే! నీ జన్మ రహస్యం తెలియకపోవచ్చుకాని, నువ్వు దేవకి బిడ్డవేనని ఆమె నమ్మకం. అందుకే నిన్నంతగా ప్రేమిస్తున్నది.
    మీ కంపెనీ యజమాని గోవిందరావు. నీ మేనమామ గోవిందరావు, నా స్నేహితుడు గోవిందు - అందరూ ఒకటే! ఇక్కడికి వచ్చాక కూడా అదృష్టం వరిస్తూనే ఉంది. నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు రూపమే కాక, నీ పోషకురాలి పేరునుబట్టి నువ్వేనని తెలుసుకుని ఉద్యోగం ఇచ్చాడు. ఆర్తి కూడా తెలుసుకుంది. క్రమంగా నీకీ గాథ తెలుపబడవచ్చు.
    ఇప్పటికి నా నిరీక్షణ ఫలించిందమ్మా! నీకు తెలియ కుండా నువ్వు నీ మేనబావను ప్రేమించావు. తనకు తెలియకుండా మరదలైన్ ప్రేమించాడు వేణు. ఈ కథ తిరిగి కొద్దో గొప్పో పునరావృత్త మయింది."    
    కిటికీలోనుండి సూర్యకిరణాలు వెచ్చగా తాకుతున్నాయి. సునీత ఎప్పుడు వచ్చి కూర్చుందో; ఆయన కాళ్ళ దగ్గిర కింద కూర్చుంది. యాదగిరి ఆమె తలను తాకుతూ, "స్నేహితులు, బంధువులు ఎవరెలా వెళ్ళి పోయినా కడకంటా మిగిలేవి ఈ మధుర జ్ఞాపకాలే నమ్మా! పసితనం, యౌవనం, గృహస్థజీవితం, జైలు, దేశాటనం-వీటన్నిటికన్నా ఎక్కువగా నీ తల్లి దేవకి నాలో జీవించే ఉంటుందమ్మా! నా అరవై ఏళ్ల జీవిత    కాలంలో నీ తల్లి నా కిచ్చిన క్షణాలు కొన్నే అయినా అని మరువలేనివి; మరుపురానివి."
    మూగపోయిన పితృహృదయం ఒకటి ఆనందాబ్దిలో తేలియాడుతున్నది. 'ఎండిపోయిన చెట్టుకు నీరులా ... ఆకలిగొన్న మనిషికి అన్నంలా .... ఎడారిలో ఒయాసిస్ లా ...... బాటసారికి గమ్యంలా ...... భగవాన్ .... తన ఈ ఆనందం కల కాదుకదా?'
    సునీతకు ఆఫీసు, యాదగిరికి ప్రెస్సు జ్ఞాపకం లేవు.
    'తను వ్యభిచారిణి కూతురు కాదు. తన తల్లి పవిత్ర ప్రణయదేవత. చేసిన తప్పు తెలుసుకుని, కుమిలిపోయె మృదుమనస్కుడు తన తండ్రి. తన తల్లి కులట కాదు. తండ్రి మోసగాడు కాదు. కాని .... కాని ..... తమను వేరుచేసిన దుర్మార్గుడు గోవిందరావు - తన తల్లిని నిర్ధాక్షిణ్యంగా బలిగొన్నాడు. తనను ఆదరంగా చూస్తూ, తన పాపాన్ని కడిగేసుకోవాలని....
    'వేణు ఎన్నోసార్లు తనతో చెప్పాడు, తన తండ్రి ఉత్తరాల్లో అడుగుతున్నట్లు. ఏది ఏమైనా ఆ కఠినుడికి శాంతి కలగనివ్వద్దు. అమ్మ అన్నట్లు భేదించ లేని ఇనపగోడ దించాడు. అందుకే తనకు ధనవాంతులంటే కోపం. వాళ్ళేది చేసినా డబ్బుకోసమే చేస్తారు. రక్తబంధుత్వాలు, అమ్మవంటివాళ్ళ ఆక్రందనలు వాళ్ళ చెవిన బడవు. కానీ.....కానీ......వేణు .... వేణు? 'ఓహ్ ..... స్వామీ....' సునీత తల పట్టుకున్నది.
    గిరి తన్మయత వేరు.
    "దేవకి నుంచి తనకు క్షమ లభించింది. అందుకు నిదర్శనం తన బిడ్డ సునీతను, తన దగ్గిరికే చేర్చింది. ఇన్నాళ్ళు తన దగ్గిరే ఉన్నా తను తెలుసుకోలేకుంటే, తెలుసుకునేట్లూ చేసింది. అందాలరాశి అయి, అంతకు మించిన అంతఃసౌందర్యంతో, యుక్తాయుక్త విచక్షణ చెయ్యగలిగి, జీవన మహాతరంగిణిని ఈదుతూ తీరాలకు చేరాలని శాయశక్తులా కృషి చెయ్యగలిగిన ధీమంతురాలు అయిన తన బిడ్డ తనను చేరటం ....అమరురాలైన ఆమె చలవే. ఏ దూరతీరాలకో పయనించిన దేవకి, తమ ఇద్దరినీ ఒక ఒడ్డుకు చేర్చింది. ఆమె దయామయి .... దయామయి....'
    "సునీతా!"    
    "నాన్నా, నాన్నా, నన్ను ఆశీర్వదించవూ?"

                                 *    *    *




Related Novels


Samanthara Rekhalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.