Home » Pasupuleti Mallikharjuna Rao » Samanthara Rekhalu



    ఒకే ఒక మలుపు, నన్ను పూర్తిగా అలిసిపోయేట్లు చెయ్యటమేగాదు, బ్రతుకుబాటనే పూర్తిగా మార్చి వేసింది. ఆ మలుపులోనే సుఖదుఃఖాలు కల్పించే ఉత్సాహోద్రేకాలకు సజీవసమాధి చెయ్యబడింది.
    మా ఊరిలో నేనంటే నా తోటి వ్యాపారస్థుల్లో ఎంతో పలుకుబడి ఉండేది. ప్రహసనాలు చెప్పి నవ్విస్తూ వ్యాపారస్థులకూ, ఖాతాదారులకూ అభిమానస్థుడ వనిపించుకున్నాను.
    స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాను. జైలుకు వెళ్ళాను. అదొక పెద్ద మజిలీ. అయిదు సంవత్సరాల దుర్భరావేధన.
    ఇరవై అయిదు సంవత్సరాల నిండు యౌవనం, గాంధీజీ శంఖారావం దిశదిశలా మార్మ్రోగి సర్వ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచివేస్తున్న రోజులవి. ఉప్పు సత్యాగ్రహం, విదేశవస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ మొదలైన కార్యక్రమాలకు దాదాపు సమకాలీన మైన దినాలు. పలువురు ప్రముఖుల దేశభక్తిపూరిత మైన ఉపన్యాసాలు చదివి, ప్రత్యక్షంగా విని ఆకర్షితుడి నయ్యాను.
    రెండు లక్షలకు పైగా ఉన్న వ్యాపారం. ఒకవైపు వ్యాపారం చేస్తూనే వీటిలో పాల్గొంటూ ఉండేవాడిని. కంట్రాక్టరు గా ఒకసారి నేను పెద్దగా నష్టపడ్డాను.
    నాకు స్నేహితుడు, భాగస్థుడు గోవిందు. మా స్నేహం అక్షరాలు దిద్దుకున్ననాటిది. మా స్నేహాన్ని పురస్కరించుకుని మా బంధువుల్లో నాకు చెల్లెలు వరసైన శ్రీదేవిని - ఆర్తి వేణులకు తల్లిని - పెళ్ళి చేసుకునేందుకు ప్రోత్సహించాను. ఆమె అందమైనదే కనక గోవిందు అంగీకరించి వివాహం చేసుకున్నాడు. ఆమెకు మొదటి సంతానం వర్ధిని. రెండవ బిడ్డ ఆర్తి. మూడవవాడు వేణు. నాలుగవ కాన్పు తరవాత కొన్నాళ్ళకు ఆమె కీర్తి శేషురాలైంది. చివరి బిడ్డ కూడా దక్కలేదు.    
    మా రెండు కుటుంబాలూ అతి సన్నిహితంగా ఉండేవి.
    నేను ఏ ఉద్యమంలో పాల్గొన్నా, ఎక్కడ తిరుగుతున్నా గోవిందు వ్యాపార వ్యవహరాలు తనే నడిపేవాడు. మా ఇద్దరి పొత్తున రెండు పెద్ద బట్టల దుకాణాలు ఉండేవి. మేము జిల్లాలో ఇతర చిన్న వ్యాపారస్థులకు హోల్ సేల్ గా బట్టలు సప్లయి చేసేవాళ్ళం. అన్నీ ఖరీధైన మిల్లు వస్త్రాలు. విదేశీ బట్టలూ మా దగ్గిర దొరికేవి. గ్లాస్కో వంటి కంపెనీలకు డీలర్సు గా ఉండే వాళ్ళం.
    'వ్యాపారులం మన దోవలు వేరనీ, మనకీ ఉద్యమాలతో పొత్తు సరిపడ'దనీ గోవిందు మొత్తుకునే వాడు. అదంతా నాకు చెవిటివానిముందు శంఖంలా ఉంటుండేది.
    గాంధీజీని మళ్ళీ అరెస్టు చేశారని వార్త వచ్చింది. ఎందరినో లాఠీలతో చావమోదారట. ఆ విషయాలను బహిరంగ సభల్లో కొందరు చెబుతూంటే విన్నాను. నరనరాల్లో యువరక్తం ఉడుకెత్తి ఉప్పొంగింది. కర్తవ్యం ఏమిటోకూడా తెలుసుకున్నాను.
    మరునాడు గోవిందరావు దగ్గిరికి వెళ్ళాను. బట్టల దుకాణాల్లో తన ఇష్టంవచ్చింది నాకు ఇచ్చెయ్యమన్నాను.
    గోవిందు చేష్టలు ఉడిగాడు.
    నాకు నచ్చచెప్ప ప్రయత్నించాడు. నేను వినేస్థితి ఏనాడో దాటిపోయాను. భాగాలు పంచవలసిందేననే పట్టుదల వదలలేదు.
    నాకు చెప్పలేక విఫలుడైన గోవిందు సరేనన్నాడు. ఆ రోజే మా భాగాలు పంచటం మొదలయింది. ఎవరూ, ఎవరికీ ఒక్క గుడ్డిగవ్వ వదలకుండా పంపకాలు జరిగాయి.
    రెండుమూడు రోజుల్లో అవి పూర్తి అయినాయి. ఈ మూడు రోజులూ వార్తల జోరు అలాగే ఉంది.
    నాకు వచ్చిన ఆ బట్టల దుకాణం అంతా నడి వీధిలో కుప్పవేసి, విదేశీ గుడ్డలన్నిటికీ నిప్పంటించి, అగ్నిహోత్రుని పరం చేసి, దేశమాతమీద ఉన్న నా భక్తిని వ్యక్తపరచాలని నా ఉద్దేశ్యం.
    సానుభూతి చూపడానికి ఆ రోజు కొందరు దుకాణాలు మూసేశారు. నేను దుకాణం ముందు నిలుచుండగా, నలుగురైదుగురు ఖద్దరు దుస్తులు తొడుగుకున్న విద్యార్ధులు - ఎక్కడినుంచి వచ్చారో, ఏమో మరి - వచ్చి తాము పట్టుకువచ్చిన సూట్లు నాలుగైదు, మూడు దొరటోపీలు దగ్గిరే ఉన్న చౌకులో తగలబెట్టారు. అన్ని కాలిపోయాక 'వందే మాతరం' అని మూడుసార్లు కేకవేశారు. ఇద్దరు పోలీసులు సాయుధులై ఆ ప్రాంతంలోనే ఉన్నారు. తుపాకులు చూపిస్తూ పోలీసు స్టేషనుకు నడవమన్నారు. నేను ఇదంతా చూస్తూనే ఉన్నాను. నేనుకూడా వాళ్ళ వెనకనే నడిచాను.
    నన్ను లోపలికి పోనివ్వలేదు. ఎలా? ఒకటే మార్గం. గట్టిగా 'వందే మాతరం' అని అరిచాను. అప్పటిలో బాగా డబ్బు, పేరు ఉన్నవాడిని కనక పోలీసు ఒకడు 'మీకెందుకు, సార్! వెళ్ళిపోండి' అన్నాడు. నేను వింటేగా? మళ్ళీ అదె కేక వేశాను. మళ్ళీ, మళ్ళీ, చివరి కెలాగైతేనేం పోలీసు అధికారిముందు నిలుచున్నాను.
    ఆ అధికారి విద్యార్ధులను ప్రశ్నలు వేస్తున్నాడు. కొంత విసుగెత్తేలా వాళ్ళు సమాధానాలిచ్చారు. కోపంగా వాళ్ళను లాకప్ చేయించాడు.
    నేను అతనికి తెలుసు. నన్ను చూసి చిరునవ్వుతో నీతులు నేర్పటం మొదలుపెట్టాడు. అన్నీ విన్నాను. దయతలుస్తున్నట్లు 'ఇది మొదటిసారి. మరోసారి చెయ్యవ'ద్దని మందలించాడు భుజంతట్టి. ఇంకెప్పుడూ ఇలా చెయ్యవద్దని, ఇక వెళ్ళమన్నట్లు చూశాడు.
    నేను 'వందేమాతరం' అన్నాను.
    "ఫూల్!' అంటూ నన్ను కర్రతో పొడిచాడు, అంతవరకూ తను చెప్పింది లెక్కచెయ్యనందుకు. పక్కనే టేబిల్ మీద రివాల్వర్ విశ్రాంతి తీసుకుంటూంది. నేను మెరుపులా ముందడుగు వేసి దాన్ని అందుకున్నాను.
    ఊరంతా గొడవగా ఉండటంవల్ల, పోలీసు బలగం అంతా శాంతిభద్రతలను కాపాడటానికి పంపబడింది. ఒక అయిదారుగురు మాత్రం స్టేషనులో ఉన్నారు. అందువల్ల నేను తప్పించుకోవటం సులభమైంది. ఆ రివాల్వర్ తో వాళ్ళను నిస్సహాయులనుచేసి బయట పడగలిగాను.
    నేను తిన్నగా దుకాణానికి వచ్చాను. తాళం తీశాను. కొట్లో ఉన్న తానులను వీధిలోకి విసిరెయ్యటం ప్రారంభించాను. కొందరు అవి తీసుకునిపోజూచారు. నేను పిస్తోలుతో బెదిరించాను. చౌకగా కొనాలని చూశారు. పడనివ్వలేదు! వారించారు. వినలేదు!
    యాభై తాన్లు కుప్పపడగానే అగ్గిపుల్లగీసి ముట్టించాను. అది తగలబడుతూంటే మరింత ఆవేశంతో అరుస్తూ లోపలినించి తెచ్చివెయ్యసాగాను.
    గోవిందు వచ్చాడు. నన్ను ఆ పని మాన్పించాలని చూశాడు. ఎవరేది చెప్పినా నా జవాబు 'వందే మాతరం'. నేను చేసిన పని అంతా తెలుసుకుని, తన పలుకుబడినంతా వినియోగించి, డబ్బు వెదజల్లి నామీద అరెస్టు వారంటు రాకుండా చేశాడు. అయితే నామీద పోలీసు నిఘా ఉండనే ఉంది.    
    రాత్రి పదకొండు గంటలవరకు దుకాణమంతా అగ్నిహోత్రుని ప్రీతికి సమర్పించటం పూర్తి అయింది. ఇంటికి తిరిగి వచ్చాను. అందరూ నేను ఉన్మాది నయ్యానని భావించారు. నా భార్య నా కాళ్ళు పట్టుకుని ఏడిచింది. పిల్లల భవిష్యత్తుకోసమైనా నేనీ పని మానుకొని ఉండవలసిందన్నది. నా సమాధానం ఆమెకుకూడా 'వందే మాతరం' అనే!
    మరునాడు ఇంట్లో ఉన్న ఆమె నగలు, ఇంకా విలవైన వస్తువులు ఇచ్చి పొద్దున ఆరుగంటల ట్రెయినుకు, పిల్లలతో సహా పుట్టింటికి పంపించేశాను.
    మధ్యాహ్నం బాంకుకు వెళ్ళాను. నా డబ్బు అంతా యాభై వేలకు పైన ఉంటే తీసుకుని ఇంటికి వస్తున్నాను. చౌక్ లో ఒక పోలీసు ఎవరో విద్యార్ధిని పట్టుకు పోతున్నాడు. నాకూ ఆ నాలుగురోడ్ల కూడలిలో గట్టిగా 'వందే మాతరం' అని అరవాలనిపించింది. అరిచాను కూడా. ట్రాఫిక్ పోలీసు సంబంధం లేకపోయినా వార్నింగ్ ఇచ్చాడు. తెలియని ఆవేశం..... వాడి చేతిలో స్టాప్ అన్న రేకు లాగి దూరంగా విసిరేశాను. ముక్కుమీద కసికొద్దీ బలంగా గుద్ది, అక్కడే హోటల్ ముందున్న సైకిళ్ళలో ఒకదాన్ని అందుకుని ఎవరికీ దొరకకుండా సందులు, గొందులు తిరిగి, ఇంటికి చేరుకున్నాను. లోపలికి వెళ్ళి దొడ్డిగుమ్మంనుంచి వచ్చి, ఇంటిముందు తాళంవేసి, మళ్ళీ లోపలికి వచ్చి పడుకున్నాను. సైకిలు కూడా ఇంట్లోనే పెట్టాను.
    నా మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు.
    వ్యాపారం మంటగలిసింది. నాకక్కడ ఉండ బుద్ధి పట్టలేదు. బాంకునుంచి తెచ్చిన డబ్బు అంతా ఎప్పుడు వాడుకునే తోలుసంచిలో వేశాను. అవిగాక ఇంటికి సంబంధించిన రిజిస్టరీ కాయితాలు కూడా అందులో వేసుకున్నాను. కళ్ళజోడు, సూటు, దొరటోపీ వగైరా లతో అచ్చం దొరబాబులా తయారయ్యాను. అర్ధరాత్రి దొడ్డిగుమ్మంనుంచే వచ్చాను. సైకిలు కొంతదూరం నడిపించుకుని, ఓ బీటు పోలీసు కలిస్తే ఎవరిదో మా ఇంటి ముందున్నదని అతనికి అప్పగించాను. నన్ను అనుమానంగా చూసి దాన్ని తీసుకున్నాడు. నేను దర్జాగా చుట్ట కలుస్తూ, ఇంగ్లీషులో రెండు మాటలు బొడ బొడమనిపించి ముందుకు నడిచాను, ఆ వీథి కొస మలుపు తిరుగుతూ ఉండగా విజిల్ మోగింది. నేను పరుగు లంకించుకున్నాను.
    ఆ డబ్బు, కాగితాలు గోవిందుద్వారా నా భార్యకు అందె ఏర్పాటు చేసి, నేను కొన్నాళ్ళపాటు, ఏ ఉత్తర భారతానికో వెళ్ళి దేశనాయకులు స్వయంగా నడిపించే సత్యాగ్రహోధ్యమాల్లో పాల్గొనాలనుకున్నాను.




Related Novels


Samanthara Rekhalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.