Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 2



                                      శిక్ష
                                                             ---వసుంధర    


    పార్వతమ్మ ఆందోళనగా వీధి గుమ్మంలో నుంచుని రోడ్డు మీద వచ్చేపోయేవారిని పరీక్షగా చూస్తోంది.
    రెండు రోజుల క్రితం వేణు ఇంట్లోంచి పారిపోయాడు. వేణు ఆమెకు ఒక్కగా నొక్క కొడుకు. అతిగారాబంచేసి పెంచారు. జులాయిగా తయారయ్యాడు.
    రెండు రోజుల క్రితం వేణు పక్కింటమ్మాయి చేయి పట్టుకున్నాడు. ఆ పిల్ల సాచి లెంపకాయ కొట్టింది. ఆమె తల్లిదండ్రులు రెండు దవడలూ వాయించినకంటే ఎక్కువగా మాటలన్నారు. పార్వతమ్మ భర్త రాఘవులు కోపాన్నణచుకోలేక-"ఇకమీదట నీ ముఖం నా కళ్ళబడకూడదు-ఫో!" అన్నాడా వేశంగా.
    వేణులో పౌరుషానికేం తక్కువలేదు. వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు రాత్రిక్కూడా ఇంటికి రాలేదు. ఆ మర్నాడూ యింటికి రాలేదు.
    పార్వతమ్మ భర్తను వేధించసాగింది. కేవలం అదొక్కటే కారణం కాక-తనకూ కొడుకు గురించి ఆందోళనగా ఉండడంవల్ల రాఘవులు వెతకడానికి బయల్దేరాడు. ఉదయ మనగా వెళ్ళాడు. ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలయింది. ఇంతవరకూ రాలేదు.
    వంటచేసింది కానీ భోజనంకూడా చేయకుండా ఎదురుచూస్తోంది పార్వతమ్మ. ఎంతకూ భర్త జాడలేదు.
    "ఏమయిందో-ఎక్కడ తిరుగుతున్నాడో?" అనుకుంది పార్వతమ్మ.
    సరిగ్గా అప్పుడే ఆమె దృష్టి నొ వ్యక్తి ఆకర్షించాడు.
    ఆజానుబాహువు. కాషాయాంబరధారి. ముఖంలో గొప్ప తేజస్సుంది. గుబురుగా పెరిగిన గెడ్డంకూడా ఆ తేజస్సునుదాచలేకపోతోంది. మధ్యాహ్నపు టెండలో కూడా కమిలిపోకుండా మిలమిల మెరుస్తున్న పసిమి ఛాయ అతడిది.
    అతడు సాలోచనగా రోడ్డుమీంచి వెడుతూండగా చూసిన పార్వతమ్మ-"స్వామీ!" అని గట్టిగా పిలిచింది.
    ఆ వ్యక్తి ఉలిక్కిపడి ఆమెవంక తిరిగి-ఆ ఇంటిని సమీపించాడు. ప్రశ్నార్ధకంగా ఆమె వంక చూశాడు.
    "మిమ్మల్ని చూడగానే నాకు మీలో దేవుడు కనిపించాడు. నా మనసులోని ఆందోళనను మీకు చెప్పుకోవాలనుంది. ఒక్కసారి లోపలకు వస్తారా?" అనడిగింది పార్వతమ్మ.
    "ఆకలిగా వుంది. భిక్ష వేస్తావా?" అన్నాడావ్యక్తి.
    "అయ్యో-ఎంతమాట! మీ గురించి వంట సిద్దంగా వుంది. రండి-భోజనం చేద్దురు గాని...." అంది పార్వతమ్మ.
    ఆ వ్యక్తి ఇంట్లో ప్రవేశించాడు. తనే తలుపులు వేశాడు. పార్వతమ్మను నీళ్ళడిగి పాదాలు, ముఖం కడుక్కున్నాడు. నేలమీద కూర్చున్నాడు. అరిటాకు కావాలన్నాడు.
    పార్వతమ్మ అన్నీ యేర్పాటు చేసింది.
    ఆ వ్యక్తి అరిటాకులో భోజనం చేశాడు. పార్వతమ్మ ముగ్గురు మనుషులకని వండిన వంట-ఆయనొక్కడూ తినేశాడు.
    "కడుపునిండా భోజనం పెట్టావు. నిన్ను భగవంతుడు దీవిస్తాడు-" అన్నాడు పార్వతమ్మ వంక ప్రసన్నంగా చూస్తూ.
    "తమ పేరు స్వామీ!" అంది పార్వతమ్మ.
    "నాకు పేర్లతో పనిలేదు. నేనొక సన్యాసిని-" అన్నాడా వ్యక్తి.
    భోజనం కాగానే అయన కూర్చునేందుకో కుర్చీ చూపించి తనాయన పాదాలవద్ద కూర్చుంది పార్వతమ్మ.
    సన్యాసి మౌనంగా ఆమెవంకే చూస్తున్నాడు. పార్వతమ్మ చాలాసేపు తలవంచుకుని ఉన్నట్లుండి తలెత్తి "స్వామీ నా కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడా?" అనడిగింది.
    "ఏమయింది నీ కొడుక్కి?" అన్నాడు సన్యాసి.
    పార్వతమ్మ క్లుప్తంగా ఆయనకు జరిగింది చెప్పింది.
    అది వింటూనే సన్యాసి ముఖం గంభీరంగా అయిపోయింది.
    "నీ యింట్లో పూజామందిరముందా?" అన్నాడాయన.
    "ఉంది స్వామీ!"
    "పద-అక్కడకు వెడదాం!"
    ఇద్దరూ పూజామందిరం వద్దకు వెళ్ళారు.
    సన్యాసి మందిరం ముందు పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అస్పష్టంగా యేదో మంత్రోచ్చారణ చేశాడు.
    పార్వతమ్మ ఆత్రుతగా ఆయన వంకనే చూస్తోంది.
    కాసేపటికి సన్యాసి కళ్ళు తెరిచి-"నీ కొడుకు బాగా చెడిపోయాడు. సమాజానికి చీడపురుగుగా తయారయ్యాడు-" అన్నాడు.
    పార్వతమ్మ ముఖం వెలవెలబోయింది-"వాడిప్పుడెక్కడున్నాడు స్వామీ?"
    "ఒక వేశ్య యింట్లో-...."
    "క్షేమంగా ఉన్నాడా స్వామీ!"
    "ఉన్నాడు కానీ అతడి ప్రాణాలకు త్వరలోనే ముప్పు వాటిల్లనుంది...."
    పార్వతమ్మ భయంతో కంపించిపోయింది.
    సన్యాసి నిట్టూర్చి-"నీ కొడుకు చెడు దారిలో నడుస్తున్నాడు. ఆ దారి వదిలిపెడితే తప్ప అతడి ప్రాణాలకు రక్షణలేదు. అతణ్ణి మంచి మార్గాన పెట్టడానికి నీ శాయశక్తులా ప్రయత్నించు-" అన్నాడు.
    "అది సాధ్యపడుతుందంటారా?"
    "మొక్కై వంగనిది మానై వంగడం సాధ్యంకాదు. అయినా ప్రయత్నించడంలో తప్పులేదు-..." అన్నాడు సన్యాసి.
    "ఇప్పుడు వాడింటికి వస్తాడా స్వామీ!"
    "నేను వివరాలు చెబుతాను. వెళ్ళి అతణ్ణి తెచ్చుకోండి. అయితే అతడి ప్రాణాలు రక్షించడం నావల్ల కాదు-" అన్నాడు సన్యాసి.
    "అందుకే ఉపాయమూ లేదా స్వామీ!"
    సన్యాసి క్షణంపాటు తీవ్రంగా ఆలోచించి-"నీ ఇంట్లో పనసకాయ కత్తి ఒకటుంది. రెండ్రోజులక్రితమే దానికి పదును పెట్టించావు అవునా?" అన్నాడు.
    పార్వతమ్మ ఆశ్చర్యంగా-"అవును-"అంది.
    "అదే నీ కొడుకు ప్రాణాలు తీస్తుంది-" అన్నాడు సన్యాసి.
    "అయితే ఆ కత్తిని కమ్మరివాడికిచ్చి కరిగించేస్తాను-"
    "అలాంటి తెలివితక్కువ పనులు చేయకు. రానున్న చావును శ్రీకృష్ణభగవానుడు తప్పించుకోలేకపోయాడు. నీ కొడుకుకనగా ఎంత? నీ కొడుకు బ్రతకాలంటే చెడుమార్గాలు వదిలిపెట్టాలి. అదొక్కటే ఉపాయం-...."
    "తెలిసి తెలిసీ ఆ కత్తినింట్లో ఉంచుకోలేనుగదా!" అంది పార్వతమ్మ.
    "నిజమే! కానీ తప్పదు. ఆ కత్తి నీ చేయి దాటి పోవడం చాలా ప్రమాదం. ఈ యింట్లోనే వుండాలి. ఎవరికీ దొరకని విధంగా జాగ్రత్తగా యే పెట్లోనో పెట్టి తాళం వేయి-" అన్నాడు సన్యాసి.
    "నాకు చాలా భయంగా వుంది-" అంది పార్వతమ్మ.
    "భయం వివేకాన్ని పోగొడుతుంది. వివేకమే నీకు రక్ష అని మర్చిపోకు...." అని - 'నీ అదృష్టం కొద్దీ నువ్వు నన్ను పిలిచావు నా శక్తులను నేను సామాన్యుల కోసం ఉపయోగించడం అరుదుగా జరుగుతుంది. నాకెన్ని శక్తులున్నా-నీవు పెట్టిన భోజనం నాలో కలిగించిన కృతజ్ఞతా భావానికవి తలలు వంచుతున్నాయి. ఒకసారి ఆ కత్తిని తీసుకునిరా-" అన్నాడు సన్యాసి.
    కొద్దిక్షణాల్లో పార్వతమ్మ కత్తి తెచ్చి ఆయనకిచ్చింది.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.