Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 2



    మాధవరావు వీరేశం దగ్గరకు వచ్చాడు. వీరేశం తను స్వయంగా రంగంలోకి దిగకుండా పరోక్షంగా రాఘవరావుని నీడలా వెన్నంటాడు. రాఘవరావు పిచ్చివాడు కాదు. దుర్మార్గుడు. కొందరు దుర్మార్గుల్ని మానసిక శాస్త్రవేత్తలు బాగుచేయగలరు. కానీ కొందరు దుర్మార్గులకు శిక్ష ఒక్కటే మార్గం. రాఘవరావు రెండో తరహాకు చెందిన మనిషి. పిచ్చి అని పేరు చెప్పి అతడిని పిచ్చాసుపత్రిలో జేర్చడం అతడికి సరైన శిక్ష అని వీరేశం అభిప్రాయపడ్డాడు.
    ఈ పథకం మాధవరావుకి ముందు నచ్చలేదు. కానీ అంతకుమించి గత్యంతరం లేదని గ్రహించడానికి ఎంతో సేపు పట్టలేదు.
    రాఘవరావు దుర్మార్గుడు. కానీ తెలివైన దుర్మార్గుడు. అతడికి ఉచ్చనీచాలు లేవు. వావివరుసలు లేవు. మాధవరావుకు వేరే వివాహావకాశం లేకుండా చేశాడు. అతడు చెడ్డవాడన్న భ్రమ ప్రపంచానికి కలిగించాడు. అయితే మాధవరావతడికి బంగారు గ్రుడ్లు పెట్టేబాతు. అతడి నెలా వదులుకోగలడు? అందుకని భార్యను శారీరకంగా హింసించి, మానసికంగా ప్రోత్సహించి మాధవరావు పట్ల ఆకర్షితులయ్యేలా చేశాడు. వారిద్దరికీ అనుకూలపరిస్థితులు తనే ఏర్పరిచాడు.
    ఆ విధంగా సుందరమ్మ పరిస్థితుల ప్రభావానికి లోనై ఇద్దరన్నదమ్ములతోటీ కాపురం చేసింది. ఆమెకు పుట్టిన బిడ్డలు యెవరి బిడ్డలో ఆమెకూ తెలియదు. మొదట్లో జుగుప్సాకంగా అనిపించినా ఆ రకం జీవితానికి ఆమె అలవాటుపడిపోయింది. పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నా రాఘవరావులో మార్పు రావడం లేదు. ఆమెకు బెంగగా ఉండేది-ఆ పసి హృదయాలు రాఘవరావు ప్రభావానికి గురికకుద్మా తను కాపాడగలనా అని!
    ఈ పరిస్థితుల్లో వీరేశం సలహా మాధవరావుకూ, సుందరమ్మకూ అమృత ప్రాయంగా తోచింది.
    ఎలాగూ మాధవరావుకు కొంత చెడ్డపేరుంది. రాఘవరావు తీసిన గోతిలో అతడే పడే ఏర్పాటు చేశాడు మాధవరావు. తాగి తందానాలాడుతూ తను మాధవరావునని చెప్పుకుంటున్న సమయంలో అతడిని మాధవరావు పిచ్చాసుపత్రిలో జేర్పించాడు. ఆ క్షణం నుంచీ రాఘవరావు మాధవరావుగా పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. మాధవరావు రాఘవరావుగా సుఖజీవనం చేస్తున్నాడు.
    తనకు అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త పిచ్చాసుపత్రిలో ఉన్నందుకు సుందరమ్మ కాస్త బాధపడింది. కానీ సమస్యలు లేని సుఖ జీవనం, పిల్లల భవిష్యత్తు-ఆమెను పరిస్థితులకు రాజీపడేలా చేశాయి. అందులోనూ లోకం దృష్టిలో రాఘవరావే తన భర్త! తనతో ఇప్పుడుంటున్నదీ లోకం దృష్టిలో రాఘవరావే!.....
    "మొత్తంమీద రాఘవరావు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి తమ్ముడిమీద పగతీర్చుకున్నాడన్నమాట!" అన్నాడు వీరేశం.
    "చాలా ఆశ్చర్యంగా ఉంది మీ కథ! కానీ ఎంతో తెలివిగా పథకాలు వేసే రాఘవరావు ఇందులో శశికాంత్ ని ఇరికించడంలో ఉద్దేశ్యమేమిటో?"
    "ఏముంది? తన తమ్ముడు కుట్రపన్ని తనను పిచ్చాసుపత్రిలో వేసి-తన భార్యతో కులుతున్నాడనీ- అందుకు తగ్గ చావు వాడికి లభించిందనీ లోకానికి చెప్పి-మళ్ళీ సుందరమ్మ మెడకు గుదిబండై కూర్చుంచామని పథకం వేసి ఉంటాడు. కానీ మీరు తీగెలాగి డొంకంతా కదిపారు. అర్జంటుగా వెళ్ళి ఆ దుర్మార్గుడిని పట్టించండి. అవసరమైతే నేనూ ముందుకు వస్తాను. తాళిగట్టిన భర్త గదా అని ఆ సుందరమ్మ అతడికి సహకరించే అవకాశం కూడా ఉంది. కానీ అతడి కారణంగా ఆ కుటుంబం సర్వ నాశనమైపోగలదు. ఎలాగో అలా ఆ నీచుణ్ణి మీరు బంధించండి...."
    వెంకన్న లేచి నిలబడి-"థాంక్యూ డాక్టర్ వీరేశం!"
    
                                   9

    వెంకన్న ఇంటికి వెళ్ళేసరికి అక్కడ శారద కనబడింది. ఆ ప్రక్కనే శశికాంత్ ఉన్నాడు. అతడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
    "మీ ఏర్పాటు అద్బుతం సార్! నిన్న రాత్రి పోలీసులు మాధవరావును పట్టుకున్నారు-" అంది రాజమ్మ.
    "మాధవరావంటే?" అన్నాడు వెంకన్న.
    "రాఘవరావు తమ్ముడు. పిచ్చాసుపత్రినుంచి పారిపోయివచ్చి అన్నను హత్యచేశాడు...." అంది సీతమ్మ.
    మాధవరావు ఆ రాత్రి సుందరమ్మను రహస్యంగా కలుసుకుందుకు వెళ్ళాడు. పడకగదిలో వారిద్దరి సంభాషణ పోలీసు స్టేషన్ లో పలికింది. క్షణాలమీద పోలీసులు వెళ్ళి అతడిని అరెస్టు చేశారు.
    డిటెక్టివ్ వెంకన్న ఇచ్చిన వేలిముద్రలతో అతడి వేలిముద్రలు సరిపోయాయి. హత్య ఎలా జరిగిందో వెంకన్న అతడినెలా ట్రేస్ చేశాడో ఇన్స్ పెక్టర్ చెప్పి నపుడు మాధవరావుక్కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు. అతడు తను చేసిన నేరం ఒప్పుకున్నాడు. పిచ్చాసుపత్రినుంచి పారిపోయి వచ్చి శశికాంత్ ని ట్రాప్ చేసి తెలివిగా అతణ్ణి హత్యలో ఇరికించి తర్వాత సుందరమ్మ జీవితంలో ప్రవేశించాలనుకున్నాడుట. కానీ అతడి పథకం ఫలించలేదు. శశికాంత్ ని తనెలా ట్రాప్ చేసిందీ అతడు వివరించాడు. శశికాంత్ అతడి వేషాలు గుర్తుపట్టాడు.
    ఆఖరున హంతకుడు రెండు కోరికలు కోరాడు. తను ఎంతో పకడ్బందీగా వేసుకున్న పథకం ఫెయిలవడానికి కారణం ఇద్దరు. ఒకడు శశికాంత్. ఇతడు అమాయకుడు. మంచివాడు. అతణ్ణి మోసంచేయాలని అనుకోవటం వల్లనే తనకీ దుర్గతి పట్టింది. రెండోవాడు వెంకన్న. కోడిగుద్దుకు ఈకలులాగే తెలివితేటలతో, నీటిలో జాడలుతీసే నైపుణ్యంతో వ్యవహరించి తన నేరాన్ని పూర్తిగా బైటపెట్టాడు. ఇలాంటివారున్నారని ప్రచారమయిందంటే నేరస్థులు భయపడక తప్పదు.
    ఈ ఇద్దరినీ హంతకుడు కలుసుకోగోరాడు. శశికాంత్ ని అతడు కలుసుకున్నాడు. తన తప్పుకు మన్నించమని వేడుకున్నాడు. ఎందుకంటే వచ్చే జన్మలో ఎవరి ఉసూరుతనకు తగలకూడదట....
    వెంకన్నను కలుసుకోవడం కోసం అతడు తహతహలాడుతున్నాడు. ఇది వినగానే అతడిని కలుసుకుని చూడాలని వెంకన్న కూడా తహతహలాడాడు.
    వెంకన్న తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. అక్కడ ఇన్స్ పెక్టర్ అతడికి ఘనస్వాగతం పలికి అభినంధనాలతో ముంచెత్తి-"హంతకుడు మీతో కొద్ది క్షణాలు మాట్లాడాలని...." అని ఏదో అనబోతూండగా-
    "నాకూ తెలుసు.....తహతహలాడుతున్నాడు గదా!" అన్నాడు వెంకన్న తర్వాత అతడు హంతకుడిని కలుసుకున్నాడు.
    "డిటెక్టివ్ వెంకన్నగారూ! మీకు నా జోహార్!" అన్నాడు రాఘవరావు. వెంకన్న ఇంకా ఏదో అనబోతూండగానే-
    "మీ మేధాశక్తికి అన్నీ తెలిసే ఉంటాయి. చిన్నతనంనుంచి నేనో శాపగ్రస్తున్ని అంతా నా దురదృష్టం. నాదంటూ నాకేమీ మిగలకుండా పోయింది. ఎందుకు బ్రతుకుతున్నానో, నా జీవితానికర్ధమేమిటో తెలియకుండానే జీవనం కొనసాగించాను-" అని.
    "అదంతా ఇప్పుడెందుకులెండి! మొదట్నుంచీ రాఘవరావుకు మంచి పేరుంది. ప్రపంచంలో అతడికున్న ఆ మంచి పేరును పోగొట్టకండి. పిచ్చాసుపత్రినుంచి పారిపోయి వచ్చిన మాధవరావే రాఘవరావును హత్య చేశాడని అంతా అనుకుంటూంటే మీరు ఖండించకండి. నేను అన్న స్థానంలో ఇక్కడ గడిపిన అయిదు సంవత్సరాలూ నా జీవితంలో మరువలేనివి.
    పిచ్చాసుపత్రినుంచి పారిపోయి వచ్చిన నా అన్నయ్య సరాసరి ఇంటికి రాకుండా నా దగ్గర్నుంచి డబ్బు గుంజాలని బ్లాక్ మెయిలింగ్ ప్రారంభిస్తే అతడిని చంపాలని తెగించాను. నా సుఖ సౌఖ్యాలతోపాటు-సుందరమ్మ-ఆమె బిడ్డల భవిష్యత్తు కూడా దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయానికి వచ్చాను...." అన్నాడతను.
    వెంకన్న ఆశ్చర్యంగా-"అయిదేళ్లుగా ఈ ఊళ్ళో ఉంటున్న రాఘవరావే మరణించాడని నేను నమ్మాను. కానీ అది నిజంగాదన్నమాట.....మరణించింది పిచ్చాసుపత్రినుంచి, పారిపోయొచ్చిన రాఘవరావేనన్న మాట!"
    "అయిందేదో అయిపోయింది-నా విన్నపం గుర్తుంచుకుంటారు కదూ?" అన్నాడతను దీనంగా.
    "ఊఁ" అన్నాడు వెంకన్న ఇంకా అతడి వంక జాలిగానే చూస్తూ.


                                -:ఐపోయింది:-




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.