Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"నిజంగా?" అంది ముక్కుమీద వేలు పెట్టుకుని తల్లి.
సుబ్బారావుకి తిరిగీ ప్రకృతీ, పరిసరాలూ అన్నీ మరణీయంగా కనుపించాయి. రాత్రి అంతా ఒక్కడూ బుల్ బుల్ మీద హాయిగా ఏ సంకోచమూ లేకుండా ఎన్నోపాటలు పాడుకున్నాడు. తర్వాత రోజున చాలా ఆలస్యంగా పక్కమీద నుంచి లేచాడు. సూర్యకాంతి తెల్లగా వెచ్చగా రోడ్డుమీదా, రోడ్డు అవతలి తురాయి చెట్లమీదా,ఆఖరి తురాయి చెట్టు కొమ్మచివర వ్రాలిన పాలపిట్ట రెక్కలమీదా పడుతోంది. బెదరూ బెంగాలేని ఏదో కొత్త లోకంలోకి వచ్చాననుకునాడు సుబ్బారావు.
అందంగా రెండుగంటలు ముస్తాబై సాయంత్రంవేళ బయలుదేరిన సుబ్బారావు హృదయం కొంచెం సంకోచంతో రెపరెపలాడినా, ఎక్కువగా ధీమాతోనే కొట్టుకుటోంది. పేరు, ప్రతిష్టా, హోదా, సావకాశమూలేని అతని జీవితం ఈ రోజున ప్రేమతో పుమీతమై ఉన్నతమై నిలబడింది.ప్రేమించి- ప్రేమకోసం బికారులైనవాళ్ళ చరిత్రని తాను చదివాడు. కాని ప్రేమతోపాటు సిరిసంపదకూడా పొందబోయో తన యి అదృష్టం ఎక్కడ రాసి పెట్టివుంది? భగవల్లీల అంటే ఇది కదా. మనస్సులోనే భగవంతుడికి వినమ్రుడై ప్రణామ మాచరించాడు.
" హలో- సుబ్బారావు" సరదాగా నవ్వుతూ చెయ్యి ఊపింది సుమిత్ర. ఈ రెండుమూడు వారాలకే కొత్తగా మరింత అందంగా కనపడింది. తలంటుకొన్న ఆమె శిరోజాలను గుబురుగా చేర్చి కట్టిన గులాబిరంగు రిబ్బను అదేరంగు మెడమీదపడి ముద్దువస్తోంది.
" సుమిత్రా" అన్నాడు సుబ్బారావు.
గబగబా ముందుకువచ్చి సుమిత్ర ఎంతో ఆప్యాయంగా కరచాలనం చేసింది.
"అరె, బుల్ బుల్ కూడా తీసుకువచ్చావే-" నవ్వింది.
" నీకు పాడి వినిపించాలిగా."
" అవును.... అప్పుడే మరి సాధన చేశావా?"
" నాకిదివరకు వాయించడం వచ్చును."
హాల్లో, సోఫాలో కూర్చున్నారు.
"ఏమిటి మన ఊరు విశేషాలు?" అంది సుమిత్ర.
" ఏముంది. నాకేం తోచలేదు. స్కూలుకి కూడా శెలవు పెట్టానుగా."
" బెంగుళూరులో నేను మా బావ, కారులో ఊ...... తిరడమే. నే నస్తమానూ నీ కబుర్లు చెపుతూంటే 'ఎవరాయన' అనేవాడు . నాబెస్టు నా బెస్టు ఫ్రెండు అనేదాన్ని."
" మీ బావను కూడా తీసుకురాకపొయ్యావా?" అన్నాడు స్పోర్టివ్ గా సుబ్బారావు.
అదేమిటో సుమిత్ర చటుక్కున సిగ్గుపడింది ఒక సెకనులో , నవ్వుతూ అంది. "మా బావా, అత్తా అందరూ మాతో వచ్చారుగా. రా. నిన్ను పరిచయం చేస్తాను" అంటూ సుమిత్రా, మొదట సుబ్బారావుకి పరిచయం కలిగించిన పడకగదిలోకి తీసుకువెళ్ళింది. ఇదివరకు సుమిత్ర పడుకున్న మంచంమీద వెల్వెట్ దిండ్ల నానుకుని ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు సిగరెట్ పొగ సాఫీగా వదులుతూ పడుకున్నాడు.
చామనచాయగా , బలంగా వున్నాడు. కళ్ళు చిన్నవి.జుట్టు పల్చగా నొసలుదగ్గర- కళ్ళకి జోడు. మంచి ఠీవిగా మాత్రం ఉన్నాడు.
" బావా, ఇతనే నేను చెప్పిన సుబ్బారావు?"
కరచాలనం , కుశల ప్రశ్నలూ అయాక తీరికగా కూర్చున్నారు.
సుబ్బారావు నిట్టూర్చాడు... హమ్మయ్య అని.
ఎందుకు?
అతను తనంత అందగాడు కానందుకు. ఇంక ఫీల్జుమీద శత్రువులు లేరు. తనకి! లోపల ఎక్కడో భయం భయంగా దాక్కున్న ఆ సంకోచం కాస్తా తొలగిపోయింది.
అత నేవేవో కబుర్లు అమెరికాని గురించి , ఫ్రాన్సుని గురించి చెప్పాడు.
"చాలా మంచివాడు, నిగర్వి" అనుకున్నాడు సుబ్బారావు.
"మీరు బుల్ బుల్ మీద పాడతానని మాటిచ్చారుటగా సుమిత్రకి.మరి పాడండి. ఆ ఆనందంలో నేనూ కొంత పాలుపంచుకుంటాను."
" ఇప్పుడెందుకులెండి" సిగ్గుపడ్డాడు. సుబ్బారావు.
"ఊహు. పాడాలి సుబ్బ్రారావు" అడిగింది, సుమిత్ర ఆప్యాయంగా . ఆ గొంతు, ఆ చూపు, ఆ తియ్యదనం- వాటికోసమే బతికాను అనుకున్నాడు సుబ్బారావు. బుల్ బుల్ మీటూతూ పాడాడు.
చిరుచీకటి గదినిండా వ్యాపిస్తూండడం ఎవరూ గమనించలేదు. అతని పాటలోని భావమూ, మధురిమా ఆ మునిమాపులో శ్రోతలిద్దర్నీ అవ్యక్తాను భూతులతో నింపివేశాయి.
కాస్సేపడటికి రాఘవరావు- సుమిత్ర బావ- నవ్వుతూ అన్నాడు.
" లైటు వేయడంకూడా మరచిపోయావు సుమిత్రా."



