Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
     "సుబ్బా, నీకోసం కష్టపడి పెట్టానురా వడియాలు"  అంది తల్లి.

     "తీసుకెళ్ళి గోదావరిలో పడెయ్యి" అన్నాడు విసురుగా సుబ్బారావు.తల్లి విస్తుపోయింది.

     "అన్నయ్యా పువ్వులజడ అల్లుకున్నాను చూడ" అని జడని ముందుకు వేసుకుని గర్వంగా చూపించింది చెల్లెలు.

     "చదువు సంధ్యా లేదు కాని పువ్వుల జడలు! ఊరికే యింతింత జుట్టు పెంచుకోవడమూ, వాటికి అత్తర్లూ, పువ్వులూ- నీకూ క్రాపింగ్ చేయించి పారేస్తానుండు" అని  విసురుగా వెళ్ళిపోయాడు.

     సుమిత్ర ఊళ్ళో లేనిదే యింత  విప్లవం కలుగుతుందని  ఎవరు అనుకుంటారు? ఆహారం  రుచించక,ఏకాంతం పడక, నలుగురులో తోచక, రాత్రిళ్ళు నిద్రపట్టక, పగలు ఎప్పటికీ  రాత్రి అవక- చిక్కిపోతున్నాడు సుబ్బారావు. అయిదవరోజున సుబ్బారావుకి పార్శెల్ వచ్చింది. అతని మొహం కళకళలాడింది. రోజూ నదివొడ్డుకిపోయి అదేచోటులో కూర్చుని బుల్ బుల్ సారించేవాడు. పాటపాడేవాడు.తాటితోపు  తల ఊపేది. నదిలో నీళ్ళు ఆనందంతో జలజలమని చప్పుడు చేసేవి.

    సుబ్బారావు ప్రేమికుడు.ఇది ప్రేమ తపస్సు.

    " ఏరా,అడిగావా ఆ  అమ్మాయిని పెళ్ళిమాట?" అన్నదీ తల్లి ఒక రోజున. ఏమిటో మధ్యమధ్య ఆమెకి అనుమానం ఎక్కువౌతూంటుంది. ఒక నెల్లాళ్ళు సెలవుపెట్టడు కొడుకు.తాకట్టుమీద తెచ్చిన డబ్బు అయిపోవచ్చింది. ఎండమావుల్ని నమ్ముకుని  ఎన్నాళ్ళు బతకడం, ఇదే ఆమె సందేహం.

    కాని ఆమె 'బుల్ బుల్ పంపడమూ,ఆమె ఉత్తరంలో  'మా మేనత్తతోనూ బావతోనూ మీమాటే చెబుదతుంటాను' అని  వ్రాయడమూ ఇది తిరిగీ ఆమెకి ఆశనీ ధైర్యాన్నీ కలిగించాయి.   ఆ ఏడుకొండలవాడే తలచుకుంటే   ఓడలు ఒళ్ళూ బళ్ళు ఓడలూ అయిపోవా!

    అలాగ పాడుకుంటూ, ఆలోచించుకుంటూ రోజులు గడుపుతున్నాడు సుబ్బారావు.

    కాని కాలం సరిపోయేదికాదు. సుబ్బారావు ఆలోచించుకోవడానికి. కాలం యిరుకుగా పాత కలకత్తా గల్లీ లాగ వుంది. పాపం ఎన్ని ఆలోచించుకోవాలి తాను. సుమ్రితతో తానింతవరకు గడిపిన ప్రతిక్షణమూ జ్ఞప్తికి తెచ్చుకునేవాడు. ప్రతీ మాట తనలో తను అనుకునేవాడు.ఆమె ప్రతి కదలికనూ ఆలోచించుకొని తన్మయత్వ పొందేవాడు.

     ఇంక ఎన్నాళ్ళకి వస్తుందో సెకనులతో సహా లెక్క పెట్టేవాడు. వచ్చిన తర్వాత బెంగుళూరు చల్లని  గాలికి ఆమె వొళ్ళూ మొహమూ ఇంకెంత అందంగా అవుతాయో, తన వివాహ ప్రతిపాదనకి ఎలాగ సిగ్గుపడి ఓరగాచూస్తూ 'అలాగే' అని అంగీకారం సూచిస్తూ నవ్వుతుందో , తమ దాంపత్య జీవితం- ఓ రోజున సుమిత్రకి వేవిళ్ళని  అమ్మ వచ్చి తన చెవిలో ఊదడం- కబుర్లు , ముద్దులూ, కౌగిలిందలు, సర్దాలు పొల అలకలు , షికార్లు-

     ఫక్కున నవ్వుకున్నాడు సుబ్బారావు, బల్లమీద అద్దంలో మూడూ  బై అయిదవ వంతు అతని  ప్రతిబింబం కూడా పక్కున నవ్వింది.

     సెకండరీ గ్రేడు స్కూలు టీచరు సుబ్బారావు మిల్ ఓనర్ కోటీశ్వరరావుగారి అల్లుడు.

     మూడూ బై అయిదవ వంతు అద్దంలోకి అరమోడ్పు  కన్నులతో చూశాడు. సుబ్బారావు.

     భవిష్యత్తూని గురించిన ధీమా ప్రాణవాయువులా వెళ్ళి అతని ఛాతీని రెండంగుళాలు పెద్దది చేసింది.

      అతని యౌవనం అందమైన స్వప్నాన్ని దండగా అల్లి అతని మెడలో వేసింది.

     స్వప్నాలు నిజాలు కాబోయే ఆ క్షణంకోసం అతను  జీవితపు మెయిన్ రోడ్డుమీద నిలబడి చూస్తున్నాడు.

     అలా చూస్తూ నిలబడి  వుండగా పోస్టుమన్ ఉత్తరం తీసుకొచ్చు ఇచ్చాడు. ఆతృతతో విప్పి చదివాడు:

    "రేపు మధ్యహ్నం బండికి వస్తున్నాము.సాయంత్రం కలుసుకో సుమిత్ర."

     అతను చేసిన అస్పష్ట ఆనందరవానికి- కంగారూ వెనకాల తల్లీ చెల్లెలూ వచ్చి నిలుచున్నారు.

        " అమ్మా- సుమిత్ర రేపు వస్తోందమ్మా."

    " సాయంత్రం నన్ను కలుసుకోమందమ్మా"

    " అడిగి తేల్చేసుకుంటానమ్మా" గబగబ అనేశాడు సుబ్బారావు.

        " ముహూర్తం తర్వగా పెట్టించెయ్యి. ఏకంగా సెలవు పొడింగించవచ్చును. ఆ తరువాత నుంచీ స్కూలుకి మానకుండా వెళ్ళొచ్చును." అంది తల్లి.

    అమాయకురాలైన తల్లికేసి ఎంతో సానుభూతితో చూచాడు.  " ఇంకా నాకు ఆవెధవ స్కూలు మేష్టరీయేనా అమ్మా."

    "అదేమిట్రా నెలకి కరకుల్లాగా ఎనభై రూపాయలు వస్తూంటే కాదంటామా- నీకుమాత్రం యేదోపనిలేకపోతే తోస్తుందీ." అంది తల్లి.

      "ఎనభై రూపాయలంటే నీకూ, నాకూ పక్కింటి బ్యాంకి గుమాస్తాగారికీ అవతల ఇంటి టైపిస్టు  నౌకర్లుకి మూడవందల రూపాయల జీతాలమ్మ. సుమిత్ర ఖర్చు  నెలకి అయిదువందలే  అయితే  "యింత తక్కువ ఖర్చు పెట్టుకుంటున్నావేం. ఒంట్లో బాగులేదా" అని  కూకలేస్తాడమ్మా వాళ్ళ ఫాదరూ!" అన్నాడు సుబ్బారావు.
   




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.