Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"అరె! సుబ్బారావు పాడితేనే నేదోలా అయిపోతాను. " అంటూ సుమిత్ర లేచి లైట్లు ఆన్ చేసింది.
" మీ స్నేహాన్నే ఎప్పుడూ కోరుతాను. మీ పరిచయం కలగడం నా అదృష్టం" అన్నాడు రాఘవరావుతో.
"ఎంత మాట"
"ఇంకా ఈ వూళ్ళో నెల్లాళ్ళవరకూ ఉండాలి కదా. మీరు రోజూ వస్తూ పోతూండాలి. ఏమంటావు సుమిత్రా" అంటూ సుమిత్రవైపు చూశాడు రాఘవరావు.
" అవును తప్పకుండా" అంది సుమిత్ర.
రాఘవరావు మంచందిగి సుబ్బారావుతో కరచాలనంచేసి, " మామగారితో మాట్లాడవల్సిన పనివుంది ఎక్స్యుజ్ మీ. సుమిత్రా, నీ చేత్తో నువ్వే సుబ్బారావుగారికి శుభలేఖ ఇయ్యి. ఇంకా కొన్ని శుభలేఖలు ఆయనచేత టీచర్లకి, వాళ్ళకి పంపిస్తానన్నావుగా" అంటూ అద్దంముందు నిల్చుని తలదువ్వుకుంటున్నాడు.
సుమిత్ర కొంచెం సిగ్గుతో కొంచెం నవ్వుతూ " అవును తీసుకువస్తా" అంటూ లోపలికి వెళ్ళి ఓ నిముషంలో ఒక కట్టని తీసుకువచ్చి సుబ్బారావు చేతిలో పెట్టింది.
శుభలేఖనవి చూసిన సుబ్బారావుకి కళ్ళు చీకట్లు కమ్మాయి. ఎవరో నెత్తిమీదనుంచి ఒక పెద్ద మేకను గుండెలదాకా కొట్టినట్టయింది. అతని కడుపుని చీల్చి పేగుల్ని యివతలికి లాగి తెంపేస్తోన్నట్టు అనిపించింది. చావుకన్న భయంకరమైన అనుభవం అతనికి హఠాత్తుగా కలిగింది. పిడుగుపడినవాడి లాగా నిశ్చేష్టుడై నోటమాట లేక అలా ఉండిపోయాడు.
"అదేం సుబ్బారావ్. ఈ మాత్రం సహాయం చెయ్యలేవా.చూడు నీ మేరేజ్ కి నేనెంత యాక్టివ్ గా ఉంటానో" అంది నవ్వుతూ సుమిత్ర.
" వస్తానండి గుడ్ నైట్" అంటూ త దువ్వుకోవడం పూర్తి అయిన రాఘవరావు గదిలోంచి వెళ్ళిపోయాడు.
"అరె అలా తెల్లబోయి నుంచుంటావేం! ఇంకా కంగ్రాచ్యులేషన్సు చెప్తావనుకుంటున్నాను" అంది ఆశ్చర్యంతో సుమిత్ర.
నీటిలోని ప్రతిబింబంలాగా సుమిత్ర రూపం కళ్ళ ఎదుట చెదిరిపోతోంది. చుట్టూ వున్న గోడలు కరిగి కూలిపోతున్నాయి. చర్మరంధ్రాల్లోంచి రక్తం, బయటికి చిమ్మేస్తుంది. కాస్సేపటికి కూర్చీలో కూలబడి "ఎంత పనిచేశావ్" అన్నాడు బొంగురుగా ఏడుపుగా.
" ఏం ముందుగా నీకు చెప్పలేదనా కోపం సుబ్బారావూ?నన్ను క్షమించు" జాలిగా తీయగా అడిగింది సుమిత్ర.
"కాదు, నిన్ను నేను ప్రేమించాను.నన్ను పెళ్ళి చేసుకుంటావనుకున్నాను" అన్నాడు సుబ్బారావు.ఎలా అన్నాడో తనకే తెలియదు.
" నిన్నా!" ఈ సారి సుమిత్ర ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. ఆమె కొక్కసారి పరిస్థితి అంతా అవగాహన అయింది.కంగారుపడింది. కాని ఆడవాళ్ళకుండే ఒక గొప్ప సౌలభ్యంతో మామూలు మనిషై, సాదాగా నవ్వుతూ యిలా అంది. " సెకండరీగ్రేడు మేష్టరువి సుబ్బారావు. నీకిచ్చి నాన్న ఎలా పెళ్ళిచేస్తాడనుకున్నావు."
" నిన్ను నేనెలా పెళ్ళిచేసుకుంటాను" అని అంటే ఆమె స్త్ర్రీలకి ప్రతినిధి కాకపోను. అక్కడే ఆమె చాతుర్యం వుంది. ప్రయత్న పూర్వకంగా అలాగ ఆమె అనలేదు. అలాగ తండ్రిని అడ్డం పెట్టి మాట్లాడాలనే ఔచిత్యం ఆమెకి సహజంగానే అలవడింది.
"సుబ్బారావు"
......................
" నువ్వంటే నాకు ఎంత స్నేహభావం! ఆ స్నేహమూ అనురాగమూ ఏమీ కాదా! కోపమా సుబ్బారావు. నా మేలునీ, అభివృద్ధినీ కోరేవాడిని కదా. ఏదీ ఒట్టు వెయ్యి మన మైత్రికి ఏ అంతరాయమూ కలగదనీ."-
కళ్ళల్లోకి చూస్తూ అనునయంగా అడగింది సుమిత్ర.
ఒట్టవేశాడు సుబ్బారావు, తనకి తెలియకుండానే.
" ఈ శుభలేఖలు మన వాళ్ళగకి యిచ్చివేస్తావు కదూ. రేపు సాయంత్రం స్కూలు వదలగానే వచ్చెయ్యాలి. సుమీ. నేనూ బావా నీకోసం కనిపెట్టుకుంటాం.అదుగో నాన్న పిలుస్తున్నాడు.వస్తా- ఏం, వెళ్ళనా సుబ్బారావు."
తల ఊపాడు సుబ్బారావు.
"అమయకుడివి సుబ్బారావు" అని అతని భుజంమీద చెయ్యివేసి వెళ్ళిపోయింది సుమిత్ర.
ఒక చెత్తో శుభలేఖ కట్టతో, చేత్తో గుండెల్ని పట్టుకుని మతిలేని తారు రోడ్డుమీద విద్యుద్దీపాల కాంతిలో మగతగా నడుస్తున్నాడు సుబ్బారావు. ఎక్కడికి వెళుతున్నాడో అతనికి తెలియదు.ఏవో మలుపులు తిరుగుతున్నాడు.ఎక్కడికో వెళుతున్నాడు . కొంతసేపటికి ఊరిచివరికి వచ్చాడు. అక్కడనుంచి తానూ సుమిత్రా షికారుకివచ్చే నదివొడ్డుకి వచ్చాడు.అక్కడ అంతా చీకటి. ఏవో కీచురాళ్ళ కూతలు. ఎవరో పరుగెత్తుతూన్నట్టూ అస్పష్టమైన ధ్వనులు ఆకులు రాలిన అకులలోంచి తొండలు కదలిన చప్పుళ్ళు . నీరసంగా శూన్యంగా ఉన్న చీకటి.అలాగే వెర్రివాడిలా నుంచుని పోయాడు. అతని క్షుభిత మనస్సుతో ఏ సంబంధమూ లేకుండా నది చిన్న చిన్న అలలతో ప్రశాంతంగా ప్రవహిస్తోంది. తాటితోపులో చీకటి మరింత చిక్కపడుతోంది.
సుబ్బారావు ఒక్కసారిగా చేతిలోంచి శుఖలేఖల్ని జారవిడిచి బావురుమన్నాడు. అతను మొహం రెండు చేతులతోనూ కప్పుకుని ఏడ్చాడు. నేలమీద కూలపడి ఏడ్చాడు. అతనికి ఏడుపు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఆ ఏడుపు అక్కడి చప్పుళ్ళతో కలసి మళ్ళీ విడిగా విడిగా తడిగా వినబడుతోంది.
ఎదురుగా నదిలో నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ప్రతిబింబిస్తున్నాయి.అతని వెనకాలనే తాటిచెట్లు విధి నియోగించిన రక్షకభటులాగ నిశ్శబ్దంగా కఠినంగా నిలబడి వున్నాయి.
జాలిగా తల్లిలాగా సుబ్బారావుని చీకటి చుట్టుకుంది.
(1961)
*************



