Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఆ వచ్చినవాళ్ళెవరో,ఎవరికెన్ని మేడలు లేక కార్లు నగలు ఉన్నాయో. ఎవరి కొడుక్కెంత కట్నం వచ్చిందో, ఏ యే అమ్మాయిలకి పెళ్ళి అయిందో, కొందరి కెందుకవలేదో- ఇటువంటివన్నీ గబగబా ఉత్సహంగా సుమిత్ర చేప్పేస్తోంది. సుబ్బారావుకి తను అడగాలన్న విషయం ఎలా ప్రారంభించాలా అని అనుమానం, అంతకన్న ఏదో భయం- " నువ్వా సామాన్య మేష్టారువి" అంటుందేమోనన్న దిగులు-
" ఒక పాట పాడు సుబ్బారావ్, ఇందాకటి పార్టీకి తలనొప్పి వచ్చేసింది." అంది వెల్లకితలా పడుకుని, అందాల యౌవనాంగి సుమిత్ర,సందేహభారంతో బరువెక్కిన గుండెగల సుబ్బారావు " ఈ వేళ పాడనేను సుమిత్రా" అన్నాడు.
" పోనీలే- నేను రేపు వెళ్ళిపోతున్నాగా" అంది బుంగమొహం పెట్టి.
" నువ్వు వెళ్ళిపోతే నాకేం తోచదు " అన్నాడు సుబ్బారావు ధైర్యంచేసి.
" నిజంగా!"
" నాకంతా శూన్యంగా ఉంటుంది." సుబ్బారావు గొంతు గాద్గదికమయింది.
"నీ మనస్సు నాకు తెలయదా? నాకు మాత్రం నువ్వస్తమానం జ్ఞాపకం వస్తూంటావు."
ఈ సమాధానం మళ్ళీ అతని గుండెవి తేలికపరచింది.
" పాడు సుబ్బారావు! ఒక్క పాట పాడుదూ."
ఏదో దీనంగా జాలిగా అడిగినట్లనిపించింది సుబ్బారావుకి. అతనిలో రాబోయే వియోగవేదన అంతా ఇప్పుడే పెల్లుబికినట్టయింది. సహజంగా విషాద మధురమైన గొంతు వచ్చేసింది. ఆ చీకటిలో అతని కంఠస్వరం రాలిపుతూన్న తారల దుమ్ములాగా, బాదంచెట్టు ఆకులమీద నుంచి జారిపడుతున్న చిరుగాలి ఏడుపులాగా హృదయాన్ని బాధగా సోకుతోంది. ' ఏ వసంతమా, నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. నా మనస్సు వర్షాకాలపు దుఃఖపునీటితో నిండిపోయింది. ఇంక భయంకరమైన హేమంతం వస్తోంది. నేను ఆశలనే ఆకులని రాల్చుకుని' మోడునైపోతున్నాను. నశించిపోతున్నాను' అని ఆ పాట అర్థం ఆ పాట ఒక చెట్టు పాడిన పాట అని వేరే చెప్పనక్కర్లేదు.
ఆ చెట్టును తానే అనుకున్నాడు సుబ్బారావు.అనుకుంటూనే విలవిలలాడిపోయేడు.
పాట ఆపి మొహం పక్కకి తిప్పడంలో పోర్టికోలోని విద్యుద్ధీపపు కాంతి అతని కళ్ళమ్మట అశ్రువులు జారడం సుమిత్ర చూసింది.
"అదేవిటి సుబ్బావు.ఏడుస్తున్నావా,ఛ!" అంది సుమిత్ర.
సుబ్బారావుకి ఏదో అభిమానం ముంచుకొచ్చింది. ఏడవడంవలన తాను సుమిత్రకి లోకువైపోతాననుకున్నాడు. ఎప్పడూ గంభీరుడూ ధీరుడూ అయిన నాయకుణ్ణి వరిస్తారుకదా అందమైన సుదంరీమణులు. అందుకోసం పెద్ద అబద్ధం ఆడేశాను.
" ఇది నాలో ఒక విషాదస్మృతి రేపింది సుమిత్రా."
"ఏమిటదీ-"
" నా మిత్రుడీపాట పాడేవాడు.అతని దగ్గరే నేనిది నేర్చుకున్నాను అతను తర్వాత పాపం- చచ్చిపోయాడు."
"అరెరె!" అంది సుమిత్ర "నీది ఎంత సున్నితమైన మనస్సు సుబ్బారావ్."
కాని సుబ్బారావు చాలా బాధపడ్డాడు.ఆమె సానుభూతిని తనమీద నుంచి తన స్నేహితుడిమీదకి ఫోకస్ చేశాడ, తెలివితక్కువవల్ల . ఈపాట బెంగుళూరు వెళ్ళిపోయే ఆమెని గురించే అనీ, ఆ ముక్కలైపోతున్న హృదయం అచ్చంగా తనదేనని చెప్పివుంటే- ఈ ' అయితే' అన్న ప్రశ్న సుబ్బారావు చరిత్రలలో సమాధానంలేని క్లిష్టసమస్య అయిపోయింది.
"నువ్వు బుల్ బుల్ వాయిస్తూ పాడితే ఎంతో బావుంటుంది " అంది సుమిత్ర.
" బుల్ బుల్ నీకు యిష్టమా?"
" చాలా యిష్టం."
" అయితే ఒకటి కొంటాను."
"కాదు కాదు.ఇక్కడ మంచివి వుండవు.బెంగుళూరు వెళ్ళగానే కొని నీపేర పార్సెల్ చేసి పంపిస్తాను వచ్చేటప్పటికి బుల్ బుల్ మీద నువ్వు పాడాలి సుమా!"
" ఓ తప్పకుండా" అన్నాడు సుబ్బారావు.
తర్వాత రోజున మఫ్లర్ మొహానికి చుట్టుకొని, ముంగురులు చిలిపిగా నొసట నాట్యం చేస్తూంటే,తెల్లని పలువరుస సన్పించేలా నవ్వుతూ గుడ్ బై చెబుతూ, చేరుమాల ఊపుతూ రైలులో కనుచూపు మేరదాకా వెళ్ళిపోయే సుమిత్రమి చూసి చూసి బరువుగా నిట్టూర్చి అంత కన్నా బరువుగా అడుగులు వేసుకుంటూ వచ్చేశాడు సుబ్బారావు.
ప్రకృతీ ప్రజలూ అందరూ నిరానందంగా కనిపించారు. సుబ్బారావుకి. అంతేకాదు అతని మనస్సు ఓ అఘాయిత్యంతో నిండిపోయింది.
" చూశావా సుబ్బారావు, ఈ 'లాంబ్రేటా' మోటార్ సైకిల్ మొన్ననే కొన్నాను. ఎలా వుంది?" అన్నాడొక క్లాస్ మేటూ ధనికుడు అయిన మిత్రుడు.
"తప్పకుండా ఏక్సిడెంట్ అయి చచ్చిపోతావు" అందామనుకున్నాడు. కాని పేలవంగా నవ్వి " బాగుంది" అన్నాడు.



