Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
" అయితే మీరెందుకూ వెళ్ళడం."
"ఊరికినే- మా మేనత్త మరీ మరీ రమ్మని వ్రాసింది"
"మీ మామయ్య ఏం చేస్తుంటాడు"
"అక్కడ టెక్స్ టయిల్ ఫ్యాక్టరీ యజమాని. చాలా పెద్ద వ్యాపారస్తుడు."
ఎలా ఉంటాడు మీ బావ అని అడగాలని " ఎన్నాళ్ళుంటారక్కడ" అన్నాడు సుబ్బారావు.
" అబ్బే పది పదిహేను రోజులు.."
" అయితే నన్ను మర్చిపోతా వన్నమాట."
" ఛా! అదేవిటి సుబ్బారావ్. నిన్ను కలలో అయినా మర్చిపోతానా, నా ప్రాణ స్నేహితుడివి.""
చాలు అనుకున్నాడు సుబ్బారావు. జన్మ ధన్యమయింది.ఇంతకన్న ఏ ఆడది నోరువిడిచి చెప్పగలదు అనుకున్నాడు.
తర్వాత రోజున సుబ్బారావు ఎక్కేగుమ్మామూ, దిగేగుమ్మమూ. సుమిత్రకి పుట్టిన రోజుకీ ప్రెజెంటు యివ్వాలంటే డబ్బేదీ. అందుకే ఎరుగున్నవాళ్ళా,ఎగిరీ ఎరగని వాళ్ళ ఇళ్ళన్నీ తిరిగాడు. సాయంత్రానికి అయిదుంబావలా వచ్చింది. చొక్కా మాత్రం చెమటతో తడిసి ముద్దయింది.
తిన్నగా ఒక షాప్ లో కి వెళ్ళాడు.చేతినున్న వాచీ తీసియిచ్చి పాతిక రూపాయలు తెచ్చుకున్నాడు. తీసి యివ్వడమంటే అమ్మేశాడన్న మాట. తాకట్టు అయితే పదిహేనుకిమించి యివ్వనన్నాడు. మరి షావుకారు.ఎనభై రూపాయలెట్టి కొన్న వాచీకి అంతకన్న ఇచ్చేవాడు ఈ పృథివీలో అంటే యీ వూళ్ళోలేడన్న షావుకారు మాటల్ని పరమసత్యంగా తీసుకుని అమ్మేశాడు.
ఆ రాత్రి అంతా నిద్రలో దుస్వప్నాలూ సుస్వప్నాలూ రెండూ కలిసివచ్చి, విశ్రాంతి లేనివాణ్ణి చేశాయి. తను అమ్మిన వాచీ గాలిలో ఎగిరి శూన్యంలోకి స్పుత్నిక్ లా దూసుకుపోయినట్టూ, సుమిత్ర దెయ్యం అయి ' నువ్వే కావాలి నువ్వే కావాలి' అని పీక్కుతింటున్నట్లూ, సుమిత్ర తనని నదివొడ్డున తాడిచెట్టు మాటున మసక మసక చీకట్లో ముద్దుపెట్టుకున్నాట్టూ.....
ఆ రోజు బాగా ఆలస్యంగా లేచాడు. వొళ్ళంతా బరువుగా వుంది..మొహమైనా కడుక్కోకుండా అద్దంముందు కూర్చుని తన మూడూ బై అయిదవవంతు మొహాన్ని చూచుకున్నాడు.జుట్టు మొహం మీద పడుతోంది.కళ్ళల్లో నిద్ర తాలూకు చీకటి రొద యింకా ఉంది. కండలు తిరిగిన ఛాతీ చేతులూ బలంగానే ఉన్నా జడంగా ఆ బల్లనానుకుని అంటుకునిపోయాయి. సుబ్బారావు ఆలోచించుకోవడం మొదలెట్టాడు.
తనలో ఎందుకీ అలసట!
ఆమె అంతకన్న తన యిష్టాన్నీ ప్రేమనీ ఎలా వ్యక్తంచేస్తుందీ? ఎంత మిలియనీర్ కూతురైనా ఆడదికదా!
తాను చాలాకాలం వెయిట్ చేశడు. తమ ప్రేమ తీగలు సాగి, ఆకు తొడిగి పుష్పించడానికి సిద్ధంగా ఉంది.
కనుక యింక అడిగెయ్యాలి. ఈ పుట్టిన రోజున తేల్చుకోవాలి.
తర్వాత బెంగుళూరు కాదు బొంబాయికూడ వెళ్ళమను! తాను అనుమతి యిచ్చేస్తాడు.
పెళ్ళయాక ఎలా ఉంటుంది. హనీమూన్ ఎక్కడ ఎక్కడ! తను కార్లో తిరుగుతూంటే స్థూల శరీరరూప రాక్షసుడు అనగా హెడ్మాష్టరు పాపం ఏమయిపోదతాడు... అలా ఆలోచించుకుంటూ ఉండిపోయాడు సుబ్బారావు.
మేడ అంతా అందంగా అరేంజి చేయబడింది. ఆ హూతులలో మొదట వచ్చిన సుబ్బారావును చూసి ' మేష్టారు ముందొచ్చేశారే' అని నవ్వి ప్లవర్ వేజులలో పువ్వులు సర్దడంలాంటి చిన్న పనులు పుమాయించింది. నౌకర్లు పనిలేకపోయినా- లేకపోవడంవలనే-మరింత హడావుడిగా ఇటూ అటూ తిరుగుతున్నారు.అతిథు లొక్కౌక్కరే రావడం నమస్తేలూ, కరచాలనాలూ,తెచ్చికోలు నవ్వులూ, గొప్పలూ, డంబాలూ, అత్తరు వాసనలూ అంతా శ్రీమంతుల ఇళ్ళల్లో లాగే ఉంది.
హఠత్తుగా కోటేశ్వరరావుగారు సుమిత్రని పిలిచి "అమ్మాయి! కిళ్ళీలు రాలేదు" అన్నాడు. సుమిత్ర కళ్ళలో యెంతో భయం గోచరించింది. చప్పున సుబ్బారావు దగ్గరకు వచ్చి సైకిలుమీదవెళ్ళి పోలయ్య కొట్లో కిళ్ళీలు తీసుకురమ్మని బతిమాలింది. సుబ్బారావు హాల్లోంచి సైకిలు సీటు మీదికి ఒకే గంతులో దూకడంకూడా సర్కస్ ఫిట్ లాంటిదని కొందరి గట్టి నమ్మకం.
కిళ్ళీలు తీసుకువచ్చిన సుబ్బారావుకి ఏ బల్లముందూ సీటు కాళీలేకపోయింది. సుమిత్ర హడావుడిగా ఆగ మగ స్నేహితులతో ఏవేవో కబుర్లు చెపుతూ ఐస్ క్రిమ్ ని అందంగా తింటోంది సుబ్బారావు కొంచెంసేపు నిలబడి సిగ్గుతో అవమానంతో హాల్లోకివచ్చి నిలబడ్డాడు. కోపంతో అతని పెదవులు వణుకుతున్నాయి. వెళ్ళిపోదాం అనుకున్నాడు. కాని "సుబ్బారావ్" అంటూ పరుగెత్తుకువచ్చింది సుమిత్ర. " క్షమించు- తొందరలో నీ మాట మరచిపోయాను. ప్లీజ్,ఎక్సూజ్ మి" అంటూ అతని చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి తన కుర్చీ పక్క మరో కూర్చీ వేయించి ' నా క్లోజ్ ఫ్రెండ్ ( ఆప్తమిత్రులు) సుబ్బారావ్" అని అందరికీ పరిచయం చేసింది. సగర్వంగా సహాసంగా నెపోలియన్ సైనిక వందనాన్ని పొందుతున్నట్టుగా సుబ్బారావు నలుదిక్కులూ చూశాడు.
ఛీ- ఎంత అపార్థం చేసుకున్నాడు,. సుమిత్ర అమృత హృదయాన్ని.ఎంత అల్పుడు తాను. ఎంత సంకుచిత మనస్సు గలవాడు!సుబ్బారావు సుబ్బారావువే క్షమించనని నిక్కచ్చిగా చెప్పేశాడు. అందరూ బహూమతులు ఇచ్చి వెళ్ళిపోయాక సుమిత్ర ఒంటరిగా ఉండగా చూసి తను తీసుకువచ్చిన ఉంగరం- ఆమెకిచ్చాడు.
" ఎంత మంచివాడవు సుబ్బారావు" అంది కృతజ్ఞతతో సుమిత్ర. " రా అలా బాదంచెట్టు క్రింద కూర్చుందాం కాస్సేపు."



