Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"అవునండి."
" గుండెకాయలో ధమనులూ సిరలూ ప్రేమలూ ఉండును-ఇదేం సైన్సు! "
"..... "
"నువ్వు చెప్పినదేనా- ఏమిటి! ప్రేమలుకూడా సైన్సేనా!"
".... "
"మనస్థిమితం లేదా? మాట్లాడవేం?"
"చూడు సుబ్బారావు, నిన్ను చూస్తే జాలివేస్తోంది. నువ్వేదో బాధపడుతూన్నట్టుంది. మనిషినిచూస్తే ఆరోగ్యంగానే ఉన్నావు. కాని నీ మూలాన పిల్లల చదువు దెబ్బతింటోంది, పోనీ కొన్నాళ్ళు సెలవు పెట్టరాదూ"
" నేనూ అదే అనుకుంటున్నానండి."
" జీతం నష్టంమీద నీకు సెలవిస్తాను కావాలా?"
" కావాలండి."
" ఎన్నాళ్ళు?"
"సుబ్బరావు ఆలోచించాడు" ఒక నెల అండి."
"సరే అప్లయ్ చేసుకో. ఈ నెళ్ళాళ్ళూ విశ్రాంతి తీసుకొని మందుచ్చుకో మనస్థిమితానికి."
" చిత్తం" అన్నాడు సుబ్బారావు. మనసులో మాత్రం 'పోవయ్యా ఇక ముందు మన జాతకం నీకేం తెలుసును?' అనుకున్నాడు.పరిశుద్ధమైన ప్రాణవాయువును ఒకసారి గుండెలనిండా పీల్చి ఉత్సాహంగా స్కూలు ఆవరణదాటి ప్రపంచం మీద పడ్డాడు.
సెలవు పెట్టిన సుబ్బారావుకు వారం రోజులవరకూ సుమిత్ర కనుపించనేలేదు.ఆమె స్నేహితురాండ్రతో ఏవో ప్రోగ్రాములూ, పిక్నిక్ లూ మొదలైనవి జరుపుకోవటం వలన ఆమె ఇంటిదగ్గర లేకుండా పోయింది. తర్వాత రోజున నాలుగు దాటాక వెళ్ళాడు సుబ్బారావు.
"మీ అక్కయ్య ఉందా?" అని అడిగాడు గోపీని.
"ఓ" అంటూ గోపీ సుబ్బారావు ఆమె గదిలోకి తీసుకెళ్ళాడు. ఆమె అక్కడలేదు. "కుర్చోండి, ఎక్కడుందో చూస్తాను" అంటూ గోపీ పరుగుతీసాడు. సుబ్బారావుకు చాలా కోపంగా ఉంది. వారంరోజు తనని ఇంత విరహవ్యధలో ముంచి చంపడానికి ఆమెకి అధికారం ఎవరిచ్చారు? అడగాలి అనుకున్నాడు.
గది నానుకుని ఉన్న బాత్ రూమ్ తలుపు తీసుకుని సుమిత్ర వచ్చింది. తువ్వాలు చుట్టుబెట్టుకుని" ' ఓ- సుబ్బారావ్' అంటూ ఆమె గదిలోంచి బాత్ రూమ్ లోకి ఒక్కసారిగా పరుగెత్తి తలుపులు వేసుకుంది. నీటిబిందువులు ముత్యాల్లా వొంటిమీద ముంగురులు చివరలా మెరుస్తూంటే,తెల్లనివొంటి వొంపుల్ని దాచలేని తువ్వాలుతో , గుండ్రని అందమైన పిక్కలతో,అందానికి మెడరన్ ఎడిషన్ లా జలసుందరిలా ఒక్కనిముషం మెరుపులా మెరిసి న ఆమె రూపం అతన్నిమూఢుణ్ణి చేసింది.అలాగే నోరావలించి ఉండిపోయాడు.
బాత్ రూమ్ తలుపు సన్నగా తీసి 'ఆ మంచంమీద చీర యిలా యిస్తావా సుబ్బారావ్'అంటూ నవ్వుతూ సిగ్గుతో అడిగింది సుమిత్ర. గబుక్కున తెలివి తెచ్చుకుని సుబ్బారావు 'సారీ-నేను హాల్లో వెయిట్ చేస్తా' నంటూ గదిలోంచి వెళ్ళిపోయాడు కంగారుగా.
తర్వాత కార్లో యిరువురూ బజారుకి వెళ్ళారు. సుమిత్ర షాపింగ్ చేసింది. ఖరీదైన చీరలు, పౌడర్లు, ఒక అందమైన మెక్లేసూ కొంది. వాటికన్నిటికీ ఖరీదు తానివ్వగలిగితే- అనుకున్నాడు సుబ్బారావ్.ఒక్క గంటలో అయిదారువందల రూపాయలు సులువుగా ఖర్చు పెట్టిన సుమిత్ర ధనాన్ని చూసి కొంచెం ఈర్ష్యపడ్డాడు. సుబ్బారావు అక్కణ్నుంచి నది వొడ్డుకు వెళ్ళారు. తాటిచెట్ల పొడుగాటి నీడలు నదీజలాలమీదపడి కదలుతున్నాయి.సుమిత్ర ఈవేళ ఏదో గంభీరంగా ఉంది.
"ఎల్లుండి నా పుట్టినరోజు సుబ్బారావ్. పంథొమ్మిది వెళ్ళిపోతాయి" ఆమె అలా
అంటూంటే ఆమె గొంతులో ఏదో బాధ ఉన్నట్టు తోచింది సుబ్బారావ్ కి. ఆమె పుట్టినరోజుకన్న పవిత్రమైన దినం పంచాగంలో ఎక్కడా ఉండదని సుబ్బారావుకి తెలుసు. పవిత్రమైన ఆ రోజుని ఆమెనడిగి తన ప్రేమ విషయం తేల్చుకోవాలనుకున్నాడు.
"తర్వా రోజున నేనూ నాన్నా అమ్మా అందరం బెంగుళూరు వెళ్ళుతున్నాం."
"బెంగుళూరా!" తలమీద మోదినట్టయింది సుబ్బారావుకి.
"అవును."
"ఎందుకు?"
" మా మేనత్త అక్కడుంటోంది."
"అయితే యిప్పుడెందుకూ, బెంగుళూరు వేసవిలో వెళితే చల్లగా ఉంటుందిట."
"మా బావ వొచ్చాడుగా."
" ఎక్కడనుంచి?"
" అమెరికానుంచి.టెక్నాలజీలో ఏదో పాసయ్యాడు."



