Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఆ రోజున ఉదయమే సుమిత్ర ఆదేశానుసారంగా సుమిత్ర ఇంటికి వెళ్ళాడు. ఆమె నవ్వుతూబ గేటుదగ్గరే ఎదురొచ్చింది. ఆమె విదేశీయమైన శ్లాక్ తొడిగి పైన ఆందమైన బనీను వేసింది. జుట్టు వెనకాల ముడివేసి కొసలు బుజాలమీద కుచ్చులా పడేటట్లు చేసింది. ఆ దుస్తులలో ఆమె అవయవాల పొంకం స్ఫుటంగా, మరీ ఆకర్షణీయంగా ఉంది. ఆమె చేతిలో బాడ్మింటన్ బాట్ ఉంది.
సుబ్బారావు రెప్పలల్లార్చకుండా ఆమెని చూశాడు.
" ఏం ఈ డ్రెస్ బావులేదా?" నవ్వుతూ అడిగింది సుమిత్ర.
"చాలా బావుంది. మీరు అప్సరలా ఉన్నారు"
"ఊర్వశినా తిలోత్తమనా?" కిలకిల నవ్వింది. "రండి ఒక గేమ్ వేసుకుందాం."
బాడ్మిటన్ లో మంచి ఆటగాడయిన సుబ్బారావు మూడు గేములూ ఓడిపోయాడు.ఆమె అందాన్నీ అవయవాల్నీ తనివిదీరక చూసే అతనికి ఊలుబంతి కనపడలేదు.
"మీరు పరాగ్గా ఆడారు .మీరు మంచి ప్లేయరని విన్నాను.ఆడదాన్ని కదా అని, పాపం దయతలచారు కదూ" చిరుకోపంతో సుమిత్ర.
"నోనో- మీరీవేళ నిజంగా బాగా ఉన్నారు-ఆ ఆడారు" అన్నాడు. విరగ బడి నవ్వింది సుమిత్ర. ఆ నవ్వుకి- ఇదేమిటి ఈతెల్లని పారిజాత పూలదండలు ఎవరో విసురుతున్నారని ఇటూ అటూ చూశాడు సుబ్బారావు.
వారంరోజులుపోయక అక్కడే ఆ బాదంచెట్టుకింది కూర్చుని వాళ్లిదరూ మట్లాడుకోవడం కనుక పాఠకుడు వినివుంటే తెల్లబోతాడు. వాళ్ళు 'మీరు' అనుకోవడం మానివేశారు. 'నువ్వు నువ్వు' అని చాలా సన్నిహితంగా చనువుగా మాట్లాడుకుంటున్నారు.
" నువ్వేవర్నీ ప్రేమించలేదా సుమిత్రా?"
"ఊహు."
" అయితే నువ్వు పెళ్ళాడవా?"
"ఉహూ- సన్యాసిగా ఉంటా."
" అబ్బ! నిజం చెపుదూ."
" నా మాటకేంగాని మరి నువ్వు.?"
" నేనూ- నేను నేను.... "
"ఉ చెప్పవోయి."
" ఒక దివ్యసుందరీ మణిని ప్రేమించాను."
" ఎవరూ....?"
" పేరు చెప్పకూడదు"
" పోనీ, ఏ ఊరూ?"
" ఈ ఊరే- "
" ఎక్కడుంది ఈ ఊళ్ళో?"
" ఎక్కడ-ఇక్కడే."
" ఇక్కడ- " తెల్లబోయి ఇటూ అటూ చూసింది సుమిత్ర.
"ఇక్కడ" అంటూ గుండెలు చూపించాడు సుబ్బారావు.
" ఓస్,అంతేనా " అంటూ పకపక నవ్వింది సుమిత్ర.
సుబ్బారావు ఒకసారి తన హృదయం విప్పి ఆమె ముందు పెడదామనుకున్నాడు.
"నువ్వు లేనిదే నేను బ్రతకలేను. నా ప్రతి అణువులో , ప్రతిఊహలో నువ్వే,నువ్వే" అనేసి ఆమె పాదాలమీద పడిపోదామనుకున్నాడు. కాని సుమిత్ర చటుక్కునలేచి " ఇక పోదాం సుబ్బారావ్. ఆలస్యమైపోంది" అంటూ విష్ చేసి లోపలికి వెళ్ళిపోయింది.
ఆలస్యంగా స్కూలుకి వెళ్ళిన సుబ్బారావుని హెడ్మాష్టరు పిలిచాడు.ఆయన కళ్ళుకోపంతో ఎరుపెక్కాయి.
"మీ ప్రవర్తన ఏం బాగులేదు."
"..... "
"మీరు క్లాసులకి సరీగ్గా రావడంలేదు. పాఠాలు సరీగా చెప్పడంలేదు. మీమీద అన్నీ కంప్లెయింట్సె- "
"..... వంట్లో బాగుండలేదండి."
" నేనలాగ నమ్మను? ఎప్పుడూ ఆకోటేశ్వరావుగారింటి దగ్గరే ఉంటావట -పోని ఇక్కడ రిజైనిచ్చి అక్కడ ఉద్యోగం చెయ్యరాదూ?"
"..... "
"చూడు ఈ నోట్సు నువ్వు చెప్పినదేనా?" అంటూ ఒక పుస్తకం పెకి తీశారు హెడ్మాస్టరు.



