Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    వాళ్ళ మాటలు ఎక్కడినుంచి ఎక్కడికి వడుతున్నాయో తెలియదుగాని, చటుక్కున ఆమె యిలా అడిగింది. "మీరింకా పెళ్ళిచేసుకోలేదేం? "

    "నన్నెవరు చేసుకుంటారు?" - గొప్ప డిప్లమసీ ఉపయోగించి అన్నాడు సుబ్బారావు యీ మాట. ఇలాగ అన్నందుకు తన తెలివికి తానే ఆశ్చర్యపోయాడు.  ఇప్పుడు సుమిత్ర ఏ జవాబు చెబుతుంది? ఆ జవాబులో తన భవిష్యత్తు  గర్భితమై ఉంటుంది.

     "ఎవరయినా చేసుకుంటారు. మీకేం దొరలా ఉన్నారు" అంది సుమిత్ర నవ్వుతూనే సీరిరయస్ గా .

     సుబ్బారావు గుండె గబగబకొట్టుకుంది- ఆనందంవలన; ఆ జవాబులో సూచించిబడిన అర్థంవలన; చటుక్కున ఆమె మృదుహస్తాన్ని చేతిలోకి తీసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నాడు. కాని  అప్పుడే  కాదు.ఇప్పటికి  రెండవమెట్టు ఎక్కాడు. మొదటిమెట్టు వాళ్ళింట్లో ట్యూషన్ కుదరటం!

    రోజులు గడుస్తున్నాయి. రోజూ కాకపోయినా రెండు మూడు రోజులు కొకసారైనా  ఇద్దరూ షికారు వెళ్ళుతున్నారు. సినిమాలకి వెళ్ళుతున్నారు. పరిచయం గాఢతరమౌతోంది. డ్రైవ్ చేస్తోన్న సుమిత్ర, కబుర్లు చెప్పే సుమిత్ర,పచ్చికమీద చేతులు తలగడగా పెట్టుకుని ఆకాశంలోకి చూస్తూ పరున్న సుమిత్ర,  చిరుకోపం  నటించే సుమిత్ర- ఇన్ని రకాలరూపాలు, వ్యక్తిత్వాలు, అందాలు  సవరించుకుని సుమిత్ర అతని  మనస్సునీ, కళ్ళనీ, గుండెనీ ఆక్రమించివేసింది.

     సుబ్బారావు ఇంటి  పనులు చూడటమే మానివేశాడు. తల్లికి దగ్గు  వస్తే మందు తీసుకురాడు. చెల్లెలికి రిబ్బనుముక్క కూడా కొనడు. వంటచెరుకు అయిపోయిందని   వరుసగా మూడురోజులు చెప్పి నాలుగవరోజున  తల్లి ఏడిస్తే అప్పుడు తీసుకువచ్చాడు. ఎందుకంటే  అతనికి తీరుబడిలేదు. ఈకాలం సరిపోవడమూ లేదు. యింటికి వెళ్ళేందుకు డ్రెస్సు వేసుకోవాలి కదా.నెలజీతం పెట్టి మంచి పాంట్లూ, బ్లౌజులు, స్నో పౌడరు, బ్రిల్ క్రీమ్, సెంట్లూ కొనేశాడు. కదా. ఇవన్నీ   వొంటికి రాసుకోవాలి. తయారవాలి. అప్పుడు సుమిత్ర దగ్గరకు వెళ్ళాలి. మరి యింటి పనులు చూసేందుకు తీరక  ఏదీ! తీరిక  ఉన్నా డబ్బేదీ? తాను మాత్రం ఏం చెయ్యగలడు పాపం!

      "ఏరా సుబ్బా,జీతం అంతా అలా తగలేస్తే నెల ఎలా గడుస్తుందిరా?" అంది తల్లి. మాట్లాడలేదు సుబ్బారావ్.

    "మమ్మల్ని బ్రతికుండమన్నావా, పస్తులుండి చావమన్నావా?" నాలుగురోజులు పోయాక అడిగింది తల్లి. వినిపించుకోలేదు సుబ్బారావు.

        " నా ప్రారబ్ధం నాయనా ,ఇంకా ఎన్నాళ్ళు చుట్టుపక్కలవాళ్ళ దగ్గర అప్పులు చెయ్యను.  ఇంక  నేను నుయ్యో గొయ్యో చూచుకుంటాను. నాకర్మ నా కర్మ" తలబాదుకుని ఏడుస్తోంది పదిరోజులు పోయాక తల్లి.

    " నీ ఫాషన్లూ, నీ సుఖమే ఎప్పుడూనూ. నేనూ ఎక్కడైనా దాసీ పిల్ల కిందచేరి అంట్లు తోముకుని బతుకుతాలే అన్నయ్యా" కన్నీళ్ళు వరదలై పారాయి, చిన్నారి చెల్లెలు లేత బుగ్గలమీద.

    " ఏమయ్యా యిన్నేళ్ళొచ్చాయి బుద్ధి ఉండద్దూ,  తల్లినిలా ఉసురు పెడుతున్నావ్" అంది  మజ్జిగపోసే మనిషి.

     ఏడుపొచ్చింది సుబ్బారావుకి.తల్లి కాళ్ళుపట్టుకున్నాడు. బతిమాలాడు. తనకీ సుమిత్రకీ గలప పరిచయాన్ని గురించి చెప్పుకున్నాడు "సుమిత్ర నన్ను  తప్పక పెళ్ళి చేసుకుంటుందమ్మా.ఇంక మనకి కష్టాలు  ఉండవ్"   అని  చెప్పాడు సుబ్బారావు.

      "అయ్యొ వెర్రినాయనా ఆమెకోటీశ్వరురాలి బిడ్డరా నాయనా. నక్క ఎక్కడ?" నాగలోకం ఎక్కడరా సుబ్బా" అని కొడుకు అమాయకత్వానికి జాలిపడింది.ఈసారి సుబ్బరావుమళ్ళీ తప్ప పెళ్ళిచేసుకోని భారతీయ తరుణీమణుల మనోవికాసమూ, సుమిత్రతో  తన కారు షికార్లూ నదీ సైకత విహారాలూ.... "అమ్మా ఆమె పడకగదిలో కూడానేను నిరాఘటంగా వెళ్ళిపోతానమ్మా. ఇంకేం చెప్పమన్నావు? నమ్ము, నా మాట  నమ్ము" అన్నాడు.

     తల్లికి నమ్మక తప్పలేదు. కళ్ళు పెద్దవి చేసుకుని వింది.ఆధునిక యువతుల స్వేచ్ఛని గురించి  విన్నదేకాని తన కుమారుని ప్రేమించేటంత పరిణామానికి  వచ్చిందన్న సంగతి గుర్తించలేకపోయింది. మొన్నటివరకూ ఈ కాలపుపిల్లలు పాడైపోతున్నారన్న నిర్ణయాన్ని ఆమె సడన్ గా మార్చివేసుకుంది. తృప్తిగా  నవ్వుతూ ఆనందం కళకళలాడే మొహంతో తల్లి కొడుకును అస్పష్టంగా ఆశీర్వదించింది. పక్కనే వింటోన్న చెల్లెలు కళ్ళల్లో ఆశ, మెరుపు , హాయి- ఝలంఝలించాయి.

    తల్లిలేచి  లోపలకివెళ్ళి తిరిగివచ్చి కొడుకు చేతిలో ఒక బంగారుకాసు పెట్టి  ఇలాగ అంది: "నాయనా,ఇంటికంతటీకీ ఇదే బంగారం. చెల్లెలికి శ్రావణానికి లోలకులు చేయించాలని ఉంచాను. ఇది ఎక్కడేనా తాకట్టుపెట్టికావల్సిన సరుకులు తీసుకురా, మళ్ళీ విడిపించుకుందాం- దేవుడి దయవుంటే."

    తల్లిలేచి లోపలికివెళ్ళి  తిరిగివచ్చి కొడుకు చేతిలో  ఒక బంగారుకాసు పెట్టి ఇలాగ అంది:"నాయనా, ఇంటికంతటీకీ ఇదే బంగారం. చెల్లెలికి శ్రావణానికి లోలకులు చేయించాలని ఉంచాను. ఇది ఎక్కడైనా  తాకట్చటు పెట్టి కావల్సిన సరుకులు తీసుకురా, మళ్ళీ విడిపించుకుందాం-దేవుడి దయవుంటే."

     "దేవుడిదయ  అంటే అన్నయ్య పెళ్ళేనా?" అంది తెలివైన చెల్లెలు. తాకట్టు  అంటే గుండెలో కలుక్కుమన్నా ,  కాసుని జాగ్రత్తగా జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు సుబ్బారావు.
   




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.