Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"మేష్టారూ అక్కయ్య మిమ్మల్ని పిలుస్తోంది" అన్నాడు గోపీ. గోపీ ఆ సమయంలో మురళి వాయిస్తూన్న బాలకృష్ణుడిలాగా కనిపించాడు. సుబ్బారావుకి. బెదురుగా ఆశగా గోపీ వెనకాలనే హాలుదాటి ఏవేవో గదులు దాటి ఓ గదిలోకి వెళ్ళాడు.
ఒక పెద్దగదిలో విరుగుడుచేప కర్రతో చేసిన సొగసైన మంచం మీద మెత్తని వెల్వెట్ దిండ్ల నానుకుని వడిలీవడలని పువ్వులా పడుకుంది సుమిత్ర.
కిటికీలకు తెరలు వాల్చి ఉన్నాయి. గోడలలోనే అమర్చబడిన విద్యుద్ధీపాలు నీరెండలాంటి కాంతిని గది అంతా ప్రసరిస్తున్నాయి.
"రాండి మేష్టారూ" అంది సుమిత్ర.
అలవాటులేని ఆపరిసరాలకీ, స్నేహశీలమైన ఆమె ఆహ్వానానికి తొట్రుపడుతూ ఆమె చూపించిన కుర్చీలో ఆమె మంచానికి అనతి దూరంలోనే కూర్చున్నాడ
"నిన్నటినుంచి జ్వరంగా వుంది. ఒక్కరైకీ ఏమీ తోచడం లేదు. పోనీ మీతో కబుర్లాడుతూంటే" నవ్వింది సుమిత్ర.
"తప్పకుండానండి."
"మీ కేమీ పనిలేదుకదా?"
" ఏం లేదండి. ఈఒక్క ట్యూషనే నాకు ఉన్నది."
"అయితే యికచిక్కేలేదు."
ఈ రోజున చెల్లెల్నీ తల్లినీ సినిమాకి తీసుకువెళతాను. రెడీగా ఉండమన్నాడు సుబ్బారావు. వాళ్ళు కనిపెట్టుకుంటారాన్న భాధని గట్టిగా నొక్కిపట్టి నోరెత్తకుండా చేశాడు.
వాళ్ళ కబుర్లు సుబ్బారావు స్కూలునీ, లేటెస్టు పిక్చరుని,సుమిత్ర కాలేజీని, స్టోర్సునీ, రాజకాయాల్ని ఒక్కొక్కటే దాటి చివరకు సంగీతం దగ్గరకు వచ్చాయి. సంగీత దర్శకులనీ పాడేవాళ్ళని అందరినీ తిరగేసి చాలామటుకు ఇద్దరూ చాలా విషయాలలో ఏకాభిప్రాయం కలిగి వున్నట్లు తెలిసికొన్నారు.
" మీరేమైనా పాడండి మేస్టారూ."
సిగ్గుపడ్డాడు సుబ్బారావు. పాడాలి తప్పదంది. సుమిత్ర. సుబ్బారావు పాడాడు.నిజంగా బాగా పాడాడు. సుమిత్ర నిటూర్చుంది.....
"అదేం?" అన్నాడు సుబ్బారావు.
"మీ పాట నన్ను కదిలించేసింది."
భారతరత్న బిరుదు ఈ మెప్పుముందు ఏ పాటిది! ఎనిమిది గంటలకు వెళతానని లేచాడు. సుబ్బారావు. సుమిత్ర కృతజ్ఞతతో "థ్యాంక్స్! మీ స్నేహం కలగడం నా అదృష్టం" అంది.
తాగి మైకంతో ఉన్నవాడిలా ఇంటికి వెళ్ళాడు. తల్లికీ చెల్లెలికీ ఏదో సాకు చెప్పాడు. టేబిలుమీద అద్దంలో తన ప్రతిబింబాన్ని అదే పనిగా చూసుకున్నాడు. ఎప్పుడూ లేని కాంతి ఆకళ్ళల్లో, ఎప్పుడూ లేని అందం ఆ మొహంలో!
భోంచేశాక చెల్లెలు " అబ్బ, గోంగూరపచ్చడిలో కారం ఎక్కువయింది బాబో" అంది.
"గోంగూరపచ్చడేమిటి?" అని విసుగ్గా అడిగాడు సుబ్బారావు.
"నువ్వు తినలేదూ?" అని అడిగింది చెల్లెలు.
" ఎప్పుడు?"
" ఇప్పుడే."
" ఎక్కడ?"
" ఇక్కడే,అదేమిటన్నయ్యా అలా మాట్లాడుతావ్?"ఇప్పుడన్నంలో కలుపుకుని తిని కూడా...?"
సుబ్బారావు కాబోలనుకున్నాడు. అతని ఉదాత్త మనస్థితిలో చచ్చు గోంగూర పచ్చడివంటి విషయాలకి తావులేదు.
అతనికి కలనిద్ర పట్టింది. నిద్రలో సుమిత్రకనపడింది. మెత్తని తెల్లని వొంపులు తీరిన ఆమె వొళ్ళూ, వొంటిమీద కొంచెం నలిగిన తెల్లని వాయిల్ చీరా, సంస్కరింపబడని ఆమె జుట్టు చిందరవందరగా ఆమె నున్నని మెడమీదా- బుగ్గలమీదా,జ్వరంవేడికి మరికాస్త ఎరుపెక్కిన చిన్న పెదవుల కదలికా- ఈ అప్రయత్న అలంకృతమైన ఆమె రూపంలోని సహజ సౌందర్యం అతని మనస్సుని వెయ్యి. అత్తరు సీసాలు పగలగొట్టినంత సౌరభయంతో ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేసింది.
తర్వాత రోజున ట్యూషను ఇంకా చెబుతూండగానే లోపలనుండి సుమిత్ర " మనస్తే మేస్టారూ" అంటూ వచ్చింది.
"నమస్తే మనస్తే" అంటూ లేచి నిలబడ్డాడు సుబ్బారావు. "మీ వంట్లో ఎలా ఉంది?"
" ఈ రోజున నయమే.చారూ అన్నం తిన్నాను. అలా షికారు పోదాం రండి. మీ కంపెనీ ఉంటే- "
" ఇంకా ట్యూషన్...." నసిగాడు సుబ్బారావు.
"పర్వాలేదులెండి.....ఒరేయి గోపీ, పోయి ఆడుకో."
కారు తిన్నగా నదివొడ్డుకు వెళ్ళి ఆగింది.ఇద్దరూ దిగారు. అంతా నిర్జనంగా ఉంది. ఇసుక ఉన్న స్థలంచూసి ఇద్దరూ కూర్చున్నారు.ఇటూ అటూ తోటలు, తోటగట్లనే వరుసల్లో వందలకొద్దీ తాటిచెట్టు: తాటి తోపు వెనుక ఆకాశం మీద ఎర్రని కుంకమ, నదిమీది నుంచి అలలు అలలుగా చల్లనిగాలి, గాలికి కదులుతున్న ఆమె కాళ్ళనీ మొహాన్నీ తగలడం-



