Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    ఇలాంటివన్నీ ఆలోచించుకుంటాడు. అందుకే అతనికి బొత్తిగా తీరిక వుండదు.

    ఒకటి: పరికిణీలు చిరిగిపోయాయి, కుట్టించరా అన్నయ్యా.

    రెండు: రెండు వోణీలుకూడా కొనేం-మరిచిపోకు.

    మూడు: అన్నట్టు పాలవాడు సొమ్ముకోసం నిలతీస్తున్నాడురా అబ్బాయి. వాడికి చాలా అవసరమట!

     నాలుగు: ఏమండోయ్ సుబ్బారావుగారు. మీరు అలాగ సంగీతం పాడేస్తూంటే మా పిల్లలు చదువుకోవాలా అక్కరలేదా- స్వంత ఇల్లు అనుకున్నరే విటీ.

     అయిదు: ఒరేయ్ సుబ్బారావు.అడక్కడక్క  అడిగావ్ పాపం. అయిదు రూపాయలు కాదుకాదా. అర్థరూపాయి కూడా లేదురా. నీతోడు.

     ఆరు: సైకిల్ కి  లైటు లేదేం? నీ పేరు? పని? ఊరు? రేపు పదింటికి కోర్టుకి రా.

    ఏడు:ఏయ్ హారన్ వాయిస్తూంటే తప్పుకోవాలని తెలియదూ. నడుస్తూనే నిద్రపోతున్నావా.

     ఎనిమిది:చిరంజీవి సుబ్బారావుకి ;   ఆనెల జీతాలూ మాకు అందలేదు. మీ అత్తయ్యకి వారం రోజుల్నుంచి జ్వరం. ఒక్క ఇరవై రూపాయలుంటే  అర్జంటుగా  పంపిచవల్సింది. జరూరు.

     తొమ్మిది: ఈ షర్టింగు గజం అయిదు రూపాయలు.ఏం అలా చూస్తావేం. బట్టలన్నీ తీయించి కుప్ప వేయించావ్. కొనే మొహమో కాదో తెలుస్తూనే  ఉంది.

     పది: ఏమోయ్ సుబ్బారావ్.  స్కూలు వదలగానే  ఒకసారి ఇంటికి. రా.రేపు మా యింట్లో సత్యనారాయణవ్రతం చేసుకుంటున్నాం. కొంచెం మార్కెటింగ్ చేసి పెడదువుగాని. నీకు సురుకనాణెం తెలిసినట్టు యింకెవరికి తెలియదంటుంది మా ఆవిడ-యిది కుర్చీలో కూర్చున్న హెడ్మాస్టర్ అభిధగల ఒక స్థూలకాయం తాలూకు ఆస్యవివరంనుంచి  వచ్చిన ఆజ్ఞ!

     ఇలాంటివి గొప్పులు, ముళ్ళు, డొంకలు,.రాళ్ళు గాజుపెంకులు, గోతులు, తేలుకాట్లు,మండ్రగబ్బలు అడుగడుగునా మలుపు నా తగులుతున్నాసుబ్బారావు నిస్ప్రృహ చెందలేదు.

    ఎప్పుడైనా ఖిన్నుడౌతాడు. గుండె బరువెక్కి ఓ నిముషం చీకట్లనీ శ్మశానాల్నీ తలుచుకుంటాడు. కాని అంతా ఓ  నిముషం మాత్రమే . మరు నిముషంలో ఆప్టిమిస్టు సుబ్బారావు-ఉత్సాహవంతుడు సుబ్బారావు హుషారుగా ఆలోచించుకుంటాడు.

     దెబ్బమీద దెబ్బతగిలిన కొద్ద  ఆలోచన మరీ మధురంగా రమ్యంగా అలంకరించుకుని వస్తుంది.

     ఆశ గబుక్కున చావదు.

     అందులో యౌవనంలో  తగ్గను కూడా తగ్గదు.

     ప్రాణశక్తి ఎలాగో ఆలాగా బతకడానికి ప్రయత్నిస్తుంది. బతకడానికి అవసరమైన అందంకోసం వెదుకుతుంది. ఆశ అనే చేయిని ఊతగా తీసుకుంటుంది.

     ఆశ ఆలోచనల్ని రేపుతుంది.  కలల్ని  జల్లుతుంది.

      అందుకే సుబ్బారావవుకి ఆలోచించడానికి ఈకాలం సరిపోవడంలేదు. ఆలోచించిన కొలదీ అతనికి రెట్టింపు బలంవస్తుంది.ఆనందం కలుగుతుంది.

    ఈ ఆనందం మిథ్యా, నిజమా? 

    వేదాంతం అంటే యిష్టంలేదు సుబ్బారావుకి.

     అనుభవించినంత సేపూ యిది నిజమే.

     తాగి మైకంలో ఉన్నంతసేపూ అదీ ఒక ఆనందమే!

     అందుకే ఆలోచనల మద్యాన్ని, మైరేయాన్ని, కల్లుని,బ్రాందీని, వైన్ ని,  విస్కీని అన్ని రకాలనీ  అవిచ్ఛన్నంగా తాగేస్తున్న సుబ్బారావుకి- ఆరోజు సాయంత్రం కల నిజమయేటంత ఆపాయం జరిగింది.

     పిల్లలకు  సైన్సు పాఠం చెప్పి లాంగా బెల్ కొట్టగానే స్కూల్ దుమ్ముని దులిపేసుకుంటూ గబగబా వస్తూన్న  సుబ్బారావుని

    కారు డీకొంది. కొంచెం జాగ్రత్తగానే.

     ఆ కారు  కింక  వేరేమార్గంలేదు. ఎందుకంటే సుబ్బారావుని ఆ మాత్రం డీకొట్టకపోతే- ఎదురుగా వచ్చే పొగరూమోతు లారీ కారుని పచ్చడిచేసి ఉండును.

    కనురెప్పపాటులో సుబ్బారావు నేలమీద సాష్టాంగపడి ఓ  అరగజం దూరం జర్రుమని జారాడు.

     దుమ్ములోంచి  నొసటి మీద ఎర్రని  నేత్రాన్ని, కాళ్ళకీ చేతులకీ అరుణకంకణాల్నీ, దేహానికి బూడిదనీ ధరించిన అపర శివుణ్ణి రోడ్డుమీదపోయే  యిద్దరు ప్రమధులు లేవనెత్తారు.

     " ఎక్సూజ్ మి"- సన్నని వీణాస్వరమే

    కళ్ళమీద ఉన్న కంకరదుమ్ము పల్చని పొరలోంచి సుమిత్ర అస్పష్టరూపం-

    "వెరీ వెరీ సారీ" అదే, ఆ వీణాస్వరమే.

     "......"
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.