Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
సుందరీ- సుబ్బారావు
సెకండ్రరీ గ్రేడు మాష్టారు సుబ్బారావుకి పాపం తీరుబడి లేదు.
అతనికి కాలం చాలా ఇరుకుగా వుంది.ఇరుకుగా ఇటూ అటూ ఊచలతో కట్టిన బోనులాగ 'కారిడర్' లాగా వుంది.
అతని వెడల్పాటి ఆశయాలు సరదాగా ఇటూ అటూ పచార్లు చేయడానికి వీలులేకుండా వుంది.
ఇరవై నాలుగేళ్ళ సుబ్బారావు. ముంగురుల మీద నుంచి కలలు జారుతుంటాయి. కృష్ణశాస్త్ర్రి చెప్పినట్లు; కృష్ణశాస్త్ర్రిగారు అతన్ని గురించి చెప్పలేదనుకోండి. అయితే సుబ్బారావుకి ఎందుకు తీరుబడి లేదు?
అతను లేచిన కాస్సేపట్లో స్నానానికి వెళతాడా! ఇక్కడ నూతిగట్టుమీద తువ్వాలుకట్టుకొని చేదమీద చేత తీసుకుని నీళ్ళు పోసుకుంటూంటే నీటి బిందువులు ముత్యాల్లా ఎర్రని వొంటిమీద నుండి జారుతాయి. ఉదయసూర్యుడి చిరువెచ్చని కాంతితో మెరుస్తాయి. రోజూ పాలుపోసే గొల్లపిల్లమాత్రం రెప్ప వాల్చకుండా ఆశగా తన వొంటికేసి చూస్తుందని సుబ్బారావుకి తెలియకపోలేదు. కాని వుత్తి గొల్లపిల్లలు- మాసిన బట్టలలో, ఆశలతో అందంగా లేని గొల్లపిల్లలు- తన కథలో నాయికలుగా ఉండడానికి అంగీకరించలేడు సుబ్బారావు.
సుబ్బు తీసి వొళ్ళు తోముకుంటూంటే సుబ్బారావుకి ఆస్పర్శ- తన ఛాతి మీద; జబ్బలలోని పిక్కలలోని కండలయొక్క స్పర్శ-ఏదో గర్వాన్నీ హాయినీ కల్గిస్తుంది. ఇంత భౌతికంగా వాస్తవంగా ప్రత్యక్షమవుతున్న ఆ బలాన్నీ యౌవనాన్నీ చూసుకుని మురిసిపోకుండా ఉండలేకపోతున్నాడు సుబ్బారావు.
అలాగ గర్వపడనివాడు వట్టి ఆధ్యాత్మికవాది.సుబ్బారావుకు ఆధ్యాత్మికవాదులంటే అంత నమ్మకం లేదు.
చక్కగా కమ్మెచ్చున తీసినట్లు- సంస్కృతి కవులు వర్ణించిన దేహపుష్టిలాగ, హాలీవుడ్ రోనాల్లో కోల్మాన్ లాగ, సింహకిశోరంలాగ బలిష్టంగా పసందుగావున్న దేహాలు కలవాళ్ళని ఒళ్ళనిచూపెడుదూ!
ఉహూ- పదిమైళ్ళ రేడియస్ లో ఎక్కడా కనపడడు.
అన్నాడు, అనుకున్నాడు సుబ్బారావు.అయితే ఇటువంటి గాత్రం కలిగివున్నవాడికి ఉండవల్సిన ప్రోస్పెక్ట్స్ ఏవిటి!
ఇలాగ ఒక గంట ఐనా ఆలోచిస్తూ నూతిలో సగం నీళ్ళు పోసేసుకుంటూన్న సుబ్బారావుకి వాళ్ళ అమ్మ పిలుపుగాని, చెల్లెలు కేకగాని వినిపించేటప్పటికి తెలివివొచ్చి వొళ్ళు తుడుచుకుని తను అద్దెకున్న తన వాటాలోకి వెళతాడు. వాటాలో మొదట వంటగదిలోంచి రెండవ గదీసఆఖరు గదీ అయిన పడకగదిలోకి వెళ్ళాలి.
పడకగదినే చదువులగది అనవచ్చుని.దాన్నే డ్రాయింగ్ రూమ్ అన్నా సుబ్బారావుకి ఏమీ అభ్యంతరం లేదు.
మొదటిదైన వంటగది దాటుతూంటే వాళ్ళమ్మ "ఒరే సుబ్బా! మెంతులూ, ఆవాలు అయిపోయాయిరా. స్కూల్ నుంచి వొచ్చేటప్పుడు పట్టుకురా నాయనా" అంటుంది.
ఓ అలాగే' అంటూ రెండవ గదిలోకి వెళతాడు. అక్కడ చెల్లెలు ఓ మూల కూర్చుని బుద్దిమంతురాలిగా సాంఘికశాస్త్ర్రం చదువుతూంటుంది.
సుబ్బారావు నవ్వుతూడు.ఎందుకంటే ఆ పుస్తకం పేజీలమధ్య సినిమాపాటల పుస్తకం కూడ వుంటుందిగా.ఐతే సుబ్బారావు తెలీనట్లుగా ఉంటాడు. డిప్లమసీ అంటారే. అదికూడా సుబ్బారావుకి తెలియకపోలేదు.
ఆగది లో ఓ బల్లవుంది. బల్లముందు ఓ కుర్చీ వుంది.ఆ కుర్చీలో కూర్చుంటాడు. సుబ్బారావు.బల్లమీద ఒక అద్దం గోడకి దాపెట్టివుంటుంది.అద్ధం అంటే. అంతాకాదు; అసలు అద్దంలో మూడూ బై ఐదవ వంతు అసలు నుంచి బలద్వియోగం పొంది విడిపోయింది.
ఈ అద్దంలో చూచుకుంటూ సుబ్బారావు మళ్ళీ ఒక గంట ఆలోచించుకుంటాడు. అద్దంలో అతని మొహం, మూడు బై ఐదవవంతు మొహం కనపడుతుంది. ఈపరిమాణంలో తన కళ్ళూ, జుట్టూ ముక్కు, పెదాలూ, పెదాలమీద అందమైన సన్నని చిన్నని మీసకట్టూ చూచుకుంటాడు. అలాగ చూచుకుంటూ ఆలోచించుకుంటాడు.
ఏమనీ-?
అదిగో,అక్కడే అతని ఆలోచన తారాజువ్వలా దూసుకుపోతుంది. విచిత్రమైన గగనాల్ని తాకుతుంది. నక్షత్రాల్ని 'హలో' అని పలకరిస్తుంది. ఇంకా పైపైన ఏయో విచిత్ర స్వప్నగోళాలు ఉన్నాయో అని గవేషిస్తూ వెళ్ళిపోతుంది పైపైకి.
తనకున్న పెర్సనాలిటీకి ఒక యూపోపియన్ కంపెనీ యజమాని కనీసం వెయ్యిరూపాయల జీతం మీద మాంచి ఉద్యోగం ఒకటి ఎందుకివ్వకూడదూ? ఏం, ఎందుకు యివ్వకూడదూ. అసలు మొదట రాక్ ఫెల్లర్ ఎవడు? ఫోర్డు ఎవడూ?
బొంబాయిలోనూ. మద్రాసులోనూ, యిళ్ళకన్న స్టుడియోలు ఎక్కువై పోయాయిట. అందులోనూ కొత్త మొహాలంకోసం ప్రొడ్యూసర్లూ, డైరెక్టర్లూ ఒకటే గోల పెడుతున్నారట. మరి తనకున్న కట్టూ గెయిటూతో (cut and gait)చటుకున్న ఓ ఛాన్సు తగిలి హీరో అయిపోతే-?
అసలు- అంతదూరం వరకూ ఎందుకూ , మిల్లు ఓనర్ ప్రకాశరావు కూతురు- తన స్కూలునుంచి వస్తుంటే కారు వయ్యారంగా డ్రైవ్చేసుకుంటూ ఎదురు వస్తుందికదా.చలాకీగా అందంగా ఫ్యాషన్ గా వుంటుంది.ఎర్రని పెదవుల మీదకి రాబోయే నవ్వు దారితప్పి అలా బుగ్గలమీదకి వెళ్ళబోయి సరాసరి కళ్ళల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. భలే. అందంగా వుటుంది. సుమిత్ర!ఒకరోజున కార్లో వెళుతూ వెళుతూ తన్నిచూసి,నిదానంగా ఇంకోమారు చూసి, స్టన్ అయి, ఉక్కిరిబిక్కిరై 'ఓహో ఎవరీ కూర్రావాడు. యితనికి హృదయం యిచ్చేశాను. ఇతనే నా మొగుడు. ఈ నిశ్చయమూ మారదు' అని గట్టిగా అనేసుకుంటే- ఏమో ఎవరికి తెలుసూ!



