Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12
కాసేపు ముత్యాలరావు , నేను, పద్మావతీ -- కబుర్లు చెప్పుకున్నాం. ముందు దేశం గురించి మాట్లాడుకున్నప్పటికీ తర్వాత ప్రైవేటు విషయాలు వచ్చాయి. ముత్యాల్రావు నా ఉద్యోగం గురించి వాకబు చేశాడు. ఆయనింకా ఏదో అడగబోతుండగా పద్మావతీ టీ కప్పులు తీసుకొని లోపలకు వెళ్ళింది.
"నువ్వు మా అమ్మాయి కేదైనా మంచి సంబంధం చూసి పెట్టు. నీ మాటంటే దానికి గురి కుదిరినట్టు కనబడుతుంది. ఇంతకాలం పెళ్లన్న పేరు వింటేనే మండి పడేది. అందుక్కారణం మగాళ్ళంటే దానికి చిరాకు -" అన్నాడాయన.
"ఎలాంటి కుర్రాడు కావాలో చెప్పండి -" అన్నాను.
"నీకు లాంటి కుర్రాడనుకో -- " అన్నాడాయన చటుక్కున. "ఎటొచ్చీ నాకు కులం విషయంలో పట్టింపెక్కువ."
అయన తన కులం చెప్పాడు. నేను వెంటనే -- 'అయితే మా బంధువుల్లోనే చూడొచ్చు --" అన్నాను.నిజానికి అయన కులం నా కులం ఒకటి కాదు. నేను పద్మావతీని పెళ్ళి చేసుకోబోవడం లేదు కాబట్టి ఈ అబద్దం ప్రమాదకరమైనది కాదు.
ముత్యాల్రావు ముఖం వెలిగింది -- "అయితే నీ బంధువుల దాకా ఎందుకు? నువ్వు పిల్లను చూడనే చూశావు. నీకు నచ్చిందంటే నేను మీ వాళ్ళతో మాట్లాడ్డాని కొస్తాను --" అన్నాడుత్సాహంగా.
'ఆర్నెల్ల క్రితం మా నాన్నగారి ముఖ్య బంధువొకాయన పోయాడు. యింకో ఆర్నెల్ల దాకా మా యింట్లో శుభకార్యాల ప్రసక్తి వుండదు. మీరు కలుసుకోవాలంటే ఆ తర్వాతే కలుసుకోవాలి -- " అన్నాను. ఇది తిరుగులేని అబద్దం . ఈ విధంగా నేను అర్నేల్లదాకా పెళ్ళి ప్రసక్తి లేకుండా పద్మావతితో తిరగొచ్చు. అప్పటి కామెపై నా మోజు తీరిపోతుంది. కాబట్టి ఆ తర్వాత సంగతేమిటని ఆలోచించక్కర్లేదు.
"అంటే నీ కభ్యంతరం లేదనేగా --" అన్నాడు ముత్యాలరావు వుత్సాహంగా.
ఆడపిల్లల తండ్రుల స్థితికి నేను జాలిపడ్డాను. అయితే ఆ జాలితో నేను వచ్చిన అవకాశాన్ని వదులుకోలేను.
అ తర్వాత వరుసగా మూడు రోజులు నేను పద్మావతిని వాళ్ళింట్లోనే కలుసుకున్నాను.
3
నాలుగో రోజు పద్మావతి యిల్లు చూపించే నెపంతో నన్ను లోపలకు పిలిచి -- "నాకిలా నచ్చలేదు. నాన్నగారిది పాత తరం. అయన ముందు మనం ఫ్రీగా మాట్లాడుకోలెం --" అంది.
"నాకూ అలాగే అనిపిస్తోంది కానీ చెప్పడానికి మొహమాటపడ్డాను...." అన్నాను. మనసులో నాకు చాలా సంతోషంగా వుంది. పద్మావతి నా దారికే వస్తోంది మరి!
"రేపు మనం పార్కులో కలుసుకుందాం --" అంది పద్మావతీ. ఏ పార్కులో కలుసుకోవాలసిందీ కూడా ఆమె నాకు చెప్పింది.
మర్నాడు ఆఫీసు నుంచి తిన్నగా పార్కుకే వెళ్ళిపోయాను. అక్కడో అరగంట యెదురు చూశాను. అప్పుడు నా దగ్గరకో అమ్మాయోచ్చింది. ఇద్దరం ఒక బెంచి మీద పక్కపక్కన కూర్చున్నాం -- కాస్త ఎడం ఎడంగా.
కాసేపట్లో పద్మావతీ వచ్చేస్తుంది, అప్పుడామే మమ్మల్నిద్దర్నీ పక్క పక్కన చూడ్డం నాకు మంచిది కాదు. మగాడు తన్ను మోసం చేసినా సహిస్తుంది. కానీ మరో ఆడదాని సహచార్యాన్నాశిస్తే భరించలేదాడది. అందుకని మా పరిచయం కొనసాగుతున్నంత కాలం ఇలాంటి పొరపాట్లు జరక్కూడదు. కానీ నా పక్కనున్న అమ్మాయి యెప్పటికీ లేవడం లేదు. కాసేపాగి నేనే ఆమెను పలకరించాను.
ఆమె ఇబ్బందిగా కాక చక్కగా నవ్వింది. ఆ నవ్వుకు ముగ్ధుడినయ్యాను. ఆమె తన పేరు గిరిజ అని చెప్పింది.
"ఎవరి కోసమో యెదురు చూస్తున్నట్లున్నారు!" అన్నాను.
"అవును -- నా స్నేహితురాలు నన్నిక్కడ కలుసుకుంటానని చెప్పింది. తనీపాటికీ రావలసిందే " అందామె.
"చిత్రంగా వుందే - నేనూ నా స్నేహితురాలి నిక్కడే అదే సమయంలో కలుసుకోవాల్సి వుంది. మీ స్నేహితురాలి పేరు ?" అన్నాను.
"పద్మావతి ...." అందామె.
"నా స్నేహితురాలి పేరూ అదే!" అన్నాను.
ఇద్దరం ఒకే వ్యక్తీ కోసం ఎదురు చూస్తున్నామని అర్ధమైంది నాకు. అందుచేత కబుర్లలో పడ్డానికి కష్టం లేకపోయింది. అలా గంటసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. అప్పుడు గిరిజ టైము చూసుకొని -- "అరె -- చాలా టైమయిందే -- ఇంకా నేను ఇల్లు చేరుకోవాలి. లేకుంటే అన్నయ్య పెద్ద గొడవ చేస్తాడు...." అంది.
"ఇంత సేపిక్కడ బోరు కొట్టకుండా కంపెనీ ఇచ్చారు , థాంక్స్!" అన్నాను.
"థాంక్స్ నేనే మీకు చెప్పుకోవాలి. మీరు చాలా సరదాగా మాట్లాడతారు. మా యింటికి రాకూడదూ -- " ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను !" అంది గిరిజ.
'ఇప్పుడు కాదు, మరెప్పుడైనా!" అన్నాను . అందుకు రెండు కారణాలున్నాయి. పద్మావతితో స్నేహం కొనసాగుతుండగా మరో ఆడపిల్లతో స్నేహం ప్రారంభిస్తే రెంటికీ చెడ్డ రేవడను కావచ్చు. అందులోనూ వాళ్ళిద్దరూ స్నేహితురాండ్రు. అటు పైన అన్నయ్యలున్న ఆడపిల్లల జోలికి వెళ్ళడం నాబోటి వాళ్ళకు ప్రమాదం. ఎనుకంటే , ఆ అన్నయ్యలూ నా జాతే కదా ---యిట్టే పసి గట్టేస్తారు.
గిరిజ తను లేచి నిలబడి -- "మీరింకా పద్మావతి కోసం యెదురుచూస్తారా?" అంది.
"లేదు. అసలు తనెందుకు రాలేదో ఇంటికి వెళ్ళి కనుక్కుంటాను ?" అన్నాను.
"అయితే నాకో సాయం చేస్తారా?" అంది గిరిజ.
"యస్ యువర్ సర్వీస్ ప్లీజ్!" అన్నాను.
గిరిజ కళ్ళు మెరిశాయి. ఆమె తన వానిటీ బ్యాగు తెరిచి ఓ చిన్న ప్యాకెట్ తీసి నాకిచ్చింది -- "ఇది మీరు అర్జంటుగా పద్మావతింట్లో అందజేయాలి --"
"ష్యూర్ --" అన్నాను. గిరిజ వెళ్ళిపోయింది. నేను పద్మావతి ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ముత్యాల్రావు ఒక్కడే వున్నాడు.
నన్ను చూసి ఆప్యాయంగా పలకరిస్తూ -- "అనుకోకుండా ఈరోజు పద్మ ఊరు వెళ్ళవలసి వచ్చింది ...." అన్నాడు.
పార్కు విషయం నే నాయనకు చెప్పలేదు. అయన నన్నడగలేదు. పద్మావతి ఊళ్ళో లేదనగానే నాకు నీరసం పుట్టుకొచ్చింది. ఏ పరిస్థితుల్లో ఆమె ఊరు కెళ్లవలసి వచ్చిందో నాకు చెబుతున్నాడాయన. నాకు బుర్ర కేక్కడం లేదు.
"మళ్ళీ ఎప్పుడొస్తుందండీ?" అన్నాను.
"అబ్బే -- రేపు సాయంత్రాని కల్లా వచ్చేస్తుంది ...."
మళ్ళీ నాలో ఉత్సాహం పుట్టింది. వెంటనే ఆయనకు గిరిజ ఇచ్చిన ప్యాకెట్ ఇచ్చాను. గిరిజ నాకెలా తెలుసు లాంటి వృధా ప్రశ్నలు వేసి అయన నన్ను విసిగించలేదు. ప్యాకేట్టందుకుని --"దానికి నేనిచ్చెస్తాలే!" అన్నాడు.
నేను సెలవు తీసుకున్నాను.
4
మర్నాడు సాయంత్రం నేను వెళ్ళే సరి క్కూడా ముత్యాల్రావొక్కడే ఇంట్లో ఉన్నాడు. నన్ను చూస్తూనే "అమ్మాయింకా రాలేదు...." అన్నాడు.
అప్పుడు నాకు ముత్యాల్రావు మీద కోపం వచ్చింది. ఆయన్ను చూస్తుంటే వళ్ళు మండిపోయింది. అందులో అయన తప్పేమీ లేదని తెలిసినా ఇలాంటి విషయాల్లో ఆవేశాన్ని నిగ్రహించుకోవడం కష్టం. అతికష్టం మీద నిగ్రహించుకున్నాను.
వెంటనే వెళ్ళి పోవాలను కున్నాను. కానీ ముత్యాలరావు బలవంత పెట్టాడు. అయన బలవంత పెట్టిన కొద్దీ నాలో అసహనం పెచ్చు మీరి పోసాగింది. అయితే వివేకం నన్ను హెచ్చరించింది.
పద్మావతి ని వల్లో వేసుకోవాలంటే ముత్యాల్రావు నీ బుట్టలో వేసుకోవాలి. తన కూతురి కోసమే నేను వస్తున్నానని ఆయనకూ తెలుసు. అయితే ఆయనంటే బొత్తిగా ఆసక్తి లేదన్న విషయం బయట పడకూడదు.
ముత్యాల్రావు చదరంగం బల్ల తీశాడు. ఆడమని నన్ను బలవంత పెట్టాడు. దురదృష్టమేమిటంటే నాకు చదరంగ మాడ్డం వచ్చు.
మొదలెట్టినపుడు చిరాకనిపించినా ఓ పావుగంటలో ఇద్దరం ఆటలో మునిగిపోయాం. తర్వాత టైము తెలియలేదు. పద్మావతి వచ్చి మా ఆటకు భంగం కలిగించింది. ఆటలో ఎంతలా మునిగిపోయామంటే పద్మావతి వచ్చి అట డిస్ట్రర్బ్ చేసినందుకు చిరాక్కూడా కలిగింది. అయితే అది తాత్కాలికమే!
పద్మావతికి నన్ను చూడగానే ముఖం వెలిగింది. తండ్రి వున్నాడని కూడా సందేహించకుండా -- "నిన్న మిమ్మల్ని పార్కు కు రమ్మనమని చెప్పాను. నేను రాలేకపోయాను...." అంటూ సారీ చెప్పింది.
'అది సరేలే -- వెళ్ళిన పనయిందా?" నేను చెప్పినవన్నీ తెచ్చావా?" అన్నాడు ముత్యాల్రావు ఆత్రుతగా.
"ముందు నీ సందేహం తీర్చేకనే ఈయనతో మాట్లాడతాను...." అంటూ ఆమె తన చేతిలోని సూట్ కేసును పక్కనే వున్న బల్ల మీద పెట్టి తాళం చెవితో తెరవబోయింది. నేను పద్మావతి వంకే చూస్తున్నాను.
ప్రయాణం చేసి వచ్చిన అలసట ఆమె ముఖంలో కనబడుతోంది. ఆ అలసట కూడా ఆమెకు కొత్త అందాన్నిచ్చింది.
అందానికి అన్నీ అలంకారమే అనుకున్నాను .
ఉన్నట్లుంది పద్మావతీ "సూట్ కేసు తాళం రావడం లేదు నాన్నా!" అంది.
"ఎందుకు రాదూ?" అంటూ ముత్యాల్రావు లేచాడు. ఆయనకూ వచ్చినట్లు లేదు . నేనూ ప్రయత్నించి "అసలీ తాళం ఈసూట్ కేసుదేనా?" అన్నాను.





